ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ రెండు రోజులు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నవంబరు 3న జరగాల్సిన పోలింగ్‌ను 5వ తేదీకి మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 28 నుంచి నవంబరు 1కి ఎస్‌ఈసీ వాయిదా వేసింది. నవంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించింది. ఇదే రోజున ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కూడా జరగాల్సి ఉంది.

మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు, పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ఒకేరోజు నిర్వహిస్తే పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఎస్‌ఈసీ భావిస్తోంది. ఈ అంశంపై గురువారం చర్చించింది.

పోలింగ్‌ను నవంబరు 5కి మార్చడం సముచితమని పోలీసు ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీ భావిస్తోంది. అయితే పోలింగ్‌ తేదీ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.