జీవిత బీమా పాలసీల గురించి... A టు Z

ప్రతి క్షణం ఎంతో విలువైనది. అలాంటి ఎన్నెన్నో.... క్షణాలతో కూడిన ఓ మనిషి జీవితం విలువ ఎంతుంటుందో ఆలోచించండి. విలువైన జీవితానికి వెలకట్టలేము. కానీ ఓ వ్యక్తిని నమ్ముకుని నడుస్తున్న వారికి ఆర్థికపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత తప్పదు కదా. కనుక జీవిత బీమా కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తికి తప్పనిసరి. 

జీవిత బీమా అనగానే ఎన్నో సందేహాలు వచ్చేస్తాయి. మార్కెట్లో పదుల సంఖ్యలో కంపెనీలు, వందల సంఖ్యలో పాలసీలు. వాటిలోనూ బోలెడన్ని రకాలు. పాలసీ ఏదైనా గానీ అవసరంలో ఆదుకునేలా ఉండాలి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి పాలసీలు ఉన్నాయి. అవి ఏ విధంగా పనిచేస్తాయి. వాటి ఉపయోగాలు ఏమిటి? తదితర విషయాలు తెలుసుకునేందుకు కొంచెం సమయం వెచ్చిద్దాం. 

అసలు జీవిత బీమా ఎవరికి అవసరం? 

ఆర్జనాపరులై ఉండి, వారిపై ఆధారపడిన వారు ఉంటే అలాంటి ప్రతి ఒక్కరు జీవిత బీమా తీసుకోవాలి. ఆదాయం లేకపోయినా, ఆధారపడిన వారు లేకున్నా బీమా అవసరం లేదా? అంటే లేదనే చెప్పాలి. ఉదాహరణకు చంద్రశేఖర్ వయసు 30 ఏళ్లు. అప్పటికే పెళ్లయి ఎంతగానో ప్రేమించే చక్కని భార్య, ముద్దులొలికే ఓ పాప, ఓ బాబు ఉన్నారు. అంతేకాదు శేఖర్ తల్లిదండ్రులు కూడా పెద్ద వయసులో ఉండి కుమారుడి దగ్గరే ఆశ్రయం పొందుతున్నారు. ఎంతో ఆనందకరమైన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పిడుగు లాంటి వార్త. రోడ్డు ప్రమాదంలో శేఖర్ హఠాన్మరణానికి గురయ్యాడు. విషాదాన్ని దిగమింగుకుని కర్మకాండలు పూర్తయిన వెంటనే శేఖర్ భార్య తనకున్న డిగ్రీ విద్యార్హతతో ఓ చిన్న ఉద్యోగంలో చేరి జీవిత పోరాటం ప్రారంభించింది. ఎందుకంటే శేఖర్ పేరిట బీమా పాలసీ లేదు. దీంతో కుటుంబం గడవడానికి ఆమె ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 

మూడేళ్ల బాబు, రెండేళ్ల పాపను అత్తా, మామల దగ్గర విడిచిపెట్టి ఆమె ఉద్యోగానికి వెళుతోంది. అమ్మా అంటూ పిల్లలు  మారాం చేస్తుంటే... వారిని ఏదోలా బుజ్జగిస్తూ కోడలు వచ్చేంతవరకు శేఖర్ తల్లిదండ్రులే ఆలనా పాలన చూస్తున్నారు. ఒకవైపు శేఖర్ లేని లోటు. మరోవైపు చిన్నారుల సంరక్షణకు సమయం వెచ్చించలేని పరిస్థితి ఆ ఇల్లాలిది. ఇలాంటి బాధాకరమైన సందర్భం ఎవరికీ రాకూడదు. కీడెంచి మేలెంచమన్నట్టు ఒకవేళ శేఖర్ ముందు చూపుతో ఆలోంచి ఉంటే ఈ రోజు అతడు లేని పరిస్థితుల్లో అతడి భార్య చిన్న పిల్లల్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. అందుకే జీవిత బీమా అనేది తమపై ఆధారపడివారు ఉంటే తప్పకుండా తీసుకోవాలి. ఒంటిరి వారు తీసుకోరాదనేమీ లేదు. కొద్ది మొత్తంతో తీసుకోవచ్చు. 

ఎన్నో రకాలు… 

జీవిత బీమా పాలసీల్లో ఏది తీసుకోవాలన్నది? కొంచెం కష్టమైన పనే. అందుబాటులో ఉన్న భిన్న రకాల పాలసీలు, వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే కానీ పాలసీ ఎంపిక చేసుకోలేము.  

టర్మ్ ఇన్సూరెన్స్

జీవితానికి అసలైన బీమా అర్థాన్నిచ్చేవి టర్మ్ పాలసీలే. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా కచ్చితంగా ఇంత పరిహారమనే స్పష్టత వీటిలో ఉంటుంది. గడువు తీరిన తర్వాత జీవించి ఉంటే రూపాయి కూడా తిరిగి రాదు. పేరులో ఉన్నట్టుగానే నిర్ణీత కాలానికి బీమా రక్షణనిస్తాయి. సాధారణంగా 35 ఏళ్ల కాలానికి టర్మ్ పాలసీల వ్యవధి ఉంటుంది. ఈ గడువులోపు పాలసీదారుడికి ఏదైనా జరిగితే ఒప్పందం ప్రకారం పరిహారం మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి. వీటికి పలు రైడర్లు కూడా జోడించుకోవచ్చు. అలాగే పరిహారం పెరుగుతూ పోయే, తగ్గుతూ పోయే రకాలు కూడా ఉన్నాయి. 

