నేపాల్ సందర్శన ఓ అందమైన అనుభూతి!
ప్రపంచంలో ఎత్తయిన (8వేల మీటర్లు దాటిన) పది పర్వత శిఖరాల్లో ఎనిమిది నేపాల్ భూభాగంలోనే ఉన్నాయి. దీంతో పర్వతారోహకులకు ప్రియమైన దేశంగా నేపాల్ మారిపోయింది. యావత్ దేశం పర్వత ప్రాంతం కావడంతో పర్యాటకులు భారీగానే నేపాల్ సందర్శనకు వెళుతుంటారు. పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయమే ఈ దేశానికి కీలకం. హిందూ, బౌద్ధ వారసత్వ విశేషాలతో భారత్, చైనా మధ్యలో ఉన్న ఈ చిన్ని దేశాన్ని సందర్శించాలంటే...
భారతీయులు నేపాల్ వెళ్లాలంటే వీసా అక్కర్లేదు. కేవలం పాస్ పోర్టు ఉంటే చాలు. హైదరాబాద్ నుంచి నేపాల్ రాజధాని కాట్మండుకు విమానంలో వెళ్లాలంటే టికెట్ ధరలు రూ.10,000 నుంచి ఉన్నాయి. మూడు నెలల ముందు అయితే రూ.6,000 లభించే అవకాశం ఉంటుంది. బెంగళూరు, చెన్నై నగరాల నుంచి కూడా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి. నేపాల్ పొరుగునే ఉన్న దేశం కనుక రోడ్డు, రైలు మార్గం ద్వారానూ నేపాల్ సరిహద్దుకు చేరుకుని పర్యటన ప్రారంభించవచ్చు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు చార్జీ స్లీపర్ లో వెళ్లేందుకు సుమారు 500 రూపాయలుగా ఉంది. (ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని గమనించగలరు.) గోరఖ్ పూర్ లో దిగి కారు లేదా జీప్ లేదా బస్సులో నేపాల్ సరిహద్దు ప్రాంతమైన సునౌలి వరకు వెళ్లాలి. ఇందుకు సుమారు 3 గంటల సమయం పడుతుంది.
సరిహద్దు దాటి నేపాల్ లోకి ప్రవేశించిన తర్వాత తిరిగి జీపు మాట్లాడుకుని కాట్మండు చేరుకోవచ్చు. బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. బస్సులో ప్రయాణానికి 9 నుంచి 12 గంటల సమయం పడుతుంది. చార్జీ 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. వారణాసి నుంచి కూడా వెళ్లవచ్చు. రైల్లో వారణాసి చేరుకుంటే... అక్కడి నుంచి తిరిగి సునౌలికి చేరుకోవాలి. అక్కడి నుంచి నేపాల్ లోకి ప్రవేశించి కాట్మండుకు వెళ్లవచ్చు.
ధరలు తక్కువే
నేపాలీ రూపీ విలువ భారతీయ కరెన్సీతో పోలిస్తే 62 పైసలతో సమానం. ఒక రోజు విడిదికి 400 రూపాయల స్థాయి నుంచి హోటల్స్ ఉన్నాయి. మంచి హోటల్లో బస చేయాలంటే 800 రూపాయల వ్యయం చేయాల్సి ఉంటుంది. నేపాల్లో ఖాట్మండు మినహా మిగిలిన ప్రాంతాల్లో 500 రూపాయల నోట్లు మార్పిడి చాలా కష్టం. పర్యటనకు ఖర్చయ్యే మొత్తాన్ని నేపాలీ రూపాయల్లోకి మార్చుకోవాలి. అందులోనూ 10, 20, 50 రూపాయల నోట్ల రూపంలోనే దగ్గర ఉంచుకోవడం నయం. బస్సుల్లో నిలబడేందుకు కూడా చోటు ఉండదు కనుక ట్యాక్సీలను మాట్లాడుకోక తప్పదు. ట్యాక్సీల్లో ప్రారంభ చార్జీ 200 నేపాలీ రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు 45 రూపాయలు వసూలు చేస్తారు. ఒక రోజు పర్యటనకు గాను సుమారు 2 వేల నుంచి రెండున్నర వేల రూపాయల ఖర్చు అవుతుందని ఒక అంచనా. భోజనం ధర సుమారు 150 రూపాయలు. వాటర్ బాటిల్ 30 రూపాయలు.
టూర్ ప్యాకేజీలు
థామస్ కుక్ నాలుగు రోజుల కాట్మండు పర్యటన ప్యాకేజీని 15 వేల రూపాయలకు అందిస్తోంది. రానుపోను, విమానయానం, అల్పాహారం, హోటల్లో బస, సైట్ సీయింగ్ సదుపాయాలు కల్పిస్తారు. యాత్రా సంస్థ డాజ్లింగ్ నేపాల్ పేరుతో ఏడు రోజుల టూర్ ప్యాక్ ను 37 వేల రూపాయలకు అందిస్తోంది. రానుపోను విమానం లేదా రైలు ప్రయాణ చార్జీలను పర్యాటకులు స్వయంగా భరించాల్సి ఉంటుంది. విమానాశ్రయం నుంచి తీసుకెళ్లి హోటల్లో బస, సందర్శక క్షేత్రాలను చూపించడం, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ వసతులకే ప్యాకేజీ పరిమితం. కాట్మండులో మూడు రాత్రులు, ఫొఖారాలో రెండు, చిత్వాన్ లో ఒక రాత్రి విడిది ఉంటుంది.
