వీపీపీ గురించి తెలుసా మీకు?

వాల్యూ పేయబుల్ పోస్ట్... వినియోగదారుడి చేతికి ఆర్టికల్ అందించి దాని విలువను తపాలా విభాగం ద్వారా వసూలు చేసుకోవడం ఈ సేవ ప్రత్యేకత. ఈ కామర్స్ వెబ్ సైట్లు వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటో చాలా మందికి తెలిసింది. కానీ, ఇవేవీ లేని కాలంలోనే భారతీయ తపాలా విభాగం క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని వీపీపీ రూపంలో అందించింది. 

వ్యాపార సంస్థలే కాదు సాధారణ కస్టమర్లు సైతం వీపీపీ సేవను వినియోగించుకోవచ్చు. రిజిష్టర్ పార్సిళ్లు, లెటర్లు, పుస్తకాలు, న్యూస్ పేపర్లు మొదలైన వాటిని వీపీపీ కింద తీసుకుంటారు. పంపే వాటి విలువను బుకింగ్ సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే అందులో అనుమతి లేని పత్రాలు, ఇతరత్రా పంపించడం లేదని నిబంధనలను అంగీకరిస్తూ సంతకం చేయాలి. వీపీపీ ఆర్టికల్ ను చిరునామాదారుడికి అందించి సంబంధిత వెలను వసూలు చేసి తిరిగి బుక్ చేసిన వ్యక్తికి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే, వీపీపీ ద్వారా పంపుతున్న వాటి విలువ 5వేల రూపాయలకు మించరాదు. అలాగే, వీటిలో కూపన్లు, టికెట్లు ఉండరాదు. ఇక డెలివరీ స్టేషన్ కు వీపీపీ వచ్చిన వారం రోజుల్లోగా చిరునామాదారుడు డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎనిమిదో రోజు బుక్ చేసిన వ్యక్తి చిరునామాకు తిరిగి దాన్ని పంపుతారు. చిరునామాదారుడు ఆర్టికల్ తీసుకునేందుకు మరో వారం రోజులు గడువు కావాలని లిఖిత పూర్వకంగా కోరేందుకు అవకాశం ఉంది. 

ఓ ఉదాహరణ చూస్తే…

శ్రీరామ్ దగ్గర 50 ఏళ్ల క్రితం నాటి ఓ వస్తువు ఉంది. దాన్ని రఘురామ్ అనే మిత్రుడు కావాలని కోరాడు. వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు. వీపీపీ రూపంలో పంపిస్తే పోస్ట్ మ్యాన్ కు డబ్బులు చెల్లించి తీసుకుంటానన్నాడు రఘురామ్. దాన్ని శ్రీరామ్ దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి రూ.1000 విలువకు వీపీపీ చేశాడు. అది రఘురామ్ దగ్గరకు చేరింది. అతడు పోస్ట్ మ్యాన్ కు 1000 రూపాయలతోపాటు సర్వీస్ చార్జీలు కూడా కలిపి చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. తపాలా విభాగం వెయ్యి రూపాయలను శ్రీరామ్ కు మూడు రోజుల్లో చేరవేసింది. ఇదీ క్లుప్తంగా వీపీపీ సేవ గురించి. 

ఇన్సూరెన్స్

వీపీపీ లెటర్లు, వీపీపీ పార్సిళ్లకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వీపీపీలో 100 రూపాయలకు మించిన విలువ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటే అందుకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి.  ఆర్టికల్ మిస్ అయినా, దెబ్బతిన్నా బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. 


More Articles