CBSE/CISCE/STATE... ఏ సిలబస్ లో ఏముంది...?

సెంట్రల్ సిలబస్ లేదా స్టేట్ సిలబస్... తమ పిల్లల్ని ఏ సిలబస్ స్కూల్లో చదివిస్తే ప్రయోజనం అనే విషయాన్ని తేల్చుకోవాల్సి వస్తే తల్లిదండ్రులు ఎంతో మథన పడుతుంటారు. ఏది సులభంగా ఉంటుంది? ఏది ప్రయోజనం, మంచి స్టాండర్డ్స్ ఏ సిలబస్ లో ఉంటాయి? ఇలా ఎన్నో సందేహాలతో సతమతం అవుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల సిలబస్ లు, వాటి మధ్య ఉన్న తేడాలు, ఇతర సమాచారం తెలుసుకుందాం. 

CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్ టీ) గుర్తింపు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్కూళ్లకు విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక రూపొందించి  అమలు చేయడం కోసం ఈ బోర్డ్ ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం స్కూళ్లు ఈ సిలబస్ ను ఫాలో అవుతున్నాయి. నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన సీబీఎస్ఈ పరిధిలో ఉంటుంది. అది కూడా ఇంగ్లిష్ లేదా హిందీ విధానంలోనే. జవహర్ నవోదయ గురుకుల విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సర్వోదయ విద్యాలయాలు సీబీఎస్ఈ పరిధిలోకే వస్తాయి. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ తదితర వాటిల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ, ఎన్ఈఈటీ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహిస్తుంటుంది. 

పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక... 

representational imageసీబీఎస్ఈ సిలబస్ లో మ్యాథ్స్, సైన్స్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎక్కువ శాతం కాంపిటీటివ్ పరీక్షల్లో సీబీఎస్ఈ సిలబస్ పైనే ప్రశ్నలు ఉంటాయి. దాంతో మంచి ఫలితాల సాధనకు వీలుగా ఈ సబ్జెక్టులపై ఫోకస్ పెడతారు. విద్యార్థుల్లో మేథస్సు, సామాజిక స్ఫూర్తి, సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంటుంది. సిలబస్ మొత్తాన్ని యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్ కు ఒక పీరియడ్ చొప్పున కేటాయిస్తారు. దాంతో ప్రతీ విభాగాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడంతోపాటు ప్రిపరేషన్ కు అనువుగా ఉంటుంది. 

ఒక కాన్సెప్ట్ గురించి విద్యార్థులకు బోధించిన తర్వాత భిన్న విధానాల్లో విద్యార్థి నాలెడ్జ్ ను పరీక్షిస్తారు. దీంతో నేర్చుకున్న అంశాన్ని భిన్న సందర్భాల్లో ఎలా ఆచరించాలనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ కంటే కొంచెం కఠినంగా (ఉన్నత ప్రమాణాలతో) ఉంటుంది. 6 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ తోపాటు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వెజ్ … 9, 10 తగరతుల వారు మేథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ లను చదవాల్సి ఉంటుంది. 

సీబీఎస్ఈని విదేశాల్లోని పలు యూనివర్సిటీలు సైతం గుర్తిస్తున్నాయి. ఈ సిలబస్ లో చదివిన వారికి విదేశాల్లో ఉన్నత విద్యకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఇక్కడ చూడవలసిన మరో విషయం ఏమిటంటే సీబీఎస్ఈ సిలబస్ లో చదివిస్తున్నట్టయితే సబ్జెక్టుల వారీ ట్యూషన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అన్నది. అందులోనూ ఎక్కువ శాతం పట్టణాల్లోని స్కూళ్లే ఈ సిలబస్ ను అమలు చేస్తున్నాయి. సీబీఎస్ఈ స్కూళ్లు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పలు ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందులో JEE, NEET పరీక్షలు సీబీఎస్ఈ కరిక్యులమ్ ఆధారంగానే ఉంటాయి కనుక ఈ సిలబస్ లో చదివిన వారు ఎక్కువ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, సీబీఎస్ఈ స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. 

సీబీఎస్ఈ ‘పది’లో సబ్జెక్టులు

పదో తరగతిలో మేథమేటిక్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, ఒక భాష సబ్జెక్టుతోపాటు ఒక అదనపు సబ్జెక్ట్ ను విద్యార్థులు ఎంచుకోవాలి.  

