అనితర సాధ్యుడు...'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి!
నాస్ డాక్... షేర్ మార్కెట్ లో రారాజు. ప్రపంచంలోనే మేటి కంపెనీల షేర్ల క్రయ విక్రయాలకు కేంద్ర బిందువు. ఇందులో లిస్టయ్యేందుకు మొగ్గు చూపని పరిశ్రమ ఉండదు. పారిశ్రామిక వేత్త కూడా ఉండడు. ఘన చరిత్ర ఉన్న ఈ ఎక్సేంజ్ లో అప్పటిదాకా ఏ ఒక్క భారత కంపెనీకి చోటు దక్కలేదు. 1999లో ఇన్ఫోసిస్ చరిత్ర సృష్టించింది. నాస్ డాక్ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా రికార్డులకెక్కింది. వ్యాపారంలో తొలి అడుగేసిన 18 ఏళ్లకు గాని ఇన్ఫోసిస్, ఈ స్థాయికి చేరుకోలేకపోయింది. కేవలం 250 డాలర్ల మూల ధనంతో మొదలైన కంపెనీకి ఆమాత్రం సమయం పట్టదా? చెప్పండి. ఖచ్చితంగా పడుతుంది. మిగిలిన వారికైతే ఈ సమయం ఏమాత్రం సరిపోదు కాని, నాగవర రామారావు నారాయణ మూర్తికి సరిపోయింది. తద్వారా భారత పారిశ్రామిక వేత్తలకు ఆయన కొత్త లక్ష్యాలను నిర్దేశించారు.
ఉద్యోగం...మూర్తికి ఇష్టం లేదట!
1969 నాటికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన నారాయణ మూర్తికి హెచ్ఎంటీ, ఈసీఐఎల్, టెల్కో తదితర కంపెనీలు ఆపర్ల మీద ఆపర్లిచ్చాయి. అప్పటికే భారత పారిశ్రామిక రంగంలో ఖ్యాతిగాంచిన ఆ కంపెనీల ఆఫర్లను వద్దనుకున్న మూర్తి... నేరుగా అహ్మదాబాద్ ఐఐటీలో చీఫ్ సిస్టం ప్రోగ్రామర్ గా విధుల్లో చేరారు. నాటి జీతం నెలకు రూ. 800. అయితే ఆ ఉద్యోగం మూర్తికి కొన్ని పాఠాలు నేర్పిందట. అందులోనూ చాలీచాలని వేతనంతో గడిపిన ఆ రోజులు తన జీవితంలోనే అత్యుత్తమమైనవని కూడా మూర్తి చెబుతారు. కొంతకాలానికే ఆ ఉద్యోగానికి వీడ్కోలు పలికిన మూర్తి... ఆ తర్వాత పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ లో చేరారు. అయితే అక్కడా ఎక్కువ కాలం పనిచేయలేకపోయిన మూర్తి, ఇక ఇలాగైతే కుదరదని భావించారు. మిత్రులతో చర్చించి, సొంతంగా కంపెనీ పెట్టేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రతిపాదనకు జీవిత భాగస్వామి సుధ కూడా ఓకే చెప్పడంతో మరింత హుషారుగా కంపెనీ ఏర్పాట్లలో మునిగిపోయారు మూర్తి. అంతా చూస్తే, ఇన్ఫోసిస్ ప్రారంభం కాకముందు మూర్తి వేర్వేరు సంస్థల్లో ఉద్యోగిగా పనిచేసిన కాలం కేవలం రెండేళ్లే.
250 డాలర్ల మూలధనంతోనే!
కంపెనీ ప్రారంభించాలంటే అందుకు తగ్గ పెట్టుబడి కావాలిగా మరి. మూర్తి, ఆయన ఆరుగురు మిత్రుల వద్ద చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మరి ఏం చేయాలి? తలా కొంతమేర సర్దుకుందామనుకున్నారు. అయినా సరిపోలేదు. దీంతో ముందడుగేయమని ప్రోత్సహించిన జీవిత భాగస్వామినే ఆశ్రయించారు మూర్తి. తన వద్ద దాచుకున్న కొంత మొత్తాన్ని ఆమె మూర్తికి అందించారు. అంతా కలిపితే 250 డాలర్లు. చిన్న మొత్తమైనా ఇక ఆలస్యం చేయరాదని భావించిన మూర్తి మిత్రబృదం... వెనువెంటనే కార్యరంగంలోకి దిగిపోయింది. అంతే, 1981, జూలై 2న ఫుణే కేంద్రంగా ‘ఇన్ఫోసిస్ టెక్నాలజీస్’ వెలసింది. కంపెనీ ఏర్పాటు చేయగానే అమెరికాకు చెందిన డేటా బేసిక్స్ కార్పోరేషన్ కు ఐటీ సేవలందించే కాంట్రాక్టు లభించింది. ఆ తర్వాత కంపెనీ కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చిన మూర్తి మిత్ర బృందం, పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకు కదిలింది. ఈ క్రమంలో సంస్థతో పాటు సంస్థలో పనిచేయాల్సిన ఉద్యోగుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ పోయింది.
లక్షన్నర మందికి పైగా ఉద్యోగులు
ఈ ఏడాది జనవరి నాటికి 1,93,383 మంది ఉద్యోగులు ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు. ఏటా రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్ఫోసిస్, 11 బిలియన్ డాలర్ల ఆస్తులను కూడగట్టింది. విశ్వవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచ దేశాల కూటమి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న యూఎన్ ఫౌండేషన్ తో పాటు ప్రతిష్టాత్మక బెంగళూరు ఐఐటీ, హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హెచ్ఎస్ బీసీ తదితర కంపెనీలకు ఐటీ సేవలందిస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం సమయంలోనూ ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల సంఖ్యను కుదించలేదు సరికదా, ఏటా కొత్త నియామకాలను చేపడుతూనే ఉంది. దినదినాభివృద్ధి చెందుతున్న కంపెనీ కార్యాలయాన్ని బెంగళూరులోని సిలికాన్ వ్యాలీకి తరలించిన మూర్తి, ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో కార్యాలయాలుండాలంటూ పారిశ్రామిక వర్గాలకు దిశానిర్దేశం చేశారు.