ఎండోమెంట్ పాలసీలు

వీటిని సంప్రదాయ పాలసీలు అని కూడా అంటారు. నిర్ణీత కాలానికి జీవిత బీమా రక్షణ కల్పించడంతోపాటు పాలసీ గడువు తీరిన తర్వాత కొంత ప్రతిఫలాన్ని అందజేయడం వీటి ప్రత్యేకత. ఏటా కట్టిన ప్రీమియం వృథాగా పోకుండా కొద్ది ప్రతిఫలంతో తిరిగి పొందవచ్చు. 

హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు

పేరులో ఉన్నట్టుగానే జీవించి ఉన్నంత కాలం ఆ వ్యక్తికి బీమా రక్షణ కల్పిస్తాయి. మరణానంతరం బీమా మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. అంటే ఆ వ్యక్తి జీవిత కాలంలో ఎలాంటి ప్రతిఫలం అందుకోవడానికి అవకాశం ఉండదు. 

మనీ బ్యాక్ పాలసీలు

పాలసీ వ్యవధిలో విడతల వారీగా మధ్య మధ్యలో కొంత నగదు మొత్తాన్ని వెనక్కి ఇస్తూ వెళుతుండడం వీటిలో ప్రత్యేకత. బీమాతో పాటు పొదుపునకు ఇందులో వీలుంటుంది. 

యూనిట్ లింక్డ్ పాలసీలు (యులిప్స్)

జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు ఈ పాలసీలు అవకాశం కల్పిస్తాయి. పాలసీ దారుడు కట్టిన ప్రీమియంలో జీవిత బీమా రక్షణ, ఇతర ఖర్చులన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లలో (వీటిలో ఈక్విటీ, బ్యాలన్స్, బాండ్ ఫండ్స్ ఇలా పలు రకాలు ఉన్నాయి) పెట్టుబడి పెడుతుంటాయి బీమా కంపెనీలు. పాలసీ దారుడు పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే బీమా మొత్తం లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువ వీటిలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. 

పెన్షన్ ప్లాన్స్

బీమా ఆధారిత పెన్షన్ పాలసీలు కూడా చాలానే ఉన్నాయి. వీటిలో ఎండోమెంట్, యూనిట్ లింక్డ్ పాలసీలని రెండు రకాలు. ఎండోమెంట్ అంటే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వాటిలో సుమారు 8 శాతం వడ్డీ వస్తుందనుకుంటే అందులో బీమా కంపెనీల ఖర్చులను మినహాయించుకుంటే గిట్టుబాటయ్యేది తక్కువగానే ఉంటుంది. ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశించేవారికి యులిప్స్ సరిపోతాయి. తట్టుకునే రిస్క్ స్థాయి, ఆశించే ప్రతిఫలాన్ని బట్టి వాటిలో సబ్ ఆప్షన్లు ఉంటాయి. 

టర్మ్ పాలసీలు.. వాటి ప్రయోజనాలు.. రకాలు

ఈ కాలమ్ లో టర్మ్ పాలసీల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఆన్ లైన్ టర్మ్ పాలసీలు, ఆఫ్ లైన్ టర్మ్ పాలసీలని రెండు రకాలు ఉంటాయి. ఆన్ లైన్ పాలసీల్లో ఏజెంట్ కమిషన్ ఏదీ ఉండదు. కనుక ప్రీమియం తక్కువ ఉంటుంది. ఆఫ్ లైన్ పాలసీకి ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాలసీలనేవి ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కార్యాలయాల ద్వారా, ఏజెంట్ల ద్వారా విక్రయిస్తుంటాయి. కనుక ఆ ఖర్చులన్నింటినీ లెక్కలోకి తీసుకుని అదనపు ప్రీమియాన్ని చార్జ్ చేస్తుంటాయి. పెద్ద మొత్తంలో బీమాను అతి తక్కువ ప్రీమియానికే టర్మ్ పాలసీ ద్వారా అందుకోవచ్చు. టర్మ్ పాలసీల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఇదే. తక్కువ ప్రీమియానికి ఎక్కువ బీమా ఇస్తూ కాల వ్యవధి తీరిన తర్వాత రూపాయి ఇవ్వకపోవడం వీటిలో గమనించాల్సిన విషయం. పైగా పాలసీ ప్రారంభంలో ఎంత ప్రీమియం అయితే చెల్లిస్తామో… పాలసీ ముగిసే వరకూ ఏటా అదే ప్రీమియం ఉంటుంది. ప్రీమియంలో పెరుగుదల ఉండదు.  

ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలి..?

కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానిది జరిగితే ఆ కుటుంబాన్ని పాలసీ ఆదుకోవాలి. కుటుంబ అవసరాలన్నీ తీర్చాలి. పిల్లలుంటే వారి విద్యా వ్యయం, పెద్ద వాళ్లు ఉంటే వారి పోషణ, ఆరోగ్య ఖర్చులు, అప్పటికే ఏవైనా రుణాలు (ఇంటి రుణం లేదా వ్యక్తిగత రుణం ఇంకా ఏవైనా) తీసుకుని ఉంటే వాటి చెల్లింపులన్నింటికీ సరిపడా బీమా ఉండాలి. ఉదాహరణకు ఫలానా ఎక్స్ అనే వ్యక్తి నెలనెలా ఇంటి ఖర్చు 20వేలు, ఆరోగ్య ఖర్చులు 10వేలు, పిల్లల విద్యకు 10వేలు, నెలనెలా రుణవాయిదాలు 10వేలు, భవిష్యత్తులో పిల్లల పెళ్లిళ్లకు అయ్యే వ్యయాన్ని తట్టుకునేందుకు నెల నెలా పొదుపునకు 10వేల రూపాయలు అవసరం అనుకుంటే... కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే బీమా కంపెనీ ఇచ్చే పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయగా... నెలనెలా వడ్డీ 60వేలు రావాలి. అప్పుడు ఆ కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతుంది. ఇంత వడ్డీ రావాలంటే సుమారు కోటి రూపాయలకైనా బీమా తీసుకోవాలి. ఇది ప్రతి వ్యక్తి అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. 

