ఆర్.త్యాగరాజన్... ఖాతాదారులకు 'శ్రీరామ్' రక్ష!
2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డుల జాబితాలో ఆర్.త్యాగరాజన్ పేరు ఉంది. దీనిని చూసిన వారంతా ఎవరీయన? అనున్నారు. తెలిసిన తర్వాత 'ఆయనేనా.. ఈయన' అనుకున్నారు అంతా. అవును మరి, తాను స్థాపించిన కంపెనీ జనాల నోళ్లలో నానింది కానీ, ఆయన మాత్రం కార్యాలయానికే పరిమితమయ్యారు. సెల్ ఫోన్ కూడా వాడేందుకు ఇష్టపడని త్యాగరాజన్... ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపరు. అందుకే శ్రీరామ్ చిట్స్ అంటే తెలిసినంతగా, త్యాగరాజన్ పేరు తెలియదు మనకు.
నాలుగు దశాబ్దాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడితో మొదలైన శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీని త్యాగరాజన్... ఇంతింతై, వటుడింతై అన్న చందంగా రూ. 60 వేల కోట్లకు తీసుకెళ్లగలిగారు. ఎందరో ట్రక్కు డ్రైవర్లను యజమానులుగా మార్చారు. ట్రక్కు కొనుగోళ్లకు అప్పిచ్చే సంస్థగా ప్రారంభమైన కంపెనీని వివిధ రంగాలకు విస్తరించారు. ప్రస్తుతం శ్రీరామ్ గ్రూపు 95 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది. దేశంలోనే అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పోరేషన్ గా ఎదిగింది.
అపార అనుభం ఆయన సొంతం...!
తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఆర్.త్యాగరాజన్... న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీలో మేనేజ్ మెంట్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సదరు ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ (ఐఎస్ఐ) నుంచి గణితంతో పాటు మేథమేటిక్ స్టాటిస్టిక్స్ లోనూ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం చార్టర్డ్ అకౌంటెన్సీలో ప్రవేశించి జేబీ బోదా అండ్ కంపెనీలో పదేళ్ల పాటు పనిచేశారు. న్యూ ఇండియా అస్స్యూరెన్స్ లో ఉండగా అక్కడ పనిచేస్తున్న డైరెర్టర్ బీకే షా పనితీరు పట్ల త్యాగరాజన్ ఆకర్షితులయ్యారు. అక్కడే ఫైనాన్స్ రంగంలోకి రావాలన్న సంకల్పం ఆయనలో బలంగా నాటుకుంది. అంతేకాక ఫైనాన్సింగ్ లో బీకే షా అనుసరిస్తున్న ఆశయాలకు మరింత దీటుగా తన కంపెనీని తీర్చిదిద్దాలని కూడా త్యాగరాజన్ తీర్మానించుకున్నారట.
పదేళ్లలో 70 రెట్టు పెరిగిన వ్యాపార సామ్రాజ్యం
సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్ టెల్ నెట్ వర్త్ పదేళ్లలో 25 రెట్లు పెరిగింది. అదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్సియల్ నెట్ వర్త్ ఏకంగా 70 రెట్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీరామ్ గ్రూపు కంపెనీల నెట్ వర్త్ రూ.60 వేల కోట్ల పైమాటే. ఇక భారతీ ఎయిర్ టెల్, శ్రీరామ్ గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు చేతికందాయి. భారతీ ఎయిర్ టెల్ లో పెట్టుబడి పెట్టిన వారికి 7 రెట్ల మేర లాభాలు చేజిక్కితే, శ్రీరామ్ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన వారికి ఏకంగా పది రెట్ల మేర లాభాలు అందాయి.
రెగ్యులేటరీ నియంత్రణలను అధిగమించి ఎయిర్ టెల్ ఈ మేర లాభాలను ఆర్జించడం గొప్పే కదా అంటే, అసలు శ్రీరామ్ గ్రూపు చేస్తున్న వ్యాపారం మరింత క్లిష్ట పరిస్థితులను దాటుకుని రావాలి. ఎందుకంటే, నిత్యం ఒడిదుడుకులు ఎదురయ్యే రవాణా రంగానికి ఆ సంస్థ రుణాలందిస్తోంది మరి. మంజూరు చేసిన రుణం తిరిగి రావాలంటే, రుణం తీసుకున్న రవాణాదారుడికి ఎలాంటి ఇబ్బంది తలెత్తరాదు. ఏమాత్రం చిన్న సమస్య ఎదురైనా, అంతా తారుమారు కావడం ఖాయం కదా.?
పది మంది మిత్రులు...తలా పది వేల రూపాయలు!
అసలు శ్రీరామ్ గ్రూపు ఆవిర్భావమే ఆశ్చర్యం కలిగిస్తుంది. 1974లో అప్పటికే 25 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ రంగంతో పాటు అకౌంటెన్సీలోనూ విశేష అనుభవం సాధించిన త్యాగరాజన్, మరో తొమ్మిది మంది మిత్రులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ఫ్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పెట్టుబడిగా రూ.1 లక్ష రూపాయలను పోగేశారు. ఎలాగంటే, పది మంది మిత్రులు.., తలా రూ. 10 వేల చొప్పున జేబుల్లోంచి తీశారు. లక్ష రూపాయలను చేశారు. ఇంకేముంది, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆవిర్భవించింది. త్యాగరాజన్ ప్రతిపాదించిన సూత్రాల ఆధారంగా వ్యాపారం చేసేందుకు మిత్రులు ఏనాడు అడ్డుచెప్పలేదు. అందుకే అప్పటికే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో పెద్ద సంఖ్యలో సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, శ్రీరామ్ తన ప్రత్యేకతను చాటుకుంది. అన్ని కంపెనీలను అధిగమించి దేశంలోనే అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థగా ఆవిర్భవించింది.
ట్రక్కుల డ్రైవర్లే లక్ష్యంగా కార్యరంగంలోకి...!
అసలు శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ లక్ష్యం... రవాణా రంగంలో సేవలందించడం కానేకాదు. కేవలం ఆ రంగంలో ఉన్నవారికి రుణాలు మంజూరు చేయడం వరకు మాత్రమే పరిమితం. అయితే ఆ రుణాలు రవాణా రంగంలో వేళ్లూనుకున్న బడా బాబులకు కాదు. ట్రక్కు డ్రైవర్లకు రుణాలివ్వడమే శ్రీరామ్ లక్ష్యం. అదెలాగంటే, డ్రైవర్లకు రవాణా రంగంపై మంచి పట్టు ఉంటుంది. ఏ రూట్లో వెళితే మంచి లాభాలు వస్తాయన్న అంశంపై పరిపూర్ణ అవగాహన ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు ట్రక్కులను కొనుగోలు చేయలేక ఎవరి దగ్గరో, ఒకరి దగ్గర పనిచేస్తూ ఉండిపోతారు.
దీనిని పసిగట్టిన త్యాగరాజన్ తొలుత సెకండ్ హ్యాండ్ ట్రక్కులు కొనుగోలు చేసేందుకు డ్రైవర్లకు రుణాలిచ్చి, తదనంతరం వారు కొత్త ట్రక్కుల యజమానులుగా మారేందుకు బాటలు పరిచారు. అంటే, ట్రక్కు డ్రైవర్ ను ట్రక్కు యజమానిగా మార్చేయడమన్న మాట. ఇంకేముంది, విషయం తెలుసుకున్న ట్రక్కుల డ్రైవర్లంతా శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ ముందు బారులు తీరారు. ఇలా వేలాది మంది డ్రైవర్లను యజమానులుగా మార్చిన ఘనత త్యాగరాజన్ కే దక్కుతుంది.
విభిన్న ఆహార్యం త్యాగరాజన్ సొంతం
వ్యాపారంలోనే కాక ఆహార్యంలోనూ త్యాగరాజన్ ది విభిన్న శైలే. మొన్నటిదాకా ఆయన సెల్ ఫోన్ కూడా వినియోగించే వారే కాదట. అదేమని అడిగితే, అత్యవసర సేవల విధులను నిర్వర్తించే వైద్యులు, పోలీసులకు సెల్ ఫోన్ కావాలి కాని నాకెందుకంటూ ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. ప్రాణాపాయంలో ఉన్న రోగికి వైద్యం చేసేందుకు వైద్యుడు పరుగెత్తుకుని వచ్చేందుకు అతడికి సెల్ ఫోన్ కావాల్సిందేనని చెప్పే త్యాగరాజన్, కార్యాలయం గడప దాటని నాకెందుకు అంటారట.
ఇప్పటికీ పర్స్ కూడా జేబులో పెట్టుకునే అలవాటు చేసుకోని త్యాగరాజన్, అతికొద్ది సంఖ్యలో రూ.10, రూ.50 నోట్లను మాత్రమే వెంట తీసుకెళతారట. అంతేకాదు, ఉదయం 9 గంటల ప్రాంతలో మనం అల్పాహారాన్ని తీసుకుని, మధ్యాహ్నం భోజనం చేస్తాం. అందుకు త్యాగరాజన్ ససేమిరా అంటారు. ఉదయం 9.30 గంటలకు భోజనం చేసే త్యాగరాజన్, ఇక రాత్రి డిన్నర్ కే తలాడిస్తారట. మొదటి నుంచి అలాగే అలవాటైంది, ఇప్పుడు మార్చమంటే ఎలాగని కూడా త్యాగరాజన్ ప్రశ్నిస్తారు. తన ఆహారపుటలవాట్లు తననేమీ ఇబ్బంది పెట్టడం లేదని కూడా ఆయన చెబుతారు.
15 ఏళ్ల పాటు బయటి పెట్టుబడులకు నో!
అవును, నిజమే మరి. దాదాపు పదిహేనేళ్ల పాటు శ్రీరామ్ ఫైనాన్స్... బయటి పెట్టుబడులనే ఆశించలేదు. ఆశించలేదనేదాని కంటే 'పెట్టుబడి పెడతాం బాబూ' అంటూ వచ్చిన వారిని త్యాగరాజన్ సున్నితంగానే తిరస్కరించారట. ఎందుకంటే, అసలే రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. నష్టాలొస్తే, బయటి వ్యక్తులు కూడా నష్టాలు చూడాల్సి వస్తుంది కదా అనేది త్యాగరాజన్ వాదన.
లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఎప్పుడూ నష్టాలు రాకూడదనేది త్యాగరాజన్ నిశ్చితాభిప్రాయం. అయితే 1990లో అశోక్ లేల్యాండ్, టాటా మోటార్స్ 15 శాతం వాటా తీసుకునేందుకు ముందుకు రాగా, త్యాగరాజన్ కాదనలేకపోయారట. అయితే ఇప్పటిదాకా శ్రీరామ్ గ్రూపులో పెట్టుబడి పెట్టిన ఏ ఒక్కరు కూడా నష్టమన్న మాటే ఎరుగరట. శ్రీరామ్ లో పెట్టుబడులు పెట్టిన క్రిస్ కేపిటల్ అతి స్వల్ప కాలంలోనే తన పెట్టుబడిపై పది రెట్ల లాభాన్ని ఆర్జించిందట.
శ్రీరామ్ చిట్స్ పేరు వినని వారుండరు!
ప్రస్తుతం అటు తమిళనాడుతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో శ్రీరామ్ చిట్స్ పేరు వినని వారుండరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. చిట్టీలు కట్టే వారిని కదిపితే, తొలుత శ్రీరామ్ చిట్స్ పేరే బయటకొస్తోంది. అంతేకాక, తక్షణ రుణాలు కావాలంటే, శ్రీరామ్ ఫైనాన్స్ ను మించిన సంస్థ మరొకటి కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోని పూర్తి స్థాయి సిబ్బంది డేటా ప్రస్తుతం శ్రీరామ్ హార్డ్ డిస్క్ లో చేరిపోయింది.
దాంతో, రుణం కావాలని ఏ ఉద్యోగి అడిగినా, అతడికి రుణం పొందే అర్హత ఉందా? లేదా? అన్న విషయాన్నిశ్రీరామ్ నెట్ వర్క్ ఇట్టే తేల్చేస్తుంది. ఉద్యోగికి ష్యూరిటీ పెట్టే సహోద్యోగి సంతకం చెల్లుతుందా? లేదా? అన్న విషయాన్నీ క్షణాల్లో తేల్చేయడంలో అందరికంటే వేగంగా స్పందిస్తోంది శ్రీరామ్ ఫైనాన్స్. ఈ వేగం రానున్న రోజుల్లో మరింత పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో శ్రీరామ్ మరింత ఉన్నతిని సాధించి, త్యాగరాజన్ ప్రతిష్టకు మరింత వన్నె తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.