ప్రేమలో విఫలమైతే ఇన్సూరెన్స్.. యువకుడికి రూ. 25 వేలు!

  • యువ జంట మధ్య కుదిరిన బ్రేకప్ ఇన్సూరెన్స్ ఒప్పందం
  • నెలనెలా బ్యాంక్ అకౌంట్లో రూ.500 జమచేసిన యువతీయువకులు
  • తొలుత యువతి బ్రేకప్ చెప్పడంతో యువకుడికి దక్కిన రూ.25 వేలు
ప్రేమ, పెళ్లి, సహజీవనం..ఇలా ఏ బంధాన్నైనా నిలుపుకునేందుకు సమయం, డబ్బు వెచ్చించక తప్పదు. మరి ఇంత కష్టపడ్డా కూడా ఆ బంధం తెగిపోతే ఆ బాధను మాటల్లో వర్ణించడం కష్టం. గుండె పగిలిన వారిని స్నేహితులో మరొకరో ఊరడించవచ్చు. కానీ.. జేబుకు పడ్డ చిల్లును మాత్రం ఎవరికి వారే పూడ్చుకోవాలి. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్‌నే ఫాలో అయ్యిందో యువ జంట. అందుకే తన గర్ల్‌ఫ్రెండ్ చేతిలో మోసపోయిన ఆ యువకుడికి ఇన్సూరెన్స్ కింద రూ.25 వేలు దక్కాయి. 

తనకు ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఎలా దక్కిందీ వివరిస్తూ ఓ యువకుడు నెట్టింట్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాము ప్రేమలో పడ్డామని తెలియగానే ఆ యువకుడు, యువతి తమ భవిష్యత్ పరిణామాలపై మొహమాటం లేకుండా చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే హార్ట్‌బ్రేకప్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. ఆ ఇద్దరు ఓ అకౌంట్లో నెలనెల రూ.500 వందలు జమచేశారు.

ఒప్పందం ప్రకారం..  తొలుత ఎవరు పక్క చూపులు చూసి చీటింగ్ చేస్తారో వారు అకౌంట్లో అప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని రెండవ వారికి ఇచ్చేయాలి. ఈ క్రమంలోనే యువకుడి గర్ల్‌ఫ్రెండ్ తొలుత వారి బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. దీంతో.. యువకుడికి ఆ అకౌంట్లోని రూ.25 వేలు దక్కాయి.

ఈ విషయాన్ని అతడు నెట్టింట షేర్ చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు. ‘‘సుమారు నాలుగేళ్ల పాటు మీ బంధం సాగింది. కానీ నీకు మాత్రం తక్కువ మొత్తమే అందింది’’ అని ఒకరు కామెంట్ చేశారు. తాము కూడా ఈ ఇన్సూరెన్స్‌ను ట్రై చేస్తామని మరికొందరు చెప్పుకొచ్చారు.


More Telugu News