ఆనాడు సామాన్యుడు... 'ఈనాడు' ఆయన 'మార్గదర్శి'!

రామోజీరావు... తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడికి నాంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు సూత్రధారి. టీవీ రంగంలో కొంగొత్త శైలికి ఆద్యుడు. చిట్ ఫండ్ నిర్వహణలో తెలుగు ప్రజల నమ్మకమైన నేస్తం. యావత్తు ప్రపంచాన్నే నివ్వెరపరచిన కళా తపస్వి.... ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితా చాంతాడంత అవుతుంది. ఇలా వరుసగా ఒక్కో రంగంలో కాలిడి, తన ప్రత్యేకతను చాటిన ఆయన, నేటి యువతరానికి ముమ్మాటికీ మార్గదర్శే. రామోజీ సాధించిన విజయాల వెనుక, ఆయన నెలకొల్పుకున్న వ్యవస్థలదే కీలక భూమిక. అయితే వాటి నిర్మాణంలో ఎదురైన ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన రామోజీ, ఒక్క అడుగూ వెనక్కేయలేదు. అందుకే ఆయన విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.
పెదపారుపూడి టు హైదరాబాద్!

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో 1936, నవంబర్ 16న సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చెరుకురి రామోజీరావు అంచలంచెలుగా ఎదిగారు. స్వస్థలం నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో మజిలీలు. స్వతహాగా రైతు నేపథ్యం ఉన్న రామోజీ, 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్ కు శ్రీకారం చుట్టారు. హిమాయత్ నగర్ లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో ఆనాడు ఆ సంస్థను ఆయన ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ, హైదరాబాద్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొట్టతొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్టణంలో నెలకొల్పారు. నేడు 4300 మంది ఉద్యోగులు, మూడున్నర లక్షల మంది కస్టమర్లతో 7750 కోట్ల టర్నోవర్ తో చిట్ ఫండ్స్ రంగంలో తిరుగులేని సంస్థగా మార్గదర్శి దూసుకుపోతోంది.

స్వతహాగా తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో రైతుల సాధకబాధకాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే, ఆధునిక పద్ధతుల్లో రైతు సేద్యం చేస్తే మంచి గిట్టుబాటు ఉంటుందన్న ఉద్దేశంతో రైతుకి ఉపయోగపడేలా 1969లో 'అన్నదాత' మాసపత్రికను తీసుకువచ్చారు. అనతికాలంలోనే అది తెలుగు రైతుల మనసులను దోచుకుని, ఆధునిక సేద్యంలో వారికి ప్రియనేస్తంగా మారిపోయింది. ఈవేళ ఈ 'అన్నదాత' పత్రిక మూడు లక్షల మందికి పైగా వార్షిక చందాదారులతో వెలుగొందుతోంది. ప్రతి ఏడాది తన చందాదారులకు ఉచితంగా ఒక డైరీని కానుకగా ఇవ్వడం రామోజీరావుకి అలవాటు. దానిని రైతులు ఏడాది పొడవునా ఆత్మీయంగా దాచుకుంటారు.        

ఈ క్రమంలోనే విశాఖలో డాల్ఫిన్ పేరిట హోటల్ నూ నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ఓ ఆలోచన తట్టింది. ఆ ఆలోచనే ఆయనను అందలమెక్కించింది.

పేపర్ కోసం మధ్యాహ్నం దాకా ఆగాలా...?

1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్ లలోనే వార్తా పత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నం అయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ తో ప్రస్తావించిన రామోజీ, విశాఖలో పత్రికను ముద్రించండని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడుకున్నదన్న ప్రసాద్ సమాధానంతో రామోజీ ఏకీభవించలేకపోయారు. అదే అదనుగా విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలాగుంటుందని భావించిన ఆయన, అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మిషన్ ను చౌక ధరకు చేజిక్కించుకుని 1974, ఆగస్టు 10న విశాఖలో  ‘ఈనాడు’కు ఊపిరి పోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు.

అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్ ను అనతి కాలంలోనే భారీగా పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో... 1975, డిసెంబర్ 17న ఈనాడు రెండో ఎడిషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన రామోజీ, పత్రిక సర్క్యులేషన్ ను ఒక్కసారిగా 50 వేల మార్కును దాటించారు. మరో రెండేళ్లకు 50 వేల సర్క్యులేషన్ తో విజయవాడ ఎడిషన్ ను అట్టహాసంగా ప్రారంభించిన రామోజీ పత్రిక మొత్తం సర్క్యులేషన్ ను నాలుగేళ్లలోనే లక్ష దాటించారు. ప్రస్తుతం 23 ఎడిషన్లతో నడుస్తున్న ఈనాడు ఒకానొక సమయంలో 19 లక్షలనూ తాకేస్తుందా అన్న రీతిలో దూసుకుపోయింది.

