సచిన్ విజయాలు మనకు కాసులు కురిపించే మంత్రాలు
క్రికెట్ చరిత్రలో సచిన్ రాసిన రికార్డులు, చెరిపేసిన రికార్డులు ఎన్నో ఎన్నెన్నో. సమీప భవిష్యత్తులో మరెవరూ తిరగరాయలేనివీ సచిన్ తన కెరీర్ లో నమోదు చేశాడు. ఈ రికార్డుల వెనుక కృషి, పట్టుదల, సహనం, ఆటపట్ల మక్కువ, తనలోని ప్రతిభ పట్ల విశ్వాసం ఇలా ఎన్నో కనిపిస్తాయి. సచిన్ ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహద పడిన ఈ సూత్రాలనే ఆచరణలోకి తీసుకుని వాటిని తమ పెట్టుబుడుల విషయంలో ఆచరిస్తే సంపదను సృష్టించుకోవచ్చు.
16వ ఏటే ఆట మొదలైంది...
సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో 16వ ఏటే ప్రవేశించాడు. దాంతో సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడిగా కొనసాగడంతోపాటు మరెవరూ సాధించలేని రికార్డులను సైతం నమోదు చేశాడు. 664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఆడిన రికార్డు సచిన్ పేరిట ఉంది. ఒక క్రికెటర్ ఆడిన అత్యధిక మ్యాచుల రికార్డు ఇది కావడం విశేషం. అంతేకాదు అతడు చేసిన 34,357 పరుగులు కూడా రికార్డే. ఇప్పటి వరకు ఈ రికార్డులు మరెవరి పేరిట లేవు.
అచ్చంగా సచిన్ కెరీర్ వలే ప్రతీ వ్యక్తి తన జీవితంలో చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించాలి. దాంతో సంపద సృష్టికి సుదీర్ఘ కాలం చేతిలో ఉంటుంది. ఇది ఎలా అంటే... 20 ఏళ్ల వయసు నుంచి నెలకు 5వేల రూపాయల చొప్పున 59వ ఏట పూర్తయ్యే వరకు (40 ఏళ్లు నిండా) పెట్టుబడి పెడుతూ వెళితే 5.9 కోట్ల రూపాయల నిధి సమకూరుతుంది. ఇది సగటు 12 శాతం వార్షిక వృద్ధి ఆధారంగా లెక్కించిన మొత్తం. అదే 30 ఏళ్ల వయసు నుంచి నెల నెలా రూ.5వేల చొప్పున 59 ఏట వరకు (30 ఏళ్లు) పెట్టుబడి పెడుతూ వెళితే 12 శాతం వార్షిక వడ్డీ ప్రకారం సమకూరే నిధి 1.74 కోట్ల రూపాయలు. పదేళ్లు తగ్గడం వల్ల ఎంత తేడా ఉందో చూశారా. కనీసం 30వ ఏట నుంచి నెల నెలా 10వేల రూపాయల చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టినా 12 శాతం వార్షిక వృద్ధితో పోగయ్యే సంపద 3.5కోట్ల రూపాయలు మాత్రమే. చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించడం వల్ల ఉన్న మహత్తు ఇదే.
లైన్ దాటరాదు...
ఆటను ఆస్వాదిస్తూ కలల్ని ఛేదించండి. అప్పుడే అవి సాకారం అవుతాయి అంటూ మాస్టర్ బ్లాస్టర్ ఓ సందర్భంలో చెప్పాడు. అంతేకాదు యావత్ భారత్ గర్వించదగ్గ శాస్త్రవేత్త కలామ్ కూడా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని సెలవిచ్చారు. ఆర్థిక లక్ష్యాల సాధన కూడా అచ్చం ఇలానే. నేను కోటీశ్వరుడిని కావాలి. నేను బెంజ్ కారులో తిరగాలి. ఓ ప్యాలస్ లో 100 మంది పనివారితో రాజవైభోగం అనుభవించాలి. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి. ఎంత ఖర్చయినా సరే నా పిల్లలకు అత్యున్నత నాణ్యతతో కూడిన చదువు చెప్పించాలి. ఇలా ఎన్నో కలలు ఉంటాయి. వాటిని చంపుకోవద్దు. ఆ కలల్ని సజీవంగా ఉంచుకోండి.
