‘ఉక్కు’ మాంత్రికుడు... లక్ష్మీ మిట్టల్!
అది 1989. ట్రినిడాడ్ అండ్ టుబాగోలో ఓ ఉక్కు కంపెనీ దాదాపు రోజుకు మిలియన్ డాలర్ల నష్టాలను పోగేసుకుంటోంది. అమెరికా, జర్మనీలకు చెందిన ఉక్కు రంగ నిపుణులు, ఆ కంపెనీని సంస్కరిద్దామని చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో ఇక కంపెనీని మూసేయడమే మార్గమని ఆ దేశ ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసేసుకుంది. అదే సమయంలో భారత సంతతికి చెందిన లక్ష్మీ నివాస్ మిట్టల్ (లక్ష్మీ నారాయణ్ మిట్టల్ అని కూడా అంటారు) ... ఆ కంపెనీని తాను కొంటానని ముందుకు వచ్చారు. అసలే నష్టాలు, ఆపై ఎలాంటి ఆశలు లేని కంపెనీని కొంటామంటే... ట్రినిడాడ్ ప్రభుత్వం ఎగిరి గంతేసి మరీ అప్పగించింది.
అంతే, కొద్దికాలంలోనే ఆ కంపెనీ నష్టాలను పూడ్చేసిన మిట్టల్... దానిని లాభాల్లోకి తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి ఆయన ఎక్కడైనా, ఏదైనా ఉక్కు కంపెనీ నష్టాల్లో ఉందంటే చాలు, అక్కడ వాలిపోయారు. అలా అందివచ్చిన ప్రతి కంపెనీని చేజిక్కించుకున్నారు. చివరకు ప్రపంచంలోనే అత్యధిక ఉక్కు తయారు చేస్తున్న ’ఆర్సెలర్ మిట్టల్’ను నిర్మించారు. సాధారణంగా లాభాల్లో నడుస్తున్న కంపెనీలను కొనుగోలు చేసేందుకు అందరూ యత్నిస్తారు. కానీ, మిట్టల్ మాత్రం అందరికంటే భిన్నంగా నష్టాల్లోని కంపెనీల వైపే దృష్టి సారిస్తారు. వీలయినంత తక్కువ మొత్తంతో కంపెనీలను కొనుగోలు చేసి... తన నైపుణ్యం, వ్యాపార చతురతతో వాటిని లాభాల బాట పట్టిస్తారు. అంతేకాదండోయ్...వాటితో పాటు తాను కూడా దినదినప్రవర్ధమానంగా ఎదిగిపోతారు మిట్టల్. అదే ఆయన సిద్ధాంతం.
తొలి అడుగే విదేశాల్లో!
సాధారణంగా ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్నది పెద్దల సామెత. అయితే మిట్టల్ మాత్రం ముందు రచ్చ గెలిచి చూపిస్తాననే టైపు. అందుకే ఆయన తన వ్యాపారాన్ని తొలుత విదేశీ గడ్డమీదే స్థాపించారు. చిన్నపాటి ఉక్కు కంపెనీని నడుపుతున్న తండ్రికి సాయంగా ఉంటున్న క్రమంలో 1976లో ఇండోనేసియా వెళ్లిన మిట్టల్ కు, తన లక్ష్యమేమిటో తెలిసిపోయింది. తన ఆలోచనలకు సరిపడ అవకాశాలు భారత్ లో లేవని గ్రహించిన ఆయన ‘ఇస్పాత్ ఇండో’ పేరిట ఇండోనేసియాలో ఉక్కు కంపెనీని స్థాపించారు. తండ్రి వద్ద నేర్చుకున్న మెళుకువల సాయంతో ఈ యత్నంలో మిట్టల్ విజయాన్ని అందుకున్నారు.
అంతే, ఇక వెనుదిరిగిచూడాల్సిన అవసరం ఆయనకు రాలేదు. సొంత కంపెనీని చూసుకుంటూనే విస్తరణకు ఉన్న అవకాశాలు ఎక్కడున్నాయంటూ ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 1989లో ట్రినిడాడ్ లోని కంపెనీ ఆయన దృష్టిలో పడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడుగు ముందుకేశారు. అక్కడా విజయం తోడవడంతో రెట్టించిన ఉత్సాహంతో తన ‘పరుగు’లో మరింత వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, చైనా, మెక్సికో తదితర అగ్ర దేశాల్లోనే కాక బోస్నియా, రొమేనియా, మాసిడోనియా, అల్జీరియా, పోలండ్, కజకిస్థాన్, ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాలకూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
లాభాలొచ్చే కంపెనీలొద్దట!
