భారత మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం... ఇంద్రా నూయీ

‘ఆశయాలేమో గొప్పగా ఉన్నాయి. వాటిని సాధించుకుందామంటే సరిపడేంత వనరులు లేవు మరి. ఏం చేయాలి? ముందు, వెనుకా ఆలోచించకుండా అమెరికా వచ్చేశాను’ అంటూ ఆ విద్యార్థిని మధనపడుతూ ఉండి ఉంటే... ఇంద్రా నూయీ పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంచనాలేసుకుని రావడానికి తానేమైనా, అనుభవజ్ఞురాలు కాదు కదా? ఈ తరహా పరిపరి విధాల యోచనలను పక్కనబెట్టేసిన ఆమె, తొలి ఇంటర్వ్యూ కోసం కొనుక్కోవాల్సిన వెస్టర్న్ సూట్ గురించే ఆలోచిస్తోంది. కనీసం 50 డాలర్లయినా కావాలి మరి. అప్పటికే విద్యాభ్యాసం కోసమే, నడిరాత్రి నుంచి సూర్యోదయం దాకా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. అలా సంపాదించుకున్న దాన్నుంచి, ఎలాగైతేనేం 50 డాలర్లు మిగిల్చింది.

ఇంటర్వ్యూకు వెళ్లే నాటికి అనుకున్నట్లుగానే తొలిసారిగా సూటుతోనే కార్పోరేట్ సంస్థ మెట్లెక్కింది. అయితే నిరాశే ఆమెకు స్వాగతం చెప్పగా ఊసురోమంటూ తిరిగి రాక తప్పలేదు. ఇక అక్కడితో ఆమె వెనుదిరిగి వుంటే కనుక... ఇంద్రా నూయీ ఎవరో కూడా తెలిసేది కాదేమో. ఓ అధ్యాపకుడు ఇచ్చిన బ్రహ్మాండమైన సలహా ఆమె దశనే మార్చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా చరిత్ర పుటలకెక్కింది.

చీరకట్టుతోనే తొలి కొలువు సాధన

తొలి ఇంటర్వ్యూ సందర్భంగా పాశ్చాత్య పోకడలను పరిశీలించిన మీదట, మనం కూడా అలా వెళ్లకపోతే ఇబ్బంది పడతామేమో అన్న మీమాంస నూయీని సంశయంలో పడేసింది. ఆ కారణంగానే శక్తికి మించి పనిచేసి, సూటు కొనుక్కుని ఇంటర్వ్యూ కు  హాజరైంది. ఆ డ్రస్సులో ఇబ్బంది పడుతున్న ఆమె... ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను మెప్పించలేకపోయింది. దీంతో గంపెడాశలు పెట్టుకున్న కొలువు యత్నం బెడిసికొట్టడంతో దిగాలుగా కనిపించిన నూయీని, ఆమె చదువుతున్న కళాశాలలోని ఓ ప్రొఫెసర్ విషయమేమిటని ఆరా తీశారు.

 ఏ వస్త్రధారణ అయితే నీకు సౌకర్యంగా ఉంటుందన్న ఆయన ప్రశ్నకు చీరేనంటూ తన సంప్రదాయ వస్త్రధారణను వివరించారు. అయితే చీరలోనే వెళ్లమంటూ ఆయన ఇచ్చిన సలహాను పాటించిన నూయీ... రెండో యత్నంలో ఉద్యోగం సాధించారు. అలా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో 1980లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా, నిండైన చీరకట్టునే ఆశ్రయించారు. అంతేకాదండోయ్... పెప్సీకో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్న నూయీ, బోర్డు మీటింగ్ లకు ఇప్పటికీ చీరలోనే వెళతారట!

తల్లి ప్రేరణతోనే ఉన్నతాశయాల దిశగా...!

చెన్నైకి చెందిన ఇంద్రా కృష్ణమూర్తి నూయీ... 1955 అక్టోబర్ 28న జన్మించింది.  సోదరితో కలిసి పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆమె తల్లి ప్రేరణతో కొత్త విషయాల వైపు దృష్టి సారించారు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండే ఇద్దరు పిల్లలకు నిత్యం కొత్త అంశాల గురించి ఆ మాతృమూర్తి చెప్పేవారట. ఈ క్రమంలోనే నూయీ మదిలో సరికొత్త అంశాలపైకి దృష్టి మళ్లింది. అంతేకాక, ఇతరుల కంటే ఉన్నతంగా రాణించాలనే ధ్యాస కూడా తల్లి బోధనల నుంచే అబ్బిందని తల్లిని గుర్తు చేసుకుంటూ మురిపెంగా చెబుతారు ఇంద్రా నూయీ.

ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే... అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా తొలుత తల్లితోనే మాట్లాడతానని కూడా ఆమె గర్వంగా చెబుతారు. తల్లి చెప్పిన మార్గాన్ని ఆశ్రయించి సమస్య నుంచి ఉమశమనం పొందుతారు. తన తల్లిలానే నూయీ కూడా ఇద్దరు కుమార్తెలకు తల్లి. ఓ వైపు ప్రపంచంలోనే పేరెన్నికగన్న కంపెనీ బాధ్యతలు మోస్తున్నప్పటికీ, తన తల్లిలానే పిల్లలకు అందుబాటులోనే ఉంటూ, ఉన్నతాశయాల గురించి నూరిపోస్తూనే ఉంటారు.

చదువులోనూ దిట్టే!

విద్యాభ్యాసం విషయానికి వస్తే, ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చెన్నైలోనే చదువుకున్న నూయీ, మేనేజ్ మెంట్ చదువు కోసం కోల్ కతా వెళ్లారు. అక్కడి ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించిన నూయీ, ఆపై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అయితే తాను చదవాలనుకున్న సంస్థలో విద్యనభ్యసించేందుకు మాత్రం ఆమెకు ఆర్థిక పరిస్థితులు కలసిరాలేదు. అయినా రాజీపడని నూయీ, ఖాళీ సమయాల్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని కనెక్టికట్ లోని యాలే వర్సిటీలో విద్యనభ్యసించారు. ఇందుకోసం రాత్రి పొద్దుపోయిన తర్వాత నుంచి తెల్లవారేదాకా రిసెప్షనిస్టుగా పనిచేశారు. చదువులో చురుకుగా ఉన్న నూయీ అంటే అక్కడి అధ్యాపకులకు ఎంతో ఇష్టం. అందుకే ఆమె ఎప్పుడైనా దిగాలుగా కనిపిస్తే చాలు, విషయం ఏంటని ఆరా తీసేవారు.

ఏబీబీ... దశ మార్చేసింది

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో పనిచేసిన కొంతకాలానికి మరింత పెద్ద కంపెనీలో ఉద్యెోగం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఏసియా బ్రౌన్ బొవేరీ  (ఏబీబీ) నూయీకి రెడ్ కార్పెట్ పరిచింది. నాలుగేళ్లుగా వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తించిన ఆమె అక్కడి ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్లో ఒకరిగా సత్తా చాటారు. కార్పోరేట్ వ్యవహారాలు, ప్రణాళిక విభాగానికి అధిపతిగా పనిచేసిన నూయీ, సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లారు. తద్వారా కంపెనీ పురోగతిపై తన ప్రత్యేక ముద్ర వేశారు. దీంతో వ్యాపార వర్గాల్లో తన పేరు ప్రస్తావన చర్చకొచ్చే స్థాయికి  ఆమె చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఆమెకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. ఇలా ఆమెకు రెడ్ కార్పెట్ పరిచిన కంపెనీల్లో ప్రపంచ విఖ్యాత కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (GE) కూడా ఉంది. అయితే ఆ కంపెనీలో చేరి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో మరి!

నూయీ అవసరం పెప్సీకి ఉందట!

జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిన సమయంలో దాదాపుగా ఆ కంపెనీలో చేరిపోయేందుకు నూయీ సిద్ధమైపోయారు. అప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ పేరుతో పాటు దాని యజమాని జాక్ వెల్చ్ కు విఖ్యాత పారిశ్రామిక వేత్తగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఆఫర్ ను తిరస్కరించే వారే ఉండరు. కానీ, నూయీ మాత్రం తిరస్కరించారు. కాదు, పెప్సీకో ఛైర్మన్... నూయీ చేత తిరస్కరింపజేశారు. ‘జనరల్ ఎలక్ట్రిక్ మంచి కంపెనీనే. దాని యజమాని అత్యుత్తమ సారధి. అందులో సందేహం అవసరం లేదు. అయితే మీలాంటి వ్యక్తులు పెప్సీకోకు కావాలి. అంతేకాక పెప్సీకోను మీకు మరింత ప్రత్యేకంగా మారుస్తాను’ అంటూ పెప్సీకో చీఫ్ చెప్పిన మాటలకు నూయీ కాదనలేకపోయారు. వెనువెంటనే పెప్సీకో కార్పోరేట్ వ్యవహరాలు, ప్రణాళిక విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా 1994లో విధుల్లో చేరిపోయారు. ఆ తర్వాత పెప్సీకో తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ నూయీ కీలక భూమిక పోషించారు. సంస్థను పోటీదారులకు సవాల్ చేసే విసిరే స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు.

