భారత పార్లమెంటు వ్యవస్థ... చట్టాలు ఎలా తయారయ్యేదీ తెలుసా..?

ఒక మానవ సమూహాన్ని ఓ ప్రాంతంలో విడిచిపెట్టి బతికేయండి అని చెబితే ఏమవుతుంది? ముందు ఆకలి కోసం వారి నుంచి వేట మొదలవుతుంది. కొందరికే ఆహారం దొరికి మిగిలిన వారికి ఏమీ లభించకుంటే ఏం చేస్తారు? దొరికిన ఆహారం కోసం వారు గొడవ పడతారు. చివరికి అక్కడ అశాంతికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కనీసం హక్కులు కూడా అందని పరిస్థితి నెలకొంటుంది. అందుకే కొన్ని ఉమ్మడి సూత్రాలకు అందరూ కట్టుబడి ఉండే సామాజిక విధానం అవసరం. ఆ సమాజాన్ని పాలించే వ్యవస్థే ప్రభుత్వం.  

ప్రజల ఆకాంక్షలు... ప్రభుత్వ చర్యలు

పాలనా వ్యవస్థ అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండవచ్చు. కొన్ని దేశాల్లో రాచరిక పాలన కనిపిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న వారు పాలిస్తారు. ఈ విధానమే నేడు చాలా దేశాల్లో అమల్లో ఉంది. ప్రజల సహజ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ కర్తవ్యం. స్వేచ్చ, గౌరవంతో జీవించే అవకాశం, జీవించేందుకు అవసరమైన భద్రత, ప్రజలు గొడవలు పడకుండా, యుద్ధాలు జరగకుండా నివారించడం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత నివాసం లేదా తక్కువ ధరలకే గృహలు, ప్రజా రవాణా వసతి, విద్యుత్, నీరు, సబ్సిడీ ధరలకే ఆహారం, అందరికీ సమాన అవకాశాలు, సమాజంలో అసమానతలు లేకుండా చూడాలని ప్రభుత్వం నుంచి ప్రజలు సాధారణంగా ఆశిస్తుంటారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు నిర్ణయాలు తీసుకోవడం, విధానాలు రూపొందించడం, చట్టాలను తీసుకొచ్చి అమలు చేయడం జరుగుతుంది. ఇలా ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం చట్టాలను తీసుకొచ్చే వేదికే శాసన వ్యవస్థ (పార్లమెంటు). 

ప్రభుత్వంలో మూడు విభాగాలు ఎందుకు...?

శానసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనే ఈ మూడు కూడా ప్రభుత్వంలో భాగమే. సమాఖ్య ప్రభుత్వంలో శాసన వ్యవస్థ అంటే పార్లమెంటు (రాజ్యసభ, లోక్ సభ). కార్య నిర్వాహక వ్యవస్థ అంటే రాష్ట్రపతి, ప్రధాని, మంత్రివర్గం చట్టాలను అమలు చేసేవారు. జ్యుడీషియరీ అంటే న్యాయస్థానాలు. రాజ్యాంగం ఈ మూడు వ్యవస్థలకు విడివిడిగా అధికారాలు కల్పించింది. తమ అధికారాల మేరకు స్వతంత్రంగా పనిచేస్తూనే మిగిలిన విభాగాల్లో అధికార దుర్వినియోగం జరగకుండా నివారిస్తాయి. 

కార్య నిర్వాహక వ్యవస్థ అధికారాలను పార్లమెంటు సమీక్షించడమే కాకుండా అవసరమైతే చెక్ పెట్టగలదు. పార్లమెంటు చేసిన చట్టాలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే అత్యున్నత న్యాయస్థానం సమీక్షించి నిజమేనని భావిస్తే ఆ చట్టాలు చెల్లుబాటు కావని ప్రకటించే అధికారం ఉంది. ఇక కోర్టులు కొట్టివేసిన బిల్లును అవసరమైతే తగిన మార్పులతో మళ్లీ తీసుకొచ్చే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే, ఈ చట్టాల విషయంలో సాధారణంగా సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకునే అధికారాలు ఉన్నప్పటికీ జోక్యం చేసుకోదు. పౌరులు, లేదా సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద సవాలు చేసిన సందర్భాల్లోనే న్యాయ సమీక్ష జరుపుతాయి. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల ప్రవర్తనపై ఆరోపణలు వచ్చినప్పుడు వారిని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే ఆయన సమ్మతితో న్యాయమూర్తులను తొలగించవచ్చు. ఇక పార్లమెంటులోనూ లోక్ సభ, రాజ్యసభలు ఒకదానికొకటి నియంత్రించగలవు. ముఖ్యంగా బిల్లుల సమయంలో లోక్ సభలో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని భావిస్తే దానిని రెండో సభ ఆమోదించకుండా అడ్డుకోవచ్చు. రెండు సభల్లోనూ అధికార పార్టీయే మెజారిటీ కలిగి ఉంటే ఇది సాధ్యం కాదు. 

