రిజిస్టర్ పోస్ట్... పోస్టల్ పార్సిల్... చౌకలో విశ్వసనీయ సేవలు
వినియోగదారుల భిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని తపాలా విభాగం పార్సిల్ సేవలను అందిస్తోంది. ఇందులో ఎక్స్ ప్రెస్, సాధారణ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ ప్రెస్ సర్వీస్ అయితే పేరులోనే ఉన్నట్టు వేగంగా డెలివరీ చేస్తారు. కొరియర్ సంస్థలకు ధీటుగా తపాలా విభాగం ఈ సేవలను అందిస్తోంది. వాటి వివరాలు చూస్తే...
వ్యాపార వర్గాలతోపాటు రిటెయిల్ కస్టమర్లకు కూడా ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. చాలా వేగంగా, భద్రంగా పార్సిళ్లను చేరవేయడమే ఈ సర్వీస్ ప్రత్యేకత. విమానాలు లేదా వేగంగా వెళ్లే ఇతర సాధనాలను ఇందుకు వినియోగించుకుంటారు.
ఎంత వ్యయమవుతుంది..?
రిటెయిల్ కస్టమర్లు కనీసం అరకేజీ నుంచి 20 కేజీల బరువు వరకు పార్సిళ్లను పంపుకోవచ్చు. పంపాల్సిన చిరునామా అదే పట్టణంలో ఉంటే అర కిలో వరకు 30 రూపాయలు చార్జీ చెల్లించుకోవాలి. ఆ తర్వాత ఐదు కిలోల వరకు ప్రతి అర కిలోకు 8 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఐదు కిలోల బరువు దాటితే ప్రతి అరకిలో బరువుకు 10 రూపాయల అదనపు చార్జీ ఉంటుంది.
అదే రాష్ట్రం పరిధిలో వేరే ప్రాంతానికి పంపేందుకు అరకిలో బరువుకు 50 రూపాయలు.. ఆ తర్వాత నుంచి ఐదు కిలోల వరకు ప్రతి అర కిలోకు 14 రూపాయల చొప్పున... ఐదు కిలోలు దాటితే ప్రతి అర కిలోకు 16 రూపాయల చొప్పున చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
పక్కనే వున్న సరిహద్దు రాష్ట్రానికి పంపేందుకు తొలి 500 గ్రాముల బరువుకు 60 రూపాయలు, ఆ తర్వాత నుంచి ఐదు కిలోల వరకు ప్రతి 500 గ్రాములకు 18 రూపాయలు, ఆ తర్వాత ప్రతి 500 గ్రాముల బరువుకు 20 రూపాయల చార్జీ చెల్లించాలి.
సరిహద్దు రాష్ట్రాలు కాని ఇతర రాష్ట్రాలకు ప్రతి 500 గ్రాములకు 80 రూపాయలు... ఆ పై ప్రతి 500 గ్రాముల బరువుకు 20 రూపాయల చొప్పున ఐదు కిలోల బరువు వరకు, ఆపై ప్రతి 500 గ్రాముల బరువుకు 22 రూపాయల చొప్పున చార్జీ ఉంది.
మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానుల మధ్య ఎక్స్ ప్రెస్ సర్వీసుకు అరకిలో వరకు 70 రూపాయల చార్జీ అవుతుంది. అంతకుమించి బరువు ఉంటే 5 కిలోల వరకు ప్రతి 500 గ్రాములకు 18 రూపాయలు, ఐదు కిలోలు దాటిన తర్వాత ప్రతి 500 గ్రాములకు 12 రూపాయల చొప్పున చార్జీ ఉంది.
కొరియర్ చార్జీలు కొంచెం మంటే
500 గ్రాముల బరువున్న పార్సిల్ (నాన్ డాక్యుమెంట్) ను హైదరాబాద్ నుంచి విజయవాడకు పంపాలంటే పోస్టల్ లో 50 రూపాయలతో అయిపోతుంది. కానీ కొరియర్ ద్వారా పంపాలనుకుంటే మాత్రం ఎక్కువే భరించాలి. ఇందుకు ఓ ఉదాహరణ చూద్దాం. 500 గ్రాముల పార్సిల్ ను డీటీడీసీ అనే సంస్థ లైట్ సర్వీస్ ద్వారా బుక్ చేస్తే 80 రూపాయల చార్జీ అవుతుంది. మరి ఇదే పార్సిల్ ను బ్లూడార్ట్ కొరియర్ ద్వారా సర్ఫేస్ లైన్ విధానంలో పంపాలనుకుంటే 200 రూపాయలు చెల్లించుకోవాలి. డొమిస్టిక్ ప్రయారిటీ విధానంలో అయితే 300 రూపాయలు.
