తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్లలోకి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుండగా, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.

శుక్రవారం ఒక్కరోజే మొత్తం 77,759 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,977 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా శ్రీవారికి రూ. 2.96 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మలయప్పస్వామి హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. నేటి రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ వైభవంగా జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.