రక్తదానం... నమ్మలేని నిజాలు... ఏ గ్రూపు వారు ఎంత మంది ఉన్నారు?
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం ఆవశ్యకత ఎంతో ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్త స్రావమై కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని బతికించాలంటే.. రక్తం ఎక్కించాల్సిందే. దాతలు ముందుకు రాకుంటే వారి పరిస్థితి ఏంటి..?
అత్యవసరంగా గుండె లేదా మరేదైనా పెద్ద శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితుల్లోనూ రక్తం అవసరం ఏర్పడుతుంది. అత్యంత సన్నిహితుల్లోనూ ఒకరికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. అప్పుడు కూడా రక్తం ఇవ్వడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. ధైర్యంగా ముందుకు రారు. ఏవేవో కారణాలు చెప్పి మిన్నకుండిపోతారు. దీని వెనుక రక్తం ఇస్తే బలహీన పడిపోతామని, నీరసం వస్తుందని, ఓపిక ఉండదని, సూది అంటే భయం... ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో రక్తదానానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వాస్తవ విషయాలు ఏంటో చూద్దాం...
ఏ అధ్యయనంలోనూ అలా అని రుజువు కాలేదు
రక్తదానం చేయడం వల్ల బలహీనత వస్తుందని ఇప్పటి వరకూ ఏ అధ్యయనమూ పేర్కొనలేదు. కనుక రక్తదానం నిస్సంకోచంగా చేయవచ్చు. ఆరోగ్యవంతులై కనీసం 16 సంవత్సరాల వయసు లేదా 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు.. 55 కిలోల బరువుకు తక్కువ కాకుండా ఉన్నవారు రక్తదానానికి అర్హులు. అలాగే, ఆరోగ్యంగా ఉంటే 60 ఏళ్ల వయసు వరకూ కూడా రక్త దానానికి ముందుకు రావచ్చు. పురుషులు అయితే మూడు నెలలకు ఒకసారి, స్త్రీలు నాలుగు నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు.
ఒక్కరోజులోనే తిరిగి వచ్చేస్తుంది
350 మిల్లీ లీటర్ల నుంచి 450 మిల్లీ లీటర్ల వరకు రక్తాన్నిదాత నుంచి సేకరిస్తుంటారు. ఇది మొత్తం రక్తంలో పది శాతం వరకూ ఉంటుంది. ఈ మొత్తం కూడా తిరిగి 24 గంటల సమయంలో మన శరీరంలో తయారవుతుంది. అయితే, అందులో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి మాత్రం ఆరు వారాల సమయం తీసుకుంటుంది. అందుకే రక్తం ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నెలల లోపుగా రక్తదానం చేయవద్దని వైద్యుల సూచన. ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంటాయి.
ఏటా కోట్ల యూనిట్లలో రక్తదానం
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ఆధారంగా చూస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 10.8 కోట్ల యూనిట్ల రక్తదానం జరుగుతోంది. ఇందులో 50 శాతం అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది. ఇక్కడి జనాభా ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతమే. అదే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కేవలం 38 శాతమే రక్తదానం నమోదవుతోంది. ఏటా ఒక్క మనదేశ అవసరాలే చూస్తే 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతోంది. కానీ మన దగ్గర 80 లక్షల యూనిట్ల సేకరణ మాత్రమే జరుగుతోంది. ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతోంది. సికిల్ సెల్ వ్యాధి ఉన్నవారు జీవితాంతం రక్తమార్పిడి చేయించుకుంటూ ఉండాలి. రక్తం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. నెగెటివ్ రక్త గ్రూపు ఉన్న వారి జనాభా చాలా తక్కువ. అన్ని నెగెటివ్ గ్రూపుల వారి సంఖ్య మొత్తం జనాభాలో పది శాతం లోపే ఉంటుంది. కనుక తరచుగా రక్తదానం చేయడం అవసరంలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టగలదు.
ఒక్కరు 500 మందికి ప్రాణ దాత
18 ఏళ్లకు మొదలు పెట్టి 60 ఏళ్ల వరకు రక్త దానం ప్రతి 90 రోజులకు ఒకసారి చేసినట్టయితే జీవిత కాలంలో వారు చేసిన 30 గ్యాలన్ల రక్తం 500 మంది ప్రాణాలను నిలబెడుతుంది. గుండె శస్త్ర చికిత్సలో ఆరు యూనిట్ల వరకు రక్తం అవసరం ఏర్పడుతుంది. అవయవ మార్పిడికి 40 యూనిట్లు, అగ్ని ప్రమాదంలో కాలిన గాయాలైన బాధితులకు 20 యూనిట్ల ప్లేట్ లెట్లు అవసరం ఉంటుంది.
