కాశీ క్షేత్రంలో ఉత్తరార్కుడుగా సూర్యభగవానుడు
కాశీ క్షేత్రంలో 12 సూర్య దేవాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. లోలార్కుడు .. సాంబాదిత్యుడు .. ద్రౌపద్యాదిత్యుడు .. ఖఖోలాదిత్యుడు.. అరుణాదిత్యుడు .. మయూఖాదిత్యుడు .. గంగాదిత్యుడు .. విమలాదిత్యుడు .. వృద్ధాదిత్యుడు .. కేశవాదిత్యుడు .. యమాదిత్యుడు .. ఉత్తరార్కుడుగా సూర్యభగవానుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. ఒక్కో సూర్యదేవాలయం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథ వినిపిస్తూ ఉంటుంది. అలా 'ఉత్తరార్కుడు' ఆలయం వెనుక కూడా ఒక కథ వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం అసురుల ధాటికి తట్టుకోలేకపోయిన దేవతలు .. సూర్యభగవానుడిని శరణు కోరారట. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఒక పర్వతశిలను దేవతలకి చూపించి .. 'కాశీ క్షేత్రానికి దానిని తీసుకెళ్లి విశ్వకర్మచే నా రూపాన్ని చెక్కించి ఆరాధించండి. అలా చెక్కుతూ ఉండగా రాలి పడిన శిలలను అసురలపైకి అస్త్రాలుగా ప్రయోగించండి' అని చెప్పాడట. సూర్యభగవానుడు చెప్పినట్టుగా చేసిన దేవతలు .. అసురుల బారి నుంచి బయటపడతారు. 'ఉత్తరం' అంటే చెప్పడం కనుక .. ఇక్కడి సూర్యభగవానుడిని 'ఉత్తరార్కుడు'గా పూజిస్తూ వుంటారు.