గాల్ బ్లాడర్ రాళ్లు వచ్చాయా.. సులువుగానే బయటపడొచ్చు!

కడుపులో ఒక్కసారిగా వచ్చే నొప్పి నుంచి పచ్చ కామెర్లు, కాలేయం, క్లోమగ్రంథి ఇన్ఫెక్షన్ల దాకా గాల్ బ్లాడర్ సమస్యల కారణంగా ఏర్పడుతాయి. తీవ్రమైన కడుపునొప్పి, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ సమస్యలతోపాటు శరీరానికి విటమిన్లు అందకుండా చేసే ఈ సమస్యల నుంచి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సులువుగానే బయటపడొచ్చు. అసలు గాల్ బ్లాడర్ పని ఏమిటి, రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి, ఇన్ఫెక్షన్లకు కారణం ఏమిటి, ఏయే లక్షణాలను బట్టి గాల్ బ్లాడర్ సమస్యలను గుర్తించవచ్చు, ఈ సమస్య నుంచి ఎలా బయటపడొచ్చు తెలుసుకుందాం..

ఇన్ఫెక్షన్ మొదలైతే ఎన్నో సమస్యలు

representational imageశరీరంలో అత్యంత ముఖ్యమైన కాలేయానికి అనుసంధానమై ఉండే అవయవమే గాల్ బ్లాడర్ (పిత్తాశయము). కాలేయంలో తయారైన పైత్యరసం ఇందులో నిల్వ ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న పేగులలోకి ప్రవేశిస్తుంది. పైత్యరసం నేరుగా చిన్న పేగులలోకి విడుదలై ఆహార జీర్ణక్రియలో పాలుపంచుకుంటుంది. ఇందులోని ఎంజైములు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసేందుకు, కొవ్వు పదార్థాల ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరం సంగ్రహించడానికి తోడ్పడుతాయి. అయితే పలు కారణాల వల్ల గాల్ బ్లాడర్ కు ఇన్ఫెక్షన్లు వస్తాయి. బైలరీ కొలిక్, గాల్ స్టోన్స్ (రాళ్లు), కొలెసిస్టిటిస్, పాంక్రియాటిటిస్, కొలంగిటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటి కారణంగా పైత్యరసం సరిగా విడుదల కాదు. దీంతో నూనెలు, కొవ్వులు అరగకపోవడం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తలెత్తుతాయి. వీపుపై కుడివైపు కింది భాగాన నొప్పి వస్తుంది. మల విసర్జన దుర్వాసనతో, నురగతోనూ ఉంటుంది.

అడ్డుపడితేనే సమస్య

శరీరంలో సాధారణంగానే గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడం జరుగుతుంది. కానీ ఆ రాళ్లు పెద్దవై నాళాల్లో ఇరుక్కుపోవడం, అడ్డుపడడంతో సమస్య తలెత్తుతుంది. దీంతో పైత్యరసం జీర్ణాశయంలోకి వెళ్లకుండా తిరిగి వెనక్కి మళ్లి రక్తంలో కలుస్తుంది. తద్వారా పచ్చ కామెర్ల వ్యాధి తలెత్తుతుంది. కాలేయం ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇక రాళ్లు మరింత కిందకు జారి క్లోమ రస నాళానికి అడ్డుపడితే మరెన్నో దుష్పరిణామాలు తలెత్తుతాయి. దేశంలో ఎంతో మంది గాల్ బ్లాడర్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడినవారిలో, మహిళల్లో, ఊబకాయుల్లో ఈ సమస్యలు ఎక్కువ. చిన్న శస్త్రచికిత్సతో గాల్ బ్లాడర్ ను తొలగిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది శరీరంలో అంత ముఖ్యమైన అవయవం కాదని, ఇది లేకపోయినా కాలేయంలో ఉత్పత్తయ్యే పైత్యరసం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే తీసుకునే ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

సమస్యకు కారణమేమిటి?

ఇన్ఫెక్షన్లు, గాల్ బ్లాడర్ లో కదలికలు సరిగా లేకపోవడం, పైత్యరసం ఎక్కువ కాలం నిల్వ ఉండడం, గాల్ బ్లాడర్ గోడలు గట్టిపడడంతో పాటు ఆహార పదార్థాల నుంచి అందే కాల్షియం, మరికొన్ని ఖనిజ పదార్థాల కారణంగా కూడా గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్, రాళ్లు ఏర్పడవచ్చు. ఆహారంలో కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం, మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లో హెచ్చుతగ్గులు, గర్భ నిరోధక మాత్రలను ఎక్కువ కాలం వాడడం కారణంగా కూడా గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తుతాయి. మద్యపానం అలవాటు, మధుమేహం వ్యాధి ఉన్న వారిలో, రక్త హీనత సమస్యతో బాధపడుతున్నవారిలో గాల్ బ్లాడర్ రాళ్లు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ. ఊబకాయంతో బాధపడుతున్నవారు ఒక్కసారిగా బరువు తగ్గినా వారిలో రాళ్లు ఏర్పడుతాయి. వంశ పారంపర్యంగా కూడా గాల్ స్టోన్స్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

