సిడ్నీ టెస్టు.. రాణించిన భార‌త బౌల‌ర్లు.. ఆసీస్ ఆలౌట్

  • సిడ్నీ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ ఐదో టెస్టు
  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 181 ప‌రుగుల‌కు ఆలౌట్
  • చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ 
  • మొద‌టి ఇన్నింగ్స్ లో 185 ప‌రుగులు చేసిన టీమిండియా
  • భార‌త్ కంటే 4 ర‌న్స్ వెనుకంజ‌లో ఆసీస్
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఆఖ‌రిదైన ఐదో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టు త‌న తొలి ఇన్నింగ్స్ లో 181 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్‌నైట్ స్కోరు 9/1 తో రెండో ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో 172 ర‌న్స్ జోడించి మిగ‌తా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో అరంగేట్ర ఆట‌గాడు వెబ్‌స్ట‌ర్ హాఫ్ సెంచ‌రీ (57) తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌నికి తోడుగా స్టీవ్ స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23, అలెక్స్ కేరీ 21 ర‌న్స్ తో ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జ‌స్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి త‌లో రెండు వికెట్లు తీశారు. 

ఇక అంత‌కుముందు భార‌త్ త‌న మొద‌టి ఇన్నింగ్స్ లో 185 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. దాంతో టీమిండియాకు 4 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. కాగా, మ్యాచ్ మ‌ధ్య‌లో బుమ్రా గాయ‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

భార‌త బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపిస్తున్న అత‌డు గాయ‌ప‌డి చికిత్స కోసం మ్యాచ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో టీమిండియా శిబిరంలో ఆందోళ‌న నెల‌కొంది. అలాగే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ కూడా బుమ్రానే. అత‌డు బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.      


More Telugu News