representation image

పార్లమెంటు 

చట్టాలను రూపొందించే వేదిక ఇది. లోక్ సభ, రాజ్యసభలను కలిపి పార్లమెంటుగా వ్యవహరిస్తారు. పార్లమెంటు అనే పదం ఫ్రెంచ్ పదం పార్లెర్ నుంచి వచ్చింది. పార్లెర్ అంటే ప్రసంగం. అమెరికాలో శాసన వ్యవస్థను కాంగ్రెస్ అంటారు. యూకేలో పార్లమెంటు, ఇటలీలో పార్లమెంటో, జర్మనీలో పార్లమెంటు, పాకిస్థాన్ లో ఫెడరల్ లెజిస్లేచర్, రష్యాలో ఫెడరల్ అసెంబ్లీ, జపాన్ లో ద నేషనల్ డైట్ అంటుంటారు. 

ఎగువ సభను మన దగ్గర రాజ్యసభ అని, దిగువ సభను లోక్ సభ అంటారు. వీటినే అమెరికాలో అయితే సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, యూకేలో హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని, ఇటలీలో రిపబ్లికా సెనేట్, చాంబర్ ఆఫ్ డిప్యూటీస్, ఫ్రాన్స్, పాకిస్థాన్ ల లో సెనేట్, నేషనల్ అసెంబ్లీ, జపాన్ లో హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనే పేర్లున్నాయి. 

లోక్ సభ

లోక్ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545 మంది. వీటిలో 543 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఓ రెండు స్థానాల్లో మాత్రం ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు. మిగిలిన లోక్ సభ సభ్యులను 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదు చేసుకున్న భారత పౌరులే నేరుగా ఎన్నుకుంటారు. మొత్తం సీట్లలో 131 సీట్లను రిజర్వ్ డ్ వర్గాలకు కేటాయించారు. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థి భారతీయులై, 25 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. దోషిగా నిరూపితం కాకుండా, మానసిక స్థితి సరిగా ఉండాలి. ప్రతీ రాష్ట్రానికి కూడా లోక్ సభలో ప్రాతినిథ్యం ఉంటుంది. ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఈ సీట్ల సంఖ్య ఉంటుంది. నిర్ణీత జనాభాకు ఓ స్థానం చొప్పున ఈ సంఖ్యను నిర్ణయించారు. 

వాస్తవానికి లోక్ సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండేందుకు రాజ్యాంగం అనుమతించింది. లోక సభ పదవీ కాలం ఐదేళ్లు. లోక్ సభ ఎన్నికల అనంతరం మొదటి సారి సమావేశమైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అయితే, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటిస్తే ఆ సమయంలో లోక్ సభ పదవీ కాలాన్ని ఏడాది పాటు పార్లమెంటులో చట్టం ద్వారా పొడిగించవచ్చు. చివరిగా 2014లో 16వ సారి లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 282 సీట్లను గెలుచుకున్న బీజేపీ తన మిత్ర పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  

రాజ్యసభ

ఎగువ సభ లేదా పెద్దల సభ అని కూడా దీనికి పేర్లున్నాయి. రాజ్యాంగం అనుమతించిన సభ్యుల సంఖ్య 250 కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య మాత్రం 245 మంది. వీరిలో 233 మందిని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. రాష్ట్ర జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాల శాసనసభ (చట్టసభ) సభ్యుల సంఖ్య ఉంటుంది. రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రతీ రాష్ట్రానికి రాజ్యసభ సీట్లు కేటాయింపు చేశారు. 

రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసేందుకు కనీసం 30 ఏళ్లు నిండి ఉండాలి. ఇది శాశ్వత సభ. లోక్ సభ మాదిరిగా ప్రతీ ఐదేళ్లకోమారు దీని కాలపరిమితి ముగియదు. ప్రతీ సభ్యుడికి ఆరేళ్ల పదవీ కాలం ఉంటుంది. మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు సభ్యుల పదవీ కాలం ప్రతీ రెండేళ్లకోమారు ముగుస్తుంది. ఖాళీ అయిన స్థానాలకు తిరిగి ఎన్నిక జరుగుతుంటుంది.  