అంతేకాదు ధన విలువను కబళించే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 30 ఏళ్ల వయసున్న వ్యక్తి 60 ఏళ్ల వరకు అంటే 30 ఏళ్ల కాలానికి కోటి రూపాయల పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. 55 ఏళ్ల వయసులో అంటే పాలసీ తీసుకున్న మరో 25 ఏళ్ల తర్వాత అతడు మరణిస్తే వచ్చే పరిహారం కోటి రూపాయలు. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అప్పుడు వడ్డీ రేటు తగ్గి 6 శాతం ఉందనుకుందాం. అంటే నెలనెలా సుమారు 50వేల వడ్డీ వస్తుంది. కానీ అదే సమయంలో ద్రవ్యోల్బణం దెబ్బ కారణంగా సదరు వ్యక్తి కుటుంబ ఖర్చులు పెరిగి ఉంటాయి కదా.  ఎంత తక్కువలో అయినా నెలకు కనీసం 1.25 లక్షల వడ్డీ అయినా వచ్చేట్టు ఉండాలి. అంటే అంత మొత్తాన్ని ఇచ్చేలా బీమా పాలసీ ఉండాలని ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. 

మరో ఉదాహరణ ప్రకారం… 25 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకోవాలని అనుకున్నాడు. అతని సంవత్సరాదాయం 3 లక్షల రూపాయలు. అతడు పదవీ విరమణకు ఇంకా 35 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 35 ఏళ్లు మూడు లక్షల రూపాయల చొప్పున మొత్తం 95 లక్షల రూపాయలు సంపాదించగలడు. జీతంలో పెరుగుదల లెక్కలోకి తీసుకుంటే ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. అంటే అంత మొత్తానికి బీమా తీసుకోవాలని అర్థం. 

కోటి రూపాయల బీమాను టర్మ్ పాలసీలు అతి తక్కువ ప్రీమియానికే అందిస్తాయి. వార్షికంగా కేవలం పది వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువకే పొందడానికి అవకాశం ఉంది. 20 నుంచి 25 ఏళ్లలోపు వయస్సున్న వారయితే 5 వేల రూపాయల ప్రీమియానికే కోటి రూపాయల బీమాను ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. మరి ఎండోమెంట్ పాలసీల్లో పది వేల రూపాయల ప్రీమియానికి గట్టిగా మూడు లక్షల రూపాయలకు మించి బీమా పరిహారం వచ్చే పరిస్థితి లేదు. 

టర్మ్ పాలసీల్లోనూ కట్టిన ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చేవి ఉన్నాయి. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీల ప్రీమియం సాధారణ టర్మ్ పాలసీల ప్రీమియం కంటే ఎక్కువే ఉంటుంది. అలాంటప్పుడు సాధారణ పాలసీయే తీసుకుని అదనంగా కట్టే ప్రీమియాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతూ వెళితే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేదానికంటే రెట్టింపు ప్రతిఫలాన్నే పొందవచ్చు.

టర్మ్ పాలసీల్లో పాలసీదారుడు మరణిస్తే కోటి రూపాయల పరిహారం ఇవ్వడం ఒక విధానం. మరో విధానంలో కోటి రూపాయలు ఇవ్వడంతోపాటు నెలనెలా ఆ కుటుంబానికి నిర్ణీత మొత్తం చొప్పున ఓ పదేళ్లు లేదా పదిహేనేళ్ల పాటు ఇచ్చే రకాలు ఉన్నాయి. మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూడు రకాల ఆన్ లైన్ టర్మ్ పాలసీలను అందిస్తోంది. ఉదాహరణకు పొగతాగడం, మద్యం వంటి ఆరోగ్యాన్ని కబళించే అలవాట్లు లేని 30 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతుడైన వ్యక్తికి మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయల బీమాను 7,400 రూపాయల వార్షిక ప్రీమియానికే అందిస్తోంది. ఒకవేళ మరణం సంభవిస్తే కోటి రూపాయల పరిహారాన్ని చెల్లిస్తారు. అలా కాకుండా కోటి రూపాయల ఏక మొత్తం పరిహారంతోపాటు ఆ కుటుంబానికి నెలనెలా 40వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు అందించే మరో ఆప్షన్ కూడా ఉంది. దీనికి ప్రీమియం 10,100. అంటే కేవలం అదనంగా 2,700 రూపాయల ప్రీమియం చెల్లించగలిగితే అతడి కుటుంబం నెలనెలా 40వేల చొప్పున అదనంగా 40 లక్షల రూపాయల ప్రతిఫలాన్ని పొందవచ్చు. 

