కేబినెట్ విస్తరణ నేపథ్యంలో... ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా

  • పోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్ రాజీనామా
  • ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ
  • కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించే అవకాశం
ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ సాయంత్రం జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆహ్వానం అందుకున్న నేతలందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

మరోవైపు కీలక నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. మరోపక్క, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌధురి కూడా తన పదవికి రాజీనామా చేశారు.

అనారోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్టు పోఖ్రియాల్ తెలిపారు. ఈనాటి కేబినెట్ విస్తరణలో పలువురికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో కిషన్ రెడ్డి, కిరణ్ రిజుజు, అనురాగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరి, పురుషోత్తం రూపాల, మనుష్ మందవ్య ఉన్నారు.


More Telugu News