కంప్యూటర్ ముందు కూర్చుని పాన్ కార్డుకు అప్లై చెయ్యండి... డైరెక్టుగా ఇంటికి వచ్చేస్తుంది!
బ్యాంకు ఖాతాతో మొదలు పెడితే ప్రాపర్టీ కొనుగోలు వరకు అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు కావాల్సిందే. అలాంటి పాన్ కార్డుకు ఇంటి నుంచే దరఖాస్తు చేసి సులభంగానే ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న కంప్యూటర్ ఉంటే చాలు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, పాన్ కార్డు నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. పాన్ కార్డు పొందేందుకు గుర్తింపు ధ్రువీకరణపత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువపత్రం, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు ఉంటే చాలు. అంతేకాదు, పాన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా ఎవరికివారు ఆన్ లైన్ ద్వారా సులభంగానే చేసుకోవచ్చు.
ధ్రువీకరణ పత్రం
ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, రేషన్ కార్డు (అందులో దరఖాస్తుదారుడి ఫొటో ఉంటేనే చెల్లుతుంది), ఆయుధాల లైసెన్స్ పత్రం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ఫొటో గుర్తింపు పత్రం, ఫొటోతో కూడిన పెన్షనర్ కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కార్డు లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఆరోగ్య పథకం ఫొటో గుర్తింపు కార్డు, పార్లమెంటు సభ్యుడు లేదా శాసనసభ్యుడు లేదా మున్సిపల్ కౌన్సిలర్ లేదా గెజిటెడ్ హోదా అధికారి సంతకంతో కూడిన గుర్తింపు పత్రం, బ్యాంక్ లెటర్ హెడ్ తో కూడిన ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటవుతాయి.
చిరునామా ధ్రువీకరణ
ఫొటో ధ్రువీకరణ పత్రంతోపాటు చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, దరఖాస్తుదారుడి చిరునామాతో కూడిన పోస్టాఫీసు పాస్ బుక్, తాజాగా జారీ చేసిన ఆస్తి పన్ను అసెస్ మెంట్ ఆర్డర్ కాపీ, ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన వసతి సదుపాయం కేటాయింపు పత్రం, ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రం, పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిలర్, గెజిటెడ్ హోదా ఉన్న ప్రభుత్వ అధికారి ధ్రువీకరించిన నివాస పత్రం అడ్రస్ ప్రూఫ్ గా చెల్లుతాయి. అలాగే, విద్యుత్ బిల్లు, ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లు, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ బిల్లు, వాటర్ బిల్లు, వంటగ్యాస్ పాస్ పుస్తకం లేదా బిల్లు, బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్, డిపాజిటరీ అకౌంట్ (డీపీ) స్టేట్ మెంట్, క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ కూడా నివాస ధ్రువీకరణలుగా చెల్లుతాయి. కాకపోతే దరఖాస్తు తేదీకి ఈ బిల్లులు మూడు నెలల లోపు జారీ చేసి ఉండాలి.
పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు
ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీ ధ్రువీకరణలుగా పనికివస్తాయి. మున్సిపాలిటీ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పదో తరగతి సర్టిఫికెట్, రిజిస్ట్రార్ జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రం, మేజిస్ట్రేట్ సంతకం చేసిన పుట్టినతేదీ అఫిడవిట్ కాపీలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఒకవేళ మైనర్ల పేరిట కార్డుకు దరఖాస్తు చేస్తున్నట్టయితే తల్లిదండ్రుల్లో ఒకరు లేదా సంరక్షకుడికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క పుట్టిన తేదీ ధ్రువీకరణ మాత్రం చిన్నారులకు సంబంధించినదే ఇవ్వాలి. జారీ చేసే కార్డుపై కూడా చిన్నారుల ఫొటోను ముద్రించారు. పెద్దయ్యే సరికి వారి గుర్తింపులో మార్పులు వస్తాయని అలా చేస్తారు. 18 ఏళ్లు నిండిన తర్వాత తాజా పాస్ పోర్టు ఫొటోలతో పాన్ కార్డు కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పత్రాల విషయంలో మరిన్ని వివరాలను https://www.utiitsl.com లింక్ నుంచి తెలుసుకోవచ్చు.
యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (యూటీఐఐటీఎస్ఎల్), ఎన్ఎస్డీఎల్ సంస్థలు ఆదాయపన్ను శాఖ తరఫున పాన్ కార్డు జారీ వ్యవహారాలను చూస్తున్నాయి. వీటికి సంబంధించిన వెబ్ సైట్ చిరునామాలు...
https://www.utiitsl.com/UTIITSL_SITE/site/pan/#one
దరఖాస్తు చేసుకునే విధానం
* కంపెనీలు, వ్యాపార సంస్థలు సాధారణంగా మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా పాన్ కార్డు వంటి సేవలను వినియోగించుకుంటాయి కనుక ఇక్కడ సాధారణ వ్యక్తుల దరఖాస్తు విధానం వివరాలను పేర్కొంటున్నాము.