నాణ్యతకు మారుపేరుగా ఈటీవీ

టీవీ రంగంలోకి అడుగిడిన రామోజీ, 1995, ఏప్రిల్ లో ఈటీవీని ప్రారంభించారు. వినోద ప్రధానంగా ప్రారంభమైన ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్ద పీటే వేసింది. నానాటికి మారుతున్న సమాజ రీతులకనుగుణంగానే నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ-2ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో ఈటీవీ పలు భాషల్లోకీ రంగప్రవేశం చేసింది. గత ఆగష్టు 27న ఈటీవీ లైఫ్ (ఆరోగ్యం, జీవనశైలికి చెందిన కార్యక్రమాల చానెల్), ఈటీవీ సినిమా (పూర్తిగా సినిమా ప్రసారాల కోసం), ఈటీవీ ప్లస్ (ప్రత్యేకంగా యువతకు సంబంధించిన వినోద కార్యక్రమాల చానెల్), ఈటీవీ అభిరుచి (ప్రత్యేకంగా వివిధ రకాల వంటలను పరిచయం చేసే చానెల్) పేరిట మరో నాలుగు కొత్త చానెళ్లను ప్రారంభించారు. ఇవి కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.  

ఇక, ఈటీవీ ప్రారంభమైన ఏడాదే,  రామోజీ గ్రూప్ 'కళాంజలి' పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని, వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది. అంతకుముందుగానే చిత్ర నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్ లను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ చేదోడు వాదోడుగా నిలిచింది.  

సినిమా రంగంపై రామోజీ ముద్ర

తన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించారు. 'స్టార్ డం' ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ 'కథే మా హీరో' అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేబట్టారు. కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్టులో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందొచ్చన్న కొత్త సూత్రాన్ని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు.

 ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్ కౌంటర్, అశ్వని... వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ, ప్రేక్షకులను రంజింప జేశాయి. రామోజీకి లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయన్న విషయం ఆయనకు 'ప్రతిఘటన' సినిమా ద్వారా తెలిసిందంటారు. వివిధ భాషల్లో ఆయన ఇప్పటివరకు 87  చిత్రాలను నిర్మించారు.

సినీ నిర్మాణం అంతా ఒక్కచోటే ఉంటే...!

అడుగిడిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ వెళుతున్న రామోజీ సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూశారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలాగుంటుందన్న ఆలోచనే ఆయనను ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ నిర్మాణం దిశగా అడుగులేసేలా చేసింది. దాదాపు 1,666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను కట్టేసిన రామోజీ 1996, అక్టోబర్ లో దానిని ప్రారంభించారు. ఈ నిర్మాణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఓ చిత్ర నిర్మాణం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోకి స్క్రిప్ట్ తో అడుగిడితే, థియేటర్లలో ప్రదర్శించే కాపీతో బయటకు వచ్చేయొచ్చు. అంతేకాదు, హైదరాబాద్ లోనే కాక దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ ‘సిటీ’ అలరారుతోంది. ఇక ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీ ‘ప్రియా’ బ్రాండ్ పేరిట పచ్చళ్లు, వంట నూనెల ఉత్పత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ వుంది.   

ఈనాడులో స్థానిక వార్తలకు అగ్రాసనం!

ఈనాడు పత్రిక ఆవిర్భావమే అద్భుతమనుకుంటే, తనదైన శైలిలో స్థానిక వార్తలకే అగ్రతాంబూలమిచ్చిన రామోజీ, జిల్లాల వారీగా ప్రత్యేకంగా ‘టాబ్లాయిడ్’ పేరిట అనుబంధాల ప్రచురణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతగానంటే, ఆ తర్వాత వెలువడ్డ ఏ పత్రిక అయినా, జిల్లా వార్తల కోసం టాబ్లాయిడ్ లను ముద్రించక తప్పనంతగా. ఇందులో రామోజీ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ ప్రయోగం రామోజీ కీర్తిప్రతిష్ఠలను కూడా ఇనుమడింపజేసింది. జర్నలిజంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక బీడీ గోయెంకా అవార్డును సాధించిపెట్టింది. వార్తల సేకరణకే కాక పత్రిక ప్రతులను అమ్మడానికి కూడా రామోజీ ఓ ప్రత్యేక వ్యవస్థనే నిర్మించారు. ఆ వ్యవస్థే, రామోజీ వయసురీత్యా కాస్త విశ్రమిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మెరికల్లాంటి జర్నలిస్టులను తయారుచేయడానికి ఏకంగా 'ఈనాడు జర్నలిజం స్కూలు'ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి, ఆ అభ్యర్థులను తన సంస్థలోనే ఉద్యోగులుగా తీసుకునే ఓ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్దారు.  

