పాస్ పోర్ట్ ను సులభంగా పొందడం ఎలా?
విదేశాల్లో విద్యకు, ఉద్యోగాలకు, విదేశీ యాత్రలకు... భారత సరిహద్దు దాటాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇండియన్ పాస్ పోర్ట్ ఉండాల్సిందే. పాస్ పోర్ట్ దరఖాస్తుకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? సులభంగా ఎలా పొందవచ్చు? ఆన్ లైన్ లో దరఖాస్తు విధానం ఎలా? ఇత్యాది విషయాలు తెలిసిన వారు తక్కువ మందే. ఆ సమాచారం తెలుసుకుందాం.
విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడితేనే పాస్ పోర్ట్ తీసుకోవాలనేమీ లేదు. భారతీయులు ఎవరైనా పాస్ పోర్ట్ తీసుకోవడం వారి హక్కు. ఈ హక్కును సొంతం చేసుకోవడంలో భాగంగా ఆన్ లైన్ లో దరఖాస్తు విధానం గురించి చూద్దాం. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే పాస్ పోర్ట్ ఇంటికే వస్తుందనుకోవద్దు. ఆన్ లైన్ లో దరఖాస్తు నింపి సమర్పించినప్పటికీ అన్ని పత్రాలతో నిర్ణీత తేదీన పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
* ముందుగా http://www.passportindia.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఎడమచేతి వైపు న్యూ యూజర్? రిజిస్టర్ నౌ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన వివరాలు ఇవ్వాలి. సైట్ లో యూజర్ గా నమోదు ప్రక్రియ ఇది. పాస్ పోర్ట్ ఆఫీస్ కాలమ్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ విశాఖపట్నం కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్కడుంటే అక్కడ లేదా ఏ పాస్ పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వచ్చే వారు దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు అన్నీ ఇచ్చిన తర్వాత చివరిలో రిజిస్టర్ బటన్ ఓకే చేయాలి.
* తర్వాత పైన ఇచ్చిన పాస్ పోర్ట్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఎడమచేతివైపు భాగంలో ఎగ్జిస్టింగ్ యూజర్? లాగిన్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఈ మెయిల్ పాస్ వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ అవ్వాలి.
* అప్లయ్ ఫర్ ఫ్రెష్ పాస్ పోర్ట్ / రీ ఇష్యూ ఆఫ్ పాస్ పోర్ట్ బటన్ క్లిక్ చేయాలి. అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. డౌన్ లోడ్ ద ఫామ్ లేదా ఫిల్ ఆన్ లైన్ ఈ రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకుని నింపి తిరిగి అప్ లోడ్ చేయడం కంటే ఆన్ లైన్ లోనే పూర్తి చేయడం సులభం కదా.
* ఆన్ లైన్ ఫిల్లింగ్ ఆప్షన్ ఓకే చేసుకుంటే తర్వాత పేజీలో ఫ్రెష్ పాస్ పోర్ట్ లేదా రీ ఇష్యూ ఆఫ్ పాస్ పోర్ట్, నార్మల్ లేదా తత్కాల్, 36 పేజీలు లేదా 60 పేజీలు అని ఉంటాయి. వీటిలో ప్రతీ విభాగంలోనూ ఒకటి టిక్ చేసుకోవాలి. మైనర్లా కాదా అని కింద ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒకటి సెలక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ బటన్ ఓకే చేయాలి.
* తర్వాత పేజీలో వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ తప్పులు లేకుండా జాగ్రత్తగా ధ్రువ పత్రాల్లోని వివరాలతో సరిపోలేలా ఇవ్వాలి. ఈ దశలో ఏవైనా సందేహాలు ఉంటే https://portal1.passportindia.gov.in/ ఈ లింక్ లోకి వెళ్లి దరఖాస్తు సూచనలను తెలుసుకోవచ్చు. తర్వాత అదే పేజీలోని కింది భాగంలో సబ్ మిట్ అప్లికేషన్ ను ఓకే చేయాలి.
* తర్వాత వ్యూ సేవ్డ్/ సబ్ మిట్ అప్లికేషన్ ఆప్షన్ ను ఓకే చేస్తే అందులో పే అండ్ షెడ్యూల్ అపాయింట్ మెంట్ ఓకే చేసుకోవాలి. ఆన్ లైన్ పేమెంట్ ను సెలక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఓకే చేయాలి.
* తర్వాత పాస్ పోర్ట్ సేవా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. దగ్గర్లోని కేంద్రాలు, డేట్, టైమ్ కనిపిస్తాయి. ఒకదాన్ని ఎంపిక చేసుకుని ఓకే చేయాలి. నెక్స్ట్ బటన్ ఓకే చేసిన తర్వాత పే అండ్ బుక్ అపాయింట్ మెంట్ ఓకే చేసుకోవాలి.
* అప్పుడు పేమెంట్ గేట్ వే పేజీకి వెళుతుంది. అక్కడ నగదు చెల్లింపు పూర్తి చేయడం అయ్యాక తిరిగి పాస్ పోర్ట్ వెబ్ సైట్ పేజీకి వెళతారు. మాస్టర్ కార్డ్, వీసా పేరుతో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదు చెల్లించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకుల ద్వారానే చెల్లించాలి.
