వాహన బీమా లేకుండా ప్రయాణాన్ని ప్రారంభిస్తే చిక్కుల్లో పడినట్టే...!

ఉరుకుల పరుగుల జీవితంలో మోటారు వాహనాల ప్రాధాన్యం నేడు ఎంతగానో పెరిగిపోయింది. వీధి చివర ఉన్న షాపు దగ్గరకు వెళ్లాలన్నా బైక్ ఉండాల్సిందే. వాహనాల రద్దీ నేపథ్యంలో ప్రమాదాల సంఖ్యా పెరిగిపోతూనే ఉంది. ప్రమాదంలో తాను బాధితుడు కావచ్చు… లేక ఇతరులు (థర్డ్ పార్టీ) బాధితులుగా మిగిలిపోవచ్చు. ఈ నేపథ్యంలో వాహనదారుడితోపాటు, అతని వాహనం ప్రమాదం కారణంగా నష్టపోయిన ఇతరులకూ అన్ని విధాలుగా రక్షణ కల్పించే బీమా పాలసీల అవసరం ఎంతో ఉంది. పైగా మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాలకు బీమా తీసుకోవడం దేశంలో తప్పనిసరి. కనుక మోటారు వాహనాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలు, వాటి ద్వారా అందే పరిహారం, ఆయా నిబంధనలు ఏమంటున్నాయో తెలుసుకుందాం.

దేశంలో ప్రతి నెలా నాలుగు లక్షల మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో మరణిస్తుండగా అంతకు రెండు మూడు రెట్లు గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మోటారు వాహనాల బీమా అవసరం ఎంతో ఉంది. ఈ పాలసీలు వాహనదారుడితోపాటు ప్రమాదంలో థర్డ్ పార్టీ (వాహనదారుడితో ప్రయాణిస్తున్నవారు)కి కూడా పరిహారం అందిస్తాయి. 

వాహనాలకు సంబంధించి రెండు రకాల పాలసీలు ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ పాలసీ. బీమా భాషలో మొదటి పార్టీ అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి. ఆ పాలసీ జారీ చేసిన బీమా సంస్థ రెండో పార్టీ. ఇతరులు అందరూ థర్డ్ పార్టీ కిందకు వస్తారు. థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ ఉంటే...  ఏదైనా ఒక వాహనదారుడు ప్రమాదానికి కారణమైన సందర్భంలో దాని వల్ల అతడికి కాకుండా ఇతరులకు, వారి ఆస్తులకు జరిగే నష్టానికి బీమా కవరేజీ లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం కలిగి సంపాదించలేని పరిస్థితి కలిగినా ఆ మేరకు పరిహారం కూడా లభిస్తుంది. కానీ, వాహనదారుడు, అతడి వాహనానికి బీమా కవరేజీ ఉండదు. థర్డ్ పార్టీ లయబిలిటీతోపాటు వాహనదారుడు తనకు, తన వాహనానికి కూడా బీమా కోరుకుంటే కాంప్రహెన్సివ్ (సమగ్రమైన) పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. 

దీనివల్ల పాలసీ దారుడి వాహనానికి అన్ని రకాల రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదం, పేలుడు, పిడుగుపాటు, కొండచరియలు విరిగిపడడం, తుఫానులు, పెను తుఫానులు, వరదలు, భూకంపాలు, దొంగతనం, అల్లర్లు, రవాణా సమయంలో నష్టం వాటిల్లితే పరిహారం అందుతుంది. ఇప్పటికే పాలసీ తీసుకున్న వారు తమ పాలసీ పత్రాన్ని పరిశీలిస్తే అందులో ఓన్ డ్యామేజీ, లయబిలిటీ టు పబ్లిక్ రిస్క్ అని వేర్వేరుగా ప్రీమియం చార్జీలను పేర్కొనడాన్ని గమనించవచ్చు. అందులో ఓన్ డ్యామేజీ లేకుంటే అది థర్డ్ పార్టీ పాలసీగానే భావించాల్సి ఉంటుంది.   