కింగ్ మేకర్ గా ఉండటమే ఇష్టమట!

కింగ్ గా ఉండటం కంటే కింగ్ మేకర్ గా ఉండటమే రామోజీకి ఇష్టమట. 1983లో అప్పటికే చలన చిత్ర రంగంలో మేరునగధీరుడిగా ఎదిగిన దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీ ప్రచారం కోసం ఆయన రామోజీ సహాయం తీసుకున్నారు. దీంతో టీడీపీ పక్షపాతిగా ఈనాడుపై పేరు పడిపోయింది. అయినా, వార్తల విషయంలో రామోజీ ఏనాడు రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సర్కారు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విమర్శనాత్మక వార్తలు రాశారు. అయితే అదే ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర రావు గద్దె దింపిన సమయంలో  రామోజీ... ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతికి ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబు వేరు కుంపటి పెట్టడం, ఆ కుంపటి అధికారం చేజిక్కించుకునేలా రామోజీ వ్యవహరించడం జరిగిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత కీలకంగా వ్యవహరించిన ఆయన, పదవులు తీసుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు.

ఉద్యమాల్లోనూ విజేతే!

ఈనాడు వేదికగా రామోజీ అక్షర యుద్ధం చేసిన సందర్భాలూ కోకొల్లలు. మద్యపాన నిషేధం ఉద్యమానికి రామోజీ వెన్నుదన్నుగా నిలిచారు. ఆ ఉద్యమం జరిగినంత కాలం ఈనాడులో కార్టూన్లు కూడా సదరు ఉద్యమానికి సంబంధించినవే. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యేదాకా ఈనాడు నిద్రపోలేదు. ఇక 1983లో రాష్ట్రంలో పెద్దల సభ శాసన మండలినే రామోజీ ఢీకొన్నారు. ‘పెద్దల గలాభా’ పేరిట తన పత్రిక రాసిన కథనంపై సభ మండిపడింది. సభకు పిలిచి సంజాయిషీ కోరాలని తీర్మానించింది. అయితే తాను రాసింది ముమ్మాటికీ సబబేనన్న భావనతో రామోజీ, సుప్రీంకోర్టుకు వెళ్లారు. అరెస్ట్ కాకుండా కోర్టు ఉత్తర్వులు పొందారు. ఆ విధంగా, పెద్దల సభ ఆదేశాల మేరకు తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఉట్టిచేతులతో తిప్పిపంపారు. ఇక ఏడెనిమిదేళ్ల క్రితం తన ఆర్థిక మూలాలైన మార్గదర్శిని దెబ్బకొట్టడానికి నాటి కాంగ్రెస్ సర్కారు చేయని యత్నం లేదు. అయినా రామోజీ ఎదురొడ్డి పోరాడారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో వుంది. అయినా తెలుగు ప్రజలు మార్గదర్శిపై మరింత నమ్మకాన్ని పెంచుకున్నారు.

మడమతిప్పని నైజం!

రామోజీరావులో మనం గమనించవలసిన ముఖ్య లక్షణం పట్టుదల. ఒక పని చేయాలని అనుకున్నాక, దానిపై సమగ్రంగా చర్చించి, పక్కా ప్రణాళికతో ఆయన రంగంలోకి దిగుతారు. ఇక దిగడమంటూ జరిగితే.. వెనకడుగన్న సమస్యే  ఉత్పన్నం కాదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా... ఆరునూరైనా దూసుకుపోవడమే ఆయన నైజం. 'మనం వెళ్లే దారిలో రాళ్లు రప్పలు, ముళ్లు వుంటాయి. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ గమ్యం చేరడమే మన కర్తవ్యం. ఆ పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం నీదే' అంటారాయన. ఆయన నమ్మిన సిద్ధాంతం అదే! అందుకే, కార్యసాధనలో ఎన్నో ఢక్కా మొక్కీలు తిన్నా, ఆయనెప్పుడూ మడమ తిప్పలేదు. ఆ లక్షణమే ఆయనను విజయ శిఖరాలకు చేర్చింది.

రామోజీలోని మరో గొప్ప లక్షణం!