మరో ఆప్షన్ ప్రకారం కోటి రూపాయల ఏకమొత్తం పరిహారం, నెలనెల 40వేల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఏటా ఈ 40వేలకు పది శాతాన్ని పెంచుతూ ఇస్తారు. అంటే మొదటి 12 నెలలు నెలనెలా 40వేల రూపాయలు... రెండు ఏడాది 44వేల రూపాయలు.. మూడో ఏడాది 48,400 రూపాయల చొప్పున ఇస్తూ వెళతారు. ఇందుకు వార్షిక ప్రీమియం 11,100 రూపాయలు. ఈ కంపెనీ టర్మ్ పాలసీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా... మీ వయసు, బీమాను బట్టి ప్రీమియం తెలుసుకోవాలన్నా https://buyonline.maxlifeinsurance.com/maxvsm/Home/VSMHome?ChannelId=2&CompanyId=1&SourceId=2&clk=corporat%20%20e ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. హెచ్ డీఎఫ్ సీ క్లిక్ టు ప్రొటెక్ట్ ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ కూడా ఇలానే పనిచేస్తుంది. అవగాహన కోసం కేవలం రెండు కంపెనీలనే కోట్ చేయడం జరిగింది. ఇలాంటి సదుపాయలతో కూడిన పాలసీలను మరికొన్ని కంపెనీలు కూడా అందిస్తున్నాయి. 

ఎంత కాలానికి తీసుకోవాలి?

పాలసీ వ్యవధి అనేది చాలా కీలకమైన అంశం. సాధారణంగా ఒక వ్యక్తి సంపాదించేంత వరకు పాలసీ వ్యవధి ఉండాలన్నది ప్రాథమిక నియమం. అంటే 60 ఏళ్ల వరకు పాలసీ గడువు ఉండేలా చూసుకోవాలి. కొందరికి 60 ఏళ్లు వచ్చినా పిల్లల పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు తీరవు. అలాంటి సందర్భాల్లో 65 ఏళ్ల వరకు పాలసీ ఉంటే మంచిదని నిపుణుల సలహా. 60 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి ఆఫర్ చేసే పాలసీలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచన. 

ఒక్క పాలసీ వద్దు రెండు పాలసీలు ముద్దు

ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలన్నది నిర్ణయం జరిగాక... అంత మొత్తానికి ఒకే కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం సరైన నిర్ణ యం కాదన్నది నిపుణుల సూచన. ఉదాహరణకు కోటి రూపాయల పాలసీని ఫలానా ఎక్స్ కంపెనీ నుంచి తీసుకున్నారనుకుందాం. పాలసీదారుడు మరణించిన సందర్భంలో పరిహారం కోసం అతడి నామినీ క్లెయిమ్ చేసుకున్నారు. పరిహారం వెంటనే రాలేదు. అది కావాలి, ఇది కావాలంటూ కంపెనీ ఆరు నెలలు తిప్పుకుని అప్పుడు పరిహారం విదిల్చింది. అప్పుడు ఎంత కష్టమో ఆలోచించండి. ఒకవేళ పరిహారం ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో మరణానికి కారణాలు వెతికి వెతికి ఏదో అడ్డుపుల్ల వేసి క్లెయిమ్ తిరస్కరిస్తే. అందుకే బీమా మొత్తాన్ని రెండు భాగాలు చేసి రెండు కంపెనీల నుంచి తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ ఒక కంపెనీ నుంచి చేదు అనుభవం ఎదురైనా మరో కంపెనీ నుంచి అందే పరిహారం అక్కరకు వస్తుంది. అడ్డగోలుగా క్లెయిమ్ తిరస్కరించిన కంపెనీపై కోర్టులో న్యాయపోరాటం చేసి కంపెనీ మెడలు వంచి పరిహారం తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలుసుగా. 

representational image

దంపతులు ఇద్దరికీ ఒకటే పాలసీ

కొద్దిగా ప్రీమియం అదనంగా భరించగలిగితే ఒకే టర్మ్ పాలసీలో భార్యా భర్తలు ఇద్దిరికీ బీమా రక్షణనిచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పీఎన్ బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ మేరా టర్మ్ ప్లాన్ పేరుతో ఓ పాలసీని అందిస్తోంది. ఇందులో భార్యా, భర్తలు ఇద్దరికీ బీమా రక్షణ ఉంటుంది. ఉదాహరణకు వంశీ (30) 30 ఏళ్లకు 50 లక్షలకు పాలసీ తీసుకుంటే, అతడి జీవిత భాగస్వామి పేరిట 25 లక్షల రూపాయల బీమాను కూడా పొందవచ్చు. ప్రీమియం సుమారు వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటుంది. కేవలం వెయ్యి రూపాయలకే 25 లక్షల రూపాయల బీమా పొందవచ్చు. ఒకవేళ భర్త మరణిస్తే అతడి పేరు మీద ఉన్న 50 లక్షల రూపాయల పరిహారాన్ని కంపెనీ అతడి జీవిత భాగస్వామికి చెల్లిస్తుంది. ఆ తర్వాత ఆమె పేరిట ఉన్న 25 లక్షల బీమా కొనసాగుతుంది. పైగా దీనికి ఏటా ప్రీమియం చెల్లించే అవసరం ఉండదు. ఈ పాలసీ వివరాలకు https://www.pnbmetlife.com/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఇలాంటి పాలసీలను మరికొన్ని కంపెనీలు కూడా అందిస్తున్నాయి. 

పెరుగుతూ… తరుగుతూ..