రైడర్లు

కారు ఇన్సూరెన్స్ పాలసీల్లో కంపెనీలు వివిధ రకాల రైడర్లను అందిస్తున్నాయి. ఇంజన్ ప్రొటెక్టర్ రైడర్ తీసుకుంటే ప్రమాదం, ఇంజన్ ఆయిల్ లీకేజీ లేక ఇతరత్రా కారణాల వల్ల ఇంజన్ కు నష్టం కలిగితే కంపెనీ ఇంజన్ రీప్లేస్ కు అయ్యే మొత్తాన్ని భరిస్తుంది. అలాగే, వెహికల్ రీప్లేస్ మెంట్ రైడర్ తీసుకుంటే... కారు దొంగతనానికి గురైనా, లేక ప్రమాదంలో నామరూపాల్లేకుండా పోయినా కొత్త కారును తిరిగి తీసుకునేందుకు అయ్యే వ్యయాన్ని కంపెనీలు అందిస్తాయి. కారులో యజమాని నుంచి తోటి ప్రయాణికుల వరకు ప్రమాద మరణం, లేదా పూర్తి అంగవైకల్యానికి యాక్సిడెంట్ షీల్డ్ పేరుతో రైడర్లు కూడా ఉన్నాయి.  

ఈ సందర్భాల్లో పరిహారం రాదు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతూ ప్రమాదం జరిగితే పరిహారం రాదు. డ్రగ్స్, మద్యం సేవించి వాహనాలు నడిపినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినా, ఎలక్ట్రికల్, మెకానికల్ సమస్యల కారణంగా వాహనాలకు జరిగే నష్టాలకు పరిహారం ఇవ్వవు. 

బీమా ఎలా నిర్ణయిస్తారు? 

వాహనాలకు బీమా ఎంత లభిస్తుందీ అనేది సూచించేదే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ (ఐడీవీ). వాహనం పోయినా ప్రమాదంలో పూర్తిగా పనికిరాకుండా పోయినా ఐడీవీని పాలసీదారుడికి చెల్లిస్తాయి. వాహనం ప్రస్తుత మార్కెట్ ధర (ఎక్స్ షోరూమ్ ప్రైస్) లోంచి వాహన వయసు ఆధారంగా తరుగుదల తీసివేయగా మిగిలిన మొత్తమే ఐడీవీ. సాధారణంగా ఆరు నెలల వయసులోపు ఉన్న వాహనాలకు 5 శాతం తరుగుదల ఉంటుంది. ఆరు నెలల నుంచి ఏడాది లోపు 15 శాతం... ఏడాది దాటిన తర్వాత 20శాతం... రెండేళ్లు దాటితే 30 శాతం, మూడేళ్లు దాటితే 40 శాతం, నాలుగేళ్లు దాటితే 50 శాతం తరుగుదలను బీమా కంపెనీలు అమలు చేస్తుంటాయి. ఐదేళ్ల తర్వాత పాలసీదారుడు, కంపెనీ మధ్య ఉమ్మడి అంగీకారం మేరకు తరుగుదల ఉంటుంది. పాత కార్లు అయితే కారు కండీషన్ ను సర్వేయర్లు, కారు డీలర్ల ద్వారా మదింపు చేసి ఐడీవీ నిర్ణయిస్తుంటాయి. 

ప్రీమియం ఎంత..?

ప్రీమియం ఎంతనేది కవరేజీ ఆప్షన్ ను బట్టి, వాహన వయస్సు (తయారీ సంవత్సరం)ను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే, ప్రస్తుతం ఆ వాహనం మార్కెట్ ధర ఎంత, బీమా తీసుకుంటున్నది వ్యక్తి లేక కార్పొరేట్ కంపెనీ అనే అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.  

కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్

రవాణా అవసరాలకు వినియోగించే అన్ని రకాల వాహనాలకు తీసుకునే పాలసీలు కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలు. అంబులెన్సులు కూడా వీటి పరిధిలోకే వస్తాయి. 

representational image

డిడక్టబుల్

ప్రమాదం జరిగి క్లెయిమ్ చేస్తున్నారనుకోండి. క్లెయిమ్ మొత్తంలో పాలసీదారుడు కొంత మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు డిడక్టబుల్ 10 శాతంగా ఉందనుకుందాం. 5వేల రూపాయలకు క్లెయిమ్ చేస్తుంటే అప్పుడు అందులో పది శాతం 500 రూపాయలను పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పాలసీని ఎంచుకునే సమయంలో ఈ డిడక్టబుల్ ను కూడా పరిశీలించాలి.

