మీకు గృహ రుణం ఎంతొస్తుందో తెలుసా..?
గృహ రుణం అనేది వేతన జీవులకు ఓ మంచి ఐడియా. ఇల్లు, లేదా ఫ్లాట్ కొనుగోలుకు కావాల్సినంత నగదు సిద్ధంగా ఉన్నా కొంత వరకైనా గృహ రుణం తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే పన్ను రాయితీల పరంగా దీనికి పలు ప్రయోజనాలు ఉన్నాయి. పైగా రుణం తీర్చే మార్గంలో ఇల్లు రూపంలో పొదుపు చేసినట్టు కూడా అవుతుంది. అయితే, గృహ రుణం కావాలనుకునేవారు తమకు ఎంత మొత్తం వస్తుందో తెలుసుకోవడం కూడా ముఖ్యమే.
వేతనంలో మిగులు
శ్రీనివాస్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని వేతనం నెలకు 80వేల రూపాయలు ఉందనుకుందాం. ఇప్పుడు శ్రీనివాస్ కు గృహ రుణం ఎంత వస్తుందో ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. నెలకు 80వేల రూపాయల వేతనంలో అన్ని ఖర్చులు పోను ఎంత మిగులుతుందన్నదే ఇక్కడ ముఖ్యం. శ్రీనివాస్ కేవలం 20వేల రూపాయలే ఖర్చు పెట్టి 60వేల మొత్తాన్ని పొదుపు చేస్తున్నాడని అనుకుందాం. కానీ రుణాలిచ్చే బ్యాంకులు లేదా ఇతర గృహ రుణ సంస్థలు దీన్ని పరిగణనలోకి తీసుకోవు. వాటికంటూ ఓ సూత్రం ఉంటుంది. వాటి ప్రకారమే గృహ రుణం అర్హతను తేలుస్తాయి.
బ్యాంకులను బట్టి ఇది మారుతూ ఉంటుంది.
ఉదాహరణకు ఏదేనీ ఒక బ్యాంకు గృహ రుణం మంజూరు విషయంలో వేతనంలో మిగులును 50 శాతంగా పరిగణనలోకి తీసుకుందని అనుకుందాం. దీని ప్రకారం శ్రీనివాస్ వేతనం 80వేల రూపాయల్లో మిగులు 40 వేల రూపాయలు. ఒక లక్ష రూపాయల రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 10.5 శాతం వడ్డీ రేటు కింద లెక్క కడితే నెలసరి వాయిదా 998 రూపాయలుగా తేలుతుంది. ఈ సూత్రాన్ని బట్టి శ్రీనివాస్ కు 40 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తే (40*998=39920) నెల సరి వాయిదా 39,920 రూపాయలు. అయితే, చాలా వరకు బ్యాంకులు వేతనంలో మిగులును 35 నుంచి 40 శాతంగానే పరిగణనలోకి తీసుకుంటాయి. దీన్ని బట్టి ఎవరికి వారు తమకు ఎంత మొత్తం గృహ రుణం వస్తుందనేది లెక్కలేసి అవగాహనకు రావచ్చు.
ఆదాయాన్ని బట్టే...
ముఖ్యంగా బ్యాంకులకు రుణం విషయంలో వ్యక్తుల ఆదాయమే ప్రామాణికం. ఎక్కువ వేతనం ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణమిచ్చినా సులభంగా చెల్లించగలరని బ్యాంకులు విశ్వసిస్తాయి. స్వయం ఉపాధి, వృత్తులలో ఉన్నవారు, వ్యాపారస్థుల కంటే వేతన జీవులకే ఆదాయం విషయంలో నిలకడ ఉంటుంది. నెలకు లక్ష రూపాయలు ఆర్జించే వ్యాపారి కంటే కూడా అంతే మొత్తం ఆదాయం ఉన్న ఉద్యోగికే రుణం ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అందుకే బ్యాంకులు గత సంవత్సర కాలానికి సంబంధించిన పే స్లిప్స్, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నుల వివరాలు, ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్ అడుగుతాయి. దీన్నిబట్టి దరఖాస్తుదారుడి ఆదాయం, ఖర్చు విషయంలో ఓ అంచనాకు వస్తాయన్నమాట. ప్రయాణ భత్యం, హౌసింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ లను ఆదాయంలో భాగంగా పరిగణించవు. కొంత మంది పన్నులు కట్టాల్సి వస్తుందని ఐటీ రిటర్నుల్లో ఆదాయాన్ని తక్కువగా చూపిస్తుంటారు. దీని వల్ల రుణం లభించే మొత్తం తగ్గిపోతుంది.
వయసు కూడా ముఖ్యమే
రుణానికి దరఖాస్తు చేసుకున్న వారి వయసును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఎందుకంటే 30 ఏళ్ల వ్యక్తికి రుణం మంజూరు చేస్తే రిటైర్మెంట్ లోపు మిగిలిన 30 ఏళ్ల కాలంలో రుణాన్ని పూర్తిగా చెల్లించగలడు. అదే 50 ఏళ్ల వ్యక్తి అయితే పదవీ విరమణకు 10 ఏళ్లు మాత్రమే ఉంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తం రుణం తీర్చడం అన్నది కష్టమే. దీంతో బ్యాంకులు తక్కువ రుణం మంజూరు చేస్తాయి.
