పాన్ కార్డుతో బోలెడు ప్రయోజనాలు

పాన్ కార్డు అంటే చాలా మందికి ఏదో తెలియని భయం. పాన్ కార్డుంటే ఆదాయపన్ను శాఖకు పన్ను కట్టాల్సి వస్తుందేమో, రిటర్నులు దాఖలు చేయాలేమో! ఇలా ఎన్నో సందేహాలు, ఆందోళనలతో ఉంటారు. అయితే, వాటన్నింటినీ పక్కన పెట్టి నిశ్చింతగా పాన్ కార్డు తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. 

పాన్ కార్డుంటే పన్ను కట్టాలన్న నిబంధన లేదు. పన్ను వర్తించే ఆదాయంలో ఉన్న వారు మాత్రమే రిటర్నులు దాఖలు చేసి పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను పరిధిలో ఉన్న వారు రిటర్నుల దాఖలకు పాన్ నంబర్ ఎలాగూ తప్పనిసరి. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు చేస్తూ పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న వారు ఎందరో ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు, నల్లధనం చెలామణీని అరికట్టేందుకు ఆదాయపన్ను శాఖకు పాన్ కార్డు నంబర్ ఉపకరిస్తుంది. ఈ నంబర్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం (వివిధ మార్గాల ద్వారా) ఎంత విలువైన లావాదేవీలు జరిగాయో ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలుస్తుంది. 

పాన్ కార్డు వేటికి అవసరం

2016 జనవరి 1 నుంచి ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధన ప్రకారం అమల్లోకి వచ్చిన నిబంధనల మేరకు... ఈ క్రింది వాటన్నింటికీ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 

* 2 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు కొనేవారు పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు 2 లక్షల రూపాయలకు మించిన అన్ని రకాల వస్తువులు, సేవల కొనుగోళ్లు, అమ్మకాలకు పాన్ నంబర్ పేర్కొనాలి. 

* బ్యాంకులో 50వేల రూపాయలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ ఇవ్వాలి. బ్యాంకులోనే కాదు పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకూ ఇదే వర్తిస్తుంది. పోస్టాఫీసు సేవింగ్ ఖాతాలో 50వేలకు మించిన డిపాజిట్ లకు లోగడ్ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా... ఆ నిబంధన తొలగించారు. బ్యాంకులో పాన్ నంబర్ ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు. బ్యాంకు డిపాజిట్లపై ఏడాదికి వచ్చే వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు మించితే 20 శాతం (టీడీఎస్) కోత కోసి దాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. పాన్ నంబర్ ఇస్తే ఈ కోత 10 శాతానికే పరిమితం చేస్తారు. పాన్ నంబర్ ఇవ్వని పక్షంలో 20 శాతం టీడీఎస్ కోతకు సంబంధించి బ్యాంకు సర్టిఫికెట్ కూడా ఇవ్వదు. దీంతో ఆదాయపన్ను శాఖ నుంచి రిఫండ్ పొందలేరు. ఫామ్ 15జీ/15హెచ్ ఇచ్చి కోత నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. 

* ద్విచక్ర వాహనం మినహా అన్ని మోటారు వాహనాల కొనుగోలుకూ తప్పనిసరి. 

* రూ.10 లక్షలకు మించి విలువ గల అన్ని ఆస్తి లావాదేవీలకు పాన్ నంబర్ ఇవ్వాలి. లోగడ ఇది రూ.5 లక్షల మొత్తాలకే ఉండేది. 

* అన్ని రకాల బ్యాంకు ఖాతాల ప్రారంభ సమయంలో పాన్ నంబర్ ఇవ్వాలనేది ఇంతకుముందు వరకూ ఉన్న నిబందన. అయితే, సాధారణ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు ఈ  నిబంధన నుంచి తాజాగా మినహాయింపు కల్పించారు. 

* బ్యాంక్ డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, బ్యాంకర్ చెక్కులు రూ.50వేలకు మించితే పాన్ ఇవ్వాలి. అలాగే, 50వేలకు మించి నగదు జమలకు కూడా. 

* ఏదేనీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, పాన్ నంబర్ ఉందో లేదో కూడా చూసుకోండి. యాత్రా సంస్థలకు, విమాన ప్రయాణాల చార్జీలు, హోటల్స్ గదుల అద్దెల రూపేణా 50 వేల రూపాయలకు మించి చేసే చెల్లింపులకు పాన్ అవసరం. 

* ముందస్తు చెల్లింపులు, క్యాష్ కార్డుల పేమెంట్ 50వేల రూపాయలు దాటినా పాన్ తప్పదు. 

* అన్ని రకాల టెలిఫోన్, సెల్ ఫోన్ కనెక్షన్లకు పాన్ నంబర్ తప్పని సరి అన్న నిబంధనను తొలగించారు. 

* అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో 50వేలకు మించి చేసే చెల్లింపులకు కూడా పాన్ నిబంధన వర్తిస్తుంది. 

* క్రెడిట్ కార్డుల దరఖాస్తు సమయంలోనూ పాన్ తప్పనిసరి. 

* మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల కొనుగోలు 50వేల రూపాయలు మించితే ఇదే నిబంధన వర్తిస్తుంది. 

* డీమ్యాట్ ఖాతా ప్రారంభం, అన్ లిస్టెడ్ కంపెనీ షేర్లు లక్ష రూపాయల విలువకు మించి చేసే కొనుగోళ్లు, విక్రయాలకు కూడా పాన్ అవసరం. 

* డిబెంచర్లు, బాండ్లు, ఆర్ బీఐ బాండ్లు కొనుగోలు 50వేల రూపాయల విలువ మించినా పాన్ ఇవ్వాలి. 

* లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఏడాదికి కట్టే ప్రీమియం 50వేల రూపాయలు దాటినా పాన్ తప్పదు. 

* ఈ వివరాలకు సంబంధించిన ఇంగ్లిష్ నోటిఫికేషన్ ను http://pib.nic.in/ లింక్ నుంచి పొందవచ్చు. 

మైనర్లకు పాన్ నంబర్... మంచిదే

మైనర్లకు పాన్ నంబర్ ఎందుకని అనుకుంటున్నారా? కానీ కొన్ని సందర్భాల్లో ఆ అవసరం ఏర్పడవచ్చు. చిన్నారుల పేరుపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆ మొత్తం నిర్ణీత పరిధి దాటితే వారి పేరుతో ఉన్న పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, స్టాక్స్, ఇతర పెట్టుబడులకు నామినీగా మైనర్ పేరును పేర్కొంటే అప్పుడు కూడా మైనర్ పేరుతో ఉన్న పాన్ నంబర్ ఇవ్వాలి. మైనర్ అంటే బాల బాలికలు. సహజంగా వీరికి ఎలాంటి ఆదాయం ఉండదన్నది ప్రభుత్వం భావన. అందుకే మైనర్ల పేరిట వచ్చే ఆదాయాన్ని వారి తల్లిదండ్రుల ( వీరిలో ఆదాయం ఆర్జించేవారు) ఆదాయంగానే పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నారుల పేరు మీద ఏదైనా ఆదాయం వచ్చినట్టయతే దాన్ని తల్లిదండ్రులు తమ ఆదాయంలో భాగంగానే చూపించి పన్ను వర్తించే ఆదాయమైతే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ చిన్నారులకు అంగవైకల్యం ఉండి వారు సొంతంగా ఆదాయాన్ని పొందినట్టయితే అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల ఆదాయానికి కలపరు. అలాగే, తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఆదాయం వస్తే దాన్ని సంరక్షకుల ఆదాయానికి కలపరు.  