పార్లమెంటు సమావేశాలు

రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ప్రతీ ఏడాదిలో కనీసం రెండు సార్లు తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ సమావేశాన్నే సెషన్ అని అంటారు. రెండు సమావేశాల మధ్య విరామం ఆరు నెలలకు మించి ఉండరాదు. అయితే సాధారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఏటా మూడు సార్లు సమావేశం అవుతుంటాయి. బడ్జెట్ సమావేశాలు (ఏటా ఫిబ్రవరి నుంచి మే మధ్య), వర్షాకాల సమావేశాలు (జూలై, సెప్టెంబర్ మధ్య), శీతాకాల సమావేశాలు (నవంబర్, డిసెంబర్ మధ్య) జరుగుతుంటాయి. 

చట్టాలకు రూపకల్పన ఆమోదం

ఏదేనీ ఓ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాదలిస్తే అందుకు సంబంధించిన విధి, విధానాలతో ఓ బిల్లును రూపొందిస్తుంది. ఈ బిల్లు ముసాయిదాను ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రెండు సభల్లో తొలుత ఏ సభ ముందుకు అయినా బిల్లు ముసాయిదాను తీసుకు రావచ్చు. అయితే, బిల్లును ప్రవేశపెట్టడం నుంచి ఆమోదం వరకు ఎన్నో దశలు ఉన్నాయి.  

ఓ బిల్లును రూపొందించడం అయిన తర్వాత సంబంధిత శాఖ దాన్ని న్యాయ శాఖ పరిశీలనకు పంపిస్తుంది. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ఉందేమో పరిశీలన పూర్తయిన తర్వాత బిల్లు ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా ఉంటే న్యాయ శాఖ దాన్ని కేబినెట్ (మంత్రివర్గం)కు పంపుతుంది. కేబినెట్ (మంత్రి మండలి) ఆమోదం అనంతరం ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖ మంత్రి బిల్లు ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెడతారు. తర్వాత మోషన్ కోరతారు. మోషన్ అనేది చట్టం రూపొందించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన. ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నదీ మంత్రి సభకు వివరిస్తారు. ఈ మోషన్ ను సభలోని మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే బిల్లు ముసాయిదాపై చర్చ ఉంటుంది. ఆమోదించకుంటే అది వీగిపోతుంది. 

ఆమోదం పొందితే పార్లమెంటులో బిల్లు నమోదైనట్టు తీర్మానం అనంతరం సభలో చర్చ జరుగుతుంది. ఒక్కోసారి అభ్యంతరాలు వ్యక్తమయితే స్పీకర్ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపుతారు. ఆ కమిటీ అధ్యయనం అనంతరం తగిన సూచనలతో బిల్లును ప్రవేశపెట్టిన సభకు పంపుతుంది. తర్వాత ఆ బిల్లుపై సభలో చర్చ జరుగుతుంది. సభ్యులు దీనిపై సవరణలు సూచించవచ్చు. అయితే, సభ ఈ సవరణలను ఆమోదించవచ్చు. తిరస్కరించవచ్చు. చర్చ సందర్భంగా అధికార పక్షం, ప్రతిపక్షాల తరఫున సభ్యులు వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. చర్చముగిసిన తర్వాత బిల్లుపై సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఆమోదం పొందితే ఆ తర్వాత ద్వితీయ సభలో మరో సభ పరిశీలనకు వెళుతుంది. అక్కడ కూడా సభలో చర్చ, ఓటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే చివరిగా రాష్ట్రపతి ఆమోదానికి వెళుతుంది. 

ఇదే చివరి దశ. రాష్ట్రపతి ఉభయ సభలు ఆమోదించి పంపిన బిల్లును పరిశీలించి అవసరమైతే తగిన సూచనలు, సవరణలు సూచించవచ్చు. అయితే, పార్లమెంటు వాటిని ఆమోదించాలన్న కట్టుబాటు ఏమీ లేదు. అలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి ఆమోదించవచ్చు. లేదా తిరస్కరించి పార్లమెంటుకు తిప్పి పంపవచ్చు. ఇలాంటి సమయాల్లో పార్లమెంటు మరోసారి బిల్లును ఆమోదించి పంపితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదించాల్సిందే. రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా మారిపోతుంది. 

ఒక సభ ఆమోదించిన బిల్లుపై రెండో సభ సవరణలు చేస్తే... అప్పుడు దాన్ని తొలుత ఆమోదించిన సభ మరోసారి ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. రెండో సభ చేసిన సవరణలను తిరిగి ముందటి సభ ఆమోదించకుంటే అప్పుడు ఆ బిల్లును రెండు సభలు ఆమోదించనట్టే భావిస్తారు. ఏదైనా ఒక బిల్లు విషయమై రెండు సభల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంటే అప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని (జాయింట్ సెషన్) ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు సాధారణ మెజారిటీతో (మొత్తం హాజరైన సభ్యుల్లో సగానికంటే ఎక్కువ) బిల్లును ఆమోదించుకోవచ్చు.  