లాంగ్వేజ్ ఆప్షన్లు... హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, కంప్యూటర్,జర్మన్, బెంగాలీ, గుజరాతి, కన్నడ, కశ్మీరీ, మరాఠి, మలయాళం, మణిపురి, ఒరియా, పంజాబి, సింది, తమిళ్, తెలుగు, ఉర్దు, లింబు, భూటియా, అరబిక్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, నేపాలి, టిబెటన్, మిజో, బోడో, తాంగ్ కుల్

అదనపు సబ్జెక్టులు... ఇన్ఫర్మేషన్  ఎడ్యుకేషన్, హోమ్ సైన్స్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఒకటి ఎంచుకోవాలి. 

సీబీఎస్ఈ ఇంటర్ లో సబ్జెక్టులు... 

మెడికల్ గ్రూప్... ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్

నాన్ మెడికల్ గ్రూప్... ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్

కామర్స్ గ్రూప్... ఇంగ్లిష్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనమిక్స్, థియరీ అండ్ ప్రాక్టీస్ మేనేజ్ మెంట్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్

ఆర్ట్స్ గ్రూప్... ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్ / సైకాలజీ, హిస్టరీ/ఎకనమిక్స్, జియోగ్రఫీ/మ్యాథ్స్/హోమ్ సైన్స్/ సోషియాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్/హిందీ/ సంస్కృతం 

ఆప్షనల్ సబ్జెక్టులు... ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వోకల్ లేదా ఇన్ స్ట్రుమెంటల్, క్లాసిక్ లేదా డ్యాన్స్

అనుకూలతలు

representational imageదేశవ్యాప్తంగా సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంటున్నందున బదిలీ లేదా ఏదేనీ ఇతర అవసరం ఏర్పడి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది ఉండదు. పాఠ్యాంశాల నాణ్యత ఎక్కువ. కరిక్యులర్, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆధారంగా ఆరు నుంచి పదో తరగతి వరకు మార్కులకు బదులు గ్రేడ్ విధానం అమల్లో ఉంటుంది. దీంతో మార్కుల పరంగా ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది. భారత్ లో అన్ని కళాశాలలు సీబీఎస్ఈ కోర్సులను గుర్తిస్తున్నాయి. అయితే, రాష్ట్రాల్లోని కళాశాలలు స్టేట్ బోర్డ్ సిలబస్ విద్యార్థులకు మరిన్ని సీట్లు కేటాయించడం ప్రతికూలమని చెప్పుకోవచ్చు. అలాగే సీబీఎస్ఈ సిలబస్ లో ఆర్ట్స్, లిటరేచర్ కు అంత ప్రాధాన్యం ఉండదు. 

కేరళలో సీబీఎస్ఈలో పది వరకు చదివిన వారు ఇంటర్ కు వచ్చే సరికి సగం మంది స్టేట్ సిలబస్ ఎంచుకుంటున్నారు. దీనికి కారణం స్టేట్ సిలబస్ లో అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశంతోపాటు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే భావన. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లోనే చదవాలనుకుని, రాష్ట్ర స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే వారికి స్టేట్ బోర్డు సిలబస్ అనువుగా ఉంటుందని చెప్పవచ్చు. 

కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్ సిఈ)

ఇది ప్రైవేటు రంగ బోర్డు. దీన్నే ఐసీఎస్ఈ అని కూడా అంటారు. ఈ బోర్డు పదో తరగతి విద్యార్థులకు ఇండియన్ సర్టిఫికెట్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ), ఇంటర్ విద్యార్థులకు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్ సీ) పరీక్షలను నిర్వహిస్తుంది. సీబీఎస్ఈ వలే నర్సరీ నుంచి ఇంటర్ వరకు కరిక్యులమ్, సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ చూస్తుంటుంది. కంటెంట్ పరంగా సీబీఎస్ఈ పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికకు భిన్నంగా ఉంటుంది. అదే సమయంలో సీబీఎస్ఈ కంటే సీఐసీఎస్ఈ సిలబస్ మరింత కఠిన ప్రమాణాలతో, అదనపు సిలబస్ తో ఉంటుంది. విద్యార్థి బహుముఖంగా రాణించేలా, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే విధంగా ఈ బోర్డ్ విద్యా విధానం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో దేశాలు దీన్ని గుర్తిస్తున్నాయి. 