ప్రపంచ ఉక్కు రంగంలో లాభాల బాటలో దూసుకుపోతున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అయితే 20వ శతాబ్దం ముగిసే వరకు వాటివైపే చూడలేదు మిట్టల్. ఎందుకంటే అలాంటి కంపెనీలకు తన అవసరం లేదనున్నారో, లేక తనకు అలాంటి కంపెనీలు వద్దనుకున్నారో మరి. ట్రినిడాడ్ కంపెనీ విజయంతో వరుసపెట్టి నష్టాల్లో నడుస్తున్న కంపెనీలను ఎక్కడ ఉన్నా వెతికి మరీ కొనుగోలు చేశారు. అలా ఆయన వ్యాపారం పలు దేశాలకు విస్తరించింది. ఆ జాబితా చెప్పకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. కాలిడిన ప్రతి చోటా లాభాలే చూసిన మిట్టల్, సదరు కంపెనీల్లో అప్పటిదాకా నిరాశానిస్పృహలతో కాలం వెళ్లదీస్తున్న కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నింపారు. దీంతో ఆయా కంపెనీల్లోని కార్మికులు మరింత కష్టపడి పనిచేసి, తమకు పునరుజ్జీవాన్ని ఇచ్చిన యజమానికి మరిన్ని లాభాలు వచ్చేలా తోడ్పాటునందించారు. 2006 వరకు మిట్టల్, ఇదే పంథాను కొనసాగించారు. 2006 తర్వాత ఆయనకు ఆ అవసరం లేకుండా చేసింది ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ.
సదల్పూర్ నుంచి లండన్ దాకా పయనం
రాజస్థాన్ లోని సదల్పూర్ లో 1950 జూన్ 15న మోహల్ లాల్ మిట్టల్ దంపతులకు జన్మించిన లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆ దంపతుల ముగ్గురు సంతానంలో ఒకడిగా కుటుంబంతో పాటు కోల్ కతా వలస వెళ్లారు. నాడు సదల్పూర్ లో కనీస వసతులు కూడా లేని నేపథ్యంలో మోహన్ లాల్ కుటుంబంతో పాటు కోల్ కతా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జీవనోపాధి నిమిత్తం ఓ చిన్న ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన మోహన్ లాల్... పిల్లల విద్యాభ్యాసం విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. చదువుపై తండ్రికున్న మమకారంతో చిన్ననాటి మిట్టల్, కోల్ కతా లోని ప్రతిష్టాత్మక సెయింట్ జేవియర్ కళాశాలలో కామర్స్ విభాగంలో డిగ్రీ పట్టా సాధించారు.
ఆ తర్వాత ఇక పై చదువులెందుకులే అనుకున్నారేమో, ... తండ్రి చేసే వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటూనే వ్యాపార మెళుకువలను ఒంటబట్టించుకున్నారు. ఈ మెళుకువలే తనను ఉన్నత స్థితికి చేర్చాయని ఆయన చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇండోనేసియాలో కంపెనీని కొనుగోలు చేసి, ఖాయిలా పడ్డ కంపెనీలను చేజిక్కించుకుంటూ సాగిన ఆయన తన స్థిర నివాసాన్ని లండన్ లో ఏర్పాటు చేసుకున్నారు.
వ్యాపార విభజన తర్వాత పెరిగిన దూకుడు
1994 దాకా ఉమ్మడి కుటుంబంగానే కొనసాగిన మోహన్ లాల్ ముగ్గురు కొడుకులు... ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుని వాటాలు పంచుకున్నారు. ఈ క్రమంలో విదేశాల్లోని కంపెనీలు మిట్టల్ కు దక్కాయి. ‘ఇస్పాత్ ఇంటర్నేషనల్’ పేరిట పేరు మార్చిన మిట్టల్ వ్యాపార విస్తరణలో మరింత వేగం పెంచారు. ఆ తర్వాత 2004లో ‘ఎల్ఎన్ఎం హోల్డింగ్స్’ పేరిట ఏర్పాటు చేసిన కంపెనీని ఇస్పాత్ ఇంటర్నేషనల్ లో విలీనం చేసి ‘మిట్టల్ స్టీల్’ గా పేరు మార్చారు. అప్పటికే ఇస్పాత్ ఇంటర్నేషనల్, ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంటర్నేషనల్ స్టీల్ గ్రూపు ఇంక్ (ఐఎస్ జీఐ)ని తనలో విలీనం చేసుకుంది. అప్పటికే పలు దేశాల్లో నష్టాల్లోని కంపెనీలను కొనుగోలు చేస్తూ వెళ్లిన మిట్టల్, ఐఎస్ జీఐ విలీనంతో 14 దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించినట్లైంది.
