రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 22వ సమావేశం జరిగింది. గతంలో కుదిరిన ఒప్పందాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాటిని పెట్టుబడులుగా మార్చి ఉత్పత్తి ప్రారంభించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పీ నారాయణ, కందుల దుర్గేశ్ వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. పరిశ్రమలు, ఇంధనం, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలపై బోర్డు చర్చించింది. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న 714 ఒప్పందాలకు గాను, 519 ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ మొదలైందని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. దీంతో పాటు పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని స్పష్టం చేశారు.