మరో ఉదాహరణ చూస్తే... 500 గ్రాముల బరువున్న పార్సిల్ (నాన్ డాక్యుమెంట్) ను హైదరాబాద్ నుంచి చెన్నైకి పోస్ట్ ద్వారా పంపేందుకు అయ్యే చార్జీ 60 రూపాయలు. డీటీడీసీ లైట్ సర్వీసులో ఇందుకు 98 రూపాయలు ఖర్చవుతుంది. బ్లూడార్ట్ డొమెస్టిక్ ప్రయారిటీ విధానంలో అయితే చార్జీ 310 రూపాయలు. సర్ఫేల్ లైన్ (డెలివరీకి ఎక్కువ సమయం తీసుకుంటుంది) విధానంలో అయితే 200 రూపాయలు చార్జ్ చేస్తారు. పెద్దగా బరువులేని ఎన్వలప్ లెటర్ ను హైదరాబాద్ నుంచి బెంగళూరు పంపాలంటే పోస్టల్ ద్వారా 40 రూపాయలు సరిపోతాయి. కొరియర్ సంస్థలైతే 100 రూపాయలు చార్జ్ చేస్తున్నాయి.కావాలంటే ఆ తేడాను https://www.bluedart.com/pricefinder.html, http://dtdc.in/sg_priceTimeFind.asp లింకుల ద్వారా మీరే పరిశీలించుకోండి.
చిన్న స్థాయి పట్టణాల వరకు కొరియర్ సంస్థలు చేరుకున్నాయి. కానీ, తపాలా విభాగం పంచాయతీ స్థాయి వరకూ శాఖలతో చొచ్చుకుపోయి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే తపాలా విభాగానికి 1.39 లక్షల శాఖలు ఉన్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు పంపాలంటే పోస్ట్ ఒక్కేటే ఆధారం. పోస్టల్ శాఖలో రిజిష్టర్ చేసినవి జాగ్రత్తగా చేరతాయని అందరికీ తెలిసిందే. పైగా బుక్ చేసిన ఆర్టికల్ ఎక్కడుందో తెలుసుకునే ట్రాకింగ్ సదుపాయాన్ని కూడా తపాలా విభాగం ప్రవేశపెట్టింది.
పార్సిల్ మిస్సయితే...
పార్సిల్ అదృశ్యం అయినా, డ్యామేజ్ అయినా వెయ్యి రూపాయలు లేదా పార్సిల్ వాస్తవ విలువ ఏది తక్కువ అయితే దాన్ని చెల్లిస్తారు. వ్యాపార వర్గాల వారి అవసరాల కోసం ప్రధానంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారు కనీసం రెండు కిలోల నుంచి 35 కిలోల బరువు వరకు పార్సిళ్లను పంపుకోవచ్చు.
నిషేధిత వస్తువులు మినహా మిగిలినవి ఏవైనా పార్సిల్ సర్వీస్ ద్వారా పంపుకునే వీలుంది. సాధారణంగా 4 కిలోలకు మించి బరువు ఉండరాదు. కస్టమర్ బ్రాంచ్ పోస్టాఫీస్ కు వచ్చి తీసుకునేట్లు అయితే 10 నుంచి 20 కిలోగ్రాముల వరకు అనుమతిస్తారు. పార్సిల్ పొడవు మీటరు, వెడల్పు మొత్తం మీద 1.80మీటరు మించి ఉండరాదు. అంతపెద్ద పరిమాణంలో, పరిమితికి మించి ఉన్న బరువుగల వాటిని తపాలా విభాగం బట్వాడా చేయదు.
ఒకవేళ పార్సిల్ పెట్టెలో లెటర్లు ఉన్నాయని భావిస్తే రిజిస్టర్ పోస్ట్ కింద చార్జీలు తీసుకుంటారు.
నిషేధిత వస్తువులు ఉన్నాయని అనుమానిస్తే చిరునామాదారుడి ముందు పోస్ట్ మ్యాన్ పెట్టెను తెరచి చూస్తాడు. నిషేధిత వస్తువులు ఉన్నట్టు తేలితే ముందు చెల్లించిన చార్జీలతో సంబంధం లేకుండా బట్వాడా చార్జీలను రెట్టింపు వసూలు చేస్తారు.