అంతేకాక 2006లో ఆయన వేసిన సాహసోపేతమైన అడుగు, ఆయనను ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీదారుగా మార్చేసింది. ప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ 16 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఉక్కు తయారీకే పరిమితం కాకుండా షిప్పింగ్, మైనింగ్, ఆటోమోటివ్, గృహోపకరణాల తయారీ, రవాణా, ప్యాకేజింగ్ లతో పాటు నిర్మాణ రంగంలోనూ ఆర్సెలర్ మిట్టల్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2.3 లక్షల మంది కార్మికులతో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్మికులను కలిగి ఉన్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
అత్యంత ధనికుల జాబితాలో చోటు
2006లో అప్పటికే ఉక్కు తయారీలో అగ్రగామిగా ఉన్న అర్సెలర్ ను కూడా చేజిక్కించుకునేందుకు మిట్టల్... అప్పటిదాకా ఏ ఒక్కరు చేయని సాహసాన్ని నమోదు చేశారు. ఎప్పుడూ నష్టాల్లో ఉన్న కంపెనీలను కొనుగోలు చేస్తూ పోయిన మిట్టల్, ఈ సారి కొత్తగా ఉక్కు దిగ్గజంగా పేరుగాంచిన ఆర్సెలర్ ను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగారు. అయితే ఆర్సెలర్ యాజమాన్యాన్ని ఒప్పించడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన, ఎంత భారీ మొత్తమైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించి ప్రపంచ వాణిజ్య దిగ్గజాలను ఆశ్చర్యంలో ముంచేశారు.
పలు దఫాలుగా జరిగిన చర్చల్లో భాగంగా ఆర్సెలర్ యాజమాన్యం, తమ కంపెనీని మిట్టల్ కు విక్రయించక తప్పలేదు. ఆర్సెలర్ కొనుగోలుతో మిట్టల్... ప్రపంచంలోనే 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి రంగంలో అగ్రస్థానంలో నిలిచి ‘ఉక్కు మనిషి’గా ఖ్యాతిగాంచారు. అదే సమయంలో ప్రపంచంలోని కుబేరుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. అర్సెలర్ ను విలీనం చేసుకుందుకు ఆయన చేసిన సాహసం... దుస్సాహసమేనని ప్రపంచ వాణిజ్య వర్గాలు పేర్కొనడం గమనార్హం. అయినా వెనకడుగు వేయని మిట్టల్, ఆర్సెలర్ ను చేజిక్కించుకుని సత్తా చాటారు.
ఆడంబరాలంటే అమిత ఇష్టం
ఊహించని రీతిలో అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరిన మిట్టల్ కు ఆడంబరాలంటే మక్కువ ఎక్కువే. 2004లో తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించిన మిట్టల్, అందుకోసం దాదాపు రూ.240 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రపంచంలోని పారిశ్రామిక, రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరైన ఈ వివాహ వేడుకను ఐదు రోజుల పాటు నిర్వహించి, ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశారు.
ప్రస్తుతం లండన్ లో నివాసముండే మిట్టల్ ఇల్లు కూడా ఓ అద్భుతమే. లండన్ లోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో మిట్టల్, తన రాజప్రాసాదం లాంటి ఇంటిని ముచ్చటగా చూసుకుంటూ మురిసిపోతారట. ఈ తరహా హంగూ ఆర్భాటాలు ప్రదర్శించిన నేపథ్యంలోనే రాజకీయ నేతలను కూడా తనవైపు తిప్పుకోగలిగారనే విమర్శలు ఆయన ప్రత్యర్థుల నుంచి వినిపిస్తుంటాయి. రొమేనియాలోని ఓ ఉక్కు కంపెనీని చేజిక్కించుకునేందుకు మిట్టల్... బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సిఫారసు చేయించుకున్నారట. మిట్టల్ అడిగిన మరుక్షణమే టోనీ బ్లెయిర్ కూడా రొమేనియా సర్కారుకు లేఖ రాయడమే కాక, మిట్టల్ కు అనుకూలంగా వ్యవహరిస్తే, యూరోపియన్ యూనియన్ లో స్థానం కోసం సాయపడతానని హామీ ఇచ్చారన్న అపవాదు లేకపోలేదు. ఏదేమైనా బ్రిటన్ ప్రధానినే తనదారికి తెచ్చకున్నాడంటే మిట్టల్... నిజంగా ఉక్కు మాంత్రికుడే.