రుణంతో వాణిజ్యపరమైన ఆస్తిని కొనాలని అనుకుంటున్నారా...అయితే, ఇక్కడ ఒక లుక్కేయండి!
రుణంతో ఇల్లు కొనుగోలు చేసేవారు అధిక సంఖ్యలో కనిపిస్తుంటారు. రుణంతో వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేసేవారు తక్కువ మందే కనిపిస్తారు. అయితే రుణం విషయంలో ఈ రెండింటి విషయంలో బ్యాంకులు వేర్వేరు అంశాలను పరిశీలిస్తాయి.
కార్యాలయ భవనమా? లేక రిటెయిల్ షాపా?... కొనుగోలు చేస్తున్న వాణిజ్య భవనం వినియోగానికి సిద్ధంగా ఉందా? లేక నిర్మాణంలో ఉందా? ఈ విషయాలను రుణాలిచ్చే బ్యాంకుల వంటి సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. కమర్షియల్ ప్రాపర్టీ రుణాలు తీసుకునే వారిలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లే ఉంటారు. కొంత కాలానికి లాభం ఆర్జించాలనే యోచనతో వీరు రుణంపై వాణిజ్య ఆస్తి కొనుగోలు చేసి రుణం తీరిపోయిన తర్వాత దాన్ని అమ్మేస్తుంటారు.
ఎల్టీవీ రేషియో
గృహ రుణం విషయంలో ప్రాపర్టీ విలువలో బ్యాంకులు 75 నుంచి 90 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. అదే వాణిజ్య ఆస్తి రుణం విషయానికి వచ్చేసరికి విలువలో 55 శాతానికి రుణాన్ని పరిమితం చేస్తాయి. నిర్మాణంలో ఉన్న వాటి కంటే వినియోగానికి సిద్ధంగా ఉన్న వాటికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు మొగ్గు చూపుతాయి.
ఫీజులో తేడాలు
ప్రాసెసింగ్ ఫీజులోనూ తేడా ఉంటుంది. గృహ రుణం దరఖాస్తుకు ప్రాసెసింగ్ ఫీజు 10వేల రూపాయల్లోపే ఉంటుంది. కొన్ని సంస్థలు అయితే 0 శాతం ఫీజు అని ఆఫర్ కూడా చేస్తుంటాయి. వాణిజ్య రుణం విషయంలో ప్రాసెసింగ్ ఫీజు అనేది రుణం మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది. అయితే రుణ గ్రహీతల చరిత్ర బాగుండి, కొనుగోలు చేస్తున్న కమర్షియల్ ప్రాపర్టీ మంచి విలువ కలిగినది అయితే ప్రాసెసింగ్ ఫీజును అర శాతానికి తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి.
వడ్డీ రేటు
గృహ రుణం కంటే వాణిజ్య రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఒకటి నుంచి 2 శాతం వరకూ అదనంగా బ్యాంకులు వడ్డిస్తుంటాయి. రుణ గ్రహీతల ప్రొఫైల్ సరిగా లేకుంటే ఈ వడ్డీ రేటు గృహ రుణంతో పోలిస్తే 4 నుంచి 5 శాతం ఎక్కువగా ఉంటుంది.
బిల్డర్ కేటగిరీ... సాంకేతిక ప్రమాణాలు
బిల్డర్ల ప్రొఫైల్ ను కూడా రుణ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. చేపట్టిన ప్రాజెక్టును నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయగలడా? లేదా? అన్నది పరిశీలిస్తాయి. భవనం సాంకేతికంగా ప్రమాణాల ప్రకారం ఉందా? లేదా? అన్న విషయం కూడా కీలకమే. లిఫ్ట్ లు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, అత్యవసర ద్వారాలు, మెట్ల మార్గాలు రెండూ ఉన్నాయా? లేదా? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. గృహ రుణం విషయంలో బ్యాంకులు వీటిని పెద్దగా పట్టించుకోవు.
అనుమతుల సంగతేంటి?
నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? రుణాలిచ్చే సంస్థలు ఈ విషయాన్ని తప్పనిసరిగా చూస్తాయి. అనుమతి లేకుండా నిర్మిస్తే వాటిని ప్రభుత్వ విభాగాలు కూల్చివేసే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు రుణ గ్రహీత చేతులెత్తేస్తే రుణ రికవరీ కష్టం అవుతుందని బ్యాంకులు ముందే జాగ్రత్ర పడతాయి. అందుకే కొనుగోలు దారులు కూడా కొనే ముందు సంబంధిత ఆస్తి నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలి.
రుణ కాల వ్యవధి
గృహ రుణాలను 30 ఏళ్ల కాలానికి కూడా బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే వాణిజ్య భవనాల రుణాలను మాత్రం పదేళ్లకే పరిమితం చేస్తాయి. అంతేకాదు, ఉదాహరణకు 10 కోట్ల రూపాయల వాణిజ్య భవనం కొంటున్నారనుకోండి. అర్హత ఉన్నప్పటికీ బ్యాంకులు 3 కోట్ల రూపాయలకు మించి రుణాలు ఇవ్వవు. రుణం తిరిగి చెల్లించడంలో గ్రహీత విఫలమైతే మొండి బకాయిగా మారకూడదని బ్యాంకులు ముందు జాగ్రత్తగా ఈ పనిచేస్తాయి. ఆర్కిటెక్ట్ లు ఇచ్చిన విలువను పరిగణలోకి తీసుకుని బ్యాంకులు పరిమితి నిర్ణయిస్తాయి.
కొంటున్న ఆస్తి వయసు ఎంత..?
వాణిజ్య భవనం నిర్మాణమై ఎంత కాలం అయింది? అనే విషయాన్ని కూడా బ్యాంకులు పరిశీలనలోకి తీసుకుంటాయి. ఎందుకంటే కొత్తగా కట్టిన దానికి, ఓ 20 ఏళ్ల భవనానికి విలువ పరంగా తేడా ఉంటుంది కదా. ఒకవేళ పాత భవనాలు అయితే, వాటిలో ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన సౌకర్యాలు ఉండడం అరుదు. కనుక రుణాలు ఇచ్చే ముందు వీటిని పరిగణనలోకి తీసుకుని రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి.
సైజు ఎంత?
కనీసం ఇన్ని స్క్వేర్ ఫీట్లు ఉండాలన్న నియమాలను కూడా బ్యాంకులు ఫాలో అవుతుంటాయి. కనీసం 250 స్వ్వేర్ ఫీట్లు లేకుంటే అలాంటి వాణిజ్య భవనాలకు కొన్ని సంస్థలు రుణాలివ్వడానికి ముందుకు రావు. కొన్నింటి నిబంధనలు కొంచెం సరళంగానూ ఉండవచ్చు. అయితే వాణిజ్య రుణం తక్కువ మొత్తంలో మంజూరు కావడంతోపాటు కాల వ్యవధి తక్కువగా ఉంటుంది. అంటే కొనుగోలు దారులు తమ వాటా ఎక్కువ చెల్లించడంతోపాటు.... రుణాన్ని తక్కువ కాల వ్యవధిలో తీర్చేయాల్సి ఉంటుంది. అందుకే వాణిజ్య భవనాలకు రుణాలు తీసుకునే ముందు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవాలి.