భగ భగ మండుతూ భూమిని తాకిన గ్రహశకలం.. వీడియో ఇదిగో!

  • ఆకాశంలో గుర్తించిన 12 గంటల్లోనే భూమిని తాకిన వైనం
  • రష్యాలోని యకుతియా నిర్మానుష్య ప్రాంతంలో పడిన శకలాలు
  • అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించిన అధికారులు
అంతరిక్షంలో భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు చివరిక్షణంలో గుర్తించారు. దాని సైజును, ఎక్కడ పడుతుందనే లెక్కలు కడుతుండగానే ఆ గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి భూమిపై పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆ గ్రహశకలం చిన్నది కావడం, రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చిన ఈ గ్రహశకలాన్ని చూసి రష్యాలోని యకుతియా ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్యా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ గ్రహశకలం భూమిని తాకింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గ్రహశకలానికి నిప్పంటుకుంది. భగభగ మండుతూ ముక్కలుగా విడిపోయి భూమిపై పడింది. యకుతియా ప్రాంతం భూమిపై అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి. మంగళవారం రాత్రి కూడా అక్కడ మైనస్ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఈ ఘటనతో భూమి సమీపంలో అంతరిక్షంలో తిరుగుతున్న శకలాల (నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్) పైన ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.


More Telugu News