విదేశీ పార్సిళ్లు మిస్ అయితే కిలోగ్రాముకు నాలుగున్నర డాలర్ల పరిహారం చెల్లిస్తారు.
ఇన్సూరెన్స్
రిజిస్టర్డ్ లెటర్లు, వీపీపీ లెటర్లు, రిజిస్టర్డ్ పార్సిళ్లు, వీపీపీ పార్సిళ్లకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 600 రూపాయల విలువ మొత్తానికి బీమా తీసుకోవచ్చు. ఇతర పోస్టాఫీసుల్లో అయితే లక్ష రూపాయల వరకు బీమా తీసుకునేందుకు అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో వాస్తవిక విలువ ఆధారంగా కూడా బీమా తీసుకునేందుకు అనుమతిస్తారు.
ఆర్టికల్ మిస్ అయినా, దెబ్బతిన్నా బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.
పంపుతున్న వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే 200 రూపాయల విలువకు గాను 10 రూపాయలు, ఆ తర్వాత ప్రతి 100 రూపాయల మొత్తానికి ఆరు రూపాయలు చెల్లించాలి.
రిజిస్టర్ పోస్ట్
తపాలా విభాగం ద్వారా రిజిస్టర్ పోస్ట్ బుక్ చేసుకుంటే... బుకింగ్ దగ్గర్నుంచి డెలివరీ వరకు అన్ని దశల్లోనూ వివరాలను నమోదు చేస్తారు. రవాణా విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటి ద్వారా అన్నీ పంపుకోలేము. కొన్నింటిని మాత్రమే రిజిష్టర్ పోస్ట్ ద్వారా పంపుకునే సౌలభ్యం వుంది. లెటర్లు, లెటర్ కార్డులు, పోస్ట్ కార్డులు, ప్యాకెట్లు, లిటరేచర్ ప్యాకెట్లు, పార్సిళ్లు, న్యూస్ పేపర్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. అలాగే 4 కిలోగ్రాముల పైబడి బరువున్న పార్సిళ్లు, ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆర్టికల్... కస్టమర్ ధ్రువీకరణ అవసరమైన పార్సిళ్లకు రిజిష్టర్ పోస్ట్ తప్పనిసరి. అలాగే, చెక్ లు, బ్యాంకు నోటీసులు మొదలైన వాటిని తప్పనిసరిగా రిజిస్టర్ పోస్ట్ లోనే పంపుకోవాలి. అన్నిరకాల ఆర్టికల్స్ ను రిజిస్టర్ పోస్ట్ చేయడానికి వీల్లేదు. లెటర్ అయితే 2 కిలో గ్రాములకు మించరాదు. అదే పార్సిల్ అయితే 10 కిలో గ్రాములకు మించి బరువు ఉండరాదు. పార్సిల్ ప్యాకింగ్ బలంగా ఉండాలి. బీమాతో కూడన లెటర్లు, పార్సిళ్లు బ్రాంచ్ పోస్టాఫీసులో అయితే 600 రూపాయలు.. ఇతర పోస్ట్ ఆఫీసుల్లో లక్ష రూపాయలకు మించి విలువగల వాటిని పంపుకునేందుకు అవకాశం లేదు.ఎన్ని రోజుల్లో చేరుతుంది?
స్థానికంగా డెలివరీకి రెండు రోజులు; ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ నగరాల మధ్య రెండు నుంచి మూడూ రోజుల్లోపే చేరవేస్తారు. అంటే బుకింగ్ చేసిన మూడో రోజు డెలివరీ అయిపోతుంది. అదే రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రంలో వేరే ప్రాంతానికి మూడు నుంచి నాలుగు రోజుల్లోపు, మిగిలిన ప్రాంతాలకు ఐదు నుంచి ఆరు రోజులలో డెలివరీ అవుతుంది.
ఇవి నిషేధం
అసభ్యకరమైన ప్రింట్లు, ఫొటోలు, లితోగ్రాఫ్, బుక్, కార్డ్, అసభ్యకరమైన కథనాలు వీటిని రిజిస్టర్ పోస్ట్ లో పంపడం నిషేధం. అలాగే, పేలుడు పదార్థాలు, హనికర, అసహ్యకరమైన పదార్థాలు కూడా నిషేధమే. బతికి ఉన్న ఏ జీవినా బయటకు తెలియకుండా ప్యాక్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం నేరం. రూ. 20వేలకుపైగా విలువ చేసే బంగారు ఆభరణాలు ఇతరత్రా పంపించకూడదు.