రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలపై భారం పడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయని, దాని ప్రభావం రాష్ట్రంపై పడకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బియ్యం, కందిపప్పు, ఉల్లి, వంటనూనె, పంచదార వంటి నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతు బజార్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అమ్మకాలపై ఆయన ఆరా తీశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు వివరించగా.. దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో కూడా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మార్కెట్‌లో ఉల్లిపాయల సరఫరాను మరింత పెంచి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్నామని, దీన్ని మరింత మెరుగుపరచాలన్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో తొమ్మిది లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, దీని కోసం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

ఇసుక సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు. పాలనలో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఏవైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని చంద్రబాబు అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.