ఆరోగ్య బీమాతో జీవితానికి కొండంత అండ!

హెల్త్ ఈజ్ వెల్త్... అన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం అన్న విషయం చాలా మందికి తెలుసు. ఆరోగ్యంగా ఉంటే అంతకుమించి వేరే సంపద ఏం కావాలి. మనిషి ఏది అనుభవించాలన్నా… అందుకు ఆరోగ్యం సహకరించాలి. చిన్న అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళితే వేలాది రూపాయలు ఖర్చవుతున్న కాలంలో ఏదైనా పెద్ద సమస్యే వచ్చిందనుకోండి, కూడబెట్టిన రాసులు కూడా కుప్పకూలే పరిస్థితి తలెత్తుతుంది. ఏటేటా పెరిగిపోతున్న వైద్య ఖర్చులతో పేద, మధ్య తరగతి ప్రజలందరూ తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుని తమ జీవితానికి ఆరోగ్య రక్షణ కల్పించుకోవాలి.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడానికి ఓకే అనుకుంటున్నారా...? అయితే ఎలాంటి పాలసీ తీసుకోవాలి, ఏమేమి ఉండాలి, ఒక్కడికేనా, కుటుంబ సభ్యులందరికీనా? ఇలా సందేహాలు వస్తుంటాయి. హెల్త్ పాలసీల్లో ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఇవి ఒక్కరికే పరిమితం అవుతాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అయితే కుటుంబ సభ్యులందరికీ కలిపి తీసుకునే పాలసీలు. 

ఉదాహరణకు రూ.2 లక్షల రూపాయల బీమా పరిహారంతో భార్యా భర్త, ఇద్దరు పిల్లలున్న కుటుంబానికి ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే.. ఆ కుటుంబంలో ఒక్కరు లేదా అందరూ కలిపి ఆ ఏడాదిలో 2 లక్షల రూపాయల పరిహారాన్ని పొందవచ్చు. రూ.2 లక్షల క్లెయిమ్ రీచ్ అయితే ఇక ఆ ఏడాదిలో దేనికీ పరిహారం ఇవ్వరు. ఇండివిడ్యువల్ పాలసీల కంటే ఫ్లోటర్ పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం ఫ్లోటర్ పాలసీలు దంపతులు, వారి పిల్లలకు పరిమితం అవుతుండగా... కొన్ని తల్లిదండ్రులకు కూడా వర్తింపజేస్తున్నాయి. అలాగే, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను దృష్టిలో పెట్టుకుని వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 

సర్జరీలకు, వ్యాధులకు ప్రత్యేక కవర్

representation imageసర్జరీ అండ్ క్రిటికల్ ఇల్ నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వీటిని విడిగా పాలసీ రూపంలోనూ లేదంటే అప్పటికే పాలసీ ఉన్నవారు రైడర్ రూపంలోనూ తీసుకోవచ్చు. తీవ్ర అనారోగ్యాల బారిన పడిన సందర్భాల్లో ఇది అక్కరకు వస్తుంది. కేన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, పక్షవాతం ఇలాంటి వ్యాధులనమాట. వీటిలో ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి బారిన పడితే వైద్య  ఖర్చులు భరించడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. అందుకే ఈ పాలసీ/రైడర్ ఉన్నవారు తీవ్ర వ్యాధుల బారినపడినట్టు ధ్రువీకరణ అయితే పరిహారం మొత్తాన్ని ఏక మొత్తంలో చెల్లించేస్తాయి కంపెనీలు. 

ఇండెమ్నిటీ… బెనిఫిట్

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇండెమ్నిటీ అండ్ బెనిఫిట్ అని రెండుగా చెబుతారు. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఇండెమ్నిటీ పాలసీలుగా పేర్కొంటారు. ఇవి రూమ్ రెంట్, డాక్టర్ ఫీజు, ఇతర హాస్పిటల్ ఖర్చులను చెల్లిస్తాయి. సాధారణ ఇబ్బందులైతే ఇవి ఓకే. కానీ తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు క్రిటికల్ ఇల్ నెస్ వంటి బెనిఫిట్ పాలసీలు అక్కరకు వస్తాయి. జీవన విధానంలో మార్పులు, కాలుష్యం కారణంగా నేడు ఎన్నో రకాల తీవ్ర వ్యాధులు యుక్త వయస్సులోనే వచ్చేస్తున్నాయి. అందుకే కంపెనీలు బేసిక్ పాలసీతోపాటు డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, కేన్సర్ ఇలాంటి బెనిఫిట్ తో కూడిన రైడర్లను అందిస్తున్నాయి.  

సర్జికల్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకుని ఉంటే.. ఏ సర్జరీ అవసరం ఏర్పడినా అది పాలసీ పరిధిలో ఉంటే, దానికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒకేసారి కంపెనీలు చెల్లించేస్తాయి. క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ కూడా ఇంతే. ఒక్కో వ్యాధికి ఇంత మొత్తం చొప్పునే బీమా తీసుకుంటే... సంబంధిత వ్యాధికి గురైనప్పుడు ఆమేరకు పరిహారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు హార్ట్ ఎటాక్ బారిన పడితే దానికి 10 లక్షల మేరకు బీమా తీసుకుని ఉన్నారనుకోండి. ఆ మొత్తాన్ని చెల్లించేస్తాయి. అయితే వీటికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కట్టగలిగే శక్తి లేని వారు బేసిక్ ప్లాన్ కే పరిమితం కావడం మంచిదని నిపుణుల సలహా. ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చే అవకాశం ఉందని ముందే తెలిస్తే  అప్పుడు ఆ బెనిఫిట్ తో కూడిన రైడర్ తీసుకోవచ్చు. అయితే, ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం కొన్నేళ్లు ఆగాల్సిందే మరి. 

మేటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్

representation imageసాధారణ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అన్నింటిలోనూ మేటర్నిటీ కవర్ లేదు. కొన్ని మాత్రం మేటర్నిటీ కవరేజీని పాలసీ తీసుకున్న రెండు నుంచి మూడేళ్ల తర్వాత అందిస్తున్నాయి. అందుకే ఆ లోపు మేటర్నిటీ కవర్ అవసరం పడుతుంది అనుకుంటే ప్రత్యేకంగా మేటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కవరేజీ ఉంటే ఆస్పత్రిలో ప్రసవ ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. డెలివరీకి ముందు, తర్వాత తీసుకునే చికిత్సకు కూడా పరిమిత కాలం పాటు అయ్యే వ్యయాన్ని అందిస్తాయి. 

పర్సనల్ యాక్సిడెంటల్ కవర్

యాక్సిడెంటల్ డెత్ ఆర్ పర్మినెంట్ ఆర్ పార్షియల్ డిస్ మెంబర్ మెంట్ అంటూ రైడర్లను హెల్త్ పాలసీలు అందిస్తుంటాయి. ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ మేరకు పరిహారం చెల్లిస్తారు. అలాగే పూర్తిగా అంకవైకల్యానికి లోనైనా లేదా పార్షిక అంగవైకల్యం పాలైనా పరిహారం అందుతుంది. ఈ రైడర్ సాధారణ జీవిత బీమాతోనూ అందుబాటులో ఉంది. లేదా విడిగానూ అందుబాటులో ఉంది. 

ఎంత ముందుగా తీసుకుంటే

representation imageఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే వ్యాధులకు బీమా కంపెనీ పరిహారం చెల్లించక తప్పదు. ఒకవేళ అప్పటికే వ్యాధుల బారిన పడి ఉంటే వాటికి బీమా కవర్ కోసం మూడేళ్లకుపైగా ఆగాల్సి వస్తుంది. ప్రీమియం కూడా తేడా ఉంటుంది. పెళ్లి కాని వారు అయితే వారితోపాటు తల్లిదండ్రులకు కూడా కవర్ తీసుకుంటే సరిపోతుంది. మరి అదే పెళ్లయిన వారు కుటుంబ సభ్యులు అందరికీ కలిపి ఫ్లోటర్ పాలసీ తీసుకోవడమే కరెక్ట్. ఇక్కడో లాజిక్ ఉంది. భార్యా భర్త యుక్త వయస్కులై, పిల్లలు కూడా ఉన్నారనుకోండి. పాలసీ తీసుకునే వ్యక్తి తల్లిదండ్రులకు కూడా తీసుకోవాలని అనుకుంటే వారు పెద్ద వయసువారై తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటే వారికోసం ప్రత్యేకంగా ఓ పాలసీ తీసుకుని... తాను, తన భార్య, పిల్లలకు కలిసి ఓ పాలసీ తీసుకోవడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే అనారోగ్య సమస్యలున్నవారిని కూడా ఫ్లోటర్ పాలసీలో భాగం చేస్తే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారిని బేస్ చేసుకునే ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.

పైగా వారు ఎప్పుడైనా ఆస్పత్రి పాలైతే బీమా పరిహారం మొత్తం వారికే ఖర్చు కావచ్చు. మిగిలిన వారికి అదే ఏడాదిలో అనారోగ్య సమస్య వస్తే జేబులోంచి పెట్టుకోవాలి. కేవలం తల్లిదండ్రులే కాదు భార్యా భర్తల్లో ఒకరు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినా సరే అలాంటి హెల్త్ రిస్క్ ఉన్న వారు వ్యక్తిగత పాలసీ తీసుకుని మిగిలిన వారికి ఫ్లోటర్ పాలసీ తీసుకోవడం సరైన నిర్ణయమని నిపుణుల సలహా. లేదు అందరికీ కలిపి ఒక్కటే తీసుకుంటాం అనుకుంటే అలానే కానీయండి. కానీ బీమా ఎక్కువ మొత్తానికి తీసుకోండి. ప్రస్తుతం ఓ వ్యక్తి హాస్పిటల్ లో చేరితే వ్యాధులను బట్టి 50వేల నుంచి 3 లక్షల రూపాయల వరకు సగటున ఖర్చవుతోంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో ఈ ఖర్చుని ముడిపెట్టి చూస్తే 20 ఏళ్ల తర్వాత ఇదే విధమైన వైద్యానికి 13 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అందుకే బీమా పరిహారం ఎక్కువ మొత్తానికి తీసుకోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. 

పాలసీలో దాగి ఉన్న ఓ నిజం

బీమా పాలసీల్లో తప్పనిసరిగా చూడాల్సిన అంశం  ఒకటుంది. హాస్పిటల్ రూమ్ రెంట్ క్యాపింగ్. హాస్పిటల్ లో చేరినప్పుడు ఒక రోజులో రూమ్ రెంట్ పరిమితి 4వేల రూపాయలు అని పాలసీలో నిబంధన ఉందనుకోండి. ఆ పరిమితి ఒక్క రూమ్ తోనే ఆగిపోదు. పాలసీలో అన్నింటికీ వర్తిస్తుంది. అదెలానో చూద్దాం. రాముకు హార్ట్ అటాక్ రావడంతో అతడ్ని కుటుంబ సభ్యులు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐదు రోజుల్లో క్యూర్ అయిపోయింది. ఈ ఐదు రోజులకు గాను రోజుకు 8వేల రూపాయల రెంట్ ఉన్న రూమ్ తీసుకున్నారనుకుందాం. ఐదు రోజులకు 40వేల రూపాయలు అయింది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ రోజుకు రూ.4వేల చొప్పున రూ.20వేలే చెల్లిస్తుంది. అంటే పాలసీలో పేర్కొన్న మేరకే రూమ్ రెంట్ చెల్లిస్తుంది. ఇదే ప్రపోర్షనేట్ లో మిగిలిన ఖర్చులకు కూడా వర్తింపజేస్తుంది. ఎలా అంటే సర్జరీకి లక్ష రూపాయల ఖర్చు అయితే 50వేల రూపాయలు, డాక్టర్ చార్జీలు 5వేల రూపాయలు అయితే 2,500 రూపాయలు, వైద్య పరీక్షలకు 10వేల రూపాయలు అయితే 5వేల రూపాయలే చెల్లిస్తాయి. మందులకు అయ్యే వ్యయాన్ని మాత్రం పరిమితి మేరకు పూర్తిగా చెల్లించేస్తాయి. రూమ్ రెంట్ క్యాపింగ్ లో దాగి ఉన్న రహస్యం ఇదే. ఒకవేళ 10వేల రూపాయల రెంట్ ఉన్న రూమ్ తీసుకుని ఉంటే పరిమితి మేరకు 4వేల రూపాయలే వస్తుంది. అంటే వాస్తవ వ్యయంలో 40 శాతమే వచ్చింది. ఇదే ప్రపోర్షనేట్ లో సర్జరీకి లక్ష రూపాయలు ఖర్చయితే 40వేల రూపాయలు, డాక్టర్ చార్జీలు ఐదు వేల రూపాయలకు గాను రెండు వేల రూపాయలు ఇలా చెల్లిస్తుంది బీమా కంపెనీ. అందుకే పాలసీ తీసుకునే సమయంలో పాలసీ విత్ ప్రైవేటు రూమ్ సదుపాయం, రూమ్ రెంట్ క్యాపింగ్ లేనివి, రూమ్ రెంట్ క్యాపింగ్ ఉన్నవి అనే ఆప్షన్లను గమనించాలి. ఎక్కువ రూమ్ రెంట్ క్యాపింగ్ తీసుకుంటే 20 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణ ప్రభావంతో అదేమంత ప్రయోజనకరం కాకపోవచ్చు. అందుకే ప్రైవేటు రూమ్ సదుపాయం ఉన్నవి, రూమ్ రెంట్ క్యాపింగ్ లేని ఆప్షన్లు పరిశీలించవచ్చు. 

representation image

సబ్ లిమిట్ / కో పే

ఆస్పత్రిలో అయ్యే వైద్య ఖర్చుల భారం తగ్గించుకునేందుకు కంపెనీలు సబ్ లిమిట్, కో పే అని కొన్ని పరిమితులను పాలసీల్లో దూర్చేస్తుంటాయి. ఉదాహరణకు కంటి వైద్య చికిత్సకు అయ్యే వ్యయాన్ని పాలసీ పరిహారంలో ఇంత శాతానికే అని పరిమితం చేయవచ్చు. సర్జరీ వ్యయాలకూ పరిమితులను పెట్టే పాలసీలు ఉన్నాయి. డిడక్షన్ అనే పదం కనిపించినా పాలసీ డాక్యుమెంట్ లో పూర్తిగా చదివి తెలుసుకోండి. ఆ లిమిట్ సహేతుకం అనిపిస్తేనే తీసుకోండి. లేకపోతే అనువైన దాని కోసం అన్వేషించండి. కో పే అంటే కొన్ని రకాల వైద్య చికిత్సలకు అయ్యే వ్యయాన్ని కంపెనీలు పూర్తిగా చెల్లించకుండా నేనింత, నువ్వింత అని తెలివిగా విధించే నిబంధన. ఇలాంటివి వద్దనుకుంటే బీమా ప్రీమియం ఎక్కువవుతుంది మరి. అందుకే పాలసీ డాక్యుమెంట్ లో నిబంధలన్నింటినీ జాగ్రత్తగా చదివి తెలుసుకోవాలి. అన్ని కీలకమైన నిబంధనలు తనకు తెలిసినట్టుగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ పై సంతకం పెట్టాలి. ఈ షీట్ ను బీమా కంపెనీలు ఐఆర్డీఏకు సమర్పించాల్సి ఉంటుంది. కనుక అన్నింటినీ తెలుసుకోవాలి. 

నెట్ వర్క్

పాలసీ తీసేసుకుంటే సరిపోతుందా..? ఆ బీమా కంపెనీ నెట్ వర్క్ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో చూడాలిగా. అందుకే తాము నివసించే ప్రాంతాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ సదుపాయాన్ని ఆ పాలసీ అందిస్తుందేమో చూసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటే ఇంటర్నేషనల్ కవరేజీ ఉండే వాటిని ఎంపిక చేసుకోవడం అనువుగా ఉంటుంది. 

సూపర్ టాపప్

representation imageనలుగురు సభ్యులు గల కుటుంబానికి 4 లక్షల రూపాయలతో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటున్నారనుకోండి. 15 నుంచి 20 ఏళ్ల తర్వాత అది ఏమూలకు సరిపోతుంది. కనుక 4 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటూనే సూపర్ టాపప్ పేరుతో మరో మరో 10 లేదా 15 లక్షల రూపాయలకు సూపర్ టాపప్ కవర్ తీసుకుంటే నయం. అసలు పాలసీనే 19 లక్షల రూపాయలకు తీసుకుంటే పోలా అనుకుంటే ప్రీమియం చాలా అవుతుంది. అదే టాపప్ రూపంలో తీసుకుంటే అసలు పాలసీ ప్రీమియానికి మరో 20 నుంచి 30 శాతం మాత్రమే అదనంగా వ్యయం అవుతుంది. అదే నేరుగా 19 లక్షలకు అంటే 28వేల రూపాయలు సమర్పించుకోవాలి. దానికంటే టాపప్ తీసుకుని మొత్తం 18 నుంచి 20వేలు చెల్లిస్తే చాలదూ! ఒకవేళ పాలసీ తీసుకునే సమయంలో అంత అవసరం లేదనుకుంటే తర్వాత టాపప్ యాడ్ చేసుకునే సదుపాయం ఉందో లేదో చూసుకోవాలి. ఆ సదుపాయం ఉన్న పాలసీ వైపే మొగ్గు చూపడం మంచిది. 

క్రాంప్ర హెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్

హాస్పిటల్లో చేరి ఒక రోజు తక్కువ కాకుండా ఉండి తీసుకునే వైద్యానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే కంపెనీలు చెల్లిస్తుంటాయి. అలా కాకుండా ఔట్ పేషెంట్ గా తీసుకునే చికిత్సా వ్యయం, హాస్పిటల్లో చేరకముందు సంబంధిత అనారోగ్య సమస్యకు అయిన వ్యయం, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయానికి కవరేజీ ఉండేలా కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం సరైనది. కంపెనీ తరఫున గ్రూప్ పాలసీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కుటుంబానికి ఓ ఫ్లోటర్ పాలసీ తీసుకోవడం సర్వదా రక్ష. అనుకోకుండా ఉద్యోగాన్ని వీడాల్సిన సందర్భం వస్తే, ఉద్యోగం లేని సమయంలో హాస్పిటల్ పాలైతే పరిస్థితి ఊహించుకోండి. అందుకే కుటుంబానికి ఒక ఫ్లోటర్ పాలసీ అవసరం.  

అనవసర సదుపాయాలు వద్దు

representation imageఏది జరిగినా పాలసీతో పరిహారం రావాలని ఆశించడం సరైనది కాదు. దీని వల్ల ప్రీమియం తడిసి మోపెడు అవుతుంది. ముఖ్యంగా సర్జరీల సమయంలో ఎంత మొత్తం పరిహారం అందుతుంది, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలను పూర్తిగా చెల్లిస్తారా, రూమ్ రెంట్ లిమిట్ ఉందా, ఐసీయూ చార్జీల్లో పరిమితులు ఉన్నాయా?, మందుల వ్యయం తిరిగి చెల్లిస్తారా?, క్యాష్ లెస్ సదుపాయం ఉందా, హాస్పిటల్స్ నెట్ వర్క్ కవరేజీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడం చాలా ముఖ్యం. వీటి కోసం ప్రీమియం కొంత ఎక్కువ చెల్లించినా నష్టం లేదు. కానీ అంబులెన్స్ చార్జీలు, డైలీ హాస్పిటల్ క్యాష్ ఫెసిలిటీ, ఇంట్లో వైద్యానికి అయ్యే వ్యయం ఇలాంటి ప్రాముఖ్యత లేని సదుపాయాలకు అంత ప్రాముఖ్యత అవసరం లేదని నిపుణుల సలహా. దీనివల్ల ప్రీమియం భారం కాకుండా ఉంటుంది. 

పాలసీ ఎంత కాలానికి?

ఐఆర్డీఏ తాజా నిబంధనల ప్రకారం ఆరోగ్య బీమా పాలసీలను జీవిత కాలానికి ఇష్యూ చేయాలి. మీరు తీసుకునే పాలసీలో వయసు పరిమితులు ఉన్నాయా? అన్నది గమనించుకోవాలి. అసలు ఆరోగ్య బీమా పాలసీ 50 ఏళ్ల తర్వాత నుంచి జీవించి ఉన్నంత కాలం చాలా చాలా అవసరమైన ఆధారం. 

థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ తో లేటే

టీపీఏల ద్వారా హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల క్లెయిమ్ ప్రాసెస్ కు అధిక సమయం తీసుకుంటుంది. కొన్ని టీపీఏల సేవలు బాగుంటే కొన్ని అథమంగా ఉన్నాయి. వీలుంటే కంపెనీ నుంచి నేరుగా పాలసీ తీసుకోవడం నయం. లేదా సంబంధిత కంపెనీ టీపీఏ సర్వీసులు బాగున్నాయా లేదా పరిశీలించి తీసుకోవాలి. 

నో క్లెయిమ్ బోనస్

ఒక ఏడాదిలో పాలసీ దారుడు తరఫున ఎలాంటి క్లెయిమ్స్ లేకపోతే కంపెనీలు తర్వాతి సంవత్సరం ప్రీమియంలో బోనస్ రూపంలో తగ్గింపును అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు బోనస్ కు బదులు బీమా పరిహారం మొత్తాన్ని పెంచుతున్నాయి  ప్రీమియాన్ని పెంచకుండానే. 

పాలసీ పోర్టబులిటీ

బీమా కంపెనీ సేవలు నచ్చని సందర్భాల్లో పోర్టబులిటీ ఆప్షన్ అక్కరకు వస్తుంది. దీంతో వేరే కంపెనీకి మారిపోవచ్చు. అందుకే పాలసీ తీసుకునే సమయంలోనే పోర్టబులిటీ సదుపాయం ఉందా, లేదా? గమనించాలి. 

ఉచిత చెకప్

కొన్ని కంపెనీలు ఏడాదికోసారి ఉచిత చెకప్ అంటూ పాలసీ బెనిఫిట్స్ పత్రంలో పేర్కొంటాయి. కానీ నిజంగా ఉచితమేమీ కాదు. ఆ మేర ప్రీమియంలో పోటు ఉంటుందని నిపుణుల విశ్లేషణ. కనుక నిజంగా ఏడాదికోసారి చెకప్ లు అవసరమైతేనే ఈ సదుపాయాన్ని ఓకే చేసుకోవాలి. 

పన్ను పరిధిలో ఉంటే ఈ పాలసీతో ఆదా

ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియానికి రూ.25వేల వరకు సెక్షన్ 80డీ కింద రాయితీ ఉంది. అదే 50 ఏళ్లు దాటిన వారయితే 30వేల ప్రీమియం వరకు రాయితీ పొందవచ్చు. 

క్లెయిమ్స్ హిస్టరీ

పాలసీ తీసుకుంటే సరిపోదు.. అవసరంలో పరిహారం కూడా అందాలి. అందుకే ఎక్కువ క్లెయిమ్స్ ను ప్రాసెస్ చేసే కంపెనీల వైపు మొగ్గు చూపడం నయం. పాలసీ తీసుకునే ముందు క్లెయిమ్స్ హిస్టరీ సమాచారం కోరితే కంపెనీలు అందిస్తాయి. 

ప్రీమియం

మార్కెట్లో పదుల సంఖ్యలో కంపెనీలు వందకు పైగా ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. ప్రీమియం తక్కువగా ఉందన్న కారణంతో గుడ్డిగా ఓ పాలసీని తీసేసుకోవద్దు. మంచి క్లెయిమ్స్ హిస్టరీ ఉన్న కంపెనీ అయి ఉండి, అన్ని ముఖ్యమైన అనారోగ్య సమస్యలకు కవరేజీ ఇస్తున్న పాలసీనే అవసరం. అలాంటి సదుపాయాలతో ఉన్న పాలసీల్లో తక్కువ ప్రీమియం ఉన్నవి నిశ్చింతగా ఎంపిక చేసుకోవచ్చు. ముందు సౌకర్యాలు, బీమా రక్షణ, భరోసా. ఆ తర్వాతే ప్రీమియం అన్నది ఆరోగ్య బీమా పాలసీలో చూడాల్సినది. 

వీటికి పరిహారం రాదు

పాలసీ తీసుకున్న తొలి 30 రోజుల్లోపు హాస్పిటల్ పాలైతే పరిహారం రాదు. ముందస్తుగా ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం రెండు నుంచి మూడేళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. యుద్ధం, తీవ్ర వాదం, అణు విస్పోటనం లేదా అణు ప్రభావం, ఆత్మహత్యాయత్నం తదితర సందర్భాల్లో పరిహారం ఇవ్వడం లేదు. అలాగే, సౌందర్య చికిత్సలు, లింగమార్పిడి చికిత్సలకు కూడా పరిహారం ఉండదు. చాలా కంపెనీలు అల్లోపతి కాకుండా ఇతర వైద్య పద్ధతుల్లో (ఆయుర్వేదం, హోమియోపతి తదితర) చికిత్సలకు కవరేజీ ఇవ్వడం లేదు. 


More Articles