పోటీ లేకుంటే మజా ఏముంది?

నిత్యం కార్పొరేట్ వ్యవహారాల్లో మునిగిపోయే నూయీని కదిలిస్తే... కార్పోరేట్ల పోటీతత్వంపై గంటల తరబడి మాట్లాడతారు. అసలు సరైన పోటీ లేకుంటే మజా ఏముంటుందంటూ ఎదురు ప్రశ్నిస్తారు. కోకకోలా లాంటి ఉద్ధండ సంస్థలుండబట్టే కదా పెప్సీ ఈ స్థాయికి ఎదిగింది అంటూ ఆశ్చర్యపరుస్తారు. పెప్సీకోలో చేరే నాటికి 44 ఏళ్ల వయసున్న నూయీ... సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. సంస్థ వేసిన ప్రతి అడుగులోనూ తన ప్రమేయాన్ని చాటుకున్న ఆమె పనితీరు కంపెనీకి అయాచిత లాభాలను సాధించిపెట్టింది.

సంస్థకు అనుబంధంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ చైన్ ను పూర్తిగా విలీనం చేసుకోవడం వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ట్రోపికానాతో పాటు క్వాకర్ ఓట్స్ ను చేజిక్కించుకునే క్రమంలోనూ నూయీ వాదనకు పెప్సీ విలువిచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయాలు పెప్సీకి మరింత ఊపునిచ్చాయి. దీంతో కంపెనీలో ఆమెకు మరింత ప్రాధాన్యం పెరిగింది. దీంతో వైస్ ప్రెసిడెంట్ హోదా నుంచి సీఎఫ్ఓగా పదోన్నతి పొందడంతో పాటు 2001లో కంపెనీ డైరెక్టర్ల బోర్డులోనూ స్థానం సంపాదించారు. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్ గానూ పెప్సీకోలో అత్యున్నత స్థానానికి ఎగబాకారు.

ఎల్లవేళలా తిరుమల వెంకన్న నామస్మరణ

చూడటానికి ఆధునిక యువతిలా కనిపించినా... స్వదేశాన్ని వదిలి పాశ్చాత్య దేశంలో స్థిరపడ్డా ఇంద్రా నూయీ... నేటికీ భక్తిభావం నుంచి అంగుళం కూడా దూరం జరగలేదు. అంతేకాదు, మరింత దగ్గరైందనే చెప్పాలి. నిత్యం తిరుమల వెంకటేశ్వర స్వామిని తలచుకుంటూనే కార్యరంగంలో దూసుకెళుతూ ఉంటారట. పని ఒత్తిడిలో అలసిపోతే...  ఒక్కసారి వెంకన్నను తలచుకుంటే ఇట్టే రీచార్జీ అయిపోతానని నూయీ చెబుతూ ఉంటారు. అంతేకాక ఒత్తిడి ఇబ్బంది పెడుతుంటే, చెన్నైలోని తల్లికి ఫోన్ చేసినా, ‘వెంకన్నను స్మరించుకో తల్లి, అంతా బాగుంటుందనే’ సమాధానమే వస్తుందని చెబుతుంటారు. ఇక ఇంటిలో రోజుకు 18 గంటల పాటు కర్ణాటక సంగీతం మారుమోగుతూనే ఉండాలట. కర్ణాటక సంగీతం వింటూ ఉంటే, దేవాలయంలోనే ఉన్నట్లుంటుంది అని నూయీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

కుటుంబ సభ్యులతో సమానంగా సిబ్బంది

అటు కుటుంబం, ఇటు కార్యాలయం రెండింటినీ సమానంగానే చూస్తానంటూ చెప్పే నూయి... రెండింటిలో దేనికి ప్రాధాన్యమిస్తారంటే మాత్రం కుటుంబమనే చెబుతారు. అయితే కార్యాలయంలోని సిబ్బందిని కూడా కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానంటూ తెలివిగా మాట్లాడేస్తారు. అసలు ప్రావీణ్యం లేని సిబ్బందితో కంపెనీలు ఎలా ఎదుగుతాయి? అని ప్రశ్నించే నూయీ... తన కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అంశంలో అత్యంత విలువైన సామర్ధ్యం ఉందని భావిస్తారు. చివరకు రిసెప్షనిస్టును కూడా ఇంటికి ఆహ్వానిస్తారు. తన పిల్లల దినచర్య ఏమిటనే విషయం కార్యాలయంలోని ప్రతి ఒక్కరికీ తెలుసట మరి. అందుకే నూయీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.


More Articles