* ఎన్ఎస్డీఎల్ కంటే యూటీఐఐటీఎస్ఎల్ ద్వారా దరఖాస్తు విధానం సులభంగా ఉంటుంది. కనుక ఈ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే https://www.utiitsl.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎడమచేతి వైపు అప్లయ్ యాజ్ యాన్ ఇండియన్ సిటిజన్/ఎన్ఆర్ రెసిడెంట్ ఇండియన్ కాలమ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే... అక్కడ మళ్లీ అప్లయ్ ఫర్ న్యూ పాన్ కార్డు (ఫామ్ 49ఏ) ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఫామ్ 49 ఏ ఓపెన్ అవుతుంది. లేదా నేరుగా ఈ లింక్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ద్వారానూ ఫామ్ 49ను ఓపెన్ చేయవచ్చు. అక్కడ అన్ని వివరాలను నమోదు చేయాలి. పేజీ పై భాగంలోనే గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. వాటిని చదవడం ద్వారా ముందు స్పష్టతకు రావచ్చు. ఆ గైడ్ లైన్స్ ఏంటో తెలుసుకోవాలంటే http://www.myutiitsl.com/ నేరుగా ఈ లింక్ ను క్లిక్ చేసినా తెలుసుకోవచ్చు. అన్ని కాలమ్ లలో వివరాలను నమోదు చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి.
* భారతీయులు అయితే 107 రూపాయలు, దేశం వెలుపల ఉన్నవారు అయితే 989 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సర్వీసు ట్యాక్సుల్లో మార్పుల వల్ల ఈ చార్జీల్లో కొంత మార్పులు ఉండవచ్చు. ఆ తర్వాత సబ్ మిట్ క్లిక్ చేస్తే అప్పటి వరకు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఆ వివరాలన్నీ చెక్ చేసుకుని కన్ ఫర్మ్ చేయాలి. తర్వాత పేజీలో పేమెంట్ నిబంధనలు కనిపిస్తాయి. అలాగే ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఎక్కడన్నా రాసి పెట్టుకుని అగ్రీ (ఆమోదాన్ని తెలుపుతూ) బటన్ క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.
* పేమెంట్ ప్రక్రియ సక్సెస్ అయిన తర్వాత అప్పటి వరకు పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. దానిపై మూడు చోట్ల సంతకాలు చేయాల్సి ఉంటుంది. రెండు ఫోటోలను పేస్ట్ చేయాలి. ఈ ఫొటోలు 3.5 ఇంటూ 2.5 సైజులో ఉండాలి. వీటిని గమ్ తో అంటించాలే కానీ పిన్ లతో అటాచ్ చేయరాదు. ఇటీవల తీసినవై స్పష్టతతో ఉండాలి. ఎందుకంటే పాన్ కార్డుపై ఇదే ఫొటో కనిపిస్తుంది. ఎడమ చేతి వైపు అంటించిన ఫొటోపై నుంచి ఫామ్ పైకి వచ్చేలా సంతకం, లేదా వేలి ముద్ర వేయాలి. వేలిముద్ర అయితే దాన్ని మేజిస్ట్రేట్ లేదా నోటరీ లేదా గెజిటెట్ అధికారి ధ్రువీకరిస్తూ వారి అధికారిక స్టాంప్ వేయాల్సి ఉంటుంది.
* అప్లికేషన్ తోపాటు గుర్తింపు, నివాస, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాల (ఇవన్నీ దరఖాస్తులోని వివరాలతో సరిపోలాలి)ను అటాచ్ చేసి కింది చిరునామాల్లో ఒక దానికి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత 15 రోజుల్లోపు చేరేలా పంపాలి.
* PAN PDC Incharge – Mumbai region, UTI Infrastructure Technology And Services Limited, Plot No. 3, Sector 11, CBD Belapur, NAVI MUMBAI – 400614, Tel No:(022)67931300
* PAN PDC Incharge – Chennai region, UTI Infrastructure Technology And Services Limited, STC Trade Centre, First Floor, A-29, Thiru- Vi- Ka Industrial Estate, Guindy, CHENNAI - 600032, Tel No:(044) 22500426
* PAN PDC Incharge – Kolkata region, UTI Infrastructure Technology And Services Limited, 29, N. S. Road, Ground Floor, Opp. Gilander House and Standard Chartered Bank, KOLKATA - 700001, Tel No:(033) 22108959 / 22424774
* PAN PDC Incharge - New Delhi region, UTI Infrastructure Technology And Services Limited, Ground Floor, Jeevan Tara Building, Opp. Patel Chowk Metro Station, 5 Parliament Street, NEW DELHI – 110001, Tel No:(011) 23741282-86
ఎన్ఎస్డీఎల్ ద్వారా దరఖాస్తుకు...