నో క్లెయిమ్ బోనస్

పాలసీ గడవులో ఎటువంటి క్లెయిమ్స్ చేయకుంటే పాలసీ రెన్యువల్ సమయంలో ప్రీమియంపై కొంత మొత్తాన్ని తగ్గింపు ఇస్తున్నాయి కంపెనీలు. ఒక కంపెనీ సేవలు నచ్చక రెన్యువల్ సమయంలో వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ తీసుకుంటున్నా ఈ నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకు పాత ఇన్సూరెన్స్ కంపెనీ జారీ చేసిన ప్రీమియం రెన్యువల్ రిమైండర్ నోటీసును చూపించాల్సి ఉంటుంది. 

వాహన బీమా లేకుంటే పర్సు గుల్లే... 

representational imageదేశంలో వాహన యజమానులు అందరూ తమ వాహనాలకు బీమా పాలసీలు తీసుకోవడం లేదు. కానీ, బీమా లేకుండా వాహనదారులు పట్టబడితే భారీ జరిమానాలు విధించేందుకు కఠిన చట్టాలు ఉన్నాయి. వాహన బీమా లేకుండా ద్విచక్ర వాహనదారుడు పట్టుబడితే 10వేల రూపాయల వరకు జరిమానా, కార్లకు 75వేల వరకు జరిమానా విధించేందుకు రవాణా, ట్రాఫిక్ విభాగానికి అధికారాలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కారు లేదా బైక్ కొన్నారనుకోండి. దానికి అప్పటికే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు పాలసీని తమ పేరిట మార్పించుకోవాలని గుర్తు పెట్టుకోండి. 

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద కంపెనీలు వాహనదారులకు పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజీని కూడా అందిస్తున్నాయి. అలాగే కో పాసింజర్లకు కూడా పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజీని తీసుకోవచ్చు. దీనివల్ల వారి వాహనంలో వెళుతున్న వారు ప్రమాదంలో మరణిస్తే పరిహారం అందుతుంది. థర్డ్ పార్టీ లయబిలిటీ కింద థర్డ్ పార్టీ డ్యామేజీ (ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో) కవరేజీ రూ.6వేలకే పరిమితం. అయితే, పాలసీదారులు ఈ కవరేజీని కార్లకు 7.5 లక్షల రూపాయలు, టూ వీలర్లకు లక్ష రూపాయల వరకు పెంచుకోవచ్చు. ఇలా పెంచుకున్నందుకు కార్లకు, ఆటోలకు 150 రూపాయలు మాత్రమే అదనంగా అవుతుంది. టూ వీలర్లకు 50 రూపాయలకు మించి ఖర్చు కాదు. గరిష్ఠ కవరేజీని తీసుకోకుంటే ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో ట్రైబ్యునల్ ఎక్కువ పరిహారానికి ఆదేశిస్తే జేబులోంచి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు.    

బీమా ఉంటే పరిహారం గ్యారంటీగా వస్తుందా…?

బీమా పాలసీ తీసుకుని ప్రీమియం కట్టేస్తే వాహనానికి ఏమి జరిగినా పరిహారం వస్తుందిలే అన్న హామీ ఏమైనా ఉందా..? అలా ఏమీ లేదు. పాలసీదారుడిగా, వాహనదారుడిగా తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాద పరిహారం క్లెయిమ్ లలో... వాహనానికి సహజంగా జరిగే నష్టానికి పరిహారం రాదు. అంటే వాహనాన్ని వాడుతున్న సమయంలో సహజంగా కొన్ని పార్ట్స్ కాలం తీరి పాడైపోతుంటాయి. వాటికి క్లెయిమ్ చేస్తే కంపెనీలు రూపాయి కూడా చెల్లించవు.  డ్రైవర్ తప్పిదం కారణంగా జరిగే ప్రమాదాలకు కూడా పరిహారం ఇవ్వవు కంపెనీలు. వ్యక్తిగత కార్లను వాణిజ్య అవసరాలకు వినియోగించినా, మెకానికిల్, ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా వాహనాలు పనిచేయకపోయినా పరిహారం రాదు. అలాగే, వాహనం టైర్లకు కూడా పరిహారం అందదు. అలాగే, ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ కు కూడా పూర్తిగా పరిహారం రాదు. కొంత శాతం మేర పరిహారం చెల్లిస్తాయి. 