సాధారణ బిల్లులు ఏవైనా గానీ వాటిపై ఓటింగ్ రోజున హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ వస్తే ఆమోదానికి నోచుకున్నట్టే. అదే రాజ్యాంగ సవరణ బిల్లు అయితే దీనికి హాజరైన మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బిల్లు నెగ్గినట్టు.

పార్లమెంటులో మంత్రి మాత్రమే కాకుండా ఇతర ఏ సభ్యుడైనా బిల్లును సభలో ప్రవేశపెట్టవచ్చు. అలాంటప్పుడు దాన్ని ప్రైవేటు మెంబర్స్ బిల్లు అంటారు. దీని కోసం నెల రోజులు ముందుగా సభాపతికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. మనీ బిల్లులను మాత్రం లోక్ సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. వీటికి లోక్ సభ అనుమతి ఉంటే చాలు. వీటిపై రాజ్యసభ 14 రోజుల్లోపు సిఫారసులు మాత్రమే చేయగలదు. 

అవిశ్వాస తీర్మానం

ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లును తీసుకొచ్చినా లేక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నట్టు భావించినా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం కింద స్పీకర్ కు నోటీసు ఇస్తుంది. స్పీకర్ ఆమోదిస్తే దానిపై సభలో చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో ప్రతిపక్షం నెగ్గితే అప్పుడు ప్రధానమంత్రి, ఇతర మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇతర పార్టీలు కలసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా తాజా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. 

సభ్యుల అధికారాలు

పార్లమెంటులో ఏ సభ్యుడైనా, ఏ అంశంపైన అయినా స్వేచ్చగా మాట్లాడవచ్చు. పార్లమెంటులో చేసిన ఏ ప్రకటనపై అయినా అతన్ని శిక్షించే అధికారం కోర్టులకు లేదు. పార్లమెంటు సమావేశాల కాలంలో ఏ సభ్యుడినైనా అరెస్ట్ చేయరాదు. ఒకవేళ సభ్యుడిపై హత్య వంటి తీవ్ర నేరారోపణలు వచ్చినట్టయితే అరెస్ట్ చేసేందుకు స్పీకర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. 

పార్లమెంటు కార్యకలాపాలు, అధికారాలు

చట్టాలను రూపొందించడం, బడ్జెట్ ను ఆమోదించడం, ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలు, ప్రణాళికలు, పాలనా విధానాలు, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చలు పార్లమెంటులో జరుగుతుంటాయి. ప్రతీ సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం, నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను, జాతీయ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కూడా సభ దృష్టికి తీసుకురావచ్చు. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల వికేంద్రీకరణలో రాజ్యాంగం ప్రకారం కేంద్రం వ్యవహరించకపోయినా సభలో నిలదీయవచ్చు. నిధుల విషయమై కూడా ప్రశ్నించవచ్చు. 

సభలు సమావేశమైన రోజుల్లో ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్)గా పేర్కొంటారు. ఈ గంట వ్యవధిలో ప్రభుత్వ పాలసీలు, బిల్లులపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. జనజీవనంపై ప్రభావం చూపే వ్యవహారాలపైనా ప్రశ్నలు సంధించవచ్చు. 12 గంటల నుంచి ఓ గంట వ్యవధిలో ముందస్తుగా స్పీకర్ కు నోటీసు ఇచ్చి ఏ ముఖ్యమైన అంశంపైనా చర్చించవచ్చు. ఏ బిల్లు, అంశంపైన అయినా ఓటింగ్ చేపడితే అది ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుంది. 

రాష్ట్రపతిని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన ఎన్నికల అధికారి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని సైతం అభిశంసన ద్వారా తొలగించే అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయి. పాలనా, అధికార యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తాయి. అంతేకాదు, అవసరమైతే ప్రజా ప్రయోజనాల రీత్యా రాజ్యాంగాన్ని సైతం సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. 

