భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపిస్తోందా? ముఖ్యంగా స్వీట్లు, చిప్స్‌ వంటి చిరుతిళ్ల గురించి పదేపదే ఆలోచిస్తున్నారా? శారీరకంగా ఆకలి లేకపోయినా ఆహారం తినాలనే ఆలోచనలు వెంటాడటాన్ని ‘ఫుడ్‌ నాయిస్‌’ అంటారు. ఇది వైద్యపరమైన వ్యాధేమీ కాదు. అయితే ఈ అలవాటు ఆహారపు ఎంపికలపై ప్రభావం చూపొచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను గుర్తించి.. కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే ఆహారంపై అనవసరమైన ఆలోచనలను తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి.. బోర్‌ కొట్టడం కూడా కారణాలే!
ఒత్తిడి, ఒంటరితనం, విసుగు, మానసిక అలసట ఉన్నప్పుడు కొందరు ఆహారం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని చూస్తారు. ఇష్టమైన ఆహారం తినడం వల్ల మెదడులో ఆనందాన్ని కలిగించే రసాయనాల ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఆకలి లేకపోయినా మళ్లీ తినాలనే కోరిక కలగవచ్చు. రుచికరమైన ఆహారాన్ని చూడటం, వాసన పీల్చడం లేదా దాని గురించి ఆలోచించడం కూడా ఈ కోరికను పెంచవచ్చు.

భోజనం మానేయడం.. నిద్రలేమితోనూ సమస్యే!
బరువు తగ్గాలనే ఉద్దేశంతో భోజనం మానేయడం, అతిగా ఆహార నియంత్రణ పాటించడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందకపోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్‌, ఫైబర్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండకపోవచ్చు. దీంతో తరచూ చిరుతిళ్లు తినాలనే కోరిక కలుగుతుంది. మరోవైపు, తగినంత నిద్ర లేకపోవడం ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలపై ఆసక్తిని పెంచవచ్చు.

ఫుడ్‌ నాయిస్‌ను తగ్గించుకోవడం ఎలా?
ఆహారంపై పదేపదే వచ్చే ఆలోచనలను తగ్గించుకోవడానికి బ్యాలెన్స్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవడం ముఖ్యం. ప్రొటీన్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉండే పదార్థాలను భోజనంలో చేర్చుకోవాలి. భోజన సమయాలను వీలైనంత క్రమబద్ధంగా పాటించాలి. ఆకలి వేసినప్పుడు తినకుండా ఉండటం లేదా అతిగా డైటింగ్‌ చేయడం మంచిది కాదు.

ఏదైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఆగి.. నిజంగా ఆకలిగా ఉందా? లేక ఒత్తిడి, విసుగు లేదా అలసట కారణంగా తినాలనిపిస్తోందా? అని ప్రశ్నించుకోవాలి. నెమ్మదిగా తినడం, ఆహారం రుచి మీద దృష్టి పెట్టడం, తగినంత నిద్రపోవడం కూడా ఉపయోగపడతాయి. తరచూ ఆహార ఆలోచనలు వస్తూ రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడితే వైద్య నిపుణులు లేదా అర్హత కలిగిన పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.