నేపాల్లో చూడాల్సినవి...
పరమశివుడు స్వయంభువుగా కొలువైన ఉన్నదే పశుపతినాథ్ దేవాలయం. కాట్మాండులో బాగ్మతీ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం. సీతాదేవి జన్మస్థానంగా చెప్పబడే జానక్ పూర్ సందర్శన కూడా పర్యటనలో భాగం చేసుకోవాలి. దీనికి మిథిలానగరమనే పేరు కూడా ఉంది.
జనకమహారాజుకు సీతాదేవి భూమిలో ఓ పెట్టెలో లభించినది ఇక్కడేనన్నది ఓ నమ్మకం. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు (జైన మతస్థుల చివరి తీర్థంకరుడు), కూడా జానక్ పూర్ లో నివసించినట్టు చరిత్ర. ఇక్కడి రాజప్రాసాదంలో జానకీదేవి మందిరాన్ని కూడా చూడవచ్చు.
ఫెవా తాల్ సరస్సు పక్కనే ఉన్న ఫొఖారా పట్టణం ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. నాటు పడవలో విహరిస్తూ అన్నపూర్ణ పర్వత శిఖరాల అందాలను చూడడం వాహ్వా అనిపిస్తుంది. కాట్మాండ్ కు సమీపంలోని నాగర్ కోట్ కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతం. వేడిగా, తియ్యగా, మసాలాతో కూడిన చియా పానీయాన్ని ఒక్కసారైనా రుచిచూడాల్సిందే. ఇది నేపాల్ జాతీయ పానీయం.
ఎవరెస్ట్ (8,848 మీటర్లు), కాంచన్ జంగ (8,586 మీటర్లు), లోట్సే (8,516 మీటర్లు), మకాలు (8,485 మీటర్లు), చోఓయు(8,201 మీటర్లు), దౌలగిరి (8,167 మీటర్లు), మనస్లు (8,163), అన్నపూర్ణ (8,109 మీటర్లు) వంటి అత్యంత ఎత్తయిన పర్వత శిఖరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూసి వచ్చేందుకు అనువుగా రవాణా వసతులు కూడా ఉన్నాయి.
10 రోజుల అన్నపూర్ణ శాంక్చురీ ట్రెక్ ఇక్కడ పాప్యులర్. సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో, మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఇక్కడ ట్రెకింగ్ కు అనుకూలం. ట్రెక్కింగ్ అంటే దూరంగా జరిగే వారు కూడా ఒకసారి నాగర్ కోట్ ను సందర్శిస్తే పర్వతారోహణ చేయాలని ఉబలాటపడతారు. అలాగే, నేపాలీ రాజ కుటుంబం లోగడ నివసించిన దర్బార్ స్క్వేర్ ప్రస్తుతం సందర్శకులకు అందుబాటులో ఉంది. 2008 వరకు నేపాల్ రాచరిక పాలనలో ఉంది. నారాయణ్ హితి ప్యాలస్ దీనికి కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఇది మ్యూజియంగా సందర్శకులకు కనువిందు చేస్తోంది.
తెల్లటి వర్ణంలో ఉండే బౌద్ధనాథ్ స్థూపం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాకెక్కింది. దీనితోపాటు స్వయంభునాథ్ స్తూపం బౌద్ధులకు సంబంధించి ప్రముఖ ప్రదేశంగా ఉంది. స్వయంబునాథ్ స్థూపాన్ని 20 కిలోల బంగారం తొడుగుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
కాట్మండుకు పది కిలోమీటర్ల దూరంలో భక్తపూర్ ఉంది. 1702 కాలం నాటి పొడవైన న్యాటపోల ఆలయాన్ని ఇక్కడ చూడవచ్చు. దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలస్, ఆర్ట్ గ్యాలరీ తదితర విశేషాలు కూడా ఉన్నాయి. ఇక అధిక సంఖ్యలో ఆలయాలతో కూడిన పఠాన్ ప్రాంతం కూడా సందర్శనీయ స్థలాల్లో ఒకటి. 1,700 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న లాంగ్ టాంగ్ నేషనల్ పార్క్ పర్యాటకులు చూడతగినది. ఎత్తయిన పర్వత ప్రాంతంలో మంచు, జలపాతాలు, వృక్షాలతో చూడచక్కగా ఉంటుంది. మొత్తానికి నేపాల్ సందర్శన ఓ అందమైన అనుభూతిగా మిగులుతుంది.