పిల్లలు ముభావంగా ఉంటున్నారా.. ఆటిజం కావొచ్చు!
కొందరు పిల్లలు ఎప్పుడూ ముభావంగా ఉంటారు.. పిలిచినా పెద్దగా స్పందించరు.. ఎవరితోనూ మాట్లాడరు.. ఎలాంటి భావాన్నీ వ్యక్తీకరించరు. చదువులోనూ వెనుకబడుతుంటారు.. ఇవన్నీ ఆటిజం (బుద్ధి మాంద్యం) లక్షణాలు. పిల్లల్లో నాడీ వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. దీని బారిన పడినవారిలో మానసిక ఎదుగుదల లోపిస్తుంది. ఇది ఎక్కువగా మగ పిల్లల్లోనే కనిపిస్తుంది. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. అయినా కూడా రెండు మూడేళ్ల వయసు వచ్చేదాకా గుర్తించలేకపోవచ్చు.
మానసిక సమస్యలెన్నో..
ఆటిజం బారినపడినవారు నలుగురితో కలవలేరు. ముభావంగా ఉంటారు. నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేరు. భావోద్వేగాలను వ్యక్తం చేయలేరు. వయసుకు తగిన పరిణతి లేకపోవడం, ఒకే మాటను పదే పదే చెబుతుండడం, ఒకే రకమైన ఆహారం, దుస్తులు కావాలనడం, చేతులు, కాళ్లు విచిత్రంగా కదపడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఆడి, పాడే వయసులో పిల్లలు ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారంటే వారిలో కచ్చితంగా ఆటిజం ఉండవచ్చు.
‘‘పిల్లలు బయటకు వెళ్లడం, స్కూలుకు వెళ్లడం వంటివి మొదలుపెట్టినప్పుడు వారు మిగతా వారితో కలసి ఉండాల్సి వస్తుంది. కమ్యూనికేట్ కావాల్సి వస్తుంది. కొన్ని అంశాల్లో ఊహాత్మక శక్తి అవసరమవుతుంది. ఆటిజం లక్షణాలున్న పిల్లల్లోని స్వభావం ఇలాంటి సమయంలోనే బయటపడుతుంది..’’ అని ఈ అంశంపై పరిశోధన చేసిన కెనడాలోని మెక్ గిల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మయడా ఎల్సాబాగ్ వివరించారు. అయితే వినికిడి సమస్యలున్న పిల్లలకు కూడా మాటలు సరిగా రావు. అందువల్ల ఆటిజంగా నిర్ధారించే ముందు ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో పరిశీలించడం అత్యవసరం. ఇక ‘డిస్ లెక్సియా’ సమస్య ఉన్న పిల్లల్లోనూ మాటలు రావడం ఆలస్యం కావడం, అక్షరాలు, అంకెలు నేర్చుకోవడంలోను, గుర్తించడంలోను లోపాలు వంటివి ఉంటాయి. దీనినీ గమనించాలి.
వ్యాధికి కారణమేమిటి?
ఆటిజం సాధారణంగా జన్యు సంబంధిత లోపాల వల్ల ఏర్పడే వ్యాధి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోముల్లో లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు రుబెల్లా, సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినా.. డ్రగ్స్, ఆల్కాహాల్ అలవాటు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలున్న వారి పిల్లలకు బుద్ధి మాంద్యం వచ్చే అవకాశం ఉంది. కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక దెబ్బతినడం వంటి కారణంగా, మహిళలు లేటు వయసులో పిల్లలను కనడం ద్వారా కూడా బుద్ధి మాంద్యం తలెత్తే అవకాశం ఉంది. బాల్యంలో విపరీతమైన మానసిక సంఘర్షణకు గురైన పిల్లల్లో ఆటిజం తలెత్తే అవకాశం ఉంది.
సరిగా గమనిస్తే ముందుగానే గుర్తించవచ్చు..
ఏడాది, ఏడాదిన్నర వయసులోనే పిల్లల ప్రవర్తన తీరును సరిగ్గా గమనిస్తే ‘ఆటిజం‘ను గుర్తించవచ్చు. దాంతో వీలైనంత త్వరగానే సరిదిద్దే అవకాశం ఉంటుంది. అకారణంగా నిరంతరాయంగా ఏడవడం, గంటల తరబడి మౌనంగా ఉండిపోవడం, తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవడం, పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వకపోవడం వంటివి బుద్ధి మాంద్యం కారణంగా వచ్చే లక్షణాలు. దీనిని తొలి దశలోనే గుర్తించి, చికిత్స చేయడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్లో హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏ పనైనా వేగంగా చేయడం, కాళ్లు, చేతులు కదుపుతూనే ఉండడం, ఉద్వేగం లక్షణాలు ఉండే రుగ్మత), సృజనాత్మకత లోపం, మూర్ఛ వ్యాధి, మానసిక కుంగుబాటు వంటివి కూడా కమ్ముకుంటాయి. సాధారణంగా పిల్లల వైద్యులు కొన్ని రకాల ప్రశ్నలతో ఓ సర్వే వంటిది చేసి పిల్లల మానసిక స్థితిని అంచనా వేస్తారు. అలా పరిశీలించాక ఆటిజం లక్షణాలేవైనా కనిపిస్తే.. ప్రత్యేక నిపుణులను కలవాల్సిందిగా సిఫారసు చేస్తారు. నిపుణులు ఆ పిల్లలను పరిశీలించి.. అది సాధారణ ఎదుగుదల లోపమా? లేక బుద్ధి మాంద్యమా అన్నది నిర్ధారిస్తారు. ‘ఆటిజం’ సమస్యను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ అనే ఓ సినిమా కూడా తీశారు.
