కాస్త ఓపిక పడితే... ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకే షాపింగ్ చేయచ్చు!
ఇల్లు, ఆఫీసు ఎక్కడున్నా కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో కొనేయడం ఇప్పుడు కామన్ అవుతోంది. ఆఫ్ లైన్ మార్కెట్ల కంటే ఈ-కామర్స్ సైట్లు ఆఫర్లతో దంచేస్తుంటాయి. పలు రకాల కారణాల వల్ల ఆన్ లైన్ లో కొన్ని చాలా చౌక ధరలకే లభ్యమవుతుంటాయి. కాస్త టైమ్ కేటాయిస్తే ఆన్ లైన్ షాపింగ్ లో ఇంకాస్త ఆదా చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.
తక్కువ ధర ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలంటే...!
డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, హోంనీడ్స్, హౌస్ కీపింగ్ చివరికి సబ్బులు, పప్పులు, ఉప్పు కూడా ఆన్ లైన్ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. ముందు కొనాల్సినవి ఏంటనేవి అనుకున్న తర్వాత... ఆ వస్తువు ఏ షాపింగ్ సైట్లలో తక్కువ ధరకు లభిస్తుందో తెలుసునే ప్రయత్నం చేయాలి. బై హట్కే.కామ్ అనే సైట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ అందిస్తోంది. దీనిని డౌన్ లోడ్ చేసుకుంటే... క్రోమ్ బ్రౌజర్ లో మీరు ఒక ఉత్పత్తి గురించి ఏదేనీ ఈ కామర్స్ సైట్ లో చూస్తుంటే... అదే వస్తువు వివిధ సైట్లలో తక్కువ ధరకు లభిస్తోందో ఆటేమేటిక్ గా మేసేజ్ రూపంలో బ్రౌజర్ లోనే చూపిస్తుంది. ఆన్ లైన్ లో ప్రైస్ కంపారిజన్ సైట్లు కూడా ఉన్నాయి. mysmartprice.com, shopmania.in, www.compareraja.in వంటివి కొన్ని. ఇంకా చాలానే ఉన్నాయి.
డిస్కౌంట్ల వివరాలు...
ఫలానా వస్తువు చౌక ఎక్కడో తెలుసుకోవడం పూర్తయితే... ఇప్పుడు ఆయా సైట్ లలో డిస్కౌంట్ లు ఉన్నాయా? లేదా? పరిశీలించాలి. కొన్ని ఇంత శాతమని అదనపు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఒక సైట్ లో ఓ వస్తువు అతి తక్కువగా రూ.100 ఉందనుకుందాం. కానీ ఆ సైట్ లో ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్లు లేవు. అదే వస్తువు రూ. 110 ధర ఉన్న మరో సైట్ లో 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంటే రూ.88కే లభిస్తుంది. అందుకే ఆన్ లైన్ షాపింగ్ లో తెలివిగా వ్యవహరించాలి.
ప్రైస్ కంపారిజన్ సైట్లు, మొబైల్ రీచార్జ్ సైట్లు కూడా పలు సైట్లకు సంబంధించి డిస్కౌంట్ కూపన్లు అందిస్తుంటాయి. అలాంటివి పరిశీలించాలి. వెబ్ సైట్ లో కంటే యాప్ లో కొంటే కొన్ని మరింత తగ్గింపు ధరలకే అందిస్తుంటాయి. అలాంటి ఆఫర్లు ఉన్నాయేమో సదరు ఈ కామర్స్ సైట్లలో ఆఫర్ల కోసం సెర్చ్ చేయాలి. ఉంటే సంబంధిత ప్రొమో కోడ్ ను వస్తువుకు ధర చెల్లించే ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. అది మరిచిపోతే డిస్కౌంట్ వర్తించదు. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి సంస్థలు అయితే, ఫలానా బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ అంటూ తరచుగా ఆఫర్ చేస్తుంటాయి. ఆయా కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల మరింత ఆదా చేసుకోవచ్చు. ఈబే సంస్థ అయితే, తరచూ ఎంతో కొంత డిస్కౌంట్ కూపన్లు ప్రకటిస్తుంటుంది. పెప్పర్ ఫ్రై సంస్థ రిజిస్టర్డ్ యూజర్లకు డిస్కౌంట్ కోడ్స్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది.
పండుగ సమయాల్లో...
దీపావళి, న్యూ ఇయర్, ఇండిపెండెన్స్ డే, బిగ్ సేల్ డేస్, యాప్ డేస్ పేరుతో ఈ కామర్స్ సైట్లు విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. వెంటనే కొనాల్సిన అవసరం లేకుంటే డిస్కౌంట్ కోసం వేచి చూడవచ్చు. కొన్ని వస్తువులు కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పన్నుల్లో మార్పుల కారణంగా తగ్గడం, పెరగడం జరుగుతుంది. అవి కూడా గమనించాలి. ధర తగ్గినప్పుడు మీకు సమాచారం ఇచ్చేందుకు cheapass.in వంటి సైట్లు కూడా ఉన్నాయి. ఆయా సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే ఆ వస్తువు ధర తగ్గిన వెంటనే సమాచారం వస్తుంది.
ఇదో ట్రిక్!
ఏదైనా వస్తువును కొనాలి అనుకున్నప్పుడు సంబంధిత వస్తువును కొనుగోలు చేసేందుకు షాపింగ్ కార్డ్ కు యాడ్ చేసి అలా ఉంచేయండి. కొన్ని సందర్భాల్లో ఆయా సంస్థలు షాపింగ్ కార్ట్ లో ఉన్నవాటి కొనుగోలు పూర్తి చేసేందుకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తాయి. ఇక మొబిక్ విక్ డాట్ కామ్, పేటీఎం డాట్ కామ్ వంటి సంస్థలు తమ వ్యాలెట్ల ద్వారా (అంటే ముందుగా ఆయా సైట్లలో నమోదు చేసుకుని ఉండాలి) వివిధ సైట్లలో కొనుగోలు చేస్తే ఇంత మొత్తం తగ్గింపును, క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తుంటాయి. మీకు రెండు మూడు ఈ మెయిల్స్ ఉంటే జాక్ పాటే. న్యూ యూజర్లకు అన్ని సైట్లూ తగ్గింపు ఆఫర్లు ఇస్తుంటాయి. అందుకే కొత్త మెయిల్ ఐడీ ద్వారా కొత్త వినియోగదారుడిగా నమోదై డిస్కౌంట్ పొందవచ్చు.
అవసరం లేకుంటే ఆ వైపు కూడా చూడొద్దు
ఈ కామర్స్ సంస్థల మధ్య విక్రయాల పోటీ తారా స్థాయికి చేరింది. ప్రతీ సంస్థ విక్రయాలు, ఆదాయాలు పెంచుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్ల మోత మోగిస్తుంటాయి. నిజంగా కొనాల్సిన అవసరం ఉంటేనే పైన చెప్పిన చిట్కాలతో తెలివిగా చౌకగా కొనుగోలు చేసుకోవడం సరైనది. అవసరం లేని వస్తువులను ఆఫర్ల మోజులో కొని జేబులు గుల్ల చేసుకోవడం తెలివి అనిపించుకోదు.