తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) తోసిపుచ్చింది. ఇప్పటికే అన్ని అనుమతులు పొందిన ప్రాజెక్టుల గురించి మళ్లీ చర్చించే అధికారం తమకు లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ అభ్యంతరాలను పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ)ల నుంచి అనుమతులు పొందిన ప్రాజెక్టులను పునఃసమీక్షించలేమని గోదావరి బోర్డు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు.

మరోవైపు, ఈ నెల 30వ తేదీన జరగనున్న బోర్డు సమావేశానికి సంబంధించిన అజెండాను ఉభయ రాష్ట్రాలకు పంపింది. గత 17వ సమావేశపు మినిట్స్‌ను ఆమోదించడం, బోర్డు నిర్వహణకు తెలుగు రాష్ట్రాలు నిధులు కేటాయించడం, ప్రాజెక్టుల వద్ద నీటి లభ్యతను కొలిచేందుకు టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు వంటి కీలక అంశాలను అజెండాలో చేర్చారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల మదింపు పురోగతిపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఏపీ అభ్యంతరాలకు అజెండాలో చోటు కల్పించకపోవడం గమనార్హం.