సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషించే డ్రై ఫ్రూట్స్!

డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలిసి ఉండదు. మరీ ముఖ్యంగా ఇవి మంచి సౌందర్య సాధనాలన్న విషయం తెలిసిన వారు చాలా అరుదు. ఈ డ్రై ఫ్రూట్స్ తో కొత్త అందాలను ఎలా తెచ్చుకోవచ్చనే విషయంలో సౌందర్య, పోషకాహార నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం... 

బాదం

వీటిలో ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, పీచు సమృద్ధిగా ఉంటాయి. మొటిమల నివారణకు ఉపయోగకారిగా ఉంటాయి. వీటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి మార్పు కనిపిస్తుందట. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను, మడ్డిని తొలగిస్తుంది. దాంతో ముఖం కళకళలాడిపోతుంది. శిరోజాలకు బాదం నూనె రాయడం వల్ల మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. 

ఎండుద్రాక్ష

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కొద్ది మొత్తంలో ఎండు ద్రాక్షలను తినాలట. దంతాలు దెబ్బతినకుండా ఉండడానికి, పుచ్చిపోకుండా ఉండడానికి ఇవి ఉపకరిస్తాయి. విటమిన్ ఎ తగినంత లభిస్తుంది. విటమిన్ ఎ కంటిచూపునకు ఉపకరిస్తుందని తెలుసు కదా. రిస్వెరట్రాల్ అనే యాంటీ యాక్సిడెంట్ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది. చర్మం ముడతలు పడడాన్ని ఇది అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.  

వాల్ నట్స్

వీటినే ఆక్రోట్లు అని అంటారు. రుచి విషయంలో వీటిని పెద్దగా ఇష్టపడకపోవచ్చు. కానీ వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. వీటిల్లో  ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. పొడి చర్మానికి పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. మూడు టేబుల్ టీ స్పూన్ల పెరుగులో కొన్ని ఆక్రోట్లు వేసి మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి. ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు రాకుండా నివారిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆక్రోట్లు మెదడు ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా వీటిలోని ఒమెగా యాసిడ్లు మేలు చేస్తాయి. 

జీడిపప్పు

జీడిపప్పులు మితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. రోజుకు కొన్ని తినడం ద్వారా బరువు తగ్గవచ్చు. జీడిగింజల్లోని నూనెను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని ఇది సరి చేస్తుంది. కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు. వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి కూడా వీటివల్ల ప్రయోజనమే. 

పిస్తా

పిస్తాలో పోషకాలు ఎక్కువ. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అది చర్మాన్ని కాపాడుతుంది. అతినీలలోహిత కిరణాల (యూవీ రేస్) నుంచి రక్షణ ఇస్తుంది. అరుదైన కెరటోనాయిడ్స్, ల్యూటిన్, జీక్సాంతిన్ పిస్తాలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడం వల్ల చర్మం ముడతలు పడడాన్ని ఆపి, కేన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. అంతేకాదు జీర్ణశక్తికి తోడ్పడతాయి. బ్లష్ షుగర్ ను అదుపు చేస్తాయి. గుండె జబ్జులు రాకుండా కూడా కాపాడతాయి. 


More Articles