పోలీసులకు ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు ఎలా..?
ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాలి... కంప్లయింట్ ఇచ్చేది ఎలా...? ఎఫ్ఐఆర్ ప్రక్రియ ఎలా...?, ఏవైనా చార్జీలు చెల్లించాలా? ఇటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యక్తిగత, సామాజిక, శాంతియుత జీవనానికి అడ్డంకులు సృష్టించినా, ధన, మాన, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినా, నేరపూరిత చర్యలకు ఎవరైనా పాల్పడినా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. నేరాలు ఏ ప్రాంతంలో జరిగాయో ఆ పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిర్యాదు వ్యక్తిగతమైనది కావచ్చు. లేదా ప్రజలకు సంబంధించినది అయి ఉండవచ్చు. అత్యాచారం, రోడ్డు ప్రమాదాల వంటి కేసుల్లో బాధితులు ఫిర్యాదు ఇచ్చే కండీషన్ లో లేకుంటే వారి తరఫున తల్లిదండ్రులు, బంధువులు లేదా స్నేహితులు వీరిలో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు (ఇన్ స్పెక్టర్ లేదా సబ్ ఇన్ స్పెక్టర్) ఇవ్వవచ్చు. వీరు అందుబాటులో లేకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కు లేదా హెడ్ కానిస్టేబుల్ కు ఇవ్వవచ్చు. చట్టపరంగా విచారించతగిన కేసు అయితే అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఏ క్రిమినల్ కేసు అయినా ఎఫ్ఐఆర్ నమోదుతో విచారణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఫిర్యాదు విషయంలో గుర్తుంచుకోవాల్సినవి...
ఫిర్యాదు ఇచ్చే విషయంలో ఎప్పుడూ ఆలస్యం చేయరాదు. ఒకవేళ ఆలస్యం అయితే అందుకు గల కారణాలను పేర్కొనాలి. నోటి మాట ద్వారా పోలీసు అధికారికి చెబితే సరిపోదు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అనవసర విషయాల ప్రస్తావన ఉండరాదు. విషయాన్ని వక్రీకరించకూడదు. అర్థాలు తెలియని పదాలను ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. ఫిర్యాదులో విషయం సరళంగా గందరగోళం లేకుండా ఉండాలి.
ఏ హోదాలో ఫిర్యాదు చేస్తున్నారు?, నేరానికి పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎప్పుడు నేరం జరిగింది (తేదీ, సమయం, సంవత్సరం, ప్రదేశం), ఎలా జరిగింది (నేరం క్రమం, పాత్ర ధారులు), ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి పేరు, చిరునామా వివరాలు, జరిగిన నష్టం ఎటువంటిది (ఆస్తి నష్టం జరిగిందా? లేక ప్రాణ నష్టమా? గాయపడ్డారా ఇలా అన్నమాట), నేరాన్ని రుజువు చేసే ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఈ సమాచారం అంతా ఫిర్యాదులో ఉండాలి. ఫిర్యాదులో ఈ వివరాలన్నీ వచ్చాయేమో చూసుకుని చివరిలో సంతకం చేయాలి. దాన్ని పోలీస్ స్టేషన్ లో ఇవ్వడమే కాదు, అది వారికి అందినట్టు ధ్రువీకరణ కాపీని పొందడం హక్కులో భాగమే. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి పక్కదోవ పట్టిస్తే భారతీయ శిక్షాస్మృతి 1860 లోని సెక్షన్ 203 ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
క్రిమినల్ కేసుల్లో ఫిర్యాదుదారులు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవాలను ఫిర్యాదులో సవివరంగా పేర్కొనకుంటే ఆ కేసు చివరకు న్యాయస్థానాల్లో నిలబడకపోవచ్చు. పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండకపోవడం కేసులు వీగిపోవడానికి ఒక కారణమైతే.... కేసుకు సంబంధించిన వాస్తవాలను పేర్కొనడంలో ఫిర్యాదు దారులు విఫలమవడం మరో కారణం. కేసు నమోదు, దర్యాప్తు ఉచితంగా అందించాల్సిన సేవలు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. ఒకవేళ స్టేషన్ లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే సీనియర్ పోలీసు అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
విచారణకు అర్హమైన వాటిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. విచారించతగని నేరాలైతే ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులకు కోర్టు అనుమతి అవసరం. ఇటువంటి సమయాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఫిర్యాదు దారుడు చెప్పిన సమాచారాన్ని విని తమ డెయిరీలో లేదా డెయిలీ రిజిస్టర్ లో నమోదు చేసుకుంటారు. దానికి సంబంధించి ఓ కాపీని ఫిర్యాదు దారుడికి అందిస్తారు. దాంతో కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి.
ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నా దర్యాప్తే చేయకపోవచ్చు...
ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ దానిలో తీవ్రత లేదని విచారణాధికారి భావిస్తే, విచారించడానికి ఎలాంటి ఆధారాలు లేవని భావిస్తే దర్యాప్తు కొనసాగించకపోవచ్చు. అయితే, ఎందుకు విచారణ నిర్వహించడం లేదన్న దానికి దర్యాప్తు అధికారి కారణాలను నమోదు చేసి ఫిర్యాదు దారులకు తెలియజేయాల్సి ఉంటుంది. విచారించతగిన నేరం అనుకుంటే ఫిర్యాదు లేకపోయినా పోలీసులు నేరుగా విచారణ చేపట్టడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి.
వాస్తవానికి ఫిర్యాదు దారుడు స్టేషన్ కు వచ్చి అధికారికి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వారు చెప్పే వివరాలను సావధానంగా వింటారు. ఫిర్యాదును పూర్తిగా చదివిన తర్వాత ప్రాథమిక విచారణ అవసరమా లేదా అన్ని నిర్ణయానికి వస్తారు. అవసరం అని భావిస్తే ఎఫ్ఐఆర్ ను నమోదు చేసుకుని విచారణ మొదలు పెడతారు. ఫిర్యాదు దారుడు /బాధితులు చెప్పిన వివరాల విషయంలో సందేహాలు నెలకొంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవచ్చు. కొంత విచారణ తర్వాత వారికి నేరానికి సంబంధించిన వివరాలు, ప్రాథమిక ఆధారాలు లభిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు.
కొన్ని సందర్భాల్లో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నమోదు తక్కువగా ఉందని చూపించుకునేందుకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విచారణ జరిపి, స్టేషన్ స్థాయిలో పరిష్కరించే అధికారులు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే విచారణ దగ్గర్నుంచి కోర్టులో కేసు ముగిసే వరకూ పోలీసులు తమ బాధ్యతను విస్మరించడానికి లేదు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే...?
విచారణకు వీలైన ప్రతీ నేరంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదుకు స్టేషన్ లో నిరాకరిస్తే... సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ఆశ్రయించవచ్చు. లేదా అడిషినల్ ఎస్పీ, ఎస్పీలను కూడా ఆశ్రయించవచ్చు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదుకు వారు సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేస్తారు. ఫిర్యాదు నమోదు చేయకపోయినా లేదా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా, పక్షపాతంగా ఉన్నా వారిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా స్థానిక మేజిస్ట్రేట్ ను కూడా ఆశ్రయించే హక్కు ఉంది.