ఇవీ లక్షణాలుrepresentational image

గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్నవారిలో ఆహారం తీసుకున్న వెంటనే పొట్టలో కుడివైపు నొప్పిగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, తేన్పులు, గుండెలో మంట, వాంతులు కావడం, మల విసర్జన నల్లగా కావడం, చలి జ్వరం, పచ్చకామెర్లు రావడం, వీపుపై కింది ప్రాంతంలో నొప్పి వస్తుంది. కొద్దిగా తినడంతోనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అయితే చాలా మందిలో ఈ రాళ్లు ఉన్నా కొద్ది మందిలో మాత్రం ఇబ్బందికర స్థాయికి పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కేన్సర్ గా కూడా మారే ప్రమాదం ఉంటుంది. అల్ట్రా సౌండ్ పరీక్ష, ఎంఆర్ ఐ స్కానింగ్, రక్త పరీక్షల ద్వారా గాల్ బ్లాడర్ రాళ్లు, ఇన్ఫెక్షన్ల పరిస్థితిని గుర్తించవచ్చు.

రెండు రకాల రాళ్లు

పైత్యరసంలో ఎక్కువ శాతం కొలెస్టరాల్, బైలురుబిన్, బైల్ లవణాలు (బైల్ సాల్ట్స్) ఉన్నట్లయితే దానికి ఇతర కారణాలు తోడై పైత్యరసం గట్టిపడి రాళ్లుగా మారుతుంది. ఈ రాళ్లలో కొలెస్ట్రాల్ రాళ్లు, పిగ్మెంట్ రాళ్లు అని రెండు రకాలు. కొలెస్ట్రాల్ గడ్డకట్టడంతో ఏర్పడే రాళ్లు కొలెస్ట్రాల్ రాళ్లు. ఇవి పెద్ద సైజులో ఉంటాయి. ఇక బైలురుబిన్ తో ఏర్పడే పిగ్మెంట్ రాళ్లు చిన్న సైజులో ఎక్కువ సంఖ్యలో ఏర్పడుతాయి. మొత్తంగా గాల్ స్టోన్స్ సన్నని ఇసుక రేణువు పరిమాణం నుంచి పెద్ద సైజు నిమ్మకాయ పరిమాణం వరకు ఉండవచ్చు. వీటిల్లో పిగ్మంట్ రాళ్లతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.

నాళాల్లోకి వెళితే ప్రమాదకరం

గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడం సాధారణమే అయినా.. అవి నాళాల్లోకి ప్రవేశిస్తే మాత్రం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. పిత్తాశయం నుంచి వెళ్లే నాళంలో అడ్డుపడితే పిత్తాశయం వాపు, ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీనికి ‘కొలెసిస్టిటిస్’ అంటారు. కొందరిలో దీని వల్ల ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి వస్తుంది. దీనినే ‘గాల్ బ్లాడర్ అటాక్’ అంటారు. నాళాల మధ్యలో అడ్డుపడితే బైలరీ ట్రీ అబ్ స్ట్రక్షన్ అంటారు. దీనివల్ల పచ్చ కామెర్ల వ్యాధి వస్తుంది. అదే ఇంకా ముందుకు వెళ్లి క్లోమగ్రంథి నుంచి వచ్చి కలిసే నాళానికి రాళ్లు అడ్డు పడితే ‘పాంక్రియాటిటిస్’ ఏర్పడుతుంది. దీనివల్ల పైత్యరసం క్లోమ గ్రంథిలోకి వెళ్లి.. క్లోమగ్రంథి వాపు, ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇది మరింత ప్రమాదకరం. దీనివల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. 

గాల్ బ్లాడర్ సమస్యలు ఇవి..

గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడం, నాళాల్లోకి వెళ్లడం, రాళ్లు ఏర్పడకున్నా పలు ఇన్ఫెక్షన్ల కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

  • కొలెసిస్టిటిస్: సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే సమస్య ఇది. చిన్న పేగుల్లోకి పైత్యరసం వెళ్లే నాళాల్లో రాళ్లు అడ్డుపడడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. దీంతో జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, వికారం వంటివి తలెత్తుతాయి. కొన్ని రకాల మందులు, విశ్రాంతితో దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరిలో మాత్రం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది.
  • కొలెడొకొలిథియాసిస్: పైత్యరస నాళంలోకి గాల్ స్టోన్ ప్రవేశించి.. గాల్ బ్లాడర్ వాపు, మంట ఏర్పడుతాయి.
  • అకాల్క్యులోస్ డిసీజ్: గాల్ బ్లాడర్ కండరాలుగానీ, వాల్వులుగానీ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మధుమేహం, గుండె సమస్యలు వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది వచ్చే అవకాశముంది.
  • కొలంగిటిస్: రాళ్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ట్యూమర్ల కారణంగా పైత్యరస నాళం మంట, వాపు తలెత్తడం వల్ల వచ్చే సమస్య ఇది.
  • గాల్ బ్లాడర్ కేన్సర్: ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణ గాల్ బ్లాడర్ సమస్యల తరహాలోనే దీని లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల త్వరగా గుర్తించడం కష్టం. ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే పుండ్లతో కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
  • గాల్ బ్లాడర్ గాంగ్రీన్: గాల్ స్టోన్స్ సమస్యకు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే అది ‘గాల్ బ్లాడర్ గాంగ్రీన్’గా మారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల జ్వరం, మానసిక గందరగోళం, చర్మం కింద గాలి బుడగలు, అనారోగ్యం, రక్తపోటు పడిపోవడం, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. గాల్ బ్లాడర్ కు చీము పట్టి ఇన్ఫెక్షన్ ఇతర అవయవాలకూ సోకుతుంది.

తొలగింపే శాశ్వత పరిష్కారం

గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడం, అవి నాళాల్లోకి చేరడం వల్ల ఏర్పడే సమస్యలకు శస్త్రచికిత్స చేసి గాల్ బ్లాడర్ ను శాశ్వతంగా తొలగించడమే పరిష్కారమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మందుల ద్వారా, శస్త్ర చికిత్స ద్వారా రాళ్లను తొలగించినా.. మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేగాకుండా మందులను సుదీర్ఘంగా ఆరు నెలల పాటు వాడాల్సి ఉంటుంది. అప్పటిదాకా రాళ్లతో వచ్చే సమస్యలను భరించాల్సి రావడంతోపాటు మందుల కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి. తొలిదశలో రాళ్లు చిన్నగా ఉన్నప్పుడు మందులతో ఉపశమనం లభించినా.. తర్వాత మళ్లీ రాళ్లు ఏర్పడితే శస్త్రచికిత్స చేసి గాల్ బ్లాడర్ ను తొలగించడమే ఉత్తమమని అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వైద్యులు చెబుతున్నారు. కొంత కాలం కిందటి వరకూ పొట్టపై పెద్ద గాటు పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. కానీ ఇప్పుడు అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ల్యాపరోస్కొపీ ద్వారా కేవలం చిన్న గాటుతో శస్త్రచికిత్స చేసి గాల్ బ్లాడర్ ను తొలగిస్తారు. కేవలం వారంలోపు విశ్రాంతితోనే సాధారణ జీవితం గడపవచ్చు.

ఈ జాగ్రత్తలు తీసుకోండిrepresentational image

  • విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, నీటిని ఎక్కువగా తీసుకోవాలి
  • అవకాడో, ద్రాక్ష, దోస, బ్రాకొలీ, నారింజ, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటివి తరచూ తీసుకోవాలి
  • ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, పొట్టు తీయని తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ వినియోగించాలి. బాదాం, వేరుశనగలను స్వల్ప పరిమాణంలో తీసుకోవచ్చు.
  • నాన్ వెజిటేరియన్లు మాంసంతో కూడిన వంటకాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ కొవ్వు ఏ మాత్రం లేకుండా చూసుకోవడం తప్పనిసరి.
  • వెన్న, నెయ్యి వంటి కొవ్వు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి. వెన్న తీసిన పాలు, పెరుగు వంటివి నిరభ్యంతరంగా వాడొచ్చు.
  • రోజుకు రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల గాల్ స్టోన్స్ సమస్యను నివారించవచ్చని పలు పరిశోధనల్లో తేలింది.
  • శీతల పానీయాలు, కుకీస్, జంక్ ఫుడ్ వంటివి గాల్ స్టోన్స్ ఏర్పడడానికి కారణమవుతాయి. వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
  • మధుమేహంతో బాధపడుతున్నవారు గాల్ బ్లాడర్ సమస్యల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైతే ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలి.
  • వంశపారంపర్యంగా కూడా గాల్ స్టోన్స్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ముందు తరాల వారికి ఈ సమస్య ఉన్నట్లయితే.. 40 ఏళ్లు దాటినవారు ముందు జగ్రత్తగా గాల్ స్టోన్స్ ఉన్నాయేమో పరీక్షించుకోవడం మంచిది.


More Articles