పిల్లల్లో వీటిని గమనించండి
- ఆటిజం ఉన్న పిల్లల్లో కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి. పిల్లల తీరును పరిశీలించడం ద్వారా వాటిని గమనించవచ్చు.
- పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చినా నవ్వు వంటి భావాన్ని చూపకపోవడం
- తొమ్మిది నెలల నాటికి ధ్వనులను, ముఖంలోని భావాలను గుర్తించలేకపోవడం
- 12 నెలలు వచ్చినా పిలుపునకు స్పందించకపోవడం, శబ్దాలు చేయకపోవడం
- 14 నెలల నాటికి కూడా సైగలు చేయలేకపోవడం (ఏదైనా కావాలని చూపించడం, ఎత్తుకోవాలంటూ చేతులు చాచడం వంటివి)
- 16 నుంచి 18 నెలల వయసు వచ్చే సరికి ఒక్కో మాటను ఉచ్చరించలేకపోవడం
- ఏ వయస్సులో అయినా ముందు నుంచే నేర్చుకున్న మాటలు, చేష్టలు ఆగిపోవడం.
- ఎప్పుడూ ఒంటరిగా కూర్చోవడం, ఒంటరిగా ఆడుకోవడం
- కళ్లలోకి కళ్లు పెట్టి చూడకపోవడం, ఓ రకమైన గొంతుతో మాట్లాడడం.
- అర్థమేమిటో తెలియకున్నా కొన్ని పదాలను పదే పదే అంటూ ఉండడం
- చిన్న చిన్న ప్రశ్నలను, సూచనలను కూడా అర్థం చేసుకోలేకపోవడం
- దురుసుగా ప్రవర్తించడం, తల బాదుకోవడం, దేనినీ అనుకరించలేకపోవడం
అందరినీ ఒకే గాటన కట్టొద్దు
ఆటిజానికి ఇది కచ్చితమైన కారణమని, కచ్చితంగా ఇవి ఆటిజం లక్షణాలని నిర్ధారించే అంశాలేమీ లేవు. బుద్ధి మాంద్యం అని దీనిని పేర్కొంటున్నా, చురుకుదనం ఉండదని చెబుతున్నా... వాస్తవానికి ఈ పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. వాస్తవంగా చెప్పాలంటే ఆటిజం ఉన్న పిల్లలను అర్థం చేసుకోవడం కష్టం. ఇలాంటి పిల్లల్లో కొందరు అసలేం మాట్లాడరు. కానీ బొమ్మలతో, చిన్న చిన్న పజిళ్లతో ఆడుకోవడం వస్తుంది. మరికొందరు మాట్లాడుతారు. కానీ బొమ్మలతో ఆడుకోవడం రాదు. ఊహించే శక్తి ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ఆటిజం అనేది కొద్దిగా శ్రద్ధ పెడితే సులువుగానే బయటపడగలిగిన సమస్య. దీని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
కావాల్సింది ప్రేమ, ఆప్యాయత, శద్ధ..
‘ఆటిజం’కు కచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు ఎలాంటి ఔషధాలనూ తయారు చేయలేకపోయారు. దీనితో బాధపడుతున్న పిల్లలకు కొన్ని రకాల ప్రవర్తనా, విద్యా సంబంధిత థెరపీలను అనుసరించడం ద్వారా వ్యాధి లక్షణాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వీలైనంత ముందుగానే గుర్తించి.. చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘ఆటిజం’ సమస్య నుంచి పిల్లలు బయటపడడంలో అత్యంత ప్రధానమైన పాత్ర తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, వారితో ఎక్కువగా గడిపేవారి చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చుట్టూ ఉన్న కుటుంబ వాతావరణం, పరిస్థితులు, తనతో ఉన్నవారు వ్యవహరించే తీరును బట్టి మెదడు జీవ ప్రక్రియల్లో మార్పులు జరుగుతాయని.. దాంతో పిల్లలు ఆటిజం సమస్యను అధిగమించగలరని శాస్త్రవేత్త మయడా ఎల్సాబాగ్ చెప్పారు. అయితే ఆటిజం పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, చికాకు, డిప్రెషన్ వంటి సమస్యలను మాత్రం కొన్ని రకాల మందులతో తగ్గించవచ్చని తెలిపారు.