* ముందు https://tin.tin.nsdl.com/pan/ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. కొత్త కార్డు కావాలా? పాన్ కార్డులో మార్పులు చేసుకోవాలా? ఇలా పలు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ‘న్యూ పాన్ ఫర్ ఇండియన్ సిటిజన్స్’ సెలక్ట్ చేసుకుంటే ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో గైడ్ లైన్స్ తోపాటు ఫామ్ 49ఏ కనిపిస్తుంది. 49ఏను క్లిక్ చేస్తే పేజీ పై భాగంలో గైడ్ లైన్స్ కనిపిస్తాయి. వాటిని ఒకసారి చదివి పేజీ కింది భాగానికి వెళితే అక్కడ అప్లయ్ ఫర్ న్యూ పాన్ కార్డు బటన్ కనిపిస్తుంది. అందులో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబమా, కంపెనీలా అనే ఆప్షన్లు ఉంటాయి. దానిలో ఇండివిడ్యువల్ క్లిక్ చేయడం ద్వారా 49ఏ ఫామ్ ఓపెన్ అవుతుంది.
* 49ఏ ఫామ్ లో పైన ఏరియా కోడ్, ఏవో (AO) టైప్, రేంజ్ కోడ్, ఏవో (AO)నంబర్ తెలియజేయాల్సి ఉంటుంది. ఇవి తెలియని పక్షంలో అక్కడే ఉన్న ‘ఫర్ నాన్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఏవో డిటెయిల్స్’ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. అప్పటికీ సందేహాలుంటే ఇన్ కమ్ ట్యాక్స్ హెల్ప్ లైన్ నంబర్ 18001801961కు కాల్ చేస్తే సిబ్బంది సరైన వివరాలు ఇవ్వడంలో సాయం అందిస్తారు. ఆ తర్వాత మిగిలిన వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
* క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, డీడీలలో ఏదేనీ ఒక ఆప్షన్ సెలక్ట్ చేసుకుని అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దానిలోని వివరాలన్నీ సరిగా ఉంటే కన్ ఫర్మ్ చేయాలి. అప్పుడు పేమెంట్ ప్రక్రియ మొదలు అవుతుంది. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ సెలక్ట్ చేసుకుంటే పేమెంట్ గేట్ వేకు వెళుతుంది. అక్కడ నగదు చెల్లింపు పూర్తి చేయాల్సి ఉంటుంది. డీడీ అయితే 'NSDL - PAN' ముంబైలో చెల్లింపయ్యేలా (పేయబుల్ ఎట్ ముంబై) తీయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందే డీడీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. ఎందుకంటే దరఖాస్తులో డీడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
* పేమెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్ మెంట్ నంబర్ వస్తుంది. ఆ పేజీని ప్రింట్ తీసుకోవాలి. రెండు ఫోటోలు అంటించి, సంతకాలు చేయాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు, డీడీ (డీడీ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఉంటే)లను జతచేయాలి. కవర్ పై ‘APPLICATION FOR PAN.. 15 అంకెల అక్నాలెడ్జ్ నంబర్ ను రాసి, ఈ కింది చిరునామాకు 15 రోజుల్లోగా పంపాల్సి ఉంటుంది.
NSDL e-Governance Infrastructure Limited, 5th floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411016
* డీడీ రూపంలో పంపే దరఖాస్తు అయితే పాన్ కార్డు జారీకి మూడు నాలుగు రోజులు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎన్ఎస్డీఎల్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా, దరఖాస్తు చేసిన తర్వాత స్టేటస్ తెలుసుకోవాలంటే, ఆ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. మన దరఖాస్తు పరిస్థితిని చెప్పడమే కాకుండా, దరఖాస్తును పెండింగులో పెడితే అందుకు సంబంధించిన వివరాలను కూడా అక్కడ ఇస్తారు. ఏవైనా పంపించవలసిన పత్రాలు వుంటే వాటి వివరాలు కూడా ఇస్తారు. ఇంకా కాల్ సెంటర్ కు 020 - 27218080 కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
* ఈ రెండు మార్గాల్లో దరఖాస్తు కష్టంగా అనిపించిన వారు https://www.applypanonline.com/ అనే సంస్థ సాయంతోనూ పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కాక యూటీఐ అథరైజ్డ్ పాన్ కార్డ్ సెంటర్లు, ఏజెంట్లు కూడా ఉంటారు. కాకపోతే మధ్యవర్తుల ద్వారా అయితే కొంచెం ఎక్కువ ఖర్చు భరించడానికి సిద్ధం కావాలి.
Read: పాన్ కార్డుతో ప్రయోజనాలు