రుతువు మారగానే జలుబు, జ్వరం ఎందుకొస్తాయి?

మంచి ఎండాకాలం..  ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి.. వడగాడ్పులూ భయపెట్టాయి. కానీ ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతో ఊహించని విధంగా వేడి తగ్గిపోయింది. చల్లటి వాతావరణం నెలకొంది. కొంత మందికి జలుబు, జ్వరం వంటివి పట్టుకున్నాయి. మరికొందరిలో తలనొప్పి, చర్మ వ్యాధులు మొదలయ్యాయి. చాలా మంది ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుండడం గమనిస్తూనే ఉంటాం. ఇప్పుడే కాదు.. శీతాకాలం ముగిసి ఎండాకాలం రావడం, ఎండాకాలం ముగిసి వర్షాలు మొదలవడం వంటి రుతువులు మారినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మరి ఎందుకిలా జరుగుతుందో తెలుసా..?

ఉష్ణోగ్రతల ప్రభావంత తక్కువే

సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గడమో, పెరగడమో దీనికి కారణమని భావిస్తుంటారు. వాస్తవానికి ఉష్ణోగ్రతల్లో మార్పుల ప్రభావం ఉన్నా అది కొంతవరకే. కానీ అసలు కారణం మాత్రం కొన్ని రకాల వైరస్ లు. రుతువులు మారుతున్నప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి ఆయా వైరస్ లు విజృంభిస్తుంటాయి. కొన్ని వేల రెట్లు అభివృద్ధి చెంది చాలా సులువుగా సంక్రమించి జలుబు, దగ్గు, జ్వరం వంటి శారీరక రుగ్మతలకు కారణమవుతాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఓర్లాండో హెల్త్ వైద్య సంస్థలో ఇంటర్నల్ మెడిసిన్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న వైద్యుడు బెంజమిన్ కల్పన్ ఈ అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన వివరాలను లైవ్ సైన్స్ వెబ్ సైట్ ప్రచురించింది..

వారం రోజుల వరకూ ఇబ్బందులు

సాధారణంగా రుతువులు మారినప్పుడల్లా జలుబు, ఫ్లూ, పొడిదగ్గు, స్వల్పంగా జ్వరం వంటివి కొద్ది రోజులపాటు బాధిస్తుంటాయి. ముఖ్యంగా పిల్లలు, పెద్ద వయస్సు వారు, గర్భిణులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో రెండు మూడు రోజుల్లోనే ఈ శారీరక రుగ్మతలు తగ్గుముఖం పడుతుండగా... మరికొందరిలో వారం రోజుల వరకూ బాధిస్తుంటాయి. అప్పటిలోగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పుంజుకోవడంతో, ఏవైనా ఔషధాలు వినియోగించడంతో రుగ్మతల లక్షణాలు తగ్గుముఖం పడతాయి. రుగ్మతలకు రైనో వైరస్, కరోనా వైరస్ లతో పాటు ఇన్ ఫ్లూయెంజా వైరస్ లూ కారణమవుతాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ లు వేడి వాతావరణంలో ఎక్కువగా మనలేవు. దాంతో స్తబ్ధుగా ఉండిపోతాయి. రుతువులు మారినప్పుడు విజృంభిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం, వానాకాలం ప్రారంభంలో వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో మరిన్ని కారణాలు

representational imageఇక ఎండాకాలం ప్రారంభమయ్యే సమయానికి ఏర్పడే పొడిదగ్గు, కళ్లు మంటగా ఉండడం, ముక్కు కారడం వంటి లక్షణాలకు మాత్రం వైరస్ లకు తోడు మరిన్ని కారణాలూ ఉన్నాయని వైద్యుడు బెంజమిన్ కల్పన్ చెబుతున్నారు. ఎండాకాలం ప్రారంభం నాటికి గాలిలో తేమ శాతం తగ్గిపోవడం, నేల పొడిబారి ఉండడంతో గాలులకు దుమ్మూ, ధూళి లేచి వాతావరణంలో చేరి అలర్జీలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా వివిధ పంటలు, మొక్కల నుంచి రేగే పుప్పొడి రేణువులు వాతావరణంలో చేరుతాయి. వాటివల్ల శ్వాస సంబంధమైన ఎలర్జీలు ఏర్పడుతాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ అలర్జీల లక్షణాలను సరిదిద్దే పనిలో ఉన్నప్పుడు వైరస్ సంక్రమిస్తే దగ్గు, జలుబు వంటి రుగ్మతలకు కారణమవుతాయని అంటున్నారు.

వీరికి ఇబ్బంది ఎక్కువ

చల్లగాలి పడకపోవడం, దుమ్మూధూళి ఎలర్జీలు, ఆస్తమా, మైగ్రేన్, కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారికి రుతువుల మార్పు సమయంలో మరింతగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఎలర్జీలు తలెత్తినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటిని సరిదిద్దే పనిలో ఉంటుంది. అలాంటి సమయంలో వైరస్ సంక్రమిస్తే ఇబ్బందులు మరింతగా పెరుగుతాయి. వాంతులు, విరేచనాలై డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు

రుతువులు మారుతున్న సమయంలో వచ్చే శారీరక రుగ్మతలను నివారించడానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలని వైద్యులు చెబుతున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తగినంత వ్యాయామం, ఆరోగ్యకరమైన భోజనంతో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమయ్యేలా చూసుకోవడం, కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు అదికూడా రాత్రి నిద్ర ఉండేలా చూసుకోవడం వంటివి ఆచరించాలని సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, చక్కెర, తీపి పదార్థాలు తీసుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. ఇవి పాటించకుండా మందులు, విటమిన్ టాబ్లెట్లు వంటివి తీసుకోవడం వల్ల పెద్దగా లాభమేమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల రుతువులు మారినప్పుడల్లా రుగ్మతల బారిన పడకుండా తప్పించుకునేందుకు ముందుగానే సిద్ధం కండి.

వైద్యుల సలహా తప్పనిసరి

రుతువుల మార్పు సమయంలో వచ్చే రుగ్మతలు సాధారణంగా చెప్పాలంటే పూర్తిస్థాయి శారీరక అనారోగ్యాలు కావు. అవి కేవలం ఎలర్జీలు, సాధారణ వైరస్ ల వల్ల వచ్చే రుగ్మతల లక్షణాలు మాత్రమే. సాధారణంగా ‘జలుబు మందులు వేసుకుంటే వారం రోజుల్లో.. లేకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంద’ని సామెత. అందువల్ల గాభరాపడి ఏవో తెలిసిన మందులు వాడాలని చూడవద్దు. వీలైనంత వరకూ వైద్యులను సంప్రదించి.. వారి సూచనలు సలహాల మేరకు మందులు వాడడం శ్రేయస్కరం.

ఉపశమనం కోసం వంటింటి చిట్కాలూ ఉన్నాయి

representational imageజలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం కోసం కొన్ని వంటింటి చిట్కాలనూ అనుసరించవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి.. అందులో పసుపు వేసుకుని ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గుకు మంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయమే వేడి పాలు లేదా నీటిలో శొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులు వేసి మరిగించుకుని తాగవచ్చు. ఇంకా కావాలంటే యూకలిఫ్టస్ నూనెనూ వినియోగించవచ్చు. సాధారణంగా రెండు మూడు రోజులపాటు ఉపశమనం కోసం ఈ చిట్కాలను పాటించినా... అప్పటికీ జలుబు, దగ్గు వంటివి తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.


More Articles