బీమా మొత్తం పెరుగుతూ వెళ్లే పాలసీలు, తగ్గుతూ వెళ్లే పాలసీలు కూడా ఉన్నాయి. ఎస్ బీఐ, బిర్లా సన్ లైఫ్ తదితర కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. అంటే సమ్ అష్యూరెన్స్ నిర్ణీత కాలానికి పెరుగుతూ వెళుతుంది. ఉదాహరణకు 25 ఏళ్ల అవివాహితుడైన వ్యక్తి 25 లక్షల రూపాయలకు టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకుందాం. 28 ఏళ్లకు అతడి పెళ్లయింది. అప్పుడు అతడిపై ఆధారపడిన ఓ మనిషంటూ వచ్చేసింది కదా. ఆ తర్వాత సంతానం. ఆ తర్వాత వారి విద్యా ఖర్చులు, వారు పెద్దయిన తర్వాత వివాహాలు. తల్లిదండ్రుల సంరక్షణ ఇలా కాలానుగుణంగా వ్యక్తి బాధ్యతలు పెరుగుతూ పోతాయి. బాధ్యతలు పెరుగుతున్నట్టుగా బీమా పరిహారం కూడా ఏడాదికి పది శాతం లేదా ప్రతి ఐదేళ్లకు ఇంత శాతమంటూ పెరుగుతూ పోయే పాలసీలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. 

ఇదే తరహాలో ప్రీమియం తగ్గుతూ పోయేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఓ వ్యక్తి 50 లక్షల రూపాయలకు ఇంటి రుణం తీసుకున్నాడని అనుకుందాం. ఒకవేళ సదరు వ్యక్తికి జరగరానిది ఏమైనా జరిగితే ఆ రుణాన్ని టర్మ్ ప్లాన్ పరిహారం రూపంలో బీమా కంపెనీ చెల్లిస్తుంది. రుణం తీసుకున్న వ్యక్తి నెలనెలా వాయిదాలు చెల్లిస్తూ వెళితే పదేళ్ల కాలంలో రుణం తీరిపోతుంది. అంటే సుమారు ఏటేటా ఆ రుణం 5 లక్షల మేర తగ్గుతూ వెళుతుంది (తొలి నాళ్లలో ఎక్కువ వడ్డీకే వెళుతూ  ఉంటుంది). అలా రుణం తగ్గుదలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ మొత్తం కూడా తగ్గుతూ వెళుతుంది. 

నిజానికి ఈ తరహా వాటివల్ల ఉపయోగం ఉందా? అనే దానికి భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఓ వ్యక్తి 28 ఏళ్ల వయసులో 50 లక్షల రూపాయలకు టర్మ్ పాలసీ తీసుకున్నాడు. 30 ఏళ్లకు అతడికి పెళ్లయింది. మరో మూడేళ్లలోపు ఒక పాప, బాబు వచ్చారు. ఒకవైపు బాధ్యతలు పెరుగుతూ వెళ్లాయి. మరోవైపు ద్రవ్యోల్బణం ఫలితంగా అతడు తీసుకున్న 50 లక్షల రూపాయల పాలసీ విలువ తగ్గుతూ వెళుతోంది. ఇలాంటి సమయాల్లో బీమా మొత్తం పెరుగుతూ వెళ్లే వాటి వల్ల ఫలితం ఉంటుందని కొందరి సూచన. కానీ, ఇలాంటి పాలసీల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుందని అంత ప్రీమియం కట్టే బదులు కోటి రూపాయలకు ముందే పాలసీ తీసుకోవడం నయమని మరికొందరి సూచన. లేదంటే తర్వాత విడిగా మరికొంత మొత్తాన్ని వేరే కంపెనీ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అందుకే సరైన విధంగా ఆలోచించి, ఆర్థిక నిపుణుడిని సంప్రదించి అడుగు వేయాలి. 

సింగిల్ ప్రీమియం పాలసీలు

సింగిల్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల వల్ల ప్రయోజనం ఉన్నదీ లేనిదీ  మీరే తెలుసుకోండి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల కాల వ్యవధికి 50 లక్షల రూపాయల టర్మ్ పాలసీ తీసుకున్నాడనుకుందాం. అప్పుడు అతడు ఏటా సుమారు ఓ 10 వేల రూపాయల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అంటే 30 ఏళ్ల కాలంలో 3 లక్షల రూపాయల మేర అతడు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో రూపాయి కూడా వెనక్కి రాదని తెలుసు కదా.  అలా కాకుండా అతడు సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకుంటే... ఒకేసారి ప్రీమియాన్ని ముందుగా చెల్లించాలి.50 లక్షల రూపాయల టర్మ్ ప్లాన్ కు 30 ఏళ్ల కాలానికి సింగిల్ ప్రీమియం సుమారుగా 1.70 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇవి అవగాహన కోసం ఇస్తున్న అంచనాలు మాత్రమే. ఒకేసారి అంత ప్రీమియం కట్టడం భారమే కదా. ఇలా కాకుండా ఏడాదికోసారి లేదా మూడు నెలలకోసారి కట్టడం వల్ల ప్రీమియం భారం అనిపించదు. 1.70 లక్షలను డిపాజిట్ చేస్తే ఏడాదికి 12వేల రూపాయల వరకు వడ్డీ వస్తుంది. అందులోంచి 10వేలు తీసి ప్రీమియం సులభంగా కట్టేయవచ్చు. పైగా 2వేలు ఆదా. కాల వ్యవధి తీరిన తర్వాత 1.70లక్షలు చేతికందుతాయి. దీన్నిబట్టి ఏది లాభమో ఆలోచించుకోండి. 