పార్లమెంటు కమిటీలు

ప్రతీ రంగానికి సంబంధించి పార్లమెంటు కమిటీలు ఉంటాయి. ఇవి ఆయా రంగాలకు సంబంధించిన విధానాలు, చట్టాలు, నిధుల వినియోగం, వివిధ అంశాలపై అధ్యయనం జరిపి పార్లమెంటుకు సిపారసులు చేస్తుంటాయి. పార్లమెంటరీ కమిటీల్లో అడ్ హాక్, స్టాండింగ్ కమిటీలని రెండు రకాలు. స్టాండింగ్ కమిటీలు (స్థాయీ సంఘాలు) శాశ్వతంగా ఉంటాయి. పార్లమెంటు చట్టాల మేరకు ఇవి ఏర్పాటవుతుంటాయి. అడ్ హాక్ కమిటీలు మాత్రం ప్రత్యేక అంశాలపై అధ్యయనం కోసం మాత్రమే ఏర్పాటవుతాయి. ఆ పని పూర్తయి పార్లమెంటుకు నివేదిక సమర్పించిన వెంటనే వాటి కాలపరిమితి ముగుస్తుంది. 

స్పీకర్ ఎంపిక, అధికారాలు

లోక్ సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను సభ్యులు ఏకగ్రీవంగా లేదంటే ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రాజ్యసభకు చైర్మన్ గా ఉప రాష్ట్రపతి వ్యవహరిస్తారు. డిప్యూటీ చైర్మన్ ఎంపిక ఎన్నిక విధానంలో జరుగుతుంది. చైర్మన్, ఉప చైర్మన్ లేని సమయాల్లో ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్మన్ కింద ఇతరులను ఆ బాధ్యతల్లో తాత్కాలికంగా నియమిస్తారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు చర్చలకు సంబంధించిన అజెండాను అన్ని పార్టీల సభ్యులతో కలసి రూపొందిస్తారు. ఏ ప్రశ్న ముందుగా చర్చించాలో నిర్ణయిస్తారు. సభ్యులకు వారి హక్కుల మేరకు చర్చల్లో అవకాశాలు కల్పిస్తారు. పార్లమెంటులో చర్చలకు కనీస సభ్యుల సంఖ్య అవసరం. అలా లేని సమయాల్లో సభను వాయిదా వేస్తారు. అవసరమైతే ఉభయసభలను సంయుక్తంగా సమావేశపరుస్తారు. 

రాష్ట్రపతి, పార్లమెంటుకు మధ్య అనుసంధానకర్తగా కూడా స్పీకర్ వ్యవహరిస్తారు. నిబంధనలకు అనుగుణంగా నడచుకోకుంటే సభ్యులపై చర్యలు తీసుకుంటారు. సభ్యులు ప్రశ్నలు, అంశాలను లేవనెత్తితే అవి ప్రజా ప్రయోజనాల మేరకు ఉంటే అనుమతించడం లేదంటే తిరస్కరించడం చేస్తారు. ఏదేనీ ఒక బిల్లుపై ఓటింగ్ లో టై అయితే, తనకున్న ఓటు హక్కును వినియోగించుకుని దాన్ని భవితవ్యాన్ని తేలుస్తారు. ఇక, ప్రధాని సభా నాయకుడిగా వ్యవహరిస్తే... ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందిన పార్టీ (లోక్ సభ మొత్తం స్థానాల్లో పది శాతం సీట్లు అంటే 55 సీట్లను సాధించిన రాజకీయ పార్టీ) నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు. 

అసెంబ్లీ

ప్రతీ రాష్ట్రానికి శాసన సభ ఉంటుంది. దీనిని విధాన సభగా పిలుస్తారు. పార్లమెంటులో వలే శాసనసభలో రాష్ట్ర స్థాయిలో చట్టాల రూపకల్పన జరుగుతుంది. పార్లమెంటుకు ఉన్న అధికారాల మాదిరే శాసనసభకు కూడా ప్రత్యేకంగా అధికారాలు కల్పించారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర శాసనసభలోనైనా 60 మంది సభ్యుల కంటే తక్కువ, 500 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండరాదు. సభ్యులను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని శాసనసభకు గవర్నర్ నామినేట్ చేస్తుంటారు. 

శాసనసభ పదవీ కాలం ఐదేళ్లు. ముఖ్యమంత్రి కోరికపై ముందుగానే శాసనసభను గవర్నర్ రద్దు చేయవచ్చు. అవిశ్వాస తీర్మానం, మనీ బిల్లులను శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రాజ్యసభ వలే కొన్ని రాష్ట్రాల్లో పెద్దల సభ అన్న అర్థంలో శాసనమండలి లేదా విధాన పరిషత్ ఉంది. కాకపోతే బిల్లుల ఆమోదానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం అవసరమైనట్టుగా... రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి రెండింటి ఆమోదం అవసరం లేదు. శాసనసభ ఆమోదం ఒక్కటి సరిపోతుంది. 


More Articles