ఎలా తింటున్నారు… లెక్క చూసుకోండి మరి!

తినే వస్తువు కనిపిస్తే ఆగలేకపోతున్నారా...? అదే పనిగా తినడం చేటు అని తెలిసి కూడా 'ఆ.. ఏమవుతుందిలే' అనుకుంటూ కంటిన్యూ చేస్తున్నారా? తినండి...కానీ, చూసిన ప్రతి దాన్ని తినేయాలన్న జిహ్వ చాపల్యం కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తూ తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. 

బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాలి 

పొద్దున్నే తీసుకునే ఆహారం బరువు తగ్గడాన్ని డిసైడ్ చేస్తుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల అది ఆకలిని మందగింపజేస్తుంది. దాంతో నోరు దానంతట అదే మూతపడుతుంది. ఓట్స్ ఉప్మా, సేమియా ఉప్మా, అలూ పరాటా, గుడ్లు, మొలకెత్తించిన ధాన్యం మొదలైనవి ఉదాహరణగా పేర్కొనవచ్చు. 

representational imageఏ సైజ్ ప్లేట్ లో తింటున్నారు...?

తినే ప్లేట్ సైజ్ కూడా కీలకమే. నిపుణులు మాత్రం చిన్న సైజు ప్లేట్ లో ఆహారాన్ని తీసుకోవాలని చెబుతుంటారు. తద్వారా తినే పరిమాణం తగ్గుతుందని వారి సూచన. లంచ్, డిన్నర్ అయితే, ప్లేట్ లో సగం కాయగూరలు, పావు శాతం కార్బో హైడ్రేట్లు, పావు శాతం ప్రొటీన్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లు అంటే బియ్యం, గోధుమలే కాదు. ధాన్యంలో ఎన్నో రకాలు ఉన్నాయి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలా వెరైటీలను మారుస్తూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో బలం చేకూరుతుంది. 

నిదానం... నిదానం... 

వేగంగా తినడం వల్ల ఎక్కువ పరిమాణం లోపలికి వెళుతుంది. దానికి బదులు కాస్తంత నిదానం అనే నియమాన్ని పాటించండి. 20 నిమిషాలకు పైగా అలా నిదానంగా తింటూ కూర్చుంటే కడుపు నిండిపోయింది ఇక చాలులే అని మెదడు సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుందట. 

representational image

ద్రవ పదార్థాలు... 

నీరు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్రతి అరగంటకోసారి తగినంత మోతాదులో నీరు, వీలైతే కొబ్బరి నీళ్లు తీసుకోండి. కొబ్బరి నీటికి మరేది సాటి రాదు. గ్రీన్ టీ  కూడా మంచిదే. 

స్నాక్స్ కంటికి కనిపించకూడదండోయ్..

తినే పదార్థాలను కంటికి కనిపించకుండా చాటుగా పెట్టడం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. చూస్తే మనసు ఊరుకోదు, నోరు అంతకన్నానూ.. అందుకే అలాంటి వాటిని దూరం పెట్టేసి అదే సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను కంటికి కనిపించేలా పెట్టుకోవడం మంచిదేనంటున్నారు. 

టీవీ చూస్తూ తినకండోయ్

టీవీ చూస్తూ తినడం ఆరోగ్యానికి చేటే. ఎంత తింటున్నామన్న దానిపై ఆలోచన, నియంత్రణ ఉండదు. ఫలితంగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 

తినడాన్ని మిస్ కావద్దు

అదేంటీ, తినడం కూడా మిస్ కావద్దంటున్నారని ఆశ్చర్యపోతున్నారా..? అవును. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మెటబాలిజం డల్ అవుతుంది. దీంతో ఆకలి ఎక్కువవుతుంది. ఫలితంగా ఎవరేం చెప్పినా వినిపించుకోకుండా ఆ రోజంతా తింటూనే ఉంటారు. కనుక ఏది ఎప్పుడు చేయాలో.. అప్పుడు చేయాల్సిందేనన్నది నిపుణుల మాట. 


More Articles