దీని కరిక్యులమ్ విదేశీ కళాశాలల్లోని కోర్సుల కరిక్యులమ్ ను పోలి ఉంటుంది. కనుక విదేశాల్లో ఉన్నత విద్య కాంక్ష ఉన్నవారు ఈ సిలబస్ లో చదవడం ఉపయుక్తంగా ఉంటుందనుకోవచ్చు. పాఠ్యాంశాల్లో సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజ్, మ్యాథ్స్ తదితర అంశాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ఇంటర్ లో భిన్నమైన అంశాలు, నచ్చిన సబ్జెక్టుల ఎంపికకు అవకాశం ఉంటుంది. కోర్సు మధ్యలో వేరే బోర్డ్ కు మారడానికి అవకాశం లేదు. ఫీజులు ఎక్కువ. కాగా, ఐసీఎస్ఈ, ఐఎస్ సీ విద్యార్థులు 2018 నుంచి నూతన సిలబస్ లో చదవాల్సి ఉంటుంది. హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, మేథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలు మార్చాలని నిర్ణయం జరిగింది. 9, 10వ తరగతుల్లో సిలబస్ తగ్గించడం ద్వారా విద్యార్థులపై పడుతున్న భారాన్ని తగ్గించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,157 ఐసీఎస్ఈ స్కూళ్లు ఉన్నాయి. 1958లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ దీన్నిఏర్పాటు చేసింది. 

సబ్జెక్టుల వివరాలు

పదో తరగతిలో తప్పనిసరి సబ్జెక్టులు ఐదు... ఇంగ్లిష్, హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, ఏదేనీ భారతీయ భాష 

అడిషినల్ సబ్జెక్ట్స్...  మేథమేటిక్స్, సైన్స్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్, కమర్షియల్ స్టడీస్, టెక్నికల్ డ్రాయింగ్, ఫారీన్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్, ఎకనమిక్స్ లో రెండింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, మూడో అడిషనల్ సబ్జెక్ట్ విషయానికొస్తే కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనమిక్ అప్లికేషన్స్, కమర్షియల్ అప్లికేషన్స్, ఆర్ట్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, హోమ్ సైన్స్, కుకరీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ డ్రాయింగ్ అప్లికేషన్స్, యోగా, ఎన్విరాన్ మెంటల్ అప్లికేషన్స్ ఉన్నాయి. 

ఇంటర్ లో సబ్జెక్టులు

ఇంగ్లిష్ తోపాటు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్లీ యూజ్ ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ సబ్జెక్టులు తప్పనిసరి. అలాగే మూడు నుంచి ఐదు వరకు వేరే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. వాటిలో భారతీయ భాష, మోడ్రన్ ఫారిన్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఎకనమిక్స్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ స్టడీస్, మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హోమ్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, జియోమెట్రికల్ అండ్ మెకానికల్ డ్రాయింగ్, జియోమెట్రికల్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్, ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ. 

Representation imgae

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మధ్య తేడాలు...

  • సీబీఎస్ఈ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో బోధనను అనుమతిస్తుంది. కానీ, ఐసీఎస్ఈ మాత్రం కేవలం ఇంగ్లిష్ బోధనకే పరిమితం. 

  • సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా తన గుర్తింపు పొందిన స్కూళ్లలో చదివిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తుంది. అలాగే, తన గుర్తింపు లేని స్కూళ్లలో చదివిన విద్యార్థులను కూడా పరీక్షలకు రాయడానికి అవకాశం ఇస్తుంది. అదే, ఐసీఎస్ఈ మాత్రం తన గుర్తింపు లేని స్కూళ్లలో చదివిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించదు. 

  • సీబీఎస్ఈ బోర్డుకు కేంద్ర ప్రబుత్వ అనుమతి ఉంది. కానీ ఐసీఎస్ఈకి లేదు. అయితే, ఈ రెండు బోర్డులు అందించే సర్టిఫికెట్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సీబీఎస్ఈని దేశవ్యాప్తంగా అన్ని కళాశాలలు, యూనివర్సిటీలే ఎలా అయితే గుర్తిస్తున్నాయో… అదే విధంగా  సీఐఎస్ సీఈకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని కళాశాలల నుంచి గుర్తింపు ఉంది. 

  • సీబీఎస్ఈ  సిలబస్ ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో ప్రవేశ పరీక్షలతోపాటు పోటీ పరీక్షల్లోనూ నెగ్గేందుకు ఉపకరిస్తుంది. పైగా ఐసీఎస్ఈ కంటే సిలబస్ తేలిగ్గా ఉంటుంది.  సీబీఎస్ఈ సైన్స్, మ్యాథ్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సీఐఎస్ సీఈ మాత్రం అన్ని అంశాలపై సమానంగా ఫోకస్ పెడుతుంది. 

