సిడ్నీ టెస్టులో టీ20 తరహా బ్యాటింగ్‌తో రికార్డు నమోదు చేసిన రిషబ్ పంత్

  • సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 33 బంతుల్లోనే 61 పరుగులు బాదిన పంత్
  • టెస్టుల్లో భారత్ తరపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు
  • ఆసీస్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన స్టార్ ప్లేయర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారుతోంది. ఆట రెండవ రోజున తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా... రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో తడబాటుకు గురవుతోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 141/6గా ఉంది. 

యశస్వి జైస్వాల్ 22, కేఎల్ రాహుల్ 13, శుభ్‌మాన్ గిల్ 13, విరాట్ కోహ్లీ 6, నితీశ్ కుమార్ రెడ్డి 4 పరుగుల స్వల్ప స్కోర్లకే ఔట్ అయ్యారు. ముగింపు సమయానికి రవీంద్ర జడేజా 8, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ మిగతా బ్యాటర్ల కంటే భిన్నంగా ఆడాడు. దూకుడుగా ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో బెంబేలెత్తించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మొత్తం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు సాధించి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్‌లో పంత్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. మిగతా బౌలర్లను కూడా వదల్లేదు. కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, టెస్టుల్లో ఎదుర్కొన్న బంతుల పరంగా అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా పంత్ రికార్డు నెలకొల్పాడు. మొదటి స్థానంలో కూడా పంత్ ఉండడం విశేషం.

టెస్టుల్లో వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన భారత ప్లేయర్లు వీళ్లే
1. రిషబ్ పంత్ - 28 బాల్స్ (శ్రీలంకపై 2022)
2. రిషబ్ పంత్ - 29 బాల్స్ (ఆస్ట్రేలియా, సిడ్నీ 2025)
3. కపిల్ దేవ్ - 30 బాల్స్ (పాకిస్థాన్, 1982)
4. శార్దూల్ థాకూర్ - 31 (ఇంగ్లండ్, 2021)
5. యశస్వి జైస్వాల్ - 31 (బంగ్లాదేశ్, 2024)


More Telugu News