యుద్ధాన్ని ముగించేందుకు తాము దౌత్యపరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రష్యా మాత్రం దాడులతోనే సమాధానమిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కోసం వచ్చిన ప్రతి ప్రతిపాదనకు తాము సానుకూలంగా స్పందించామని, కానీ రష్యా హింసామార్గం వీడటం లేదని ఆయన ఆరోపించారు.

రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులు, వివిధ రకాల డ్రోన్లతో కీవ్‌తో పాటు పలు నగరాలపై విరుచుకుపడిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా తాము ఎదురుదాడికి దిగాల్సి వస్తోందని చెప్పారు. విన్నిట్సియా, కీవ్, మైకోలైవ్, ఖార్కివ్, ఒడెస్సా సహా 11 ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాల కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, వీటిలో పదికి పైగా కేంద్రాలు ధ్వంసమయ్యాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

"మేం ఈ యుద్ధాన్ని ఎన్నడూ కోరుకోలేదు. గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించేందుకు మా మిత్ర దేశాలు చేసిన ప్రతి ప్రయత్నాన్ని స్వాగతించాం. కానీ రష్యా మాత్రం పదేపదే బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ దాడులు, హత్యలతోనే ప్రతిస్పందిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ఆపేందుకు లేదా ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఏమాత్రం ఆసక్తి లేదని ఆయన విమర్శించారు.

గత కొంతకాలంగా అమెరికా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాస్కోపై ఉన్న ఆంక్షలను వాషింగ్టన్ సడలించడం, రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకోవడం వంటి చర్యలను ఆయన తప్పుబట్టారు. రష్యా దాడులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని గతంలో పంచుకున్న భాగస్వామ్య దేశాలు, ఇప్పుడు ఆ విషయంలో మౌనం వహిస్తున్నాయని వాపోయారు. అమెరికా తయారీ 'పేట్రియాట్' గగనతల రక్షణ వ్యవస్థల కొరత కూడా తమ దేశాన్ని రక్షణ పరంగా మరింత బలహీన పరిచిందని ఆయన పేర్కొన్నారు.