ఆనందం కోసం పదండి... భూటాన్!

ప్రపంచంలో ప్రజలు ఆనందంగా ఉన్న దేశాలను లెక్కపెడితే వాటిలో భూటాన్ ఎనిమిదో స్థానంలో ఉంటుందట. ఆసియా దేశాల్లో ప్రజలు ఆనందంగా జీవిస్తోంది ఈ దేశంలోనేనని బిజినెస్ వీక్ కొన్నేళ్ల కిందట నిర్వహించిన అధ్యయనం ద్వారా తేల్చింది. మూడువైపులా భారత్, ఓ వైపు చైనా మధ్యలో ఉన్నదే భూటాన్. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ శాతం ఆచరించేది బౌద్ధమతాన్ని. హిందూ మతం రెండో స్థానంలో ఉంది. 38,394 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు ఎనిమిది లక్షల జనాభాగల ఈ చిన్ని దేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. 

భూటాన్ వెళ్లి రావాలనుకుంటే... 

ముంబై నుంచి బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని... కొంచెం ఖర్చయినా (రూ.2వేలు) చెల్లించగలమనుకుంటే అక్కడి నుంచి నేరుగా భూటాన్ సరిహద్దు జైగాన్ కు ట్యాక్సీలో వెళ్లవచ్చు. ఇమిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకున్న అనంతరం రాజధాని థింపూకు చేరుకుంటే పర్యటన ప్రారంభించవచ్చు.  రాత్రి 9 గంటల్లోపు చేరుకుంటేనే హోటల్ లో విడిదికి వీలవుతుంది. భూటాన్ వంటి దేశాలకు స్వయంగా కంటే టూరిజం సంస్థల ప్యాకేజీల్లో భాగంగా వెళ్లడమే సౌకర్యంగా ఉంటుంది. భూటాన్ కరెన్సీ భారతీయ కరెన్సీతో సమానం. కనుక ఆహారం, హోటల్స్ ధరల విషయంలో భారత్ తో పోలిస్తే పెద్దగా తేడా ఉండదు. స్థానికంగా రోడ్ల నెట్ వర్క్ అంత బాగుండదు. అక్కడి ప్రజల రవాణాకు ఏకైక నెట్ వర్క్ ఇదే. బస్సులు లేదా ట్యాక్సీల్లో వెళ్లవచ్చు. ఒక రోజు పర్యటనకు ట్యాక్సీ డ్రైవర్లు సుమారుగా 800 రూపాయలు తీసుకుంటారు.

representational imageటూర్ ప్యాకేజీలు

పారో, పునఖా, థింపూలో ఏడు రోజుల పర్యటనకు గాను థామస్ కుక్ సంస్థ 40 వేల రూపాయలకు ఓ ప్యాకేజిని అందిస్తోంది. రానుపోను విమాన ప్రయాణం బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, హోటల్, రవాణా చార్జీలు, గైడ్ చార్జీలన్నీ ఈ ప్యాకేజీ ధరలో భాగం. ఇదే సంస్థ థింపుకు విమాన ప్రయాణం మినహా మిగిలిన ప్యాకేజీని రూ.10వేల నుంచి ఆఫర్ చేస్తోంది. పర్యాటక సంస్థల వెబ్ సైట్లను సందర్శించడం ద్వారా నచ్చిన ప్యాకేజీని ఎంపిక చేసుకోవచ్చు. భూటాన్ పర్యాటక ప్రాంతాలు ఇవే....