ఎన్ఆర్ఐలకూ కూడా పాన్ అవసరమే

ఎన్ఆర్ఐలు భారత్ లో పన్ను వర్తించే ఆదాయాన్ని పొందుతుంటే రిటర్నులు దాఖలు చేయాలి. అందుకు పాన్ నంబర్ తప్పనిసరి. అలాగే భారత స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు పాన్ తప్పనిసరి. ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు కూడా పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన ఆర్థిక లావాదేవీల విషయంలోనూ భారతీయులకు వర్తించే నిబంధనలే వారికి కూడా వర్తిస్తాయి.  

పాన్ కార్డుతో జాగ్రత్త... 

పాన్ నంబర్ దుర్వినియోగం కావడానికి అవకాశం ఉంది. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఇచ్చిన పాన్ నంబర్లను కొంత మంది బంగారం వర్తకులు సేకరించి (రిజర్వేషన్ చార్టులలో కనిపిస్తుంది) అధిక విలువ గల బంగారం విక్రయ లావాదేవీలకు వాటిని వినియోగించినట్టు ఒక వినియోగదారుల ఉద్యమ సంస్థ గతంలో బయటపెట్టింది. ఇలా దుర్వినియోగమైన సందర్భాల్లో ఆయా లావాదేవీలకు సంబంధించి ఆదాయ వనరుల వివరాలు సమర్పించాలని ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు.  

పాన్ కార్డును గుర్తింపు పత్రంగా కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. మొబైల్ సిమ్ కార్డుకు కూడా పాన్ కార్డు కాపీ ఇచ్చేవాళ్లున్నారు.  పన్ను చెల్లింపు దారులు తమ పాన్ నంబర్ పేరిట బినామీ లావాదేవీలు జరిగితే ఫామ్ 26ఏఎస్ ద్వారా తెలుసుకునే వీలుంది. మిగిలిన వారికి ఆ అవకాశం లేదు. ఆర్థిక పరమైన మోసాలకు పాల్పడేవారు, బినామీ లావాదేవీలకు ఇతరుల పాన్ కార్డులను దొంగతనంగా వాడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక అనవసరమైన వేదికల్లో అంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి అని నిర్దేశించిన లావాదేవీలకు తప్పితే మరెక్కడా పాన్ నంబర్ ఇవ్వకుండా ఉండడమే శ్రేయస్కరం. 

పాన్ కార్డుపై ఏఏ వివరాలు ఉంటాయి?

ఇంటి పేరుతో సహా కార్డు దారుడి పూర్తి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10 అంకెల పాన్ నంబర్, సంతకం, ఫొటో, జారీ చేసిన తేదీ పాన్ కార్డుపై కనిపిస్తాయి. పాన్ కార్డుపై ఉండే పది అక్షరాలలో ఉదాహరణకు... BJQPP5524G ఈ పాన్ నంబర్ లో మొదటి మూడు ఆల్ఫాబెటిక్ (ఏ నుంచి జెడ్ లోపు) సిరీస్ లోనివి. నాలుగోది పీ అంటే పర్సన్ అని అర్థం. వ్యక్తి కాకుండా కంపెనీ అయితే అక్కడ సీ అని ఉంటుది. అదే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ అయితే హెచ్, సంస్థ అయితే ఎఫ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అయితే ఏ, ట్రస్ట్ అయితే టీ, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ కు బీ, లోకల్ అథారిటీ అయితే ఎల్, ఆర్టిఫీషియల్ జురిడికల్ పర్సన్ అయితే జే, ప్రభుత్వం అయితే జీ అనే అక్షరం ఉంటుంది. ఐదో అక్షరం పీ అనేది కార్డు దారుడి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు కార్డు దారుడి ఇంటి పేరు పచ్చళ్ల అనుకుంటే పీ అని, నారా అయితే ఎన్ అని ఉంటుంది. తర్వాతి నాలుగు ప్రత్యేకమైన నంబర్. చివరి ఆల్ఫాబెటిక్ అక్షరం చెక్ డిజిట్ అని అర్థం. 

Read : కంప్యూటర్ ముందు కూర్చుని పాన్ కార్డుకు అప్లై చెయ్యండి... డైరెక్టుగా ఇంటికి వచ్చేస్తుంది!


More Articles