బీమా కంపెనీలతో సమస్యలా... అంబుడ్స్ మెన్ తలుపు తట్టండి!
బీమా పాలసీ తీసుకోక ముందు వెంటపడి కట్టించుకున్న కంపెనీ ప్రతినిధులు… పోనీలే ఆపత్కాలంలో రక్షణగా ఉంటుందనుకుంటే… క్లెయిమ్ సమయంలో ఎన్నో కిరికిరీలు... పరిహారానికి జాప్యం కూడా చేయవచ్చు. పాలసీ పత్రంలో తప్పులు దొర్లితే మార్చాలని కోరితే రోజులు గడిచినా స్పందించకపోవచ్చు. సమస్య ఏదైనా బీమా కంపెనీల మెడలు వంచాలంటే ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ తలుపు తట్టడమే నయం.
బీమాదారుడు, బీమా కంపెనీల మధ్య విశ్వాసాన్ని నెలకొల్పేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 1998లో ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారంతోపాటు పాలసీదారుల హక్కుల పరిరక్షణ అంబుడ్స్ మెన్ బాధ్యత.
30 రోజులు దాటితే...
పాలసీ పత్రం పోయినా...? పాలసీదారుడు మరణించినా పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్నా...? సమస్య ఏదైనా గానీ, ముందు సదరు కంపెనీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి. ఫాక్స్ లేదా ఈ మెయిల్ చేసినా చాలు. 30 రోజుల్లోగా దానిపై కంపెనీ స్పందించాల్సి ఉంటుంది. ఎటువంటి స్పందన లేకపోయినా, లేక కంపెనీ స్పందన సంతృప్తికరంగా అనిపించకపోయినా ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించవచ్చు. కాకపోతే అప్పటికే వినియోగదారుల ఫోరం లేదా కోర్టును ఆశ్రయించి ఉండరాదు.
అంబుడ్స్ మెన్ కు లిఖితపూర్వకంగా గానీ, మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా గానీ సమస్యను నివేదించవచ్చు. దేశవ్యాప్తంగా 12 అంబుడ్స్ మెన్ కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న కార్యాలయం పరిధిలో తెలంగాణ, ఏపీ, యానాం ప్రాంతాలు వస్తాయి.
HYDERABAD
Office of the Insurance Ombudsman,
6-2-46, 1st floor, "Moin Court"
Lane Opp. Saleem Function Palace,
A. C. Guards, Lakdi-Ka-Pool,
Hyderabad - 500 004.
Tel.:- 040-65504123/23312122
Fax:- 040-23376599
Email:- [email protected]
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంబుడ్స్ మెన్ కార్యాలయాల చిరునామాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ను సందర్శించండి. http://www.policyholder.gov.in ఇన్సూరెన్స్ కార్యాలయం ఏ అంబుడ్స్ మెన్స్ పరిధిలోకి వస్తుందో అక్కడే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా అంబుడ్స్ మెన్ పరిష్కారానికి తీసుకునే సమస్యల్లో...
ప్రీమియం చెల్లించినప్పటికీ పాలసీ పత్రాలు రాకుంటే, పాలసీదారుడు దాఖలు చేసిన క్లెయిమ్ ను తగిన కారణం లేకుండా తిరస్కరిస్తే, పూర్తి పరిహారానికి నిరాకరించి కొంత వరకే ఆమోదిస్తే, క్లెయిమ్ ను ఆమోదించినప్పటికీ పేమెంట్ రాకపోయినా?, పాలసీ నిబంధనలకు సంబంధించిన సమస్యలు ఉన్నా? పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్నా? తదితర అంశాల విషయంలో పరిష్కారానికి అంబుడ్స్ మెన్ చర్యలు చేపడుతుంది. ఇన్సూరెన్స్ వ్యవహారాలకు సంబంధించి 20 లక్షల రూపాయల వరకు అంబుడ్స్ మెన్ ను సంప్రదించవచ్చు. మూడు నెలల్లోగా అంబుడ్స్ మెన్ తన తీర్పును వెలువరిస్తుంది. అంబుడ్స్ మెన్ ఆదేశాలను కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. న్యాయం జరగలేదని భావిస్తే వినియోగదారుల ఫోరం, లేదా కోర్టును ఆశ్రయించవచ్చు.