రైడర్లు 

వీటికి యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్ మెంబర్ మెంట్, క్రిటికల్ ఇల్ నెస్ వంటి రైడర్లను జోడించుకోవచ్చు. ప్రమాదంలో మరణిస్తే అసలు బీమాతోపాటు ప్రత్యేకంగా పరిహారం చెల్లిస్తారు. అంగవైక్యలం రైడర్ జోడించుకుంటే ప్రమాదంలో కాళ్లు, చేతులు, కళ్లల్లో ఏవైనా కోల్పోయిన సందర్భాల్లో పరిహారం చెల్లిస్తారు. ప్రీమియం వైవర్ రైడర్ తీసుకుని ఉంటే అంగవైకల్యానికి గురైన సందర్భాల్లో మిగిలిన పాలసీ వ్యవధికి ఏటా ప్రీమియం చెల్లించే పని ఉండదు.  

ఎంపిక ముందు కంపెనీల వైపు ఏమి చూడాలి?

పాలసీ తీసుకునే ముందు చాలా అంశాలు చూడాల్సి ఉంటుంది. కంపెనీ క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో. అంటే పరిహారం కోసం వస్తున్న దరఖాస్తుల్లో ఎన్నింటికి పరిహారం చెల్లిస్తున్నారు. ఎన్నింటిని తిరస్కరిస్తున్నారు. ఈ రేషియోను ఐఆర్ డీఏ ఏటా విడుదల చేస్తుంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరపు క్లెయిమ్స్ జాబితాను https://www.relakhs.com/irda-claim-settlement-ratio-2015-16/ ఈ లింక్ లో చూడవచ్చు. 

క్లెయిమ్ పరిష్కారానికి తీసుకుంటున్న వ్యవధి అంటే... ఓ పాలసీదారుడు మరణిస్తే కంపెనీ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో పరిహారం చెల్లిస్తుందన్నదీ చాలా కీలకమైన అంశం. జాప్యం చేస్తూ ఎప్పటికోగానీ పరిహారం ఇచ్చే కంపెనీల వైఖరి బాధితుల మనసులను క్షోభకు గురిచేస్తుంది. కనుక తక్కువ సమయం తీసుకునే కంపెనీల పాలసీల వైపే మొగ్గు చూపడం మంచిదని ఆర్థిక నిపుణుల సూచన. 

కంపెనీ ఆర్థిక సామర్థ్యం బలంగా ఉంటే పరిహారం చెల్లింపుల విషయంలో భరోసా ఉంటుందని భావించవచ్చు. 

పాలసీలో ఉన్న సౌలభ్యాలు, పరిమితులు, మినహాయింపులు, రైడర్ల సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రీమియం ధరలు, వినియోగదారుల సేవా తీరు ఎలా ఉన్నదీ గమనించాలి. ఉదాహరణకు కోటి రూపాయల పాలసీని 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఎక్స్ అనే కంపెనీ 5,500 రూపాయలకే ఇస్తుంటే… మరో కంపెనీ 10వేలు చార్జ్ చేస్తోంది. అందుకే క్లెయిమ్ సెటిల్ మెంట్ చరిత్ర మంచిగా ఉన్న టాప్ కంపెనీల్లో ఏది తక్కువ ప్రీమియానికి పాలసీ ఇస్తుందో చెక్ చేసుకోవాలి. https://www.bankbazaar.com/, 

 http://termlife.policybazaar.com/ ఈ వెబ్ సైట్లు అందుకు ఉపకరిస్తాయి. 

మినహాయింపులు...

మినహాయింపుల విషయానికొస్తే.. ఏడాదిలోపు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వరు. కొన్ని కంపెనీలు కేవలం ప్రీమియం వెనక్కిస్తాయి. అలాగే ప్రమాదకరమైన పనుల్లో పాల్గొని మరణించినా పరిహారం ఇవ్వమంటూ మినహాయింపులను కంపెనీలు విధిస్తుంటాయి. ఉదాహరణకు బైక్ రేసింగ్ వంటి క్రీడలు. ఇలాంటి మినహాయింపుల గురించి ముందే తెలుసుకోవాలి. ఫ్రీ లుక్ పీరియడ్ అంటూ ఒకటి ఉంటుంది. కొన్ని 15 రోజులు, కొన్ని 30 రోజుల వరకు గడువిస్తున్నాయి. పాలసీ తీసుకున్న తర్వాత నిబంధనలు నచ్చకపోతే ఆ గడువులోపు పాలసీ వద్దంటూ తిరస్కరించవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకరు వారి ఆర్థిక శక్తికి అనుగుణంగా ఎన్ని పాలసీలను అయినా తీసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద 13వేల రూపాయల ప్రీమియం వరకు పన్ను వర్తించే ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. 