ఏదైనా జరిగితే పరిహారం ఎలా...?

మోటారు వాహన బీమా కింద  క్లెయిమ్ లను మూడు రకాలుగా వర్గీకరించారు. థర్డ్ పార్టీ క్లెయిమ్, ఓన్ డ్యామేజీ క్లెయిమ్, థెఫ్ట్ క్లెయిమ్. 

థర్డ్ పార్టీ క్లెయిమ్

మీరు నడుపుతున్న వాహనం మీ తప్పిదం కారణంగా ప్రమాదానికి గురైంది. అప్పుడు ఇతరులకు ఏదైనా జరిగిందనుకోండి. అప్పుడు ప్రమాదానికి కారణమైన పాలసీదారుడు లేదా, బాధితులు లేదా వారి తరఫున మరొకరు ప్రమాద సమాచారాన్ని వెంటనే బీమా కంపెనీ, పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుది. ప్రమాదానికి కారణమైన వాహనం పాలసీ నంబర్, వాహనదారుడి పూర్తి పేరు, ప్రమాదం వివరాలు, ప్రమాదానికి గురైన స్థలం, ఎప్పుడు, ఎక్కడ, సాక్షుల పేర్లు, సంప్రదించాల్సి ఫోన్ నంబర్, వాహనం నడిపిన వారి పేరుకు సంబంధించిన వివరాలను క్లెయిమ్ కోరుకునే వారు తెలియజేయాలి. ఎవరికైనా తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేర్చితే ఆ వివరాలు, వైద్యం అందిస్తున్నడాక్టర్ వివరాలను కూడా బీమా కంపెనీకి అందించాలి. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. 

ఒకవేళ వేరే వారి వాహనం కారణంగా మీరు ప్రమాద బాధితులుగా మారినా ఇదే ప్రక్రియ. ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వడంతోపాటు వాహన ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, ఆర్సీ బుక్ కాపీ, వాహనం నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, పోలీసులు జారీ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ సేకరించాలి. 

థర్డ్ పార్టీ లయబిలిటీ కింద పరిహారం కోసం బాధితులు మోటారు వాహనాల ట్రైబ్యునల్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం పరిధిలోని ట్రైబ్యునల్ లో 60 రోజుల్లోపు కేసు దాఖలు చేయాలి. కోర్టుల్లో అయితే ఏడాది వరకూ కూడా నమోదు చేయవచ్చు. ఎఫ్ఐఆర్, బీమా కంపెనీ సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ కాపీలను కూడా జతచేయాలి. దీంతో కేసు విచారణ ప్రారంభం అవుతుంది. ట్రైబ్యునల్ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లేదా యజమానికి, అతడి వాహనానికి పాలసీ ఇచ్చిన బీమా కంపెనీకి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంబిస్తుంది.  

representational image

ఏ నిబంధన కింద ఎంత పరిహారం...

రవి కారులో వెళుతూ ప్రమాదం బారిన పడ్డాడు. తీసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. దానిపై ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ తుక్కయిపోయింది. తీవ్ర గాయాలైన వ్యక్తి కోలుకున్నతర్వాత ప్రమాదానికి కారణమైన రవిపై కోర్టుకు వెళ్లాడు. రవి కారుకు థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ ఉండడంతో బీమా కంపెనీ పరిహారం చెల్లించింది. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశాలున్నాయి. పరిహారం అనేది ఒక్కోసారి భారీ స్థాయిలో ఉండవచ్చు. మోటారు వాహనాల చట్టం 1988లోని నిబంధనల మేరకు బాధితుడు ‘నో ఫాల్ట్ లయబిలిటీ’ ‘ఫాల్ట్ లయబిలిటీ’ కింద పరిహారం కోరవచ్చు. 