థింపూ

రాజధాని థింపూ ఓ చిన్న పట్టణాన్ని తలపిస్తుంది. ప్రపంచంలో ట్రాఫిక్ లైట్లు అంటూ లేని ఏకైక రాజధాని ఇదే.  మెమోరియల్ చోర్టెన్ అనే స్థూపాన్ని రాజు జిగ్మే డోర్జి వాంగ్ చుక్ 1974లో నిర్మించారు. దీన్ని పర్యాటకులు తప్పక దర్శించాలి. నేషనల్ లైబ్రరీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జోరిగ్ చూసమ్, జానపద వారసత్వాన్ని తెలిపే మ్యూజియం, నేషనల్ టెక్స్ టైల్ మ్యూజియం, వీకెండ్ మార్కెట్, క్రాఫ్ట్ బజార్, బుద్ధ పాయింట్ తదితర సందర్శక ప్రాంతాలు థింపూలో ఉన్నాయి. 

representational image

టైగర్ నెస్ట్ 

పారోవ్యాలీ పక్కనే కొండ అంచు భాగంలో మూడువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం పర్యాటకుల స్వర్గథామం. ఎనిమిదో శతాబ్ద కాలంలో దీన్ని నిర్మించారు. రెండో బుద్ధుడిగా పేర్కొనే గురు పద్మసంభవుడు ఇక్కడే ధ్యానం చేసినట్టు చెబుతారు. ఇక్కడి నుంచే బౌద్ధ మతం భూటాన్ లోకి అడుగుపెట్టినట్టు భావిస్తారు. బౌద్ధులకు ఇది పవిత్ర ప్రదేశం. ఇక

భారత రెబెల్స్ తో పోరాటం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన భూటాన్ సైనికుల స్మారకార్థం నిర్మించిందే డోకులాపాస్. 108 స్తూపాలతో ఉంటుంది. 

గ్యాంగ్ టే

సముద్ర మట్టానికి 2900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత ప్రాంతానికి అడవులు, నదులను దాటుకుని చేరుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి సజహ సిద్ధ అందాలతో పర్యాటకులను అలరిస్తోంది. 

తాషించో డిజాంగ్

రాయల్ భూటాన్ ప్రభుత్వ కేంద్రం. అందమైన వనాల మధ్య ఉన్న దీన్ని తొలుత 1952లో నిర్మించగా... 1964లో పునర్ నిర్మాణం జరిగింది. 

పునఖ డిజాంగ్

రాజధాని థింపూ నుంచి మూడు గంటలలో ఇక్కడికి చేరుకోవచ్చు. పునఖ డిజాంగ్ ని ఆనంద మందిరంగా పేర్కొంటారు. థింపూ రాజధాని అవకముందు వరకు ఇదే రాజధానిగా కొనసాగింది. 

జూరి డిజాంగ్ హైక్

నాలుగు వైపులా కొండలు... మధ్యలో లోయ. పచ్చటి చెట్లతో అలరారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఊటీ వంటి పట్టణంగా దీన్ని పేర్కొనవచ్చు. బుద్ధుడు ధ్యానం కోసం వచ్చిన ఓ గుహ  కూడా ఇక్కడ ఉన్నట్టు చెబుతారు. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. 

రుఖ

జిగ్మే డోర్జే వాంగ్ చుక్ నేషనల్ పార్క్ లోని రుఖ అనే చిన్న గ్రామం ఉంటుంది. తాడుతో ఏర్పాటు చేసిన వంతెన ద్వారా దీన్ని చేరుకోవాల్సి ఉంటుంది. 20 ఇళ్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. 

representational image

పారో

భూటాన్ లోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉన్నది. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన వాణిజ్య విమానాశ్రయం ఇదేనంటారు. 5,500 ఎత్తులో హిమాలయ పర్వత శిఖాలను దాటుకుని ఇక్కడి విమానాశ్రయంలో ఉన్న ఏకైక రన్ వే పై విమానాన్ని ల్యాండ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఇదో లోయ ప్రాంతం. ఇక్కడికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే టైగర్స్ నెస్ట్ ఉంది. ఏటా 30వేల మంది ఈ విమానాశ్రయానికి వస్తుంటారు. ఇది కాక ఆ దేశంలో మూడు స్థానిక విమానాశ్రయాలు ఉన్నాయి.


More Articles