కోటీశ్వరుడు కావాలంటే ఎన్నేళ్లలో కావాలి. ఎన్నేళ్లలో ప్యాలస్ కు యజమాని కావాలి. పిల్లల గొప్ప చదువులకు అయ్యే వ్యయం ఎంత. ఎన్నేళ్లకు ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలి. ఇలా ప్రతీ అవసరం, సమయాన్ని లెక్కించుకుని ఆ మేరకు సంపద పోగయ్యేలా ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. అందుకు సరిపడా ఆర్థిక విజ్ఞానం లేకపోతే ఆర్థిక నిపుణుల సాయంతో లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెడుతూ వెళ్లాలి. అప్పుడే కలల్ని కళ్ల ముందు ప్రత్యక్షంగా చూస్తారు.
అంతేకాదు వేతన జీవులు, ఇతర ఆర్జనా పరులు జీవితమంతా ఒకే వేతనంలో కొనసాగరు కదా. వారికి సమయానుకూలంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా పెట్టుబడుల మొత్తాన్ని కూడా సమయానికి అనుగుణంగా పెంచుకుంటూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా.
స్థిరత్వం కావాలి
సెంచరీ కొట్టినప్పుడు... సున్నా స్కోరుతో అవుటైనప్పుడు... సచిన్ ఒకే విధంగా ఉన్నాడు. ఉప్పొంగిపోలేదు... నిరాశతో కుప్పకూలిపోలేదు. భావోద్వేగాలను అంతలా తన నియంత్రణలో ఉంచుకోవడం వల్లే అవి అతడి ఆటను ప్రభావితం చేయలేదు. ఆ కంట్రోలింగ్ పవరే సచిన్ అంత గొప్ప స్థాయికి ఎదగడానికి దోహదపడింది. అదేవిధంగా పెట్టుబడుల విషయంలోనూ ఎప్పుడూ నిరాశ కూడదు. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు స్వల్ప కాలంలో నష్టాలను చూపిస్తాయి. నిరాశ చెంది పెట్టుబడులను ఆపరాదు. సహనంతో భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. అలాగే మధ్య మధ్యలో ఎలాంటి అవసరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆకర్షణల వలలో పడొద్దు.
అధ్యయనం అవసరం
సచిన్ ప్రతీ మ్యాచ్ కు ముందు కొంత కార్యసాధన చేసేవాడు. అలాగే ప్రతీ క్రికెటర్ అసలు మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ మ్యాచులు ఆడేవారన్న సంగతి తెలిసిందే. అలాగే పెట్టుబడికి ఎంచుకునే మార్గాల విషయంలోనూ ముందుగా తగినంత అధ్యయనం అవసరం. పెట్టుబడి పెట్టాలి కదా అని ఏదో ఒక పథకాన్ని లేదా పాలసీని ఎంచుకుని వెళ్లడం సరికాదని ఆర్థిక పండితుల సూచన. అలాగే, పన్ను ఆదా కోసం ఏజెంట్లు, బ్రోకర్లు చెప్పిన మాటలను నమ్మి ఎందులో పడితే అందులో పెట్టుబడులు పెట్టకుండా అసలు ఆ పథకాలు తమ లక్ష్యాలను చేర్చే దారులా? కాదా? చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సూత్రాలతో క్రమశిక్షణతో సాగిపోతే సంపన్నులవడం... సచిన్ వంటి రికార్డులను సంపద సృష్టిలో నమోదు చేయడం అసాధ్యం కాబోదు.