నో ఫాల్ట్ లయబిలిటీ కింద పరిహారం కోరితే... వాహనదారుడు తప్పిదం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని నిరూపించాల్సిన పనిలేదు. అలాగే ఈ నిబంధన కింద పరిహారానికి పరిమితి ఉంటుంది. అదే ఫాల్ట్ లయబిలిటీ కింద బాధితుడు భారీ మొత్తంలో బీమా పరిహారం కోరవచ్చు. అయితే, ఇందుకు గాను ప్రమాదం రవి నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని నిరూపించాల్సి ఉంటుంది. ఈ భారీ పరిహారం కేవలం తీవ్రంగా గాయపడి, మరణించిన సందర్భాలకే వర్తిస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలై చికిత్స పొందుతూ మరణిస్తే చికిత్సా వ్యయంతోపాటు మరణించిన వ్యక్తి ఆదాయ స్థితిని బట్టి గరిష్ఠ బీమా పరిహారాన్ని కోరవచ్చు. 

అదే థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజీ విషయానికి వస్తే పరిహారానికి పరిమితి ఉంది. ప్రమాదంలో ఇతరుల ఆస్తులకు నష్టం వాటిల్లితే... బాధితులు ట్రైబ్యునళ్లను ఆశ్రయించినట్డయితే... కోర్టు తీర్పును బట్టి  బీమా కంపెనీలు గరిష్ఠంగా 7.5 లక్షల వరకే పరిహారాన్ని అందిస్తాయి. ఒకవేళ అంతకుమించి నష్టం జరిగిందని బాధితుడు నిరూపించగలిగితే.. ఉదాహరణకు 10 లక్షల మేర పరిహారానికి కోర్టు ఆదేశిస్తే బీమా కంపెనీ 7.5 లక్షలు పోను మిగితా మొత్తాన్ని పాలసీదారుడు తన జేబులోంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. 

వ్యక్తి చనిపోతే బాధిత కుటుంబానికి పరిహారం నిర్ణయించేది ఎలా...? 

35 ఏళ్ల వయసున్న వ్యక్తి చనిపోతే అతడి వార్షికాదాయం నుంచి అతడి జీవన, వ్యక్తిగత ఖర్చు తీసివేయగా, కుటుంబానికి వెచ్చించే మొత్తాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే, అతడు ఇంకా ఎంత కాలం సంపాదించగలడు, అతడిపై ఎంత మంది ఆధారపడి ఉన్నారన్న అంశాలను బట్టి పరిహారాన్ని నిర్ణయిస్తాయి. 5 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పరిహారానికి కోర్టులు ఆదేశించడం చాలా కేసుల్లో జరుగుతుంటుంది. ఉదాహరణకు ఓ రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ వైద్యుడు మరణించగా అతడి కుటుంబానికి 12 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని 2002లో ఓ కోర్టు ఆదేశించింది. 

అయితే మోటారు వాహనాల చట్టం 1988 స్థానంలో రోడ్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ బిల్లును మోదీ సర్కారు పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తులు మృతి చెందితే చెల్లించే పరిహారాన్ని 15 లక్షలకు పరిమితం చేయాలనే ప్రతిపాదన ఈ బిల్లులో పొందుపరిచారు. ఇదంతా ఇన్సూరెన్స్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, దీనికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం వేరే వివరణ ఇచ్చారు. ఈ ప్రతిపాదన వల్ల రోడ్డు ప్రమాదాల్లో పేదలు మరణించినా వారి కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల పరిహారం అందుతుందన్నారు.   

