బీజీటీ ప్రెజెంటేషన్‌లో గవాస్కర్‌ను పట్టించుకోని ఆస్ట్రేలియా.. క్రికెట్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

  • ట్రోఫీ ప్రెజెంటేషన్‌కు ఆహ్వానించకపోవడంపై దిగ్గజ క్రికెటర్ అసంతృప్తి
  • పిలిచి ఉంటే సంతోషించేవాడినంటూ విచారం
  • మైదానంలోనే ఉన్నా పట్టించుకోలేదంటూ గవాస్కర్ ఆవేదన
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హై-వోల్టేజ్ వాతావరణంలో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆదివారంతో ముగిసింది. ఆతిథ్య జట్టు ఆసీస్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ట్రోఫీని దక్కించుకోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు కాస్త గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ట్రోఫీ ప్రెజెంటేషన్‌‌ ఈవెంట్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను పిలవలేదు. గవాస్కర్ మైదానంలోనే ఉన్నప్పటికీ ఆయనను క్రికెట్ ఆస్ట్రేలియా పట్టించుకోలేదు. గవాస్కర్ పేరు మీదుగానే ట్రోఫీకి పేరు పెట్టినప్పటికీ ఆయనను విస్మరించడంపై విరమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆసీస్ మాజీ దిగ్గజం అలెన్ బోర్డర్ ఒక్కరే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ట్రోఫీని అందించారు. ప్రజెంటేషన్‌ ఈవెంట్‌కు తనను ఆహ్వానించకపోవడంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను భారతీయుడిని కాబట్టి తనను పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను మైదానంలోనే ఉన్నాను... నన్ను పిలవొచ్చు కదా. నా బెస్ట్ ఫ్రెండ్ అలెన్ బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందజేసి ఉంటే సంతోషించేవాడిని. ప్రజెంటేషన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నేను ఇష్టపడతాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కావడంతో ప్రజెంటేషన్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు మరింత ఇష్టపడేవాడినంటూ విచారం వ్యక్తం చేశారు. ట్రోఫీ ప్రజెంటేషన్ విషయానికి వస్తే ఏ జట్టు గెలిచినా పర్వాలేదని, బాగా ఆడారు కాబట్టి ఆస్ట్రేలియా గెలిచిందని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. 

ఈ మేరకు ‘కోడ్ స్పోర్ట్స్’తో ఆయన మాట్లాడారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య 1996-1997 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక ట్రోఫీలో ఒకటిగా పేరుపొందింది. ప్రస్తుతం సీజన్‌లో మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ లవర్స్ స్టేడియాలకు పోటెత్తారు.


More Telugu News