ఎండోమెంట్ ప్లాన్స్ 

బీమా+పొదుపు ఈ రెండు కలిపితే ఎండోమెంట్ పాలసీ. పాలసీ కొనసాగుతున్న సమయంలో బీమా రక్షణ ఇవ్వడంతోపాటు గడువు తీరే వరకు ఉంటే ప్రతిఫలాన్ని అందించడం వీటిలోని విశేషం. ఈ తరహా సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల్లో రిస్క్ ఉండదు. ఏడాదికోసారి పాలసీపై కంపెనీలు బోనస్ ప్రకటిస్తుంటాయి. అంటే లక్ష రూపాయలకు సమారు 5వేల రూపాయల ప్రీమియం కడితే... ఖర్చులు ఓ వెయ్యి రూపాయలు అయ్యయానుకుంటే.. మిగిలిన 4వేల రూపాయలను కంపెనీలు బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల వంటి వాటిలో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాన్ని బోనస్ రూపంలో ప్రకటిస్తుంటాయి. ఓ లక్ష రూపాయలకు పాలసీ తీసుకుంటే... పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారుడు మరణించినట్టయితే లక్ష రూపాయల బీమాతోపాటు అప్పటి వరకు కంపెనీ ప్రకటించిన బోనస్ లు చెల్లిస్తారు. గడువు తీరిపోయే వరకు జీవించి ఉంటే అప్పుడు లక్ష రూపాయల బీమా, బోనస్ లు, గ్యారంటీడ్ అడిషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ చెల్లిస్తారు. ఎండోమెంట్ పాలసీల్లో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే ప్రతిఫలం 5 నుంచి 6 శాతం మధ్య ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. పాలసీని సరెండర్ చేయాలనుకుంటే (వద్దని చెప్పి కంపెనీకి వెనక్కి ఇచ్చేయడం) పాలసీ విలువలో కొంత నష్టపోవాల్సి ఉంటుంది. అయితే, ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే పరిహారం కానీ, ప్రతిఫలంపై కానీ ఎలాంటి పన్ను ఉండదు. 

యూనిట్ ఆధారిత ఎండోమెంట్ ప్లాన్స్

వీటిలో రిస్క్ ఉంటుంది. అంటే పైన చెప్పుకున్నట్టుగా లక్ష రూపాయల బీమా పాలసీకి సమారు 5వేల రూపాయల ప్రీమియం కడితే... ఖర్చులు ఓ వెయ్యి రూపాయలు అయ్యయానుకుంటే.. మిగిలిన 4వేల రూపాయలను కంపెనీలు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ లో పెట్టుబడి పెడతాయి. అది కూడా యూనిట్ల రూపంలో. అంటే ఒక యూనిట్ ప్రీమియం చెల్లించేనాటికి 10 రూపాయలు ఉంటే వారి ఖాతాలో 400 యూనిట్లు జమ అవుతాయి. ప్రతిఫలం అన్నది మార్కెట్ ఆటుపోట్లపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతిఫలానికి గ్యారంటీ ఉండదు. పాలసీదారుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అప్పటి వరకు ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ విలువ లేదా బీమా మొత్తం ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. పాలసీ గడువు తీరే వరకు జీవించి ఉంటే మొత్తం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ విలువను లెక్కగట్టి ఎంతుంటే అంతే చెల్లిస్తారు. బోనస్ లు గట్రా అలాంటివేమీ రావు. వీటిలో సాధారణంగా 7 నుంచి 8 శాతం, పనితీరు దారుణంగా ఉంటే 4 శాతం ప్రతిఫలం ఉంటుందని ఆశించవచ్చు. కాకపోతే వీటిలో మోర్టాలిటీ చార్జీలతోపాటు ఫండ్ నిర్వహణ చార్జీలు, ప్రీమియం అలోకేషన్ చార్జీలంటూ బాదుడు ఎక్కువగా ఉంటుంది. అయినా దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కారణంగా కొంచెం ఎక్కువ ప్రతిఫలం అందుతుందని ఆశించవచ్చు. 

కట్టే ప్రీమియం వృథా పోకూడదు అనుకునేవారికి ఎండోమెంట్ పాలసీలు తగినవి. టర్మ్ పాలసీల్లో గడువు ముగిసే వరకు పాలసీ దారుడు జీవించి ఉంటే ప్రీమియం వెనక్కి ఇవ్వరు. కానీ కొందరు అలా అప్పనంగా ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు పోవడాన్ని ఒప్పుకోరు. అలాంటి వారికి ఎండోమెంట్ ప్లాన్సే తగినవి. అలాగే దీర్ఘకాలంలో సంప్రదాయ విధానంలో బీమా రక్షణతోపాటు కొంత నిధి సమకూర్చుకోవాలనుకునేవారికి ఇవి ప్రయోజనకరం. 

వీటిలోనూ సింగిల్ ప్రీమియం పాలసీలు ఉంటాయి. ఉదాహరణకు 50వేల రూపాయల ప్రీమియాన్ని ముందే చెల్లిస్తే దానికి పది రెట్లు అంటే  5 లక్షల రూపాయల బీమాను నిర్ణీత కాలానికి (5,10,15,20 ఏళ్లు) ఇవ్వడంతోపాటు గడువు తీరిన తర్వాత కచ్చితంగా ఇంత మొత్తం అంటూ చెల్లిస్తాయి. గడువులోపు మరణించిన సందర్భాల్లో 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు. ఏక మొత్తంగా ఏ రూపంలో అయినా నగదు చేతికి అంది, ఎలాంటి అవసరాలు లేకుంటే, ఏటా ప్రీమియం చెల్లించే తలనొప్పి వద్దనుకునేవారు సింగిల్ ప్రీమియం పాలసీలు పరిశీలించవచ్చు. 