ప్రత్యేక విధానాలూ ఉన్నాయి
ఆటిజంతో బాధపడుతున్నవారి కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలు, విధానాలు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఎర్లీ ఇంటర్వెన్షన్ ట్రయినింగ్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్ వంటివి అవలంబిస్తారు. మరోవైపు బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలన్న దానిపై తల్లిదండ్రులకు, వారితో కలసి నివసించేవారికి ప్రత్యేక శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తారు.
డిస్ లెక్సియా బుద్ధి మాంద్యం కాదు
మనకు తెలియని కొత్త విషయాలను నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వస్తుంది. కానీ కొందరు చిన్నారుల్లో ఈ నేర్చుకునే శక్తిలో లోపం ఏర్పడుతుంది. అంటే మాట్లాడడం, అక్షరాలు, అంకెలు రాయడం, వాటిని గుర్తించడంలో గందరగోళం ఉంటుంది. కొద్దిపాటి తేడాలున్న అంకెలు, అక్షరాలను ఒకదానిని మరొకటిగా పొరపడుతుంటారు. సమయ పాలనను అనుసరించలేరు. చదివినదానిని గుర్తుపెట్టుకోలేరు. ఈ లోపాన్నే ‘డిస్ లెక్సియా’ అంటారు. దీనిని ఆటిజం (బుద్ధి మాంద్యం)గా భావించవద్దు. ఆటిజం పూర్తిస్థాయి సమస్యకాగా.. డిస్ లెక్సియా అందులో ఓ చిన్న లక్షణం మాత్రమే. దీని నుంచి చిన్నారులు చాలా సులువుగా బయటపడొచ్చు. డిస్ లెక్సియా ఉన్న వారి మెదడు భాషను, పదాలను, అక్షరాలను సరిగా విశ్లేషించలేదు. సాధారణంగా దీనిని చిన్న వయసులోనే గుర్తించి, తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా అధిగమించేలా చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ‘డిస్ లెక్సియా’ జీవితాంతం కొనసాగుతుంది. మెదడు నిర్మాణంలోని లోపాల కారణంగా ఏర్పడే ఈ వ్యాధి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ.
అధిగమించి మేధావులైనవారెందరో..
చిన్న వయసులో డిస్ లెక్సియా బారిన పడినా... దానిని అధిగమించి చరిత్రలో తమదైన ముద్ర వేసిన ప్రముఖులెందరో ఉన్నారు. పిల్లల్లో ‘డిస్ లెక్సియా’ సమస్యను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ‘తారే జమీన్ పర్ (నేలపై నక్షత్రాలు)’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. మరో విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ కూడా చిన్నప్పుడు దానితో బాధిపడినవారే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలైన ఆల్బర్ట్ ఐన్ స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్, ప్రఖ్యాత చిత్రకారుడు మైఖేలాంజిలో లాంటి వాళ్లు తెలుగు హీరో అల్లు అర్జున్, ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లు కూడా చిన్నతనంలో డిస్ లెక్సియాతో బాధపడినవారే. ప్రస్తుతం ఆటిజం, డిస్ లెక్సియాల బారిన పడినవారు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది వరకూ ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. అందులో ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటి మంది వరకూ బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నారు.
ప్రోత్సాహాన్ని ఇవ్వాలి
- బుద్ధి మాంద్యంతోగానీ, డిస్ లెక్సియాతోగానీ బాధపడుతున్న పిల్లల పరిస్థితిని మెరుగుపర్చాలంటే.. వారిలో చురుకుదనం తేవాలి.
- ఏ పనికైనా వారిలో కావాల్సిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వారిలో ఉన్న అద్భుత మేధోశక్తిని వెలికి తీయడానికి ప్రయత్నించాలి.
- కేవలం పుస్తకాలు, చదువు సంధ్యలు రానంత మాత్రాన ఆందోళన చెందవద్దు. వారు విభిన్న అంశాల్లో ఎంతో సృజనాత్మకత చూపగలుగుతారు.
- ఆటిజం లక్షణాలకు దూరంగా ఉండేలా ఏదైనా మంచి పని చేసినప్పుడు పిల్లలకు వారికి నచ్చే బహుమతులు ఇవ్వాలి.
- సృజనాత్మకత పెంచే పనులు చేసేలా, తోటివారితో కలసి ఆటలు ఆడేలా ప్రోత్సాహం కల్పించాలి.
జీవితంలో వెనుకబాటు
ఆటిజం, డిస్ లెక్సియాల బారిన పడినవారిలో చాలా మంది సరైన చికిత్స తీసుకోకుంటే.. పెద్దయ్యాక సాధారణ జీవితం గడపలేరు. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. చదువులో వెనుకబడడంతో మంచి ఉద్యోగం సాధించలేరు. స్వతంత్రంగా వ్యవహరించలేరు, ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అందువల్ల అలాంటి పిల్లలపై చిన్న వయసులోనే మరింత శ్రద్ధ పెడితే.. పెద్దయ్యాక సాధారణ జీవితం గడపగలుగుతారు.
(ఆయా నిపుణుల అభిప్రాయాలు క్రోడీకరించి రాసిన ఈ ఆర్టికల్ ఉద్దేశం కేవలం పాఠకులలో అవగాహన కల్పించడం కోసం మాత్రమే)