  • ఎన్ సీఈఆర్ టీ పరిశోధన ఫలితాల ప్రకారం... ప్రస్తుతం దేశంలో పాఠశాల విద్యా విధానం అంతా పరీక్ష ఆధారితంగానే నడుస్తోంది. కరిక్యులర్ యాక్టివిటీపైనే ఎక్కువగా దృష్టి ఉందని, అది కూడా నేర్చుకుని గుర్తు పెట్టుకునే విధానంలోనే ఉందని పేర్కొంది. కానీ విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ అబిలిటీ వంటివి కూడా అవసరమని స్పష్టం చేసింది. ఐసీఎస్ఈ లో నైపుణ్య వృద్ధికి, స్వతంత్ర పరిశోధన, క్రియేటివిటీకి అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ

స్టేట్ బోర్డ్

ప్రతీ రాష్ట్రంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధనకు వీలుగా తగిన పాఠ్య ప్రణాళికలను రూపొందించి అమలు చేయడానికి, ప్రమాణాలను పర్యవేక్షించడానికి, పరీక్షల నిర్వహణకు స్టేట్ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులు ప్రభుత్వ రంగంలోనివి. వీటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆమోదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి కోసం ఎస్ఎస్ సీ బోర్డు, ఇంటర్ కోసం ఇంటర్ బోర్డు ఉన్నాయి.  స్టేట్ సిలబస్ లో ఎక్కువగా ప్రాంతీయత కనిపిస్తుంటుంది. స్టేట్ సిలబస్ స్కూళ్లలో ఫీజులు సీబీఎస్ఈ స్కూళ్లతో పోల్చి చూసినప్పుడు తక్కువగా ఉంటాయి. స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది కనుక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు అనువుగా ఉంటుంది. 

అదే సమయంలో స్థానిక భాషలోనే విద్యా బోధనకు ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా స్టేట్ సిలబస్ ఇతర బోర్డుల సిలబస్ కంటే చాలా తేలిగ్గా ఉంటుంది. విద్యార్థులు బట్టీ విధానాన్నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. మౌలిక సదుపాయాలు తక్కువగా ఉంటాయి. అలాగే, స్టేట్ సిలబస్ లో పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయరు. చాలా ఆలస్యంగా ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళితే అక్కడి స్టేట్ సిలబస్ వేరేలా ఉంటుంది. అయితే, టెక్ట్స్ బుక్స్, టీచర్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఐబీ (ఇంటర్నేషన్ బకాలరేట్), ఐజీసీఎస్ఈ కూడా ఉన్నాయి. 

ఐబీ (ఇంటర్నేషన్ బకాలరేట్)

ఐబీ అనేది జెనీవా కేంద్రంగా నడిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంస్థ. పీవైపీ (ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్)లో కేజీ నుంచి ఐదవ తరగతి వరకు... ఎంవైపీ (మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్)లో 6 నుంచి 10వ తరగతి వరకు... డీవైపీ (డిప్లొమా ఇయర్స్ ప్రోగ్రామ్)లో 11,12వ తరగతుల కోర్సులు ఉంటాయి. విద్యలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అనలైటికల్ స్కిల్స్, లాంగ్వేజ్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ పై ఫోకస్ ఉంటుంది. డీవైపీలో అంటే 11,12 తరగతుల్లో విద్యార్థులు ఒక్కో గ్రూపు నుంచి ఒక్కో సబ్జెక్ట్ ను ఎంచుకోవచ్చు. దానితోపాటు కోర్ సబ్జెక్ట్ ఒకటి తీసుకోవాలి. తమ పిల్లలను విదేశీ యూనివర్సిటీల్లో చదివించాలనుకునే వారు ఐబీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలో చేర్పించవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ కంటే ఐబీ విధానంలో చదివే వారికి వ్యయం ఎక్కువ అవుతుంది. ఇతర స్కూళ్లలో చదివిన వారు ఐబీ పరీక్షలు రాయడానికి వీల్లేదు. ప్రైవేటుగా ట్యూషన్ కు వెళదామనుకుంటే చెప్పే ట్యూటర్లు లబించడం కూడా కష్టం. 

ఐజీసీఎస్ఈ (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)

పేరులో ఉన్నట్టుగా అంతర్జాతీయ పాఠ్యాంశాలతో కూడుకున్నది. సీబీఎస్ఈ లో నేషనల్ కరిక్యులమ్ ఉంటుంది. అదే ఐజీసీఎస్ఈలో అంతర్జాతీయ అంశాలతో కూడిన కరిక్యులమ్ ఉంటుంది. ఇందులో ప్రతీ సబ్జెక్టుకో సర్టిఫికేషన్ ఇస్తారు. కోర్ కరిక్యులమ్ లో ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ లతో పాటు మేథమేటిక్స్, ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంటాయి. వీటికి అదనంగా విద్యార్థులు ఇతర సబ్జెక్టుల నుంచి ఒకటి ఎంపిక చేసుకోవాలి. రాత, మౌఖిక పరీక్షలతో విద్యార్థి నాలెడ్జ్ ను అంచనా వేస్తారు. ఇది కూడా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి అనువుగా ఉంటుంది. 


More Articles