ఓన్ డ్యామేజీ క్లెయిమ్

representational imageసొంత వాహనానికి ఏదైనా ప్రమాదం కారణంగా నష్టం వాటిల్లితే ఆ వివరాలను వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అలాగే, పోలీసులకు ఫోన్ కాల్ చేసి విషయాన్ని తెలియజేయాలి. బీమా కంపెనీ సర్వేయర్ ను సంఘటనా స్థలానికి పంపించి నష్టంపై అంచనా వివరాలు తీసుకుంటుంది. అయితే, బీమా కంపెనీకి సమాచారం ఇచ్చిన సమయంలోనే ప్రమాదస్థలం నుంచి వాహనాన్ని తొలగించవచ్చా, లేదా అన్న వివరణ కోరాలి. ప్రమాద స్థలం నుంచి తప్పించవద్దని బీమా కంపెనీ చెబితే దాన్ని కదపవద్దు. ఒకవేళ బీమా కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాన్ని క్యాష్ లెస్ సర్వీస్ నెట్ వర్క్ జాబితాలోని వెహికల్ సర్వీస్ సెంటర్ కు తీసుకెళితే సరిపోతుంది. అలా కాకుండా బయట వేరే ఎక్కడైనా రిపేర్ చేయించుకోదలిస్తే ముందుగా రిపేర్ కు అయ్యే ఖర్చుపై ఎస్టిమేషన్ తీసుకుని బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి. రిపేర్ చేయించుకున్న అనంతరం బిల్లులతో క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వాణిజ్య వాహనాలు, భారీ ప్రమాదాలు అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సర్వేయర్ వచ్చి సంఘటనా స్థలాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తారు.  

వాహనం చోరీకి గురైతే... 

వాహనం కనిపించకుండాపోయిన సందర్భాల్లో వెంటనే పోలీసులకు, ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. రవాణా శాఖకు కూడా తెలియజేయాలి. పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని క్లెయిమ్ కు దరఖాస్తు  చేసుకోవచ్చు. సందర్బాన్ని బట్టి క్లెయిమ్ దరఖాస్తుతోపాటు వివిధ రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్ పై ప్రమాదాల సమయంలో వెంటనే తెలియజేసేందుకు నంబర్ ను పేర్కొంటారు. ఈ నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. లేదా ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ శాఖకు నేరుగా వెళ్లి సమాచారం కూడా ఇవ్వవచ్చు. కంపెనీ వెబ్ సైట్ కు వెళ్లి చూసినా అన్ని శాఖల కార్యాలయాల నంబర్లు ఉంటాయి. 

దరఖాస్తుతోపాటు పైన పేర్కొన్న అన్ని రకాల పత్రాలు, చోరీకి గురైన వాహనానికి సంబంధించిన అన్ని ’కీ‘లను కూడా బీమా శాఖలో సమర్పించాల్సి ఉంటుంది . వీటన్నింటితోపాటు వాహనం ఆచూకీ లభించలేదంటూ పోలీసులు జారీ చేసే నాన్ ట్రేసబుల్ రిపోర్ట్ ను సమర్పిస్తేనే పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆర్సీని బీమా కంపెనీ పేరుతో మార్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం ఫైనాన్స్ లో తీసుకుని ఉంటే పరిహారం కూడా ఫైనాన్స్ కంపెనీకే వెళుతుంది. పాలసీలో పేర్కొన్న ఐడీవీని పరిహారంగా బీమా కంపెనీ చెల్లిస్తుంది. బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం సర్వే రిపోర్ట్ అందిన 30 రోజుల్లోగా క్లెయిమ్ ను ఆమోదించడం, తిరస్కరించడం చేయాల్సి ఉంటుంది.

ఎఫ్ఐఆర్ తప్పనిసరా..?

అన్ని రకాల థర్డ్ పార్టీ క్లెయిమ్ లలో పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ తప్పనిసరి. ఓన్ డ్యామేజీ క్లెయిమ్ లలో ఒక్కో కేసును బట్టి దీని అవసరం ఉంటుంది. ఉదాహరణకు వాహనం స్కిడ్ అయ్యి డ్యామేజీ అయిందనుకోండి. పోలీసులకు తెలియజేయాల్సిన పనిలేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా అవసరం లేదు. బీమా కంపెనీకి వెంటనే సమాచారం అందించి వారి సూచనల మేరకు ప్రొసీడ్ అవ్వాలి. అలాగే కారులో వెళుతున్నారు. గాలివానకు చెట్టు కొమ్మ విరిగి కారుపై పడిపోయిందనుకోండి. ఎవరికీ ఏమీ కాలేదు. కానీ కారు మాత్రం బాగా దెబ్బతింటే పరిహారం కోసం పోలీసుల ఎఫ్ఐఆర్ అవసరం పడదు. 

మన వాహనం వేరే వారు నడిపితే...?