రుణ చరిత్ర..
గత రుణ చరిత్ర ఏంటీ? అని కూడా బ్యాంకులు ఆరా తీస్తాయి. గతంలో ఏవైనా రుణాలు తీసుకున్నారా? తీసుకుంటే ఎంత కాలంలో తీర్చారు? ఆలస్యం చేశారా... నిర్ణీత గడువులోపు ముగించారా? తదితర విషయాలను పరిశీలిస్తాయి. రుణ చరిత్ర సరిగా లేదని అనిపిస్తే గృహ రుణం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఒకవేళ ఇచ్చినా అర్హత కంటే తక్కువ మొత్తాన్నే మంజూరు చేస్తాయి. అంటే అసలు వేతనం ప్రకారం... దరఖాస్తుదారుడికి 40 లక్షల రుణం వరకూ మంజూరు చేయడానికి అర్హత ఉన్నా... అందులో సగం అంటే 20 లక్షల రూపాయల్లోపు ఇవ్వడానికే ఆసక్తి చూపుతాయి.
చేస్తున్న ఉద్యోగం ఏంటి..?
ఇక చేస్తున్న ఉద్యోగం ఏ రంగానికి చెందినది, స్థిరత్వం ఎంత? వంటి విషయాలు కూడా కీలకం అవుతాయి. ఒడిదుడుకులు లేని రంగంలో ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా నిర్ణీత తేదీన వేతనం పొందుతూ ఉండి రుణ చరిత్ర బాగుంటే అలాంటి వారికి రుణం మంజూరుకు ఏ అడ్డంకులు ఉండవు. మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణం కూడా వస్తుంది. ఒడిదుడుకులతో కూడిన రంగాలలో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకాడతాయి. ఇక ఆ బ్యాంకు శాఖలో చాలా కాలం నుంచి ఖాతా ఉండి నిర్వహణ తీరు బాగుంటే అలాంటి వారికి రుణం లభించడం తేలికవుతుంది.
వడ్డీ రేటు కూడా మారుతుంది...
గృహ రుణం విషయంలో బ్యాంకులు రంగాలు, కంపెనీల వారిగా వడ్డీ రేట్లను మారుస్తాయి. టాప్ కంపెనీల ఉద్యోగులకు వడ్డీ రేటులో రాయితీని కూడా ఇస్తాయి. పెద్దగా పేరు లేని, చిన్న కంపెనీల ఉద్యోగులకు వడ్డీ రేటు మరోలా ఉంటుంది.
ఎక్కువ రుణం కావాలా...?
అన్నీ తెలుసుకున్న తర్వాత చివరిగా ఎక్కువ మొత్తంలో గృహ రుణం కావాలని కోరుకుంటున్నారా..? అయితే, వీటిని ఫాలో అయితే సరి. దీర్ఘకాల వ్యవధికి రుణాన్ని తీసుకోండి. ఎందుకంటే కాల వ్యవధిని బట్టే నెలసరి వాయిదా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 10 ఏళ్ల వ్యవధికి 20 లక్షల రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే కాల వ్యవధిని 20 ఏళ్లకు పెంచుకుంటే 30 లక్షల రూపాయల రుణం పొందవచ్చు. గృహ రుణం తీసుకునే ముందు పాత రుణాలు ఏవైనా ఉంటే వాటిని మొత్తం తీర్చివేయండి. దాంతో వేతనంలో మిగులు పెరిగి ఎక్కువ మొత్తంలో గృహ రుణం పొందడానికి వీలవుతుంది. అవసరమైతే చేబదులు తీసుకుని అయినా తీర్చివేయడం నయం. లేదా పాత రుణం తీర్చే కాల వ్యవధిని పొడిగించుకోండి. దాంతో నెలవారీ రుణ వాయిదా తగ్గిపోతుంది. దీంతో వేతనంలో ఎక్కువ మిగులు చూపించుకుని గృహ రుణం ఎక్కువ పొందవచ్చు.
సహ దరఖాస్తుతో ప్రయోజనం
ఇక రుణ దరఖాస్తుదారుల్లో జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని చేర్చడం కూడా తెలివైన నిర్ణయమే. దీంతో రుణ అర్హత పెరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల ఆదాయాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. వేతనం కాకుండా ఇంటి అద్దెలు, డిపాజిట్లపై వడ్డీ ఇలా ఇతరత్రా ఆదాయం ఏమైనా ఉంటే అందుకు ఆధారాలను చూపించడం ద్వారా ఎక్కువ రుణానికి అర్హత సాధించవచ్చు. అయితే, ఈ సమాచారం గృహ రుణం తీసుకోవాలని అనుకునే వారు ఒక అవగాహనకు రావడం కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం బ్యాంకు అధికారులను, ఆర్థిక నిపుణులను సంప్రదించడం ద్వారా తెలుసుకోగలరు.