విలువలతో కూడిన వ్యాపారమే మూర్తి బలం
ఒక్కసారి ఇన్ఫోసిస్ తో పనిచేయించుకోవాలని వచ్చిన ఏ సంస్థ కూడా ఆ తర్వాత దానితోనే కొనసాగింది తప్పించి, వదిలిపోలేదు. ఇప్పటికీ సంస్థ ఆదాయంలో 99 శాతం తన పాత క్లయింట్ల ద్వారానే వస్తుందని ఇన్ఫోసిస్ లెక్కలేసి మరి చెబుతోంది. దాదాపు 35 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్ కు ఇది ఎలా సాధ్యపడిందంటే... మూర్తి చేసిన విలువలతో కూడిన వ్యాపారం కారణంగానే. వినియోగదారులతో ఎలా మెలగాలో, వారిలో తమ సంస్థ పట్ల ఎలా నమ్మకం కుదిరేలా చేయాలో సిబ్బందికి తరగతులు పెట్టి మరీ చెప్పే మూర్తి... ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోకపోతే రాణించలేమని బోధిస్తారు. ఈ సూత్రమే ఇన్ఫోసిస్ ను ఏళ్ల పాటు కొత్త వినియోగదారుల కోసం అర్రులు చాచకుండా నివారించగలిగింది. వినియోగదారులతో పాటు సిబ్బంది సంక్షేమానికి కూడా మూర్తి ప్రాధాన్యత ఇచ్చారు.
బడిపంతులు ఇంటిలో వ్యాపార వేత్త!
1946, ఆగస్టు 20న మైసూర్ లో ఓ పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటిలో పుట్టిన నారాయణ మూర్తి, ప్రస్తుతం బెంగళూరును తన స్థిర నివాసంగా చేసుకున్నారు. ఈ మధ్యలో కాన్పూర్, ఫుణేలలోనూ కొంతకాలం పాటు గడిపారు. యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ లో 1967 లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన మూర్తి, ఆ తర్వాత 1969లో ఐఐటీ, కాన్పూర్ లో అదే విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు. తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో డిగ్రీ పూర్తి చేసేందుకు మూర్తి... ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పాల్సి వచ్చింది. ఉద్యోగంలో చేరే క్రమంలో బడా సంస్థలను కాదని, అహ్మదాబాద్ ఐఐటీలో చేసిన స్వల్పకాలిక ఉద్యోగం... మూర్తి జీవితాన్నే మార్చేసింది.
నిబంధనలు అందరికీ ఒకటే!
కంపెనీలో నిబంధనలనేవీ సిబ్బందికి ఒక రకంగా, యజమానికి మరో రకంగా ఉండకూడదనేది మూర్తి అభిప్రాయం. అభిప్రాయం మాత్రమే కాదు ఆచరించి కూడా చూపారు. కంపెనీ ప్రారంభమైన నాటి నుంచి 2002 వరకు మూర్తి సీఈఓగా వ్యవహరించారు. అదే సమయంలో సంస్థ ప్రారంభం నుంచి 2011 దాకా ఛైర్మన్ గానూ, చీఫ్ మెంటార్ గానూ బాధ్యతలను నిర్వర్తించారు. 2011 నుంచి 2013, మే దాకా ఛైర్మన్ ఎమిరిటస్ హోదాలో కొనసాగిన మూర్తి, 2006లో 60 ఏళ్ల వయసు రాగానే పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించి, పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశారు. అంతకు నాలుగేళ్ల ముందే వయోభారం నేపథ్యంలో సీఈఓ పదవిని వదులుకున్న మూర్తి, తన స్థానంలో నందన్ నిలేకనీని నియమించారు. ఇదిలా ఉంటే, మూర్తికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. మూర్తి తర్వాత వారే కంపెనీ పగ్గాలు చేపడతారన్న ప్రచారం సాగిన సందర్భంలో, వారసత్వ పదవులకు ఇన్ఫోసిస్ దూరమని, ప్రతిభ ఉంటే తన కొడుకు కంపెనీ ఉద్యోగి అవుతాడని ప్రకటించారు.
వృద్ధిబాటలో వడివడిగా అడుగులు
ఇన్ఫోసిస్ ను మూర్తి నడిపిన తీరు గమనిస్తే... ఆ వేగం, దూకుడు స్పష్టంగా కనబడతాయి. 250 డాలర్లతో ప్రారంభమైన కంపెనీ, బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగేందుకు 23 ఏళ్ల సమయం పడితే, ఆ తర్వాత మరో 23 నెలల్లోనే 2 బిలియన్ల మార్కును తాకింది. అంటే ఏటికేడు ఆదాయ వృద్ధిలో రెట్టింపు పెరుగుదల నమోదైంది. 2004 లో బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్, 2006 నాటికి 2 బిలియన్ల కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్, 11 బిలియన్ డాలర్ల ఆదాయంతో నడుస్తున్న కంపెనీ. ఉద్యోగుల సంఖ్యలో కూడా ఊహించనంత వేగంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కంపెనీలో 1,93,383 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ ఇన్ఫోసిస్, మూర్తి నేతృత్వంలో వడివడిగానే అడుగులు వేసింది.