రైల్వే చార్జీల్లో రాయితీలు ఎవరెవరికి.. ఎంతెంత?
దేశంలో అత్యధిక జనాభాకు అనుకూలమైన, చవకైన రవాణా వ్యవస్థ రైల్వే. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చే భారతీయ రైల్వే... మనలో కొన్ని వర్గాల వారికి టికెట్ చార్జీల్లో భారీగా రాయితీలు అందిస్తోంది. వాటి వివరాలేంటో చూద్దాం.
విద్యార్థులు, వికలాంగులు, ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారు, వైద్యులు, జర్నలిస్టులు, కళాకారులు, వృద్ధులు, జాతీయ పురస్కార గ్రహీతలు, అమరవీరుల భార్యలు, స్వాతంత్ర్య సమర యోధులు, క్రీడాకారులు, రైతు వర్గాల వారికి వివిధ రూపాలలో రాయితీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు అన్ని వర్గాల వారికీ అనువైన సీజన్ టికెట్ ఉండనే ఉంది.
15 రోజుల చార్జీకే
రెండు ప్రాంతాల మధ్య తరచూ ప్రయాణించే వారికి సీజన్ టికెట్లు అనువైనవి. నెలలో 15 రోజుల రానుపోను చార్జీ పెట్టుకుంటే మిగిలిన 15 రోజులు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. సాధారణంగా 150 కిలోమీటర్ల పరిధి మేరకు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించేవారికి సీజన్ టికెట్లు జారీ చేస్తారు. సాధారణ, ఎక్స్ ప్రెస్ రైళ్లలో వీటితో ప్రయాణించవచ్చు. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించాలంటే అదనంగా సర్ చార్జీ టికెట్ తీసుకోవాలి. తగిన గుర్తింపు పత్రాలతో రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి సీజన్ టికెట్లు పొందవచ్చు. సీజన్ టికెట్ తో పాటు రైల్వే సిబ్బంది గుర్తింపు కార్డు కూడా జారీ చేస్తారు. ప్రయాణ సమయంలో ఈ రెండూ దగ్గర ఉంచుకోవాలి. గడువు తీరడానికి 3 రోజుల ముందు నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు.
విద్యార్థులకు మరింత చౌక
విద్యార్థులకు సీజన్ టికెట్లను సాధారణ సీజన్ టికెట్లలో సగం చార్జీకే పొందవచ్చు. మూడు నెలలకు ఒకేసారి తీసుకోవాలని అనుకుంటే ఇంకొంత తగ్గింపు లభిస్తుంది. పదో తరగతి వరకు అబ్బాయిలకు, ఇంటర్ వరకు విద్యార్థినులకు పాస్ లు ఉచితం. అంటే తమ నివాస ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల్లోని స్కూళ్లు, కళాశాలలకు వెళ్లేందుకు వీలుగా వీటిని జారీ చేస్తారు. వీటితో పాసింజర్ రైళ్లలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు. రైల్వే టికెట్ కౌంటర్ నుంచి నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని తీసుకుని దాన్ని స్కూల్ లేదా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అటెస్టేషన్ చేయించి సమర్పించాల్సి ఉంటుంది. ఇక పెద్దల సీజన్ టికెట్ చార్జీలో సగానికే బాల, బాలికలు సీజన్ టికెట్ పొందవచ్చు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికులు అంటే కూరగాయల విక్రేతలు, ఇళ్లల్లో పనివారు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణరంగ కార్మికులకు మిగిలిన వారితో పోలిస్తే 100 కిలోమీటర్ల పరిధిలో చాలా తక్కువ ధరకే సీజన్ టికెట్లను రైల్వే అందిస్తోంది.
వృద్ధులకు సముచిత గౌరవం
వృద్ధులకు అన్ని తరగతుల్లోనూ రైల్వే భారీ రాయితీలిస్తోంది. 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ చార్జీల్లో 40 శాతం తగ్గింపు... 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం తగ్గింపునిస్తోంది. అంతేకాదు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ వయసు ఎక్కువగా చూపించి రాయితీ పొందితే తనిఖీల సందర్భంగా పట్టుబడితే టికెట్ చార్జీల్లో తేడాను వసూలు చేయడంతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
విజ్ఞాన యాత్రలకూ తగ్గింపు
విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళుతుంటే ముందుగా రైల్వే అధికారులను సంప్రదించినట్టయితే సెకండ్ క్లాస్ లో 50 శాతం రాయితీ లభిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు అయితే ఈ రాయితీ 75 శాతం వరకు అందుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడాదికోసారి స్టడీ టూర్ ఏర్పాటు చేసుకుని సెకండ్ క్లాస్ టికెట్ చార్జీల్లో 75 శాతం రాయితీ పొందవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ప్రవేశ పరీక్షల కోసం వెళుతున్నట్టయితే టికెట్ చార్జీలో 75 శాతం రాయితీ అందుకోవచ్చు. ఇక యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాస్తున్న వారు 50 శాతం తగ్గింపు ధరకే టికెట్లు పొందవచ్చు. రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనల కోసం వెళుతున్నట్టయితే వారు కూడా 50 శాతం తగ్గింపు అందుకోవచ్చు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి 50 నుంచి 100 శాతం రాయితీ ఉంది.
వికలాంగులకు
శారీరక వైకల్యంతోపాటు, మానసిక వైకల్యం ఉన్న వారికి రైల్వే శాఖ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, 3ఏసీ, ఏసీ చైర్ కార్ లలో 75 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది.1ఏసీ, 2ఏసీలో 50 శాతం రాయితీనిస్తోంది. వెంట ఉన్న ఓ సహాయకుడికి కూడా టికెట్ చార్జీలో ఇంతే మొత్తం రాయితీ లభిస్తుంది. అదే చెవిటి, మూగ వర్గాల వారు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్ లలో 50 శాతం రాయితీ అందుకోవచ్చు. వికలాంగులు డిస్కౌంట్ కోసం గాను ఐకార్డు తీసుకోవాలి. ఇందుకు గాను రైల్వే కౌంటర్ల వద్ద నిర్ణీత ఫామ్ పూర్తి చేసి వైకల్య ధ్రువీకరణ, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాణాంతక వ్యాధులున్నవారికి....
కేన్సర్ పేషెంట్లు తరచూ వైద్య చికిత్సలకు రైళ్లల్లో ప్రయాణిస్తుంటే తరగతులనుబట్టి 50 నుంచి 100 శాతం వరకు రాయితీ అందుకోవచ్చు. వెంట సాయంగా వచ్చే వారికి కూడా ఇదే వర్తిస్తుంది. తలసీమియా వ్యాధిగ్రస్తులకు, గుండె శస్త్రచికిత్సలకు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు వెళుతున్నవారు, హీమోఫీలియా, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్, అనీమియా, సికిల్ సెల్ అనీమియా పేషెంట్లకు కూడా 50 నుంచి 75 శాతం వరకు రాయితీ ఉంది.
రాయితీల విషయంలో ఇంకా పూర్తి వివరాలకు ఈ లింక్ ను చూడగలరు. http://www.indianrail.gov.in/ http://www.indianrailways.gov.in/ అలాగే టికెట్ చార్జీల కోసం http://www.indianrail.gov.in/ ఈ లింక్ ఉపయోగపడుతుంది.