'స్పీడ్ పోస్ట్' గురించి పూర్తిగా తెలుసుకుందాం!
వేగవంతమైన డెలివరీ కోసం ఈ సర్వీస్ ను తీసుకొచ్చారు. ఇది రాక ముందు వరకు పోస్టల్ ద్వారా కవర్లు లేదా పార్సిళ్ల చేరవేతకు చాలా సమయం పట్టేది. స్పీడ్ పోస్ట్ రాకతో ప్రైవేటు కొరియర్ సంస్థలకు పోటీగా తపాలా విభాగం సేవలను అందిస్తోంది.
ధరలు
50 గ్రాముల బరువు వరకు ఆర్టికల్స్ ను 35 రూపాయల చార్జీతో దూరంతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడికైనా పంపుకోవచ్చు.
50 గ్రాములు మించితే మాత్రం ధరల్లో మార్పు ఉంటుంది. అయితే, 51 గ్రాముల నుంచి 200 గ్రాముల్లోపు అయితే 200 కిలోమీటర్ల దూరం వరకు 35 రూపాయల చార్జీ చెల్లించాలి.
201 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లలోపు దూరానికి 40 రూపాయలు. 1001 నుంచి 2000 కిలోమీటర్ల దూరానికి 60 రూపాయలు, 2000 కిలోమీటర్ల దూరం మించితే 70 రూపాయలు చార్జీ ఉంటుంది.
201 గ్రాముల బరువు నుంచి 500 గ్రాముల బరువుగల ఆర్టికల్స్ కు 200 కిలోమీటర్ల వరకు చార్జీ 50 రూపాయలు. 201 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల దూరానికి 60 రూపాయలు, 1001 నుంచి 2000 కిలోమీటర్ల దూరానికి 80 రూపాయలు, అంతకుమించిన దూరానికి అయితే 90 రూపాయల చార్జీ ఉంటుంది.
ఇంతకుమించిన బరువు ఉంటే ప్రతీ 500 గ్రాముల బరువుకు దూరాన్ని బట్టి అదనంగా 15, 30, 40, 50 రూపాయల చార్జీ వసూలు చేస్తారు.
అదే ఒక పట్టణం పరిధిలో మరో ప్రాంతానికి స్పీడ్ పోస్ట్ పంపాలంటే 50 గ్రాముల బరువుకు 15 రూపాయలు, 51 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు 25 రూపాయలు, 201 నుంచి 500 గ్రాముల్లోపు ఉంటే 30 రూపాయలు ధర చెల్లించాలి. దీనికి మించిన బరువు అయితే ప్రతి 500 గ్రాములకు 10 రూపాయల అదనపు చార్జీ ఉంటుంది.
* ఈ ధరలకు పన్నులు అదనం.
విదేశాలకు...
100 దేశాలకు కూడా స్పీడ్ పోస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు అమెరికాకు డాక్యుమెంట్స్ ను స్పీడ్ చేయాలనుకుంటే 250 గ్రాముల బరువు వరకు 585 రూపాయల చార్జీ చెల్లించాలి. ఇంతకంటే ఎక్కువ బరువు ఉంటే ప్రతీ 250 గ్రాముల అదనపు బరువుకు గాను 165 రూపాయలు చెల్లించాలి. అదే సౌదీ అరేబియాకు అయితే 250 గ్రాముల బరువుకు 745 రూపాయలు, అంతకు మించితే అదనపు 250 గ్రాముల బరువుకు 60 రూపాయల చార్జీ ఉంది. విదేశాలకు స్పీడ్ పోస్ట్ ధరలను https://www.indiapost.gov.in/mbe/pages/content/speed-post.aspx సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
ఎన్ని రోజుల్లోపు చేరవేస్తారు... ?
స్థానికంగా డెలివరీకి రెండు రోజులు పడుతుంది. బుక్ చేసిన మరుసటి రోజు డెలివరీ చేస్తారు. అదే రాష్ట్రం పరిధిలోని వేరే ప్రాంతానికి, పొరుగు రాష్ట్రంలోని ఏదేనీ ప్రాంతానికి అయితే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపేందుకు ఐదు నుంచి ఆరు రోజుల సమయాన్ని పోస్టల్ విభాగం నిర్దేశించుకుంది.
ఆలస్యమైతే పరిహారం
దేశంలోని 87 పట్టణాల మధ్య పై సమయంలోపు చేరవేయడంలో విఫలమైతే పోస్టల్ విభాగం పరిహారం చెల్లిస్తుంది. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ మధ్య చార్జీలను వినియోగదారుడు పొందవచ్చు.
ఆర్టికల్ మిస్ అయినా... పాడైనా ...?
స్పీడ్ పోస్ట్ చార్జీకి రెట్టింపు లేదా వెయ్యి రూపాయలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. కానీ పంపించిన ఆర్టికల్ కానీ, డాక్యుమెంట్స్ కానీ విలువ పరంగా చాలా ముఖ్యమైనవి అయితే... నష్టపోకుండా తగిన చార్జీలు చెల్లించి లక్ష రూపాయల వరకు ముందే ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
సౌకర్యాలు...
దేశంలోని పెద్ద పట్టణాల్లో 24 గంటల పాటు బుకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది.
బుక్ చేసిన దగ్గర్నుంచి అది గమ్యస్థానానికి చేరే వరకు ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉందన్న విషయాన్ని ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే POST TRACK అని టైప్ చేసి 13 అంకెలతో ఉన్న బుకింగ్ నంబర్ ను 166 లేదా 51989 కు ఎస్ఎంఎస్ చేస్తే సరి.
డెలివరీ చేసిన రోజు డెలివరీ అయినట్టుగా వినియోగదారుని మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.
ఎక్కువ సంఖ్యలో పార్సిళ్లు ఉన్నట్లయితే పోస్టల్ ఉద్యోగి స్వయంగా వచ్చి తీసుకెళతారు. కార్పొరేట్ కస్టమర్లకు ధరల తగ్గింపు, తర్వాత చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ సంస్థలకు క్యాష్ ఆన్ డెలివరీ సేవను కూడా తపాలా విభాగం అందిస్తోంది.