నవరాత్రులలో దేవీ పూజ
చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసం ఏడవ నెలగా వస్తుంది. ఈ నెలలోని పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం ఉండటం వలన, ఆశ్వయుజ మాసంగా పిలవబడుతోంది. ఈ మాసంలో తొమ్మిది రాజుల పాటు దీక్ష చేపట్టి దేవీ పూజను నిర్వహించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దేవీపూజను జరిపే నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకూ దేవీ నవరాత్రులను వైభవంగా జరుపుతుంటారు. జగన్మాత అయిన అమ్మవారిని ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాలలో అలంకరిస్తూ వుంటారు. ఆయా అమ్మవార్లకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తూ వుంటారు. ఈ నవరాత్రులలో కుమారీ పూజను .. సువాసినీ పూజను .. దంపతి పూజను జరుపుతుంటారు. ఈ విధంగా చేయడం వలన అమ్మవారు అనుగ్రహం లభిస్తుందనీ, సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.