ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ఈ భేటీ సాగింది.

ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం సహా రాష్ట్రంలో తాము చేపట్టబోతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబు, మోహన్ యాదవ్‌కు సమగ్రంగా వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన తన విజన్, ప్రణాళికలను ఆయనతో పంచుకున్నారు.

అంతకుముందు, ముఖ్యమంత్రి నివాసానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ భేటీలో లోకేశ్ కూడా పాలుపంచుకున్నారు. తాను ఇటీవలే పూర్తిచేసిన 'యువగళం' పాదయాత్ర విశేషాలతో కూడిన పుస్తకాన్ని ఆయన మోహన్ యాదవ్‌కు బహూకరించారు. తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల నుంచి వచ్చిన స్పందనను, రాష్ట్ర సమస్యలపై తాను చేసిన అధ్యయనాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లోకేశ్ వివరించారు.