ఏ గ్రూపు వారు ఎంత మంది
ఏ, బీ, ఏబీ, ఓ ఇలా నాలుగు రకాల రక్త గ్రూపులు ఉన్నాయి. వీటిలో పాజిటివ్, నెగెటివ్ (ఆర్.హెచ్. ఫ్యాక్టర్) అని ప్రతి గ్రూపులోనూ రెండు రకాలు ఉంటాయి. 1901లో కార్ల్ లాండ్ స్టీనర్ అనే ఆస్ట్రేలియన్ వైద్యుడు తొలిసారిగా మూడు రక్త గ్రూపులను కనిపెట్టారు. దీంతో ఆయన పుట్టిన రోజు అయిన జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుతారు. భారత్ లో ఏటా అక్టోబర్ 1న జాతీయ రక్తదాన దినోత్సవం జరుగుతుంది.
ఓ నెగెటివ్ గ్రూప్ రక్తాన్ని మరే ఇతర గ్రూప్ వారికైనా ఎక్కించవచ్చు. అలాగే ఏబీ నెగెటివ్ గ్రూపు వారి ప్లాస్మాను ఇతర గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. వీరు యూనివర్సల్ డోనర్స్. దేశ జనాభాలో 7 శాతం మంది మాత్రమే ఓ నెగెటివ్ గ్రూపు వారు ఉన్నారు. అత్యధికంగా 35 శాతం మంది ఓ పాజిటివ్ గ్రూప్ వారు ఉన్నారు. ఏబీ నెగెటివ్ గ్రూపు వారు కేవలం 0.4 శాతం మందే ఉన్నారు.
ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ పాజిటివ్ కాగా, ప్రతి పదిహేను మందిలో ఒకరు ఓ నెగెటివ్. అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరు ఏ పాజిటివ్ కాగా, ప్రతి 16 మందిలో ఒకరు ఏ నెగెటివ్. ప్రతి 12 మందిలో ఒకరు బీ పాజిటివ్ కాగా, ప్రతి 67 మందికి ఒక్కరు మాత్రమే బీ నెగెటివ్ గ్రూపు వారు ఉన్నారు. ప్రతి 29 మందిలో ఒకరు ఏబీ పాజిటివ్ కాగా, 167 మందికి ఒకరు ఏబీ నెగెటివ్ గ్రూపు రక్తం కలిగి ఉన్నారు. కనుక నెగెటివ్ గ్రూపు వారు తరచూ రక్తదానానికి ముందుకు రావడం అవసరంలో ఉన్నవారికి ఆసరానిస్తుంది.
బాంబే బ్లడ్ గ్రూపుఇది అరుదైన రక్త గ్రూపు. మొదటి సారి 1952లో మన దేశంలోని ముంబై (కనుగొన్న సమయంలో బాంబే) నగరంలో డాక్టర్ వైఎం భెండే కనుగొన్నారు. అందుకే బాంబే గ్రూపుగా పేరు స్థిరపడింది. దీన్నే హెచ్ హెచ్ గ్రూపు, ఓహెచ్ అని కూడా పేర్కొంటారు. ప్రతీ రెండున్నర లక్షల మందిలో ఒకరు ఈ గ్రూపుతో ఉంటారు. వీరి ఎర్ర రక్తకణాల్లో ఏబీహెచ్ యాంటీజెన్స్ ఉండవు. వీరి సెరమ్ లో యాంటీ ఏ, యాంటీ బీ, యాంటీ హెచ్ ఉంటాయి. కనుక బాంబే బ్లడ్ గ్రూపున్న వారు ఏబీవో బ్లడ్ గ్రూపుల నుంచి రక్తాన్ని తీసుకోవడానికి లేదు. బాంబే గ్రూపున్న వారి రక్తమే వీరికి ఇవ్వాల్సి ఉంటుంది.
రక్తంలో ఏముంటుంది...?
శరీర బరువులో ఏడు శాతం రక్తానిదే. రక్తం నుంచి నాలుగు రకాల పదార్థాలను సేకరించవచ్చు. ఎర్రరక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్ లెట్స్, క్రయోప్రెసిప్టేట్. వీటిలో ప్లాస్మా 55 శాతం, ఎర్ర రక్తకణాలు 45 శాతం, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్లు 1 శాతం ఉంటాయి. దాతలు రక్తాన్ని లేదా రక్తంలోని ఈ పదార్థాల్లో దేన్నైనా దానం చేయవచ్చు. 12 నిమిషాల్లో రక్తదానం పూర్తవుతుంది.
తగిన పరీక్షల తర్వాతే...
రక్తం సేకరణ ముందు తగిన వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. దాత బీపీ, ఉష్ణోగ్రత, నాడి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని చూస్తారు. సేకరించిన తర్వాత హెచ్ ఐవీ, హెపటైటిస్ సీ, సిఫిలిస్, ఇతర వ్యాధులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. సురక్షితం అని నిర్ధారించుకున్న తర్వాతే ఆ రక్తాన్ని రోగికి ఎక్కిస్తారు.