ఉద్యోగం ఇవ్వడం వేరు... ప్రతి నెలా ఫస్టుకి ఉద్యోగులకు టంచనుగా జీతాలివ్వడం వేరు. ఈ వేళ ఎన్ని మీడియా సంస్థలు ఇలా కరెక్టుగా జీతాలిస్తున్నాయో మనకు తెలుసు. ఉద్యోగులకు రెండేసి, మూడేసి నెలల జీతాలు బకాయిపెడుతున్న మీడియా సంస్థలు ఎన్నో వున్నాయి. అందుకే, రామోజీ అందరిలోకీ విభిన్నం. సరిగ్గా నెలాఖరున అంటే 30 లేదా 31న ఉద్యోగి అకౌంటులో జీతం పడిపోవాల్సిందే. లేకపోతే అకౌంట్స్ డిపార్ట్ మెంటుకి మూడిందన్న మాటే! అయినా, ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో ఈనాడు గ్రూపు సంస్థల్లో ఎప్పుడూ జీతాల విషయంలో ఒక్క రోజు కూడా తేడా రాకుండా నెలాఖరున సేలరీలు పడిపోతున్నాయి. ఉద్యోగులపట్ల రామోజీకి వుండే గౌరవం అది. 'ప్రతిభ వున్నా వాడిని తీసుకో, సరిగ్గా పని చేయించుకో, నువ్వు ఇస్తానన్న జీతం నెలాఖరుకి సరిగ్గా ఇచ్చేయ్' అన్నది ఆయన పాలసీ. అందుకే, ఈనాడులో ఉద్యోగం అంటే గవర్నమెంటు ఉద్యోగం అని భావించే వారు కూడా వున్నారు.  

'రాజీ' ఎరుగని రామోజీ!

అవును ... రామోజీరావు డిక్షనరీలో రాజీ అన్న పదానికి చోటు లేదు. 'రాజీ అనేది ఆత్మహత్యా సదృశం వంటిది' అంటారాయన. అందుకే, ఆయన ఇన్నేళ్ల జీవితంలో ఏ విషయంలోనూ ఎవరితోనూ రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో చిరకాల యుద్ధమే చేశారు... ఒకానొక సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమ ఈనాడుని బ్యాన్ చేసినప్పుడు ఎదిరించి నిలిచారు... మార్గదర్శి ఫైనాన్స్ విషయంలో అప్పటి ప్రభుత్వం పెట్టించిన కేసులకు అదరలేదు, బెదరలేదు. అప్పట్లో ఆయన రాజీ పడి వుంటే కనుక ఏ సమస్యా వచ్చేది కాదు, తన నెట్ వర్క్ కు చెందిన కొన్ని ఛానెల్స్ ను అమ్మవలసి వచ్చేదీ కాదు. అయితే, ఆయన రామోజీరావు! 'రాజీ' అన్నది ఎరుగని వ్యక్తిత్వం ఆయనది! అదే ఆయన బలం... అదే ఆయన శక్తి!    

 విలక్షణ వ్యక్తిత్వం 

క్రమశిక్షణ... పట్టుదల.. ధైర్యం ఈ మూడూ రామోజీ భూషణాలు. జీవితంలో ఏ విషయంలోనైనా సరే క్రమశిక్షణ లేనిదే ఏమీ సాధించలేమంటారాయన. అనడమే కాదు, దానిని తు.చ. తప్పక ఆచరిస్తారాయన. సమయపాలనకు ఆయన ఎంతో విలువ ఇస్తారు. రేపటి పనిని ఈ రోజే పూర్తి చేయాలంటారు. పట్టువదలని విక్రమార్కుని లాంటి వ్యక్తిత్వం ఆయనది. ఆ పట్టుదలే ఆయనని అన్ని రంగాలలోను విజేతగా నిలిపింది. ఇక రామోజీలో వున్న మరో గొప్ప లక్షణం ధైర్యం. దేనికీ చలించని దృఢచిత్తం. పది నిమిషాలు మనం ఆయనతో మాట్లాడితే 'ఈ ప్రపంచాన్ని జయించగలన'న్న ధైర్యం మనకొస్తుంది. అంతటి విలక్షణ వ్యక్తిత్వం ఆయనది!

అడుగిడిన ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తూ (ఒక్క NEWS TIME  ఇంగ్లిష్ పేపర్ విషయంలో మాత్రం రామోజీ విజయం పొందలేకపోయారు) తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయడమే కాక తన సంస్థల నిర్వహణకు ఏకంగా వ్యవస్థలనే నిర్మించిన రామోజీ నిజంగా వ్యవస్థ నిర్మాతే. అందుకే రామోజీ నేటి యువతరానికి ముమ్మాటికీ మార్గదర్శే. అందుకే కాబోలు...  విభిన్న రంగాల్లో సత్తా చాటిన వ్యక్తిగా భారత ప్రభుత్వం రామోజీకి ఈ ఏడాది(2016) పద్మ విభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది.


More Articles