ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం వేసిన రోడ్డును కొందరు ట్రాక్టర్‌తో దున్నేశారని, ఇది వారి పైశాచిక ఆనందానికి, ఉన్మాదానికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో  ఉండవల్లిలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈరోజు టీవీలో చూశాను. మేం రోడ్లు వేస్తే, ఆ రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు. ఇది భరించలేక చేస్తున్నారా, లేక ఉన్మాదమో, పైశాచిక ఆనందమో నాకు అర్థం కావడం లేదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఓవైపు తాము అభివృద్ధి, జవాబుదారీ పాలన అందిస్తుంటే, మరోవైపు కొందరు విధ్వంసానికే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం 55 రకాల సేవలను అందిస్తోందని, ఆర్టీసీ బస్సులు, ఆసుపత్రులు, అన్నా క్యాంటీన్లు, రేషన్ షాపుల వరకు ప్రతి సేవపైనా ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరించి, అధికారుల పనితీరును సమీక్షిస్తున్నామని అన్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో అధికారుల ముందే వారి పనితీరుపై ప్రజల అభిప్రాయాలను చదివి వినిపిస్తూ, తప్పు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నామని, ఇంతకంటే జవాబుదారీతనం ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు.

రాజకీయ విధ్వంసం కారణంగా కోల్పోయిన 'బ్రాండ్ ఏపీ'ని మళ్లీ పునరుద్ధరించి, పెట్టుబడులకు రాష్ట్రాని నంబర్ వన్ గమ్యస్థానంగా తీర్చిదిద్దామని చంద్రబాబు అన్నారు. గత రెండున్నర ఏళ్లలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, ఇవి పూర్తయితే 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికామని, దీనివల్ల కరవు పరిస్థితుల్లోనూ నీటి సమస్య ఉండదని చెప్పారు.

మెగా డీఎస్సీ విషయంలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. "పేద పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండేందుకు సుమారు 200-300 సార్లు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. మేం పట్టుబట్టి ఉద్యోగాలు ఇస్తే, మాపైనే ఆరోపణలు చేశారు. నిజం నిప్పు లాంటిది. దానితో ఆడుకుంటే మసైపోతారే తప్ప నిలవలేరు" అని హెచ్చరించారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుందనుకున్న రాయలసీమ, నేడు తమ ప్రభుత్వ కృషితో 'రాయలసీమ రైజింగ్'గా ఎదుగుతోందని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.