పోస్టాఫీసు నుంచి నిమిషాల్లో నగదు పంపుకోవచ్చు

ఒకప్పుడు సన్నిహితులు, బంధువులకు నగదు పంపుకోవాలంటే ఉన్న ఏకైక సాధనం పోస్టల్ మనీ ఆర్డర్. అవసరమైన వారికి చేరుకునేందుకు కొన్ని రోజులు పట్టేది. ఆ తర్వాత బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చిన చాలా కాలం వరకూ మనీ ఆర్డర్ ఆదరణ తగ్గలేదు. ఎందుకంటే బ్యాంకులు ఆన్ లైన్ సేవల్లోకి మారడానికి చాలా సమయం తీసుకుంది. బ్యాంకులు ఆన్ లైన్ విధానంలోకి మారిన తర్వాత సుదూరంలో ఉన్నవారికి కూడా ఖాతాల ద్వారా వెంటనే నగదు పంపుకోగల సదుపాయం వచ్చేసింది. అప్పటి నుంచి మనీ ఆర్డర్ ను మరచిపోవడం మొదలైంది. అయితే, బ్యాంకు ఖాతాలు లేని వారికి వెంటనే నగదు పంపుకోవాలంటే? దీనికి పరిష్కారం పోస్టల్ మనీ ఆర్డర్ సేవలు. ఎన్ని రోజులు పడుతుందో? అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. పోస్టల్ సేవలు కూడా స్పీడ్ యుగంలోకి మారుతున్నాయి. విదేశంలో ఉన్న వారికి కూడా వెంటనే నగదు పంపుకోవచ్చు...

ఇన్ స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంవో)

సత్వర నగదు బదిలీకి ఈ సేవ వీలు కల్పిస్తుంది. భారతీయ పౌరులు ఎవరైనా దేశంలోపల ఎవరికైనా, ఎక్కడికైనా 50వేల రూపాయల వరకు పంపుకోవచ్చు. ఏదేనీ పోస్టాఫీసుకు వెళ్లి ‘టు రెమిట్ పేమెంట్’ పత్రాన్ని నింపి నిర్ణీత మొత్తాన్ని పే చేయాలి. తపాలా ఉద్యోగి వెంటనే 16 అంకెలతో ఉన్న నంబర్ ను సీల్ రూపంలో ఇస్తారు. దాన్ని తెరిచి ఆ నంబర్ ను ఎవరికైతే నగదు పంపాలనుకున్నామో వారికి కాల్ చేసి చెప్పడం లేదా మెయిల్ లేదా ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. ఆ 16 అంకెల నంబర్ ను నగదు తీసుకోవాల్సిన వ్యక్తి తన గుర్తింపు పత్రాన్ని తీసుకుని పోస్టాఫీసుకు వెళితే.. నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ ప్రక్రియకు పెద్దగా సమయం తీసుకోదు. నిమిషాల్లోనే అంతా పూర్తవుతుంది.  

1000 నుంచి 10 వేల రూపాయల వరకు నగదు బదిలీకి 100 రూపాయలు చార్జీ చెల్లించాలి. 10,001 నుంచి 30వేల వరకు 110 రూపాయలు చార్జీ... 30,001 వేల నుంచి 50వేల రూపాయల వరకు 120 రూపాయల చార్జీ చెల్లించాలి. ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, పోస్టాఫీస్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, స్కూల్ కాలేజీ ఐడెంటిటీ కార్డ్ లను గుర్తింపు పత్రాలుగా పరిగణిస్తారు. 

ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ ఫర్/మనీ గ్రామ్ మనీ ట్రాన్స్ ఫర్

representational imageవిదేశాల నుంచి భారత్ లోని వారికి నగదు పంపుకోవడానికి ఈ సర్వీస్ వీలు కల్పిస్తుంది. భారత్ లోని తమ కుటుంబ సభ్యుల పోషణకు... భారత సందర్శనకు వచ్చిన పర్యాటకులకు ఖర్చుల కోసం నగదుు పంపడానికి విదేశాల్లోని వారు ఈ సేవను వినియోగించుకోవచ్చు.  

ఇందుకోసం వెస్ట్రన్ యూనియన్/మనీగ్రామ్ సెంటర్ కు వెళ్లి నిర్ణీత నగదు మొత్తాన్ని చెల్లించినట్టయితే మనీ ట్రాన్స్ ఫర్ కంట్రోల్ నంబర్ లేదా రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. వెంటనే దీన్ని నగదు తీసుకోవాల్సిన వారికి తెలియజేయాలి. వారు పోస్టాఫీసుకు వెళ్లి తగిన వివరాలు తెలియజేయడం ద్వారా నగదు పొందవచ్చు. ఇదంతా నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియ. రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు ఒకసారి 2500 డాలర్ల వరకు మాత్రమే పంపడానికి వీలుంటుంది. అలాగే ఒక ఏడాదిలో ఇలా 30 సార్లు మాత్రమే పంపుకోవచ్చు. 50వేల రూపాయల వరకు మాత్రమే నగదు రూపేణా చెల్లిస్తారు. అంతకుమించిన విలువ అయితే పోస్టాఫీసు ఖాతాలో జమ చేస్తారు. నగదు తీసుకునేవారు కచ్చితంగా నివాస, గుర్తింపు ధ్రువీకరణలను సమర్పించాల్సి ఉంటుంది. 

ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్

విదేశాల్లో ఉన్న వారికి ఐఎఫ్ఎస్ విధానంలో నగదు పంపుకోవచ్చు. ప్రస్తుతం యూఏఈ, ఫ్రాన్స్ సహా కొద్ది దేశాల్లోని వారికి మాత్రమే నగదు పంపుకోవడానికి అవకాశం ఉంది. దేశంలోని 17,500 పోస్టాఫీసుల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంది. ప్రతీసారి 2500 డాలర్లకు మించకుండా నగదు పంపుకోవచ్చు. ఏడాదికి 30 సార్లు నగదు పంపేందుకు అవకాశం ఉంది. యునిక్యూ మనీ ఆర్డర్ నంబర్ ను నగదు పంపుతున్న వ్యక్తి... ఆ నగదు చేరాల్సిన వ్యక్తికి తెలియజేస్తే దాని ద్వారా నగదు పొందడానికి అవకాశం ఉంటుంది. ఐఎఫ్ఎస్ సదుపాయం ఉన్న విదేశీ పోస్టాఫీసుల్లో నగదు పొందవచ్చు. 


More Articles