* ప్రింట్ అప్లికేషన్ రిసీప్ట్ ను క్లిక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ పూర్తిగా కనిపిస్తుంది. ప్రింట్ అప్లికేషన్ రిసీప్ట్ ను మరోసారి క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత పేజీలో అదే అప్షన్ మరోసారి కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసుకుంటే ప్రింట్ వస్తుంది. దీనిలోనే అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్/అపాయింట్ మెంట్ నంబర్ ఉంటాయి. దాని ప్రకారం నిర్ణీత తేదీ, సమయం రోజున సదరు పాస్ పోర్టు కేంద్రానికి అన్ని ధ్రువపత్రాలతో వెళ్లాలి. అక్కడ కొంత సమయం పడుతుంది. పోలీసుల తనిఖీ పూర్తయ్యాక పాస్ పోర్ట్ జారీ అవుతుంది.
* దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం కోసం https://portal1.passportindia.gov.in ఈ లింక్ లోకి వెళ్లి అప్లికేషన్ టైప్, ఫైల్ నంబర్, పుట్టినతేదీ వివరాలు ఇచ్చి ట్రాక్ స్టాటస్ ఓకే చేస్తే తాజా సమాచారం తెలుస్తుంది.
కావాల్సిన పత్రాలు
* నివాస ధ్రువీకరణకు... రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, నీటి బిల్లు, టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లులు, బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్, ఆదాయపన్ను శాఖ రిటర్నుల పత్రాలు (గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నకళ్లు), ప్రముఖ కంపెనీల లెటర్ హెడ్ తో ఉన్న అపాయింట్ మెంట్ ఆర్డర్లు, తహశీల్దారు లేదా గ్రామ పంచాయతీ/ సర్పంచ్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటవుతాయి.
* పుట్టిన తేదీ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్ చదువుకోని వారయితే మేజిస్ట్రేట్, తహశీల్దార్ లేదా సర్పంచ్ అటెస్ట్ చేసిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. 35ఇంటూ35 సైజులో ఉన్న ఏడు ఫొటోలు. బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ ఇవ్వవచ్చు. యూనిఫామ్, రంగుల కళ్లద్దాలతో దిగినవి చెల్లవు.
* దరఖాస్తు సమర్పించే సమయంలో అన్ని ధ్రువీకరణ పత్రాలను పాస్ పోర్ట్ కార్యాలయం సిబ్బంది ఒరిజినల్స్ తో పోల్చి చూస్తారు. కనుక పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లేప్పుడు అన్ని ఒరిజినల్ పత్రాలతోపాటు ఓ సెట్ జిరాక్స్ కాపీలను స్వయంగా అటెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మైనర్ల తరఫున పెద్దలు దరఖాస్తు చేస్తున్నట్టయితే వారి చిరునామా ధ్రువీకరణలు అందించాలి.
* ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన తర్వాత 90 రోజుల్లోపు పాస్ పోర్ట్ కేంద్రానికి వెళ్లకపోతే మళ్లీ అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది.
* అప్లికేషన్ ఫీజు కింద 1500 రూపాయలు చెల్లించాలి. తత్కాల్ ఇతర ఫీజుల వివరాలను http://passportindia.gov.in/ లింక్ నుంచి పొందవచ్చు.
పోస్టాఫీసులోనూ...
* పాస్ పోర్ట్ కోసం పోస్టాఫీసుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్ట్ దరఖాస్తు సేవలు అందుబాటులో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారాల్లో వివరాలు నింపి సమర్పిస్తే పోస్టల్ సిబ్బందే ఆ వివరాలను పాస్ పోర్ట్ విభాగం వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. ఇంటర్వ్యూకు అపాయింట్ మెంట్ తేదీ, సమయం వివరాలను అందజేస్తారు. ఆ తర్వాత చెప్పిన తేదీ, సమయానికి ధ్రువపత్రాలతో పాస్ పోర్ట్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోస్టాఫీసు సేవలకు గాను కొద్ది మొత్తం ఫీజుగా చెల్లించాలి.
* షెడ్యూల్ తేదీ, సమయానికి పాస్ పోర్ట్ కేంద్రానికి వెళ్లడం వీలు కాకపోతే పాస్ పోర్ట్ వెబ్ సైట్ ద్వారా దాన్ని మరో తేదీ, సమయానికి మార్చుకోవచ్చు. దరఖాస్తు చేసిన ఏడాదిలోపు రెండు సార్లు మాత్రమే ఇలా అనుమతిస్తారు.
* పాస్ పోర్ట్ కు జిల్లా పాస్ పోర్ట్ సెల్, పాస్ పోర్ట్ కలెక్షన్ కేంద్రాలు, ఎంపిక చేయబడిన పోస్టాఫీసులు, పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* సీనియర్ సిటిజన్లు, మైనర్లు, అంగవైకల్యం కలవారు ఆన్ లైన్ లో పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని అపాయింట్ మెంట్ లేకుండా నేరుగా పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి నిర్ణీత ఏఆర్ఎన్ తోపాటు అన్ని ధ్రువపత్రాలను సమర్పించవచ్చు.
* పాస్ పోర్ట్ పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలను సమర్పించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా 5వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
* పాస్ పోర్ట్ సంబంధిత సమాచారం, ఇతరత్రా సాయం కోసం 17 భారతీయ భాషల్లో నేషనల్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంది. 1800 258 1800 కాల్ సెంటర్ నంబర్ కు వారంలో ఏ రోజైనా ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.
* పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో దరఖాస్తు, ఇతర పత్రాలను సమర్పించిన సమయంలో దాని స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఎస్ఎంఎస్ సేవకు నమోదు చేసుకోవచ్చు. 40 రూపాయలు చెల్లిస్తే దరఖాస్తుదారుడి మొబైల్ కు స్టేటస్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే తప్పనిసరి కాదు. ఇది కాకుండా STATUS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఫైల్ నంబర్ టైప్ చేసి 9704100100 నంబర్ కు ఎస్ఎంఎస్ పంపినా స్టేటస్ సమాచారం వస్తుంది.
* పాస్ పోర్ట్ కు సంబంధించిన సమాచారంతో mPassport Seva అనే యాప్ ను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని యాపిల్, ఆండ్రాయిడ్, విండోస్, బ్లాక్ బెర్రీ ఫోన్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
* పాస్ పోర్ట్ అప్లికేషన్లను పాస్ పోర్ట్ కార్యాలయాల్లో స్వీకరించరు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లోనే స్వీకరిస్తారు.
* పాస్ పోర్ట్ లోని వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకునే వారు రీ ఇష్యూ పాస్ పోర్ట్ అని దరఖాస్తు చేసుకోవాలి. పాస్ పోర్ట్ ప్రక్రియ వలే రీ ఇష్యూ పాస్ పోర్ట్ దరఖాస్తు విధానం ఉంటుంది. ఏవైతే మార్పులు కోరుకుంటున్నారో వాటికి సంబంధించిన రుజువులను సమర్పించాల్సి ఉంటుంది.
3 రోజుల్లోనే తత్కాల్ పాస్ పోర్ట్
నూతన నిబంధనల మేరకు అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారు మూడు రోజుల్లోనే పాస్ పోర్ట్ పొందవచ్చు. పోలీసుల తనిఖీ నివేదిక వచ్చే వరకు ఆగకుండా దరఖాస్తు చేసిన వెంటనే జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. మూడో రోజు పాస్ పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది.
* తత్కాల్ కోసం ఆన్ లైన్ దరఖాస్తు విధానం పైన చెప్పుకున్న విధంగానే ఉంటుంది. పాస్ పోర్ట్ అధికారిక వెబ్ సైట్ లో యూజర్ గా నమోదై అనంతరం లాగిన్ అవ్వాలి.
* అప్లయ్ ఫర్ ఫ్రెష్ ను సెలక్ట్ చేసుకున్న తర్వాత తత్కాల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తును పూర్తి చేసి సబ్ మిట్ చేసి పేమెంట్ చేయాలి. అనంతరం ప్రింట్ తీసుకుని అపాయింట్ మెంట్ టైమ్ ను బుక్ చేసుకుని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది.
కావాల్సిన పత్రాలు
అనెక్స్యూర్ ఎఫ్ ప్రకారం వెరిఫికేషన్ సర్టిఫికెట్
లేదా
ఓటర్ ఐడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఉద్యోగ ఐడీ కార్డు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ సర్టిఫికెట్, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు, ఆయుధాల లైసెన్స్, ఆస్తుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, రైల్వే ఫొటో ఐడీ కార్డు, ఆదాయపన్ను శాఖ పాన్ కార్డు, బ్యాంకు/పోస్టాఫీసు/కిసాన్ పాస్ బుక్, గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి విద్యార్థి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పుట్టిన తేదీ ధ్రువీకరణ, గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో మూడింటిని సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి ఫొటో ఐడీ ఉండాలి.
అలాగే అనెక్స్యూర్ 1 ప్రకారం స్టాంపు పేపర్ పై నోటరీ అఫిడవిట్ ను సమర్పించాలి. ఆన్ లైన్ అప్లికేషన్ ప్రింటవువట్, పేమెంట్ రిసీప్ట్, కలర్ ఫొటో (బ్యాంకు గ్రౌండ్ లైట్ కలర్ లేక వైట్ ఉండి ఉండాలి) ను కూడా తీసుకెళ్లాలి. అత్యవసరంగా పాస్ పోర్ట్ ఎందుకు అవసరమో తెలియజేసే పత్రాలు సమర్పించాల్సిన నిబంధన ఏదీ లేదు. కానీ అత్యవసరమన్న విషయం పాస్ పోర్ట్ అధికారికి అర్థమయ్యేందుకు వీలుగా ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకెళ్లడం మంచిది. అన్ని ఒరిజినల్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు (స్వయంగా సంతకం చేసినవి) తీసుకెళ్లాలి.