ప్రీమియం ఎక్కువ

సాధారణంగా ఎండోమెంట్ పాలసీలలో గడువులోపు రక్షణతోపాటు గడువు తర్వాత ప్రతిఫలాన్ని అందించాలి. కనుక ప్రీమియాన్ని కంపెనీలు ఎక్కువ వసూలు చేస్తుంటాయి. క్లుప్తంగా ప్రీమియం రూపంలో రాబట్టుకున్న ఆదాయాన్ని పెట్టుబడి పెట్టి అందులో ఖర్చులు పోగా వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని మనకివ్వడమే కంపెనీలు చేసే పని. దీనికి బదులు తక్కువ ప్రీమియానికి టర్మ్ పాలసీ తీసుకుని... మిగిలే మొత్తాన్ని నెలనెలా పెట్టుబడులకు మళ్లించడం ద్వారా అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చన్నది నిపుణులు చెప్పే మాట. ఎండోమెంట్ పాలసీల్లో పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించి జీవిత కాలం వరకు అంటే 75 లేదా అంతకంటే ఎక్కువ కాలానికి బీమా రక్షణ పొందే పాలసీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి పదేళ్ల పాటు ప్రీమియం కట్టి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు బీమా రక్షణ పొందవచ్చు. మరో తరహా పాలసీల్లో 60 ఏళ్ల వరకూ జీవించి ఉంటే ప్రతిఫలాన్ని పొందడమే కాకుండా మిగిలిన జీవిత కాలం వరకు బీమా రక్షణ కొనసాగించే పాలసీలు కూడా ఉన్నాయి. 

మనీ బ్యాక్ పాలసీలు

ఎండోమెంట్ పాలసీల్లోనే మనీబ్యాక్ పాలసీలు కూడా ఉన్నాయి. మామూలు ఎండోమెంట్ పాలసీకి మనీ బ్యాక్ పాలసీకి మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. బీమా రక్షణ, బోనస్ లతో పాటు పాలసీ వ్యవధి మధ్యలో కొంత మొత్తం ప్రతిఫలాన్ని ఇస్తూ వెళతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి 50వేల రూపాయల పాలసీ తీసుకున్నాడనుకుందాం. ప్రతి ఐదేళ్లకోసారి పది వేల రూపాయలు చొప్పున వెనక్కి వస్తాయి. లేదా ప్రతి ఐదేళ్లకోసారి 5వేల చొప్పున వెనక్కి ఇస్తూ గడువు తీరిన తర్వాత మిగిలిన రాబడి ఎంతుంటే అంత మొత్తాన్ని ఏకమొత్తంలో కంపెనీలు చెల్లిస్తాయి. 20 ఏళ్ల వ్యక్తి 31 ఏళ్ల వయసులో మరణించిన సందర్భాల్లో ఈ పదకొండేళ్ల కాలంలో రెండు సార్లు నగదు వెనక్కి వచ్చి ఉంటుంది. మరణం సమయంలో బీమా మొత్తం 50వేలతోపాటు అదనంగా బోనస్ ల వంటి ప్రతిఫలం ఉంటే చెల్లించేస్తాయి. బీమా రక్షణతోపాటు మధ్య మధ్యలో అవసరాలకు నగదు కోరుకునేవారికి ఇవి సరిపోతాయి. పిల్లల విద్యావసరాలు ఇతరత్రా ఖర్చులన్నమాట. అయితే సాధారణ ఎండోమెంట్ పాలసీల కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటుంది. వీటిలోనూ రైడర్లు జోడించుకునే సదుపాయం ఉంది. హెడ్ డీఎఫ్ సీ లైఫ్ కంపెనీ అయితే మనీ బ్యాక్ పాలసీలకు క్రిటికల్ ఇల్ నెస్ రైడర్, అడిషినల్ టర్మ్ బెనిఫిట్, యాక్సిడెంటల్ బెనిఫిట్, ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్లను అందిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మనీ బ్యాక్ పాలసీల్లో ప్రతిఫలం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కంటే తక్కువగా ఉంటుంది. 

హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు

పేరులో ఉన్నట్టుగానే జీవించి ఉన్నంత కాలం ఓ వ్యక్తికి బీమా రక్షణనిచ్చేవే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు. 100 ఏళ్ల నుంచి 120 ఏళ్ల వరకు ఇవి రక్షణ కల్పిస్తాయి. ఆ లోపు పాలసీదారుడు ఎప్పుడు మరణిస్తే అప్పుడు బీమా మొత్తాన్ని నామినీలకు చెల్లిస్తారు. పాలసీ కొనసాగినంత కాలం ప్రీమియం చెల్లించేందుకు లేదా పరిమిత కాలం అంటే ఓ పదేళ్లు, పదిహేనేళ్లు లేదా 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే ఆ తర్వాత జీవితాంతం బీమా రక్షణనిచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించే పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఈ పాలసీల్లో ప్రయోజనం మరణించిన సందర్భాల్లో వారిపై ఆధారపడిన వారికి పరిహారం అందించడమే. 

రిటైర్మెంట్ లేదా పెన్షన్ ఆధారిత బీమా పాలసీలు

వీటిలోనూ ఎండోమెంట్, యూనిట్ లింక్డ్ పాలసీలు ఉన్నాయి. పైన చెప్పుకున్న విధంగానే ఇవి కూడా పనిచేస్తాయి. రిటైర్మెంట్ పాలసీల్లో సాధారణంగా రెండు దశలు ఉంటాయి. పాలసీ గడువు వరకు ప్రీమియం చెల్లిస్తూ నిధిని సమకూర్చుకోవడం. రెండో దశ గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తాన్ని ఐఆర్డీఏ నిర్దేశించిన యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం. దానిపై నెల నెలా వడ్డీ పెన్షన్ రూపంలో వస్తుంది. పాలసీ గడువు తీరిన తర్వాత సమకూరిన నిధి నుంచి 30 నుంచి 40 శాతం వరకే వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కచ్చితంగా ఏదేనీ పెన్షన్ యాన్యుటీ ఫథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల కంటే యూనిట్ ఆధారిత పాలసీల్లో ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. 

Read : బీమా కంపెనీలతో సమస్యలా... అంబుడ్స్ మెన్ తలుపు తట్టండి.


More Articles