ఇన్వర్టర్ వేరు.. ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వేరు

ఇన్వర్టర్ అనగానే విద్యుత్ నిల్వ చేసి కరెంటు పోయినప్పుడు తిరిగి అందించే ఉపకరణమని చాలా మందికి తెలుసు. కానీ కొంతకాలంగా ఇన్వర్టర్ ఏసీలు, ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ల వంటివి మార్కెట్లోకి ప్రవేశించాయి. అంటే అవి కూడా విద్యుత్ ను నిల్వ చేసుకుని.. కరెంటు సరఫరా ఆగిపోయినా నడుస్తుంటాయని చాలా మంది పొరపాటు పడుతుంటారు. ఈ భావన సరికాదు. ఇన్వర్టర్ ఏసీలు, ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లు అంటే కేవలం ఇన్వర్టర్ టెక్నాలజీని పొందుపరిచి రూపొందించినవి మాత్రమే. అవి విద్యుత్ ను నిల్వ చేసుకోలేవు, విద్యుత్ సరఫరా లేనప్పుడు పనిచేయడం ఆపేస్తాయి కూడా. కానీ ఇన్వర్టర్ టెక్నాలజీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం...

ఇన్వర్టర్ కాదు.. ఇన్వర్టర్ సిస్టమ్ (వ్యవస్థ)

సాధారణంగా మనం ఇన్వర్టర్ గా పిలిచేది కేవలం ఇన్వర్టర్ కాదు.. అది ఇన్వర్టర్ సిస్టమ్ (ఇన్వర్టర్ వ్యవస్థ). ఇందులో ‘ఇన్వర్టర్ కం కన్వర్టర్’ తో పాటు ‘బ్యాటరీ’ ఉంటుంది. బ్యాటరీ విద్యుత్ ను నిల్వ చేసుకుంటే... మెయిన్ నుంచి బ్యాటరీలోకి విద్యుత్ ను నింపడం, కరెంటు పోయినప్పుడు తిరిగి విద్యుత్ ను బ్యాటరీలోంచి తీసి మెయిన్ కు అందించడం వంటి పనులను ‘ఇన్వర్టర్ కం కన్వర్టర్’ నిర్వహిస్తుంది. అంతేగాకుండా మెయిన్ నుంచి వచ్చే ఏసీ (ఆల్టర్నేట్ కరెంట్)ను బ్యాటరీలో నిల్వ అయ్యేలా డీసీ (డైరెక్ట్ కరెంట్)గా... కరెంటు పోయినప్పుడు తిరిగి బ్యాటరీ నుంచి డీసీ విద్యుత్ ను ఏసీ గా మార్చుతుంది.

ఇన్వర్టర్ టెక్నాలజీ ఏమిటి?

అవసరాన్ని బట్టి ఎలక్ట్రిక్ మోటార్లు, కంప్రెసర్ల వేగంలో మార్పులు జరుగుతూ స్థిరమైన, ఉత్తమమైన అవుట్ పుట్ లభించడాన్నే ఇన్వర్టర్ టెక్నాలజీగా చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ వినియోగించే ఉపకరణాలలో విద్యుత్ ను నిల్వ చేయడమంటూ ఏదీ ఉండదు. విద్యుత్ లేకపోతే ఆ ఉపకరణాలు పనిచేయవు. ఈ టెక్నాలజీతో తయారు చేసే  ఏసీల్లోగానీ, రిఫ్రిజిరేటర్లలోగానీ, ఇతర ఉపకరణాల్లోగానీ విద్యుత్ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా వేగాన్ని పెంచుకునే, తగ్గించుకునే మోటార్లను, కంప్రెసర్లను వినియోగిస్తారు. అవసరమైనప్పుడల్లా వాటికి అందే విద్యుత్ ఫ్రీక్వెన్సీని మార్చుతూ సరఫరా చేసేందుకు ఇన్వర్టర్ కం కన్వర్టర్ ను ఏర్పాటు చేస్తారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలోపల ఉష్ణోగ్రతలను గమనించే సెన్సర్లను అమర్చుతారు. ఈ సెన్సర్ల ద్వారా ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను ఇన్వర్టర్ పరిశీలిస్తూ... అవసరమైనప్పుడల్లా మోటార్లకు అందించే విద్యుత్ ఫ్రీక్వెన్సీని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటుంది. దీంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు స్థిరంగా పనిచేస్తాయి. విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది.

30 శాతం వరకూ ఆదా..

ఏసీలు, ఫ్రిజ్ లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రారంభ విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పరికరాలు నడిచినంత సేపు వాటిల్లోని మోటార్లు, కంప్రెసర్లు పూర్తి స్థాయి వేగంతో పనిచేస్తుంటాయి. కానీ ఇన్వర్టర్ టెక్నాలజీ వినియోగించే వాటిలో అప్పటి అవసరాన్ని బట్టి మోటార్లు, కంప్రెసర్లు పనిచేసే వేగం మారుతుంది. ఆ పరికరాలను ప్రారంభించినప్పుడు కూడా సాధారణ విద్యుత్ నే వినియోగించుకుంటాయి.

ఉదాహరణకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చలికాలంలో బాగా చలిగా ఉండే రాత్రి సమయాల్లోనూ సాధారణ ఏసీలు ఒకే వేగంతో పనిచేస్తుంటాయి. మనం మాన్యువల్ గా ఏసీల ఉష్ణోగ్రతలను తగ్గించినా, పెంచినా విద్యుత్ వినియోగం మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంటుంది. వాటి ప్రారంభ విద్యుత్ వినియోగం 3 వేల నుంచి 3,500 వాట్ల వరకు ఉంటుండగా.. కొంత సమయం తర్వాత స్థిరంగా నడిచేప్పుడు ఒకే స్థాయిలో 1,000 నుంచి 1,500 వాట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అదే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీల్లో ప్రారంభ విద్యుత్ వినియోగం 1,000 నుంచి 1,500 వాట్లు మాత్రమే ఉంటుంది. ఇక స్థిరంగా నడిచే సమయంలో అవసరాన్ని బట్టి మోటార్లు, కంప్రెసర్ల వేగం మారుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు 600 నుంచి 800 వాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. తద్వారా మొత్తంగా దాదాపు 30 % వరకు విద్యుత్ ఆదా అవుతుంది. 

ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

  • సాధారణ ఎలక్ట్రానిక్ పరికరాలకన్నా ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న పరికరాలు 30 శాతం వరకూ విద్యుత్ ను ఆదా చేస్తాయి.
  • రిఫ్రిజిరేటర్ల వంటి వాటిలో ఇన్వర్టర్ టెక్నాలజీ కారణంగా లోపలి ఉష్ణోగ్రతలు పూర్తి స్థిరంగా కొనసాగుతాయి. అందువల్ల ఆహార పదార్థాలు మరింత కాలం తాజాగా ఉంటాయి. అదే ఏసీల వినియోగంతో గదిలో ఉష్ణోగ్రతలు దాదాపు స్థిరంగా కొనసాగుతాయి.
  • సాధారణ ఫ్రిజ్ లు, ఏసీల వంటి వాటిని మామూలు ఇన్వర్టర్ వ్యవస్థతో వినియోగించుకోలేం. వాటికి అత్యధిక సామర్థ్యమున్న ఇన్వర్టర్ వ్యవస్థ కావాల్సి ఉంటుంది. కానీ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న పరికరాలను వాటి వాటేజ్ (విద్యుత్ వినియోగ స్థాయి) మేరకు ఉన్న ఇన్వర్టర్ వ్యవస్థలపై వినియోగించుకోవచ్చు. ఇటీవల ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేసే వాషింగ్ మెషీన్లు, సీలింగ్ ఫ్యాన్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి.


More Articles