మీకో కారు లేదా ద్విచక్ర వాహనం ఉంది. పని మీద బయటకు వెళ్లొస్తానంటూ దగ్గరి స్నేహితుడు వచ్చి అడిగితే కీ ఇచ్చారు. ఆ వాహనం ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఎలా...? వాహనదారుడే అన్ని సమయాల్లోనూ వాహనం నడపాలని లేదు. వాహనానికి కాంప్రహెన్సివ్ పాలసీ ఉండి, వాహనం నడుపుతున్న వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, ఎలాంటి మత్తు పదార్థాలు, ఆల్కహాల్ సేవించకుండా, నిర్లక్ష్యం లేకుండా నడిపి ఉంటే చాలు. వాహనదారుడు కచ్చితంగా పరిహారం పొందవచ్చు. 

వాహనంలో మార్పులు చేశారా..? వేరే వారి దగ్గర కొన్నారా…?

representational imageమీ వాహనంలో ఏమైనా మార్పులు చేయిస్తే ఆ సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం మంచిది. లేకుంటే క్లెయిమ్ సమయంలో కంపెనీలు ఇబ్బంది పెట్టే అవకాశం వాటికి ఇచ్చినట్టే అవుతుంది. ఉదాహరణకు మోహన్ తన స్నేహితుడి సలహా మేరకు ఇంధన ఖర్చు తగ్గించుకునేందుకు తన కారుకు సీఎన్జీ/ఎల్పీజీ కిట్ అమర్చాడనుకుందాం. అప్పుడు వెంటనే ఆ సమచారాన్ని రవాణా శాఖ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేసి ఆర్సీలో మార్పులు చేయించుకోవాలి. అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేసి అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటే చెల్లించడం సరైనది.

అలాగే, కాంప్రహెన్సివ్ ప్యాకేజీ పాలసీ నిబంధనల కింద యజమాని మారితే 14 రోజుల్లోపు బీమా కంపెనీకి తప్పనిసరిగా విషయాన్ని తెలియజేయాలి. సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఆర్సీలో యజమాని పేరు మార్పించుకుంటే చాలదు. బీమా పాలసీలోనూ యజమానిగా  వాహనదారులే ఉండాలి. ఆర్సీ మాత్రమే తన పేరిట మార్పించుకుని బీమా పాలసీని పాత యజమాని పేరు మీదే కొనసాగిస్తే పరిహారం రాదు. ఆర్సీ, బీమా పాలసీ ఒకరి పేరు మీదే, ఒకే చిరునామాతోనే ఉంటేనే కంపెనీలు క్లెయిమ్స్ సందర్భాల్లో పరిహారం అందిస్తాయి. 

ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల పాలసీలు

ఏడాదికోసారి కచ్చితంగా వాహన బీమాను రెన్యువల్ చేసుకోవడం తప్పనసరిగా చేయాల్సిన పని. ఏటా ఈ తలనొప్పి ఎందుకు అనుకునేవారి కోసం హెచ్ డీఎఫ్ సీ ఎర్గో, ఐసీఐసీఐలు మూడేళ్ల కాల వ్యవధిగల పాలసీలను విక్రయిస్తున్నాయి. సుదీర్ఘ కాల వ్యవధితోపాటు పాలసీ ప్రీమియంలో 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వాస్తవికంగా పరిశీలిస్తే ఈ తగ్గింపు ఇంకా ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే మెటారు వాహన బీమా పాలసీల ప్రీమియం ఏటేటా పెరుగుతూ ఉంటుంది. మూడేళ్ల కాలానికి ఒకేసారి తీసుకోవడం వల్ల ఈ పెంపు బాధ ఉండదు. ఇక ఐసీఐసీఐ అయితే పాలసీ వ్యవధిలో ఒక్క క్లెయిమ్ లేకుంటే రెన్యువల్ ప్రీమియంలో 40 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఒక క్లెయిమ్ చేసినా 30 శాతం తగ్గింపును అందిస్తోంది. రెండు క్లెయిమ్స్ ఉంటే 20 శాతం రాయితీ ఇస్తోంది. ఈ లింకుల ద్వారా టూ వీలర్ పాలసీ ప్రీమియం అంచనా తెలుసుకోవచ్చు. 

https://www.icicilombard